"గురు చరణాలను వదిలి .. ఆచరణను నిర్వర్తించాలి"

 

నా పేరు రఘునాథ్. మాది విజయవాడ. నేను సుమారు 15 సంవత్సరాల క్రితం నా సత్యాన్వేషణలో భాగంగా ఈ ఆధ్యాత్మిక సంస్థలోకి అడుగుపెట్టాను. ఒకానొక సద్గురువు శిష్యులను జ్ఞానవంతులుగా చేయటానికి పలు మార్గాలను ఉపయోగిస్తారు. మరి నేను భ్రమర కీటక న్యాయం ద్వారా పరిణితి చెందాను. అంటే ఏ విధంగా అయితే ఒకానొక కీటకం ఝుంకార శబ్దం వల్ల భ్రమరంగా పరిణితి చెందిందో, అదే విధంగా నేను పత్రీజీ యొక్క "ఆధ్యాత్మిక సత్యాల" ద్వారా పరిణితి చెందాను.

"బ్రహ్మర్షి పత్రీజీ" తద్వారా నా ఆధ్యాత్మిక పురోగతిలో నన్ను ప్రభావితం చేసిన వారిలో ముఖ్యులు "జక్కా రాఘవరావు" గారు. వారు సతీసమేతంగా ఒక మహోన్నత లక్ష్యం మీద రెండు నెలలు "తేలప్రోలు" గ్రామంలో ఉంటారని తెలిసింది. ఎలాగైనా వారు నిర్వర్తించే పనులను కళ్ళారా చూడాలని ఉత్సాహంతో, ఆత్రుతతో వారు వెళ్ళిన మొదటి ఆదివారం నేను వెళ్ళాను. వారు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవించడం చూసి "అరణ్య వాసానికి వెళ్ళిన సీతారాముల వలె" అనిపించింది.

శ్రీ రంగమ్మ పేరంటాలు గుడిలో వారు పురోహితులుగా దర్శనమిచ్చారు. ("పురం యొక్క హితం కోరే వారు" పురోహితులు) వారి ఇరువురిలో ఎవరో ఒకరు ఆ గుడి దగ్గరే కూర్చుని ప్రోద్దున నుంచి రాత్రి వరకు ఒక్క జీవాన్ని కూడా బలి ఇవ్వనివ్వకుండా ఆపగలిగారు. మరి ఒక రోజు ఒక పెద్దాయన గొర్రెపోతును బలివ్వడానికి వస్తే వారిని నెమ్మదిగా వారించినా వినకపోతే చేతులెత్తి దండం పెట్టి ఏ గొడవా పెట్టుకోకుండా పంపించారు. అప్పుడు మహాభారతంలోని ఈ వాక్యాలు మదిలో స్పురించాయి:

"సర్వ తీర్థములందు స్నాన మొనర్చిన
నాలుగు సముద్రాల వరకు భూమిని దానము చేసిన
సంపూర్ణ దక్షిణలు గల యజ్ఞముల్లన్నింటిని చేసిన
నాలుగు వేదములు పఠించుట వలన ఏ పుణ్యము కలుగునో"


"అలాంటి పుణ్యాలన్నీ చంపబడుతూన్న జంతువులను రక్షించటం వలన కలిగే పుణ్యంలో 16వ భాగానికి కూడా సమం కాదు" అని మహాభారతం తెలియజేస్తోంది.

ప్రతి రోజూ ధ్యాన ఆధ్యాత్మిక తరగతులను నిర్వహిస్తూ తేలప్రోలు వాస్తవ్యులు ఆత్మోన్నతిలో కూడా వారు పాలు పంచుకున్నారు.

15-3-2018 గురువారం రోజున పత్రీజీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం శాకాహార ర్యాలీ, సాయంత్రం ఆధ్యాత్మిక సభలో నేను పాలు పంచుకున్నాను. మ్రొక్కులతో, జంతుబలులు ఇవ్వడానికి వచ్చిన వారిని ఆపడం ఎంతో కష్టమైన విషయం. మరి ఆ మహోన్నత లక్ష్యాన్ని సాధించిన జక్కా రాఘవరావుగారు మరి పద్మ గార్లకు నా ప్రత్యేక ప్రణామాలు.

గురుపూజ అంటే "గురువుల పాదాలను పూజించడం" కాదు! "ఏ మహోన్నత లక్ష్యం కోసం గురుపాదాలు అనుక్షణం శ్రమిస్తున్నాయో గుర్తించి .. ఆ లక్ష్య సాధనలో మనం కూడా భాగస్వాములం కావడం"


కోరపాటి రఘునాథ్

- విజయవాడ ,కృష్ణాజిల్లా

- 9247343585

Go to top