"ధ్యానమే యోగానికి పరాకాష్ట"

 

"సరళ దివ్య యోగ" రూపకర్త హైదరాబాద్ షాపూర్ నగర్, HMT కాలనీకి చెందిన "యోగాచార్య M. వెంకటేశ్"గారు పిరమిడ్ ధ్యానులందరికీ సుపరిచితులే! వారు తమ వృత్తి అయిన యోగ శిక్షణకు ధ్యానశిక్షణను కూడా చేర్చి తమ దగ్గరికి వచ్చే సాధకులు చక్కటి శారీరక ఆరోగ్యంతో పాటు ఆత్మజ్ఞానం కూడా పొందేలా కృషి చేస్తున్నారు. తాము చేస్తూన్న విశిష్ఠ కార్యక్రమాలకు గాను పత్రీజీచే విశేష ప్రశంసలను పొందిన"యోగా వెంకటేశ్" గారి "ఇన్నర్ వ్యూ" ఈ నెల మనందరికోసం

T. వాణి.

 

వాణి: "నమస్కారం వెంకటేశ్ గారు! యోగా మాస్టర్‌గా మీరు ధ్యాన ప్రపంచానికి సుపరిచితులు. మీ బాల్యం ..?"
వెంకటేశ్ గారు: నేను 1973 మార్చి 20 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా "ఊరుకొండ" గ్రామంలో "యశోదమ్మ - లక్ష్మయ్య" దంపతులకు జన్మించాను. చేనేత వృత్తిగా జీవించే మా తల్లిదండ్రులకు మేము ఆరుగురు సంతానం. అయిదుగురు అమ్మాయిల తరువాత ఆఖరి సంతానంగా నేను పుట్టాను.

ప్రతిరోజూ మగ్గంపై చీరలు, పంచెలు నేయడం చూసి నేను కూడా నేతపని నేర్చుకున్నాను. పెద్ద కుటుంబం కావడంతో మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. అయినా "ఒక్కగానొక్క మగపిల్లవాడు" అని నన్ను అందరూ అల్లారు ముద్దుగా చూసుకునేవారు. మా నాన్నగారు ప్రతిరోజూ స్వయంగా వచ్చి నన్ను స్కూల్ దగ్గర దింపి వెళ్ళేవారు. అలా ఏ కష్టమూ తెలియకుండా పెరిగిన నాకు 8వ యేటనే పితృవియోగం జరిగింది. ఇక దాంతో మా కుటుంబ భారం మొత్తం అమ్మపై పడింది.

మా అమ్మ నేతపని ఒంటరిగా చెయ్యలేక "టీ" కొట్టుపెట్టి కుటుంబాన్ని నడుపుతూ వచ్చింది. చిన్న వ్యాపారం కావడంతో కొన్ని కొన్ని సందర్భాలలో మేము తినడానికి తిండిలేక పస్తులు కూడా పడుకునేవాళ్ళం. నేను ఎక్కువ శాతం మా ఊరు ప్రక్కనే ఉన్న అడవికి వెళ్ళి అక్కడ చెట్లకు కాసే సీతాఫలాలు, మామిడికాయలు, జామకాయలు తిని కడుపునింపుకునేవాడిని. అలా నాకు సీజనల్‌గా కాసే పండ్లను తినడం అలవాటు అయ్యింది.

మా ఇల్లు చాలా పాతది కావడంతో శిధిలావస్థలో ఉండి ఎక్కడెక్కడో ఉన్న కలుగులలోనుంచి పాములు బయటికి వస్తూ ఉండేవి. మా అక్కలూ .. నేనూ భయపడుతూ పడుకునేవాళ్ళం. ఒకరోజు నేను ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు ఒక త్రాచు పాము వచ్చి నాపై పడుకుంది. భయంతో బిక్కచచ్చిపోయి నేను కదలకుండా మెదలకుండా ఊపిరి బిగపట్టి రాయిలా ఉండిపోయాను. కొద్దిసేపటికి తరువాత అది మెల్లిగా ప్రాకుకుంటూ వెళ్ళిపోవడంతో "బ్రతుకు జీవుడా" అని ఊపిరి పీల్చుకున్నాను!

