"కాస్మిక్ వ్యాలీ .. పత్రీజీ కలలకు ప్రతిరూపం"

 

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా .. ఖమ్మం - వరంగల్ రోడ్డులో .. తిరుమలాయిపాలెం మండలం "పిండిప్రోలు" గ్రామం సమీపంలో హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది .. అతి సుందరమైన "కాస్మిక్ వ్యాలీ." ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ హనుమకొండ రఘురామ్ ప్రసాద్ గారితో కాస్సేపు ..

- T.వాణి

T.వాణి: "మీ బాల్యం .. విద్యాభ్యాసం గురించి చెప్పండి!"
రఘురామ్ ప్రసాద్ గారు: నేను 1954వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా "బాలపేట" గ్రామంలోని ఒక వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాను. మా నాన్న "శ్రీ నాగేశ్వరరావు" గారు మరి మా అమ్మ "శ్రీమతి సులోచన". నాకు ఒక తమ్ముడు ఒక చెల్లెలు. నేను జంతుశాస్త్రంలో "M.SC." చేశాను. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో నా చదువు పూర్తయ్యాక ఉద్యోగంవైపు వెళ్ళకుండా మా నాన్నగారికి చేదోడు వాదోడుగా వ్యవసాయరంగంలోనే అడుగు పెట్టాను. సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ మంచి దిగుబడులను సాధించాను. సాధ్యమైనంత వరకు సేంద్రియ పద్ధతులలో ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ మరి తోటలను అభివృద్ధిచేస్తూ నవీన వ్యవసాయ పద్ధతులను శాస్త్రీయంగా అమలు పరుస్తున్నాను.

నాకు విద్యారంగంపట్ల ఉన్న ఆసక్తితో జిల్లా కేంద్రమయిన ఖమ్మం పట్టణంలో కొంతకాలం పాటు ఒక ఇంగ్లీష్ మీడియమ్ పాఠశాలను కూడా నిర్వహించాను.

మాది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే. నా భార్య "మాధురి", గృహిణి. నా కుమారుడు "సాయి చైతన్య" USA లో సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‌గా మరి కూతురు "సాయి శ్రుతి" హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా అయిపోవడంతో వాళ్ళు తమ తమ జీవితాలలో సెటిల్ అయ్యారు.

T.వాణి: "అధ్యాత్మిక రంగంలోకి ప్రవేశం ఎలా జరిగింది?"
రఘురామ్ ప్రసాద్‌గారు: చిన్నప్పటినుంచీ మా అమ్మగారు పూజలు చేస్తూండే వారు, మరి నాన్నగారు కూడా దైవంపట్ల విశ్వాసం ఉన్న వ్యక్తి కావటంలో ఇంట్లో భక్తి వాతావరణమే ఉండేది. నేను చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ ద్వారా "మహర్షి మహేశ్ యోగి" గారి భావాతీత ధ్యానం గురించి తెలుసుకున్నాను. అదేదో వినడానికి బాగానే ఉంది అనిపించింది కానీ ప్రాక్టికల్‌గా నాకు అంత సుళువుగా తోచలేదు. దాంతో ఇక " ఈ ధ్యానం అనేది చాలా కష్ట సాధ్యమైన విషయం .. ఇది మనవల్ల కాదులే" అని వదిలేశాను.

నాకు అనారోగ్యాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ లేకపోవడంతో జీవితం చాలా సాఫీగా మరి ఆనందంగానే గడిచిపోతూండేది కానీ .. ఎక్కడో మనస్సు మూలల్లో మాత్రం "జీవితం అంటే ఈ మాత్రం పుట్టడం, పెళ్ళి చేసుకోవడం, పిల్లల్ని కనడం, తినడానికి సంపాదించుకోవడం మాత్రమే కాదు కదా! ఇంకా ఏదో మన గురించి మనం తెలుసుకోవలసింది ఉండే ఉంటుంది!" అన్న వెలితి ఉండేది.

2003వ సంవత్సరంలో ఖమ్మం పట్టణంలోని "భక్త రామదాసు కళాక్షేత్రం" లో "బుద్ధపౌర్ణిమ సంబరాలు మూడు రోజులపాటు నిర్వహించబడుతున్నాయి" అని ఒక కరపత్రం ద్వారా తెలుసుకుని "అదేమిటో చూద్దాం" అనుకుని వెళ్ళాను.

అక్కడ "పత్రీజీ" ధ్యానం గురించి ఎంతో సింపుల్‌గా వివరించి అక్కడికక్కడే మాతో ధ్యానం చేయించడం స్వయంగా అనుభవించాక .. "ధ్యానం చెయ్యడం ఇంత సుళువా?" అని ఆశ్చర్యపోయాను!

