"శ్వాస విజ్జాన జ్యోతి - విద్యార్థి జీవన క్రాంతి"

 

నా పేరు "అనిల్ సాగర్".

కరీంనగర్ జిల్లా .. హుజూరాబాద్‌కు చెందిన నేను గత పదిహేను సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను.

మా ఊరి హైస్కూల్‌లో నేను 8వ తరగతి చదువుకుంటూన్నప్పుడే పిరమిడ్ ధ్యానం గురించి తెలుసుకుని క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ చదువులో ఎప్పుడూ "ఫస్ట్" ఉండేవాడిని. నా తోటి విద్యార్థులకు కూడా ధ్యానం నేర్పేవాడిని.

ఆ తరువాత కెమిస్ట్రీ పూర్తిచేసి జూనియర్ కాలేజీలో IIT కోచింగ్ లెక్చెరర్‌గా హైదరాబాద్‌లో కొంతకాలం పనిచేశాను. ఆ సమయంలో నేను "పత్రి సార్" అంబర్‌పేట ఇంట్లోనే అవుట్‌హౌస్‌లో ఉండేవాడిని. "పత్రిమేడమ్" నన్ను స్వంత కొడుకులా చూసుకుంటూ నాకు అమ్మ ప్రేమను పంచేవారు. వారికి నా కృతజ్ఞతలు.

ఆ తరువాత ధ్యానం యొక్క లాభాలు ప్రతి విద్యార్థికీ అందించాలన్న సత్సంకల్పంతో అందుకు ఉద్యోగం చేస్తూన్న నాకు సమయం కుదరక పోవడంతో లెక్చరర్‌గా ఉద్యోగం మానివేసి అన్ని స్కూళ్ళల్లో మరి కాలేజీలలో విస్త్రుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నాను.

ఈ క్రమంలో "విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అతి సరళమైన భాషలో ఒక ధ్యాన కరదీపిక ఉంటే బాగుంటుంది" అన్న పత్రీజీ సూచన మేరకు పత్రీజీ ఆడియో క్యాసెట్ "శ్వాస విజ్ఞాన జ్యోతి" కి అక్షరరూపం తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టాను. "ధ్యానజగత్" ఎడిటర్స్ " M.స్వర్ణలత మేడమ్" మరి "T.వాణి మేడమ్" ల మార్గదర్శకత్వంలో ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది.

ఇందులో పత్రీజీ విద్యార్థులకు ఎంతో ప్రేమగా బోధించే "అయిదు వ్రేళ్ళలో అద్భుత విజ్ఞానం (Five Fingers Concept)" విద్యార్థుల ధ్యానానుభవాలు, శాకాహార విశిష్టత, పత్రీజీతో, విద్యార్థుల ముఖాముఖి, పిరమిడ్ శక్తి, ఆలోచనాశక్తి, వాక్‌శక్తి, సంకల్పశక్తి, మీ జీవితం మీ చేతుల్లో .. వంటి చక్కటి అంశాలతోపాటు విద్యార్థులు ఆచరించగలిగే పలు సాధనా ప్రక్రియలను పొందుపరచడం జరిగింది.

"విద్యార్థులకూ మరి ఉపాధ్యాయులకూ ఈ పుస్తకం ఒక జ్ఞాన వజ్రాయుధం లాంటిది" అని పత్రీజీ ఎంతగానో మెచ్చుకున్నారు. "ప్రతి ఒక్క విద్యార్థికీ ఈ పుస్తకం ఉచితంగా అందాలి" అన్న పత్రీజీ ఆశయానికి అనుగుణంగా ఒక సంవత్సర కాలంలోనే ఈ పుస్తకం పలు ముద్రణలతో యాభై వేలు కాపీలు ముద్రించబడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు విద్యాసంస్థలలో ఇవి ఉచితంగా పంచిపెట్టబడుతున్నాయి.

ఈ పుస్తకంలోని అంశాలన్నీ చాలా సరళంగా మరి విద్యార్థులకు సులభంగా వంటపట్టే రీతిలో ఉండడంతో ఇది హిందీ మరి కన్నడ భాషలలోకి కూడా అనువదించబడి ఆ యా రాష్ట్రాల విద్యార్థులకు ఉచితంగా అందించ బడుతోంది.

ఈ మహాయజ్ఞంలో నాకు సహకరిస్తోన్న నాకు ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్‌కు నా ధన్యవాదాలు. విద్యార్థుల జీవితాలలో ధ్యాన - జ్ఞాన జ్యోతులను వెలిగించగలిగే ఇంత అద్భుతమైన పనిని నాకు అప్పగించి నా జన్మను ధన్యం చేసిన పత్రీజీకి మరి స్వర్ణమాల పత్రిగారికి శతకోటి ధన్యవాదాలు. ఈ భూమి మీద ఉన్న విద్యార్థులందరికీ ఈ పుస్తకం అందేవరకూ "శ్వాస విజ్ఞాన జ్యోతి" పుస్తక యజ్ఞాన్ని నేను కొనసాగిస్తూనే ఉంటాను.

 

Ch.అనిల్ సాగర్

- హైదరాబాద్
-85019 39203

Go to top