మాకు కొద్దిగా వ్యవసాయ భూమి ఉండడంతో మా అమ్మ దానిని కొంచెం కొంచెంగా అమ్మి మా అక్కల పెళ్ళి చేసేసింది.

వాణి: "మీ చదువు సంధ్యలు ఎలా సాగాయి?"
వెంకటేశ్ గారు: నేను 7 వ తరగతి వరకు మా "ఊరుకొండ" గ్రామంలో ఉన్న అప్పర్ ప్రైమరీ పాఠశాలలో చదువుకున్నాను. మా టీచర్ "చంద్రమౌళి మాస్టర్"గాఉ స్కూల్లోనే మాచే ఉదయం 5.00 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు యోగాసనాలు వేయించేవారు. యోగా క్లాసు అయిన వెంటనే అందరికీ పాలపొడితో చేసిన వేడి వేడి పాలు ఇచ్చేవారు. చాలా రుచిగా ఉండేవి అవి! మా స్కూల్‌లో పిల్లలతో క్రికెట్ కూడా బాగా ఆడించేవారు.

చిన్నప్పుడు నాకు దేవుడు అంటే భక్తి ఎక్కువగా ఉండేది. ఆంజనేయస్వామి అంటే చాలా ఇష్టం కావడంతో క్రమం తప్పకుండా గుడికి వెళ్ళి ఆంజనేయ దండకం చదువుకునేవాడిని.

ఒకరోజు స్కూల్‌లో మా టీచర్ గౌతమబుద్ధుడి గురించి పాఠం చెప్పారు. ఆ పాఠంలో "బుద్ధుడు గయ అనే ప్రదేశంలో ఒక రావిచెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేశాడు." అని మా టీచర్ చెప్పగా విని నా మిత్రుడు "వహాబ్" తో కలిసి ఊరి బయట ఉన్న కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్న రావిచెట్టు క్రింద ఊరికే కళ్ళు మూసుకుని కూర్చున్నాం.

అది ధ్యానముద్ర అని తెలియకపోయినా బుద్ధుడు ఎలా కూర్చునేవాడో (బొమ్మలో చూసి) అలానే కూర్చున్నాం! ఇలా ధ్యానంలో కూర్చుని ఉండగా చెట్టుపైనుంచి ఒక ఉడుత వచ్చి నా పైన పడింది. చటుక్కున కళ్ళు తెరిచి "బుద్ధుడే ఈ విధంగా మనకు ప్రత్యక్షం అయ్యాడు" అని మేమిద్దరం సంబర పడ్డాం.

8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న "ఊరుకొండపేట్"లో జిల్లాపరిషత్ హైస్కూల్‌లో చదువుకున్నాను. రెండు ఊర్లకు మధ్య అడవి ఉండేది. ఒక సంవత్సరం అలా అడవి మధ్యలోంచి నడుస్తూ వెళ్ళి వచ్చాను. కానీ 9వ తరగతిలో ఆ ఊరిలోనే ఉన్న హాస్టల్‌లో సీటు రావడంతో ఇక అక్కడే ఉండి నా చదువు పూర్తిచేశాను.

నా కుటుంబ నేపథ్యంవల్ల అయితేనేమి మరి హాస్టల్ భోజనం వల్ల అయితేనేమి నాకు మాంసం తినడం అలవాటు అయ్యింది. కానీ ఎప్పుడూ "ఏదో తప్పు చేస్తున్నాను" అని మాత్రం మాంసం తిన్నప్పుడల్లా లోలోపలే బాధపడేవాడిని. 10వ తరగతి తరువాత కల్వకుర్తి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను! కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పార్ట్‌టైమ్‌గా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అమ్మకు చేదోడుగా ఉండేవాడిని.