T.వాణి: "ఏవైనా ధ్యానానుభవాలు వచ్చాయా?"
రఘురామ్ ప్రసాద్ గారు: ఏమీ రాలేదు. కానీ చాలా హాయిగా మనస్సుకు ప్రశాంతంగా అనిపించింది.

ముఖ్యంగా పత్రీజీ యొక్క సింప్లిసిటీ నాకు బాగా నచ్చించి! అప్పటివరకు "గురువులు" అంటే ఉన్న వేర్పాటుభావం నా నుంచి మాయమై పోయింది. ఆ తరువాత నుంచి ప్రతిరోజూ "శ్వాస మీద ధ్యాస" ధ్యానసాధన నా జీవితంలో ఒక భాగమై పోయింది. ఇతరులపట్ల, జీవితంపట్ల మరి దైనందిన జీవితంలో ఎదురయ్యే వ్యవహారిక సమస్యలపట్ల నాకు ఉన్న దృక్పథం మారిపోయి జీవితంపట్ల అవగాహనలో మార్పు నేను గమనించుకున్నాను. హాయిగా జీవించడం చాలా తేలిక అనిపించి .. అంతకుముందు నేను ఫీల్ అయిన వెలితి భర్తీ అయినట్లు తృప్తి చెందాను.

ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా "నలజాల సరోజ మేడమ్" గారి ఇంటికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ధ్యానంలో నాకు వచ్చే సందేహాలకు అక్కడికి వచ్చే సీనియర్ మాస్టర్స్ నుంచి సమాధానాలు పొందేవాడిని.

అంతవరకూ "భగవద్గీత" ను మాత్రమే చదివిన నేను "తులసీదళం", "ధ్యానం శరణం గచ్ఛామి", "ఓషో" మరి PSSM సాహిత్యం వంటి నవీన ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేకానేక పుస్తకాలను చదివేవాడిని. "రామ్తా", "మరణం లేని మీరు", "ఒక యోగి ఆత్మ కథ" వంటి పుస్తకాలలో ఉన్న నవీన ఆధ్యాత్మిక విజ్ఞానం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించేది.

చిత్రమేమిటంటే ధ్యానంలోకి రాకముందు భగవద్గీత చదివిన దానికీ మరి ధ్యానంలోకి వచ్చాక భగవద్గీత చదివిన దానికీ మధ్య అవగాహనలో నాకు చాలా తేడా కనిపించింది! అప్పట్లో అది "నరుడికీ మరి నారాయణుడికీ మధ్య జరిగే సంభాషణ" అనుకునేవాడిని. కానీ .. ధ్యానం చేశాక అది "మనకు మనమే చెప్పుకుంటూన్న జీవిత సత్యాలు" అని అర్థం అయ్యింది.

T.వాణి: "ధ్యాన ప్రచారం సంగతేమిటి?"
రఘురామ్ ప్రసాద్ గారు: 2005 నుంచి నేను సరోజ మేడమ్ గారితో కలిసి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేస్తూ వచ్చాను. అప్పుడే పత్రీజీ నన్ను "ధ్యాన గ్రామీణం" ప్రాజెక్ట్‌కు ఇన్‌ఛార్జ్ గా నియమించడంతో ఇక క్రొత్త మారుతీవ్యాన్ కొని దానిని పూర్తిస్థాయి Audio Visual వ్యాన్‌గా మార్చాం.

దాంట్లో 29" స్క్రీన్ ఉన్న పెద్ద TV ని ఏర్పాటుచేసి ఖమ్మం జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరం కలిసి ఖమ్మం జిల్లాలోని అనేక గ్రామాలలో విస్తృత ధ్యానప్రచారం నిర్వహించాం. ప్రతి గ్రామంలోని రచ్చబండ దగ్గర ప్రతిరోజూ సాయంత్రం ఈ వ్యాన్‌లోనే "స్పిరిచ్యువల్ రియాలిటీ" C.D ., పత్రీజీ సందేశాలు అన్నీ వేసేవాళ్ళం. మాంసం తినడం ఏ రకంగా సరియైనది కాదో వారికి వివరిస్తూ .. శాకాహారం తీసుకోవడం వల్ల ఉపయోగాలను తెలియపరిచే వాళ్ళం.

