"బాబాజీ పాదాలు దర్శించుకున్నాను"

 

నా పేరు "అనిత". నేను పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయడం వల్ల నాలో ఎన్నో గొప్ప మార్పులు సంభవించాయి.

నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు అంతా నాకు చాలా అనుభవాలు కలుగుతూంటాయి. ధ్యానం చేయడం వల్ల నా జీవితం చాలా ఆనందంగా సాగుతున్నది. జీవితంలో ఎన్ని హెచ్చు తగ్గులు, కష్ట నష్టాలు వచ్చినా వాటినన్నింటినీ తట్టుకుని, వాటి నుంచి బయటకు వచ్చే శక్తినీ మరి వాటన్నిటికీ పరిష్కారం వెదకగలననే నమ్మకాన్నీ ఈ ధ్యానం నాకు నేర్పించింది.

2018 మార్చి నెలలో మేము వారణాసికి విహారయాత్రకు వెళ్ళి వారణాసిలో శివున్ని దర్శించుకుని "బుద్ధగయ"కు వెళ్ళాం. బుద్ధగయలో మేమందరం ధ్యానానికి కూర్చున్నాం. నేను ధ్యానంలో లీనమైపోయాను. అప్పుడు సాక్షాత్తు ఆ గౌతమబుద్ధుడే వచ్చి నా ముందర కూర్చున్నారు! నేను ధ్యానంలో మునిగి తేలుతున్నాను!

ఆ క్షణంలో బుద్ధునికీ నాకూ మధ్య బంగారు వర్ణంలో ఒక వలయం ఏర్పడింది. అలా ఏర్పడిన వలయం మూలంగా బుద్ధుడు నాకు శక్తిని ప్రసాదించసాగారు. నా శరీరమంతా ఆ శక్తితో నిండిపోయింది. ఆ శక్తిని అనుభవిస్తూ నేను అమితానంద భరితురాలినయ్యాను. కాస్సేపటికి బుద్ధుని ధ్యాన మందిరంలో మంగళహారతి జరిగింది.

ఆ సమయంలో నేను బుద్ధుని చూస్తూండగా అతడు చాలా ఎత్తుగా, పెద్దగా పెరిగిపోయి నాకు విశ్వరూప దర్శనం ప్రసాదించారు! ఆకాశం నుంచి శక్తి బంగారువర్ణంలో బుధ్హునిలోకి ప్రవేశింపసాగింది. గౌతమబుద్ధుని వెనకాల ఉన్న బోధివృక్షం కూడా ఆ బుద్ధునితో సమానంగా ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయింది! ఆ వృక్షానికి ఉన్న ప్రతి ఒక్క ఆకులోనూ ఒక్కొక్క మాస్టర్ నిండిపోయారు. వారందరూ నాకు శక్తిని ప్రసాదించారు. ఆ శక్తినంతటినీ అనుభవ పూర్వకంగా పొందినందుకు నాకు అపరిమిత ఆనందం కలిగింది. వారందరికీ నేను ఋణగ్రస్తురాలను.

మేము "బుద్ధ గయ" నుంచి అలహాబాద్‌కు వెళ్ళాం. అక్కడ "క్రియా యోగ ఆశ్రమం"లో రాత్రి విశ్రమించాం. ఆశ్రమం దగ్గర ఒక రావిచెట్టు ఉంది. అది మహావృక్షం. ఆ వృక్షం క్రిందనే మాస్టర్ యుక్తేశ్వర్‌గిరి గారికి "మహావతార్ బాబా"గారు దర్శనం ఇచ్చారు. అందువలన మేమందరం ఆ వృక్షం క్రిందనే ధ్యానం చెయ్యడానికి కూర్చున్నాము.

నేను ధ్యానం చేస్తూండగా శ్వేతవర్ణంలో ఉన్న రెండు పెద్ద పెద్ద పాదాలు నాకు కన్పించాయి. ఆ పాదాలు ఎవరివని నేను చాలా ఆతురతతో చూసేసరికి అవి స్వయంగా మహావతార్ బాబాగారివి! వారు నా ముందరే నిలిచి ఉన్నారు. వారి శరీరం నుంచి కాంతి చిమ్ముతూ ఉంది. ఆ కాంతిని నేను స్వయానా నా నేత్రాలతో చూసి తరించి .. నా జీవితం సార్థకం అయ్యింది అని అనుకున్నాను.

నేను ధ్యానంలో లీనమై ఉండగా బాబాగారు యోగానంద పరమహంస, యుక్తేశ్వరగిరి, లాహిరి మాస్టర్ మొదలైనవారు కూర్చుని మాట్లాడుతున్నారు. నేను వారందరినీ చూస్తూ, అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తూ వారి మాటలను వింటూండగా, బాబాగారు నాకు ఒక అరటి పండును ప్రసాదంగా ఇచ్చారు. నేను అరటిపండును చేతిలోకి పుచ్చుకుంటే అది మాయమై పోతుందేమోనని ఆ పండుని బాబాగారే తమ స్వహస్తాలతో నాకు తినిపించాలి అని కోరాను. వెంటనే బాబాగారు తమ స్వహస్తాలతో నాకు ఆ పండుని తినిపించారు!

ధ్యానంలో ఉంటూనే ఆ అరటిపండు తిన్న అనుభవం నాకు కలిగింది. ఆ ఆనందాన్నీ మరి అనుభవాన్నీ వర్ణించటానికి నాకు మాటలు చాలడం లేదు. నాకు అరటిపండు తినిపించిన తరువాత బాబా గారు కాళ్ళు చాపుకుని విశ్రమించారు. వారి పాదాలు, కాళ్ళు ఎంత కాంతియుతంగా ఉన్నాయంటే .. ఆ కాంతిని సూర్యకాంతితో సమానంగా పోల్చవచ్చు.

నేను బాబాగారి వద్దకు వెళ్ళి .. "మేము మా గురువుగారైన పత్రీజీ గారికి కాళ్ళను వత్తుతాము. మీరు అనుమతి ఇస్తే మీ కాళ్ళను కూడా వత్తుతాం." అని అడుగగానే బాబాగారు నేను తమ కాళ్ళకు ఒత్తడానికి ఒప్పుకున్నారు! నేను ఒత్తుతూండగా బాబాగారు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు! ఇలా నేను ధ్యానంలో ఉంటూ ఎన్నో అనుభవాలను పొందాను. అవి నాకు చాలా ఆనందాన్ని ప్రసాదించాయి.

నేను "ఈ వారణాసి ధ్యాన విహారయాత్ర"కు రావడానికి కారకులైన పత్రీజీగరికి నా అనంతానంత ప్రణామాలు. నాకు చివరి శ్వాస ఉన్నంతవరకు ధ్యానం చేస్తూ, ధ్యానం ప్రచారం చేస్తాను.


అనిత

- గౌరిబిదనూరు , కర్ణాటక రాష్ట్రం

- 84533 99410.

Go to top