చిన్నప్పటి ఈ ఆర్థిక ఇబ్బందులే "బాగా సంపాదించాలి" అన్న తపనను నాలో పెంచాయి.

వాణి: "యోగా టీచర్‌గా ఎలా మారారు?"
వెంకటేశ్ గారు: చిన్నప్పుడే మా స్కూల్‌లో నేను "చంద్రమౌళి మాస్టర్" గారి దగ్గర యోగాసనాలు నేర్చుకున్నాను కదా! ఆ తరువాత ప్రక్క ఊరికి వెళ్ళిపోయినా ఆ యోగసాధనాలను సాధన చేసేవాడిని. "యోగా" అంటే నాకు చాలా ఇష్టం కావడంతో వాటికి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ దొరికినా చదివి వాటిని ప్రాక్టీస్ చేసేవాడిని.

నాకు 21 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మా బంధువుల అమ్మాయి "రాణి"తో పెళ్ళి అయ్యింది. వెంటనే హైదరాబాద్ చేరుకుని నాచారంలో ఉన్న "SOL ఫార్మా కంపెనీ"లో ఉద్యోగంలో చేరిపోయాను. నెలకు రూ. 900/-జీతం. ఆ తరువాతి కాలంలో వెంట వెంటనే ఇద్దరు పాపలు పుట్టి కుటుంబం పెరగడంతో ఇక నా కజిన్ బ్రదర్ సహాయంవల్ల ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టి "రిప్రెజెంటేటివ్"గా జీవితం మొదలుపెట్టాను.

ఉద్యోగరీత్యా అన్ని ప్రదేశాలకూ తిరుగుతూన్న క్రమంలో "యోగామృతం" అనే పుస్తకం చదివి మలక్‌పేటలో ఉన్న "దయానంద భవన్"కు వెళ్ళి ఆ పుస్తక రచయిత "డా|| పైళ్ళ సుదర్శన్ రెడ్డి" గారి దగ్గర యోగ శిక్షణ తీసుకున్నాను.

ఉద్యోగం చేసుకుంటూనే వారి ప్రోత్సాహంతో ఉదయం, సాయంకాలం చిన్న చిన్న యోగాక్లాసులు నిర్వహిస్తూ కొంత ఆర్థిక వెసులుబాటు పొందేవాడిని. ఆ తరువాత కోఠీలోని "గాంధీ జ్ఞాన మందిర్" లో "డా|| ప్రవీణ్ కపాడియా" గారి దగ్గర యోగాలోని మరిన్ని మెళుకువలు తెలుసుకున్నాను.


వాణి: "ధ్యాన పరిచయం ఎలా జరిగింది?"
వెంకటేశ్ గారు: ఈ క్రమంలోనే రాష్ట్రపతిరోడ్‌లో ఉన్న "గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్" దగ్గర పనిచేస్తూన్నప్పుడు ఆ వెనకాల ఉన్న "పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని" చూశాను.

"ధ్యానం" గురించి అప్పటికే నేను ఎన్నో పుస్తకాలలో చదువుకున్నాను. కానీ సరియైన విధానంలో ధ్యానం ఎలా చెయ్యాలో నాకు తెలియలేదు. దాంతో ఇక ఆ పిరమిడ్ ధ్యానం చెయ్యాలన్న ఉత్సాహంతో నిర్వాహకులు "శ్రీ S.రాజశేఖర్"గారి ద్వారా ఒక్క నెల రోజులలోనే నేను ఎన్నెన్నో క్రొత్త క్రొత్త విషయాలను నేర్చుకున్నాను. మాంసం తినడం ఎంత తప్పో .. మరెంత నీచమో తెలుసుకుని వెంటనే శుద్ధ శాకాహారిగా మారిపోయాను!