వ్యవసాయ విధానంలో క్రిమి సంహారక మందులు వాడకుండా కేవలం సంకల్ప ధ్యానాలతో ప్రకృతి ప్రేమికులుగా ఎదిగి తాముకూడా ప్రకృతిలో ఒక భాగం అన్న భావంతో సకల జీవరాశులతో మితృత్వాన్ని పొందే విధానాన్ని వాళ్ళకు తెలియజేశాం.

"సీతం పేట బంజర" అనే గ్రామంలో అయితే ఈ సూచనలను చక్కగా పాటిస్తూ .. రైతులు మరి వ్యవసాయ కూలీలు అందరూ శాకాహారులుగా మరి ప్రకృతి ప్రేమికులుగా మారిపోయారు. ధ్యానం చేస్తూ వారు ఎలాంటి ఎరువులూ మరి క్రిమి సంహారక మందులూ వాడకుండా చక్కటి దిగుబడులను సాధించడం జరిగింది! ఇదంతా కూడా ఏ ఒక్కరోజులోనో సాధ్యం కాలేదు. నిరంతర ధ్యాన ప్రచారం మరి ఆ యా గ్రామాల ప్రజలయొక్క అంకితభావం వల్లనే సాధ్యం అయ్యింది.

ఇలా వ్యవసాయదారులకు మేం ఇస్తోన్న ఉచిత ధ్యాన శిక్షణకు సంతోషపడిన అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ "శ్రీ శశిభూషణ్ కుమార్, IAS " గారు మమ్మల్ని అభినందిస్తూ జిల్లా పరిషత్ పాలనాధికారి(CEO) గారికి అధికారికంగా లేఖలు పంపి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో మండల స్థాయి అధికారులందరికీ మా ద్వారా ధ్యానశిక్షణా కార్యక్రమాలను నిర్వహించమని మాకు అనుమతి ఇస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. వారికి కృతజ్ఞతలు! ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా PSSM అధ్యక్షులు "శ్రీ బొల్లేపల్లి వెంకటేశ్వరరావు" గారు మరి "ధ్యానరత్న కేశవరాజు" గారి సహకారంతో మేము రెండు నెలల వ్యవధిలో జిల్లా అంతటా తిరిగి అన్ని మండలాలలో ప్రభుత్వ ఉద్యోగులకు ధ్యానపరిచయం చేయటం జరిగింది.

ఇలా మేము "ధ్యానగ్రామీణం" ప్రాజెక్టు క్రింద ఖమ్మం జిల్లాలోని 46 మండలాలలో మరి "ధ్యాన మన్యం ప్రాజెక్ట్" క్రింద అనేక గిరిజన గ్రామాలలో ధ్యాన ప్రచారం నిర్వహించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 వతేదీ " గాంధీ జయంతి" ని పురస్కరించుని విరివిగా శాకాహార ర్యాలీలుచేశాం.

T.వాణి: " ఇంకా మీరు చేపట్టిన ప్రాజెక్టులు ..?"
రఘురామ్ ప్రసాద్ గారు: ఖమ్మం జిల్లా PSSM అధ్యక్షురాలు "శ్రీమతి సరోజ మేడమ్" గారి పర్యవేక్షణలో ఇల్లెందు. "ఉసిరికాయపల్లె" గ్రామంలో జరిగిన 30'X30' "హనుమాన్ పిరమిడ్" నిర్మాణంలో నేను పాలుపంచుకున్నాను.

ఆ తరువాత 2011వ సంవత్సరంలో "నాగులవంచ" గ్రామంలో "రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ" వారి ఆధ్వర్యంలో మేము 15'X15' సైజులో 40 పిరమిడ్ గృహాల నిర్మాణం జరిపాము. దాదాపు ఆరునెలలపాటు ఒక యజ్ఞంలా నిర్వహించిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రతిరోజూ నిర్మాణ కూలీలకూ, లబ్ధిదారులకూ మరి ప్రభుత్వ అధికారులకూ మేము నిర్మాణ ప్రదేశంలోనే ధ్యాన శిక్షణను అందించి ఇంటినుంచి వండుకుని వెళ్ళి భోజనాలు కూడా పెట్టేవాళ్ళం. ప్రభుత్వం ఇచ్చిన నిధులకంటే అంచనాలకు మించిపోయిన గృహనిర్మాణ ఖర్చులను కూడా మన సొసైటీనే భరించడం అధికారులనే ఆశ్చర్యపరచింది!

