"ఏ డాక్టర్ కూడా చేయలేని మేలు ధ్యానం చేసింది"

 

నా పేరు "సంధ్య". నేను మా అమ్మ "బోళ్ళ వరలక్ష్మి" మరి నాన్న "బోళ్ళ అంజిరెడ్డి" గార్ల ద్వారా 2016 జూన్‌లో ధ్యానంలోకి వచ్చాను.

అంతకుముందు నేను పది సంవత్సరాలుగా నరాల సంబంధిత "ఫిట్స్" అంటే మూర్ఛవ్యాధితో బాధపడుతూ ఉండేదానిని. మూర్ఛవచ్చినప్పుడు విపరీతమైన తలనొప్పితో నరాలు కొట్టుకుని కళ్ళు తిరిగి పడిపోయేదానిని.

చికిత్సకోసం ఎంతోమంది డాక్టర్ల దగ్గరికీ మరి స్పెషలిస్ట్‌ల దగ్గరికీ తిరిగాం. లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయే కానీ నా జబ్బు మాత్రం తగ్గలేదు. జబ్బు తగ్గడానికి డాక్టర్లు ఇచ్చే మందులతో ఎప్పుడూ మత్తుగా ఉంటూ .. క్షణక్షణం భయంగా ఉండేది. నా భర్త కానీ .. మా అమ్మ కానీ నన్ను ప్రతి క్షణం చిన్నపిల్లలా కనిపెట్టుకుని ఉండాల్సి వచ్చేది.

అలాంటి సమయంలో సూర్యాపేట పిరమిడ్ మాస్టర్స్ చెప్పగా మా అమ్మనాన్నలతో కలిసి నేను ఖమ్మం .. జిల్లా "పిండిప్రోలు" గ్రామానికి దగ్గరలో ఉన్న "కాస్మిక్ వ్యాలీ"కి వెళ్ళాను. అక్కడి శక్తివంతమైన వాతావరణం నాకు ఎంతగానో నచ్చింది. మూడు నెలలపాటు అక్కడే ఉండిపోయి అత్యంత శక్తివంతమైన "బాబాజీ గుహ"లో మరి పిరమిడ్‌లో తీవ్రతర ధ్యానం చేశాను! ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ధ్యానం .. ధ్యానం .. ధ్యానం!

ఈ సందర్భంగా నాకు వసతి సౌకర్యాలు కలిగించిన వ్యాలీ నిర్వాహకురాలు "శ్రీమతి నలజాల సరోజ మేడమ్"కు కృతజ్ఞతలు. అక్కడ నేను పాల్గొన్న సేవాకార్యక్రమాలు కూడా నన్ను ఎంతగానో స్వస్థతపరచాయి.

ఆ తరువాత మావారి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు తరలివచ్చాక హైదరాబాద్, కొత్తపేట పిరమిడ్ మాస్టర్ "T. శ్రీనివాసరావు"గారి మార్గదర్శకత్వంలో నేను ప్రతిరోజూ "సంకల్పధ్యానం" చేసుకునేదానిని. ఇలా కేవలం ఒక సంవత్సర కాలం నేను చేసిన ధ్యానసాధన ఏ డాక్టరు కూడా చేయలేని మేలు నాకు చేసింది. ధ్యానసాధనవల్ల పొందిన ఆత్మశక్తితో నేను నా శారీరక, మానసిక మరి ఆత్మపరమైన రుగ్మతలన్నీ స్వయంగా సరిచేసుకున్నాను!

ఆ తరువాత మళ్ళీ కోదాడ సమీపంలో ఉన్న మా "బేతవోలు" గ్రామానికి కుటుంబంతో సహా తరలి వెళ్ళాం. నేను పొందిన ఆరోగ్యం మరి ఆనందం నా గ్రామ ప్రజలందరూ కూడా పొందాలి అని మా ఇంటి అవరణలో 15'X15' గ్రౌండ్ పిరమిడ్‌ను నిర్మించాము. మార్చి 23వ తేదీ పత్రీజీ మా ఇంటికి విచ్చేసి పిరమిడ్‌ను ప్రారంభోత్సవం చేసి దానికి "సర్వవ్యాప్తి పిరమిడ్" అని నామకరణం చేశారు.

ఆ సందర్భంగా మా ఇంటి ముందు ఏర్పాటు చేసిన "మేం శాకాహారులం .. మాది ధ్యాన కుటుంబం" అన్న "ఫ్లెక్సీ బోర్డు" గ్రామస్థులందరినీ ఆకర్షించడం విశేషం!

అదేరోజు 300 మంది గ్రామప్రజలు మరి పిరమిడ్ మాస్టర్లతో శాకాహారర్యాలీ నిర్వహించి అహింస మహాకరుణల పట్ల వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఒక పెళ్ళి సందడిలా విందు భోజనంతో సహా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఊరి ప్రజలందరినీ ఆకట్టుకుంది. ధ్యానంతో నేను నా అనారోగ్యం నుంచి విముక్తి పొందిన విధానం విని గ్రామ ప్రజలందరూ ఎంతగానో స్ఫూర్తిచెందారు.

అజ్ఞానంతో మరి అవగాహనా రాహిత్యంతో మాంసం తింటూ తమను తాము అగచాట్లపాలు చేసుకుంటూన్న మారుమూల గ్రామల ప్రజలు ఎందరో తమ తమ రోగాలను నయం చేసుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగి అప్పులపాలు అవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ "అపర సంజీవని"లా ఈ "ధ్యానవిద్య"ను అందిస్తోన్న "పత్రీజీ" కి కృతజ్ఞతలు!

నేను చేసిన మంచిపనికి నాకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చిన నా భర్త "వాసుదేవరెడ్డి" కీ మరి మా అమ్మనాన్నలకూ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మాంసం తినడం మానివేసి .. ముప్పొద్దులా ధ్యానంచేసి ఒక పిరమిడ్‌ను నిర్మించి నాలాగా విశ్వానికి అంకితం అయితే చాలు .. ఎన్ని కర్మల నుంచైనా మరెన్ని రోగాల నుంచైనా సరే క్షేమంగా విముక్తి చెందవచ్చు!

 

బోళ్ళ సంధ్య

- బేతవోలు గ్రామం - సూర్యాపేట జిల్లా
- 91107 43752.

Go to top