ప్రతిరోజూ రాత్రంతా గంటలు గంటలు ధ్యానం .. ఉదయం సాయంత్రం యోగా శిక్షణలు మరి రోజంతా ఉద్యోగం. క్షణం తీరిక లేకుండా రోజంతా శ్రమించినా కూడా "ప్రెష్"గా ఉండేవాడిని. అంతకు ముందు రాత్రి పడుకునే సరికి కొంత అలసిపోయే నాకు "ధ్యానం చేయడం" మొదలుపెట్టాక ఇక అలసట అన్నది మాయం అయిపోయింది. రోజంతా శక్తివంతంగా ఉండేవాడిని.

నాలో సంకల్పశక్తి చక్కగా పెరిగి ఏది అనుకుంటే అది క్షణాల్లో జరిగిపోయేది. ఇక నా యోగా తరగతులలో వాళ్ళకు కూడా ధ్యానం గురించి చెబుతూ ఆరోగ్యపరంగా మరి మానసిక పరంగా వాళ్ళల్లో కలుగుతూన్న మార్పులను నిశితంగా గమనించేవాడిని.

హైదరాబాద్‌లో ఎక్కడ పత్రీజీ కార్యక్రమాలు జరిగినా తప్పకుండా వెళ్ళేవాడిని. వారిలో నేను ఒక భగవంతుడిని చూడగలిగాను. "వారితో కరచాలనం తీసుకుంటే చాలు - నా జన్మ ధన్యం అవుతుంది" అనుకునేవాడిని.

ఈ క్రమంలో చింతల్, షాపూర్‍నగర్ మధ్యలోఉన్న H.M.T. కాలనీలో ఒక స్నేహితుడు "నందు"గారి సహకారంతో చిన్నప్పటి హాల్ తీసుకుని అక్కడ పూర్తిస్థాయి యోగా శిక్షణ మొదలుపెట్టాను. ఉద్యోగం నుంచి కూడా విరమణ పొంది ఇక "సరళ దివ్యయోగ" పేరుతో యోగా, ధ్యానం మరి అహింసా శాకాహార ప్రచారాలే ధ్యేయంగా జీవిస్తున్నాను.

ధ్యానంలోకి రాకముందు నేను ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలలో చేరి అనేకానేక సాధనలు చేశాను. అక్కడెక్కడా నాకు కలుగని తృప్తి ఈ ధ్యానయోగ కార్యక్రమాలలో కలుగుతోంది! ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో కడ్తాల్ "కైలాసపురి"లో జరిగే "ధ్యానమహాచక్రం" ఉత్సవాలలో పద్నాలుగు రోజులపాటు ప్రతిరోజూ ప్రాతఃకాలం 4.00 గంటల నుంచి 5.00 గంటల వరకు "శ్రీ సరస్వతీ సభా వేదిక" పై ధ్యానయోగ శిబిరాన్నినిర్వహించే అవకాశం పత్రీజీ నాకు ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు!! ఈ శిబిరంలో అన్ని వయస్సుల వారికి అతి సరళమైన యోగాసనాలను రోజువారీ జీవిత విధానలకు అనుగుణంగా నేర్పిస్తూ పత్రీజీ ప్రశంసలను పొందుతున్నాను.

వాణి: "మీ ‘సరళదివ్యయోగ’ కార్యక్రమాలను గురించి ఇంకా తెలియజేయండి!"
వెంకటేశ్ గారు: నేను నిర్వహిస్తోన్న సరళ యోగ శిబిరాలలో పాల్గొని శాకాహారులుగా మారి సాధన చేస్తూన్న వాళ్ళు చక్కటి ఆరోగ్యంతో జీవిస్తూన్నారు. దాదాపు 34 మంది పేషెంట్స్ ఆపరేషన్‌ల నుంచి విముక్తిచెంది హాయిగా జీవిస్తున్నారు. అందులో వెన్నెముక, కిడ్నీలు, గుండెకు సంబంధించిన పేషెంట్‌లతోపాటు కీళ్ళనొప్పులతో బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు.