ఆ తరువాత 2010 మార్చి 25 వ తేదీన ఖమ్మం పట్టణంలో సరోజ మేడమ్ చే అన్ని హంగులతో కూడిన "108 కేర్ సెంటర్" ఏర్పాటు చేయబడి "ఖమ్మం పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్" రూపుదిద్దుకుంది. ఈ ట్రస్ట్‌కు "నలజాల సరోజ మేడమ్" గారు ఛైర్మన్‌గా, నేను " వైస్‌ఛైర్మన్" గా ఉన్నాము. ఈ ట్రస్ట్ ద్వారా చేపట్టబడిన అతి గొప్ప ప్రాజెక్ట్ .. "కాస్మిక్ వ్యాలీ".

T.వాణి: "కాస్మిక్ వ్యాలీ ప్రాజెక్ట్ వివరాలు తెలియజేస్తారా?"
రఘురామ్ ప్రసాద్ గారు: "ఖమ్మం జిల్లాకు ఒక పెద్ద పిరమిడ్ రావాలి" అన్న పత్రీజీ ఆశయం మేరకు ఖమ్మం - వరంగల్ హైవేపై తిరుమలాయపాలెం "పిండిప్రోలు" గ్రామానికి దగ్గరలో చుట్టూ కొండలతో ఉన్న ఈ ప్రదేశం మన ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంటుందని మాకు అనిపించింది.

వెంటనే అక్కడి రైతులతో మాట్లాడి ముందు దాంట్లో 27'X 27' పిరమిడ్ స్ట్రక్చర్‌ను వేసేశాం. ఆ తరువాత ఇక చకచకా డబ్బులు సమకూరి తక్కువ కాలంలోనే రైతులకు డబ్బు కట్టేసి సుమారు 26 ఎకరాలను సేకరించాం!

అసలు అవి అన్నీ సాగు భూములయినా కూడా గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడక భూమి అంతా నెర్రెలు చాచుకుని వ్యవసాయానికి నోచుకోకుండా ఉన్నాయి. దాంతో దీనిని కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. అలాంటిది ఇక్కడ మన నీటి అవసరాల కోసం బావిని త్రవ్వించగా అతి తక్కువ లోతులోనే విపరీతమైన జలధార వచ్చి .. అది మా బావితోపాటు చుట్టుప్రక్కల చెరువులన్నింటినీ కూడా నింపేసింది. పత్రీజీ ఆ బావికి "గంగామాత" అని పేరు పెట్టి గౌరవించారు.

"ఇక్కడ బావి త్రవ్వితే అసలు నీళ్ళే పడవు" అని ఒకప్పుడు పెదవి విరిచిన ఆ ప్రాంత వాస్తవ్యులు కూడా ఇప్పుడు ఏ కాలంలో చూసినా నీటితో ఉండే "గంగామాత" బావిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఆ తరువాత ఇక్కడ 27'X 27' "ధ్యాన గంగ పిరమిడ్" ను నిర్మించాం. ఈ పిరమిడ్ పునాదిలో 9'X9' పిరమిడ్‌లతో కూడిన "మెర్కీనా" 3D శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ పిరమిడ్ శక్తి ప్రభావంతో దాని నిర్మాణం పూర్తి కాగానే కాస్మిక్ వ్యాలీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో మూడు నెలలపాటు ఎన్నడూ లేని విధంగా ఎడతెరపిలేని వానలు కురిసి నెర్రెలు చాచుకుని ఉన్న భూమి అంతా కూడా తడిసి ముద్ద అయ్యింది.

ఇటీవలే తిరుమలాయపాలెం మండలానికి "భక్త రామదాసు ప్రాజెక్ట్" కూడా మంజూరు అయ్యి లిప్ట్ ఇర్రిగేషన్ పధకం ద్వారా పాలేరు ట్యాంక్ నుంచి వ్యవసాయ పొలాలకూ మరి ప్రజల త్రాగునీటి అవసరాలకూ కృష్ణాజలాలు అందించబడుతున్నాయి. ఒక పిరమిడ్ శక్తి క్షేత్రం తన చుట్టుప్రక్కల ప్రదేశాలను సైతం ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి!

T.వాణి: "ఇంకా ఇక్కడి విశిష్టతలు .. ?"
రఘురామ్ ప్రసాద్ గారు: వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్న ఈ స్థలంలో అడుగడుగునా అద్భుతాలే!

ఇక్కడ ఉన్న అతి ప్రాచీనమైన కొండలమధ్య ఒక శక్తివంతమైన గుహ మాకు కనిపించింది. దానికి "బాబాజీ గుహ" గా నామకరణం చేసి దానిచుట్టూ ధ్యానులు కూర్చోవడానికి వీలుగా అరుగులు నిర్మించి .. 9'X 9' "మెర్కబా పిరమిడ్" ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటివలే పాల్వంచ పిరమిడ్ మాస్టర్ "హనుమంతరావు" గారి వితరణతో గుహకు చేరుకునే విధంగా ఇక్కడ ఒక వంతెన కూడా ఏర్పాటు చేశాం.

