"ఇక ధ్యాన ప్రచారం చేస్తాను"

 

నా పేరు "పాల్". నేను గత 20 సంవత్సరాలుగా "పాస్టర్"గా ఉన్నాను. అందులో 15 సంవత్సరాలు గుంటూరులో ఉన్న "హోసన్న మినిస్ట్రీస్"లోనూ .. ఆ తరువాత దివంగత ముఖ్యమంత్రి డా|| Y.S. రాజశేఖర్ రెడ్డిగారి అల్లుడు "బ్రదర్ అనిల్ కుమార్"గారి "వరల్డ్ ఇవాంజలిజమ్"లో అయిదు సంవత్సరాలు పాస్టర్ గా ఉన్నాను.

జూలై 20, 2017న మిర్యాలగూడ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి కృష్ణవేణి మేడమ్ గారి ద్వారా పిరమిడ్ ధ్యాన ప్రపంచంలోనికి అడుగుపెట్టాను! ఆ రోజు మిర్యాలగూడలోని "ఆత్మదీపం పిరమిడ్ ధ్యాన మందిరం"లో మొట్టమొదటిసారి ధ్యానం చేశాను.

ఎన్నో రోజులుగా నేను అన్వేషిస్తూన్న మరి నా స్వప్నంలో కనిపించిన ఆధ్యాత్మిక గురువును ఇలలో మొదటిసారి "ఓంకారేశ్వర పిరమిడ్"లో చూసినప్పుడు నా ఆత్మ ఎంతో హర్షించింది. నా సంతోషానికి అవధులు లేవు. ఆయనే "బ్రహ్మర్షి పత్రీజీ"! ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ధ్యానసాధన చేస్తూ అతి తక్కువ సమయంలోనే నాకున్న మానసిక మరి అనారోగ్య సమస్యలు నుంచి విముక్తి పొందాను. అంతేకాక ఆస్ట్రల్ ట్రావెల్‌లో "పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి", "రామకృష్ణ పరమహంస", "స్వామి వివేకానంద" మొదలైన మాస్టర్స్ నుంచి ఎంతో ఆత్మజ్ఞానం పొందాను. తద్వారా నా శేష జీవితాన్ని ధ్యానం, ధ్యానప్రచారం, సజ్జన సాంగత్యంతో గడపాలి అని సంకల్పించుకున్నాను.

అందులో భాగంగా పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహకారంతో ధ్యానప్రచారం, ధ్యాన గ్రామీణం, శాకాహార ర్యాలీలు, ధ్యాన విద్యార్థి తరగతులువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ నా ఆధ్యాత్మిక జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. 2017 డిసెంబర్ మాసం కైలాసపురి కడ్తాల్‌లో 14రోజులపాటు జరిగిన 8వ "ధ్యానమహాచక్రం" లో పాల్గొనడం ద్వారా "విశ్వకళ్యాణం కోసం పనిచేయాలి" అని నాలో పెరిగిన తపన నా జీవిత గమ్యాన్ని నిర్దేశించింది.

పత్రీజీని ఆస్ట్రల్‌గా కలిసిన ప్రతిసారీ మూడు నాలుగు రోజులలో భౌతికంగా కలవడం అనేది నాకు ప్రత్యేకమైన అనుభవం! నేను పాస్టర్‌గా చేస్తున్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడిని. ధ్యాన పరిచయం తరువాత ధ్యానం చెస్తూ ఆనందం పొందాను. ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి క్షణం బ్రహ్మానందం పొందుతున్నాను. ధ్యాన సాధనా మార్గం ద్వారా ఇంతటి అద్భుతమైన జీవితాన్ని అందించిన జగద్గురువు పత్రీజీకి నా ఆత్మాభివందనాలు.

 

బ్రదర్ పాల్ - మిర్యాలగూడ

- నల్గొండ జిల్లా

- 96760 00608.

Go to top