వాణి: "యోగ విన్యాసాలలో కొన్ని ముఖ్యమైనవి వివరిస్తారా?"
వెంకటేశ్ గారు: భారత ప్రధాని మాన్యశ్రీ "నరేంద్ర మోడీ"గారి విశేష కృషి భారతీయ ప్రాచీన యోగవిద్యకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అందరూ ఆచరించగలిగే కొన్ని సరళ యోగ ప్రక్రియలను గుర్తించి వాటిని స్కూళ్ళల్లో మరి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో ఆచరించవలసిందిగా సూచనలు చేసింది. వాటిలో కొన్ని
1. "వృక్షాసనం": కుడికాలు మడిచి పాదాన్ని ఎడమ తొడకు ఆనించి, ఒక కాలుపై బ్యాలెన్స్ చేస్తూ చేతులను నమస్కారం ముద్రలో ఉంచాలి. ఈ విధంగా రెండవ కాలు కూడా చెయ్యాలి. ఒక్కొక్క దశలో 30 సెకన్లు ఉండాలి.

లాభాలు: ఏకాగ్రతను పెంచుతుంది.

2. "తాడాసనం": రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి రెండు చేతి వ్రేళ్ళను చేర్చి శ్వాసను పీలుస్తూ చేతులను సాగతీస్తూ మడమలను పైకి లేపాలి. వదిలేస్తూ యదాస్థానానికి రావాలి. ఈ విధంగా ఆరు సార్లు చెయ్యాలి.

లాభాలు: నరాలను చైతన్యపరచి ఎత్తును పెంచి హృదయానికి మేలు చేసే ఆసనం.

3."పాదహస్తాసనం": నిలబడి రెండు కాళ్ళు దగ్గరగా చేర్చి, శ్వాస పీలుస్తూ రెండు చేతులను పైకి లేపి శ్వాస వదులుతూ వంగి చేతులు రెండు పాదాలపై చేర్చాలి. తలను మోకాళ్ళకు ఆనించే ప్రయత్నం చేయాలి. మళ్ళీ శ్వాస పీలుస్తూ యధాస్థితికి రావాలి.

గమనిక: Backpain ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: ఈ ఆసనం వల్ల పొట్ట తగ్గి, మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. ఈ ఆసనాన్ని రోజుకు 10 సార్లు చెయ్యాలి.

4. "అర్థచక్రాసనం": నిలబడి రెండు అరచేతులను నడుముపై పెట్టుకుని రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి శ్వాస పీలుస్తూ నడుం వీలైనంతవరకు వంచాలి. ఆ స్థితిలో ఎనిమిది సెకన్లపాటు ఉంచిన తరువాత తిరగి యధాస్థానానికి వచ్చి శ్వాస వదలాలి.

గమనిక: High B.P., గుండెజబ్బులు ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: ఈ ఆసనంవల్ల మెడపూసలు, నడుము, జ్ఞానేంద్రియాలు, ఊపిరితిత్తులు బలపడి వాటి పనితీరు మెరుగవుతుంది.

5. "త్రికోణాసనం": నిలబడి కాళ్ళను మూడు అడుగులు చాచి రెండు చేతులను సమానంగా చాచి కుడి చేతితో ఎడమ పాదాన్ని అందుకోవాలి. ఎడమ చేయి పైకి లేపాలి. లేపిన అరచేతిని చూడాలి. శ్వాస వదులుతూ పై చేయి చూడాలి. శ్వాస పీలుస్తూ యధాస్థానానికి రావాలి. దీనికి అభిముఖంగా చేయి మార్చి చేయాలి. ఈ విధంగా ఇరవై సార్లు చేయవచ్చును.

గమనిక: Backpain ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: ఈ ఆసనం వల్ల మనస్సు ఉల్లాసభరితంగా ఉంటుంది. భుజాలు, చేతులు బలపడును. కాళ్ళ పనితీరు మెరుగవుతుంది.