ప్రాంగణంలో ఒక ప్రక్కగా చూడముచ్చటైన రాధాకృష్ణుల విగ్రహం మరి ఆ విగ్రహం చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలతో, లతా కుంజాలతో మరి పూల పొదరిళ్ళతో చక్కటి బృందావనం ఏర్పాటు చేయబడింది. త్వరలోనే ఈ బృందావనాన్ని వెదురు పొదలతో తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ వాస్తవ్యులు మరి మాజీ మంత్రివర్యులు "శ్రీ వీరేపల్లి లక్ష్మీనారాయణ రావు దంపతుల" సౌజన్యంతో ఇక్కడ ఆరు అడుగుల "ధ్యాన బుద్ధ" విగ్రహం కూడా నెలకొల్పడం జరిగింది.

ఇక ఈ ప్రాంగణం అంతా కూడా పూల మొక్కలతో, పళ్ళ చెట్లతో కూరగాయల తోటలతో కళకళలాడుతూ అన్ని కాలాలలో కూడా పండ్లు, కూరగాయలు కాస్తూనే ఉంటాయి.

T.వాణి: "ఇక్కడ చాలా నిర్మాణాలు చేశారు!"
రఘురామ్ ప్రసాద్ గారు: అవును! ముందుగా ఇక్కడ "కాస్మిక్ హోమ్" నిర్మాణం చేశాం. అందులో పత్రీజీ కోసం ఒక ఎ.సి.రూమ్ మరి ఇతర అతిథులకోసం మరొక గదిని నిర్మించాం.

వచ్చేపోయే ధ్యానుల అవసరాలకోసం ఆరు టాయ్‌లెట్‌లు మరి 12'X12' వైశాల్యంతో కూడిన రెండు వసతి గదుల నిర్మాణంతోపాటు ఇటీవలే ఇక్కడ అన్ని హంగులతో కూడిన 30'X18' "నలభీమ వంటశాల" ను కూడా నిర్మించడం జరిగింది. పత్రీజీ దీనిని ఎంతాగానో మెచ్చుకున్నారు.

ఇంకా ఒక డార్మెటరీతోపాటు స్త్రీలకూ మరి పురుషులకూ వేరువేరుగా 10 వసతి గదుల నిర్మాణం కోసం "డోనర్స్ స్కీమ్" క్రింద ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాంగణం యొక్క మెయిన్ గేట్ కు ఇరువైపులా "జయ, విజయుల" పేర్లతో రెండు సెక్యూరిటీ సూచన మేరకు త్వరలో ఇక్కడ వెయ్యి మందికి అన్నదానం జరిపే విధంగా ఒక "భోజన ప్రాంగణం" మరి చక్కటి "గ్రంథాలయం" నిర్మించడానికి ప్రణాళికలు చేస్తున్నాం.

పాల్వంచ పిరమిడ్ మాస్టర్ "హనుమంతరావు" గారి ఆర్థిక వితరణతో మరి హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ "శ్రీ అమరేందర్ రెడ్డి" గారి సహకారంతో ఇటీవలే ఈ ప్రాంగణంలో "సోలార్ ప్లాంట్" ను అమర్చుకొవడం జరిగింది. భవిష్యత్తులో ప్రాంగణానికి కావలసిన విద్యుత్ అవసరాలన్నింటినీ ఈ సోలార్ ప్లాంట్ ద్వారా ఆ "సూర్య భగవానుడే" చూసుకుంటాడు.

T.వాణి: "పిండిప్రోలు దగ్గర మెయిన్ రోడ్డు మీద పిరమిడ్ స్వాగత ద్వారాన్ని చాలా బాగా అమర్చారు!"
రఘురామ్ ప్రసాద్ గారు: అవును! ఆ రోడ్డువెంట వెళ్ళే వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఇరవై 18'X18' పిరమిడ్‌లతో మెయిన్‌రోడ్డు ప్రక్కగా చక్కటి "పిరమిడ్ ఆర్చ్" ని నిర్మించాం. దానిని ఎంతగానో ప్రశంసించిన పత్రీజీ అన్ని పిరమిడ్ క్షేత్రాలకూ ఇలాగే నిర్మించాలని చెప్పారు.

T.వాణి: "ఇక్కడి కట్టడాలకు ప్రభుత్వపరమైన అనుమతులన్నీ తీసుకున్నారా?"
రఘురామ్