6. "వీరభద్రాసనం": నిలబడి రెండు కళ్ళు దూరంగా చాచాలి. రెండు కాళ్ళ మధ్య మూడు అడుగుల దూరం పెట్టాలి. రెండు చేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. శ్వాస పీలూస్తూ కుడివైపు తిరిగి కుడికాలిని మడిచి చేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. ఎడమకాలును భూమికి ఆనకుండా ఉంచే ప్రయత్నం చేయాలి. ఈ అవస్థలో శ్వాస పీల్చుకోవాలి. తిరిగి శ్వాస వదులుతూ యధాస్థానానికి రావాలి. తిరిగి వ్యతిరేక దిశలో పనిని చేయాలి.

గమనిక: మోకాళ్ళనొప్పులు, కాళ్ళు విరిగిన వాళ్ళు, Backpain ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: ఈ ఆసనం చేయటం ద్వారా తొడలు తగ్గుతాయి. నడుము తగ్గుతూ వీటికి బలం చేకూరుతుంది. మానసిక ప్రశాంతత జీర్ణశక్తి పెరుగుతుంది.

7. "వజ్రాసనం": రెండు కాళ్ళు మడచి పిరుదలను మడమలపైన చేర్చాలి. రెండు చేతులను మోకాళ్ళపైకి చేర్చి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఈ ఆసనాన్ని రోజుకు రెండు నిమిషాల నుంచి అయిదు నిమిషాల వరకు చేయవచ్చు.

గమనిక: మోకాళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: జీర్ణాశయంలో జఠరాగ్ని పనితీరు వృద్ధిచెంది, జీర్ణశక్తి పెరుగును. ఈ ఆసనాన్ని ఆహారం తీసుకున్న తర్వాత కూడా చేయవచ్చు.

8. "అర్థ ఉష్ట్రాసనం": రెండు మోకాళ్ళమీద నిలబడాలి. రెండు అరచేతులను నడుముపై చేర్చాలి. శ్వాస పీలుస్తూ తలను వెనక్కి వంచాలి. ఎనిమిది సెకన్ల తరువాత తిరిగి శ్వాస వదులుతూ వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా ఆరుసార్లు చేయవచ్చు.

గమనిక: High B.P., గుండెజబ్బులు, కాళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: ఈ ఆసనంవల్ల జ్ఞానేంద్రియాలు, థైరాయిడ్ గ్రంథులు చక్కగా పనిచేస్తాయి. వాటిలోని దోషాలు తగ్గుముఖం పడతాయి.

9. "శశంకాసనం": మొదటగా వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస పీలుస్తూ రెండు చేతులను పైకి లేపాలి. శ్వాస వదులుతూ రెండు చేతులు ముందుకు వంగుతూ చేతులను నేలకు చాచాలి. తలను కూడా నేలకు ఆనించాలి. పిరుదులను లేపకుండా ప్రయత్నం చేయాలి. తిరిగి శ్వాస పీలుస్తూ యధాస్థానానికి రావాలి. ఈ విధంగా పది సార్లు చెయ్యాలి.

గమనిక: Backpain, అధికంగా ముక్కు సమస్యలు ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: మానసిక ఒత్తిడి దూరంఅవుతుంది. ముఖంలో తేజస్సు పెరుగుతుంది.

10. "వక్రాసనం": కూర్చుని రెండుకాళ్ళూ ముందుకు కుడికాలు పాదాన్ని ఎడమ మోకాలి వరకు మడచాలి, ఎడమ చేతిద్వారా మడచిన కాలు ఆధారంగా చేసుకుని ఎడమకాలును అందుకోవాలి. కుడిచేయి కుడివైపు వెనక్కి చాచి శ్వాస వదులుతూ కుడివైపు చూడాలి. శ్వాస పీలుస్తూ యధాస్థానానికి రావాలి. తిరిగి ఇదే విధంగా చేతిని, కాలును మార్చి చేయాలి. ఒక్కొక్కస్థితిలో ఎనిమిది సెకన్లపాటు ఉండాలి. ఒక్కొక్కవైపు ఆరు సార్లు చేయాలి.

గమనిక: అధిక backpain ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: మధుమేహం కంట్రోలు అవుతుంది. ఊపిరితిత్తులు బలపడతాయి. చర్మవ్యాధులు దూరం అవుతాయి. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.

11. "మకరాసనం": బోర్లాపడుకుని రెండు కాళ్ళు దూరంగా చాచి రెండు పాదాలను నేలకు సంపూర్ణంగా ఆనించాలి. (లోపలివైపు) రెండు చేతులనూ గెడ్డం క్రిందకు చేర్చాలి. శ్వాస సామాన్య స్థితిలో ఉంచాలి. ఈ అవస్థలో ఒక నిమిషంపాటు ఉండాలి.

గమనిక: హెర్నియా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయరాదు.

లాభాలు: ఆస్తమా, శ్వాసకోస వ్యాధులు నివారించబడతాయి.

12. "భుజంగాసనం": బోర్లాపడుకుని రెండు అరచేతులనూ నాభికి ఇరువైపుల చేర్చాలి. శ్వాస పీలుస్తూ తలను నెమ్మదిగా పైకి లేపాలి. ఈ అవస్థలో ఎనిమిది సెకన్ల తర్వాత తిరిగి శ్వాస వదులుతూ యధాస్థానానికి రావాలి. పై విధంగా పది సార్లు చేయాలి.

గమనిక: High B.P., హెర్నియా సమస్యలు ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: మెడ, వెన్నుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. గుండె ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.

13. "శలభాసనం": బోర్లా పడుకుని రెండు చేతులు పిడికిళ్ళు బిగించి తొడల క్రింది చేర్చాలి. శ్వాసపీలుస్తూ మొదలు కుడికాలు పైకి లేపాలి. ఎనిమిది సెకన్ల తర్వాత శ్వాస వదులుతూ యధాస్థానానికి రావాలి. ఇదేవిధంగా కాలు మడిచి చేయాలి. పై విధంగా ఒక్కొక్క కాలితో కలిపి అయిదు సార్లు చేయాలి. రెండు కాళ్ళతో కలిపి కూడా చేయవచ్చును.

గమనిక: హెర్నియా సమస్య ఉన్నవాళ్ళు చేయరాదు. మూత్రసంబంధిత రుగ్మతలు ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: ఊపిరితిత్తులు బలపడతాయి. కాలేయ పనితీరు మెరుగవుతుంది. పిరుదలపై ఉన్న క్రొవ్వు తగ్గుతుంది.

14. "పవనముక్తాసనం": కాళ్ళు బారుగా చాచి వెల్లకిలా పడుకోవాలి. శ్వాస పీలుస్తూ కుడికాలు అరవై డిగ్రీలు పైకి లేపి రెండు చేతులతో కుడికాలును మడచి మోకాలిని అందుకుని శ్వాస వదిలి, గెడ్డాన్ని మోకాలికి ఆనించాలి. ఈ స్థితిలో ఎనిమిది సెకన్లు ఉండాలి. శ్వాస పీలుస్తూ తలను నేలకు ఆనించలి, ఈవిధంగా మూడు సార్లు చెయ్యాలి.

పై విధంగానే కాలును మార్చి (రెండవకాలుతో) మూడుసార్లు చెయ్యాలి. అదేవిధంగా రెండు కాళ్ళను కలిపి కూడా చేయవచ్చును. పై అన్ని స్థితులనూ మూడు సార్లు చొప్పున చేయవచ్చును.

గమనిక: Backpain, ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయరాదు. చేయవలసి వచ్చినప్పుడు తలలేపకుండా చేయాలి.

లాభాలు: గ్యాస్ ట్రబుల్, పైల్స్ సమస్యలు తొలగిపోతాయి.

15. "సేతు బంధాసనం": వెల్లకిలా పడుకుని రెండు కాళ్ళూ వెనక్కి మడచి కాళ్ళ మధ్య ఒక అడుగుదూరం ఉంచి రెండు కాళ్ళనూ, రెండు చేతులనూ అందుకోవాలి. శ్వాస పీలుస్తూ నడుం భాగాన్ని వీలైనంతవరకు పైకిలేపాలి. ఈ అవస్థలో ఎనిమిది సెకన్లు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యధాస్థానానికి రావాలి. ఈ విధంగా ఆరుసార్లు చేయాలి.

గమనిక: మెడ, గుండె, నడుం operation అయిన వాళ్ళు చేయకూడదు.

లాభాలు: గుండెలో ఉన్న రుగ్మతలు తగ్గుతాయి. గర్భాశయ, శుక్రాశయ వ్యాధులు తగ్గుతాయి.

పై అన్ని ఆసనాలు ఆసనానికి ఆసనానికి మధ్య ముప్ఫై సెకన్లు విశ్రాంతి తీసుకుంటూ ఆసనాల చివర అయిదు నిమిషాలపాటు శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

"ప్రాణాయామం"

1. "కపాలభాతి": సుఖాసనం, సిద్ధాసనంలో లేదా పద్మాసనంలో కూర్చుని చూపుడు వ్రేలు మడచి బ్రొటనవ్రేలిని చేర్చి మిగతా వ్రేళ్ళు చక్కగా ఉంచి అంటే వాయుముద్రలో శ్వాస బయటకు రెండు నాసికా రంధ్రాల నుంచి బయటకు చిమ్ముతూ కడుపులోనికి తీసుకుంటూ ఒక సెకనుకు ఒకసారి చొప్పున నిమిషానికి 60 సార్లు చొప్పున అయిదు నిమిషాలలో 300 సార్లు మొదటిరోజు చేయాలి. మనస్సును పొట్టపై లగ్నం చేయాలి. ప్రతి శ్వాసలో ఓంకారం ఉచ్ఛారణ ఉండాలి.

ఒక నెల వచ్చేనాటికి పది నిమిషాలపాటు చేయాలి.

గమనిక: శస్త్రచికిత్స, గర్భిణీ స్త్రీలు, పీరియడ్స్ సమయంలో కపాలభాతి చేయరాదు మరి హెర్నియా సమస్య ఉన్నవాళ్ళు చేయరాదు.

లాభాలు: అన్నమయకోశంలో ఉన్న క్లోమగ్రంథి, కాలేయం, ప్లీహం, పెద్దప్రేగులు, చిన్న ప్రేగులు, గర్భాశయం, శుక్రాశయం, గుండె, ఊపిరితిత్తులు, మనోమండలం, మూత్రపిండాలు పనితీరు మెరుగవుతూ వాటిలోనే దోషాలు దూరం అవుతాయి. సమస్త రోగాలకూ సమాధానం కపాలభాతి.

వాణి: "మీరు పొందిన అవార్డులు..?"
వెంకటేశ్ గారు: "గాంధీ జ్ఞాన్ మందిర్" నుంచి "యోగ సంజీవిని" బిరుదును మరి "దయానంద భవన్" నుంచి "యోగరత్న" బిరుదును పొందాను. "CVR హెల్త్ TV ఛానెల్"లో "ధ్యానశక్తి ధారా"; "యోగా ధ్యానం" వంటి కార్యక్రమాలను నిర్వహించే భాగ్యం కలిగింది. ఆర్థికంగా కూడా బాగా నిలద్రొక్కుకున్నాను. ఇప్పుడు ఏ సమస్యా లేకుండా అన్ని సౌకర్యాలతో కూడి సంతోషంగా జీవిస్తున్నాను.

ఇవన్నీ ఒక ఎత్తయితే "పత్రీజీ సాంగత్య భాగ్యం" లభించడం నాకు మరొక ఎత్తు! వారి ఆశీస్సులతో నిరంతరం సత్యం కోసం, ధర్మం కోసం, ఆరోగ్యం కోసం, ఆనందం కోసం నేను పాటుపడుతున్నాను. ఈ భూమి మీద జన్మించినందుకు ఇంతకంటే గొప్ప పని ఇంకొకటి లేదు గాక లేదు!

 

యోగాచార్య M. వెంకటేశ్

- షాపూర్ నగర్- హైదరాబాద్

-92474 09666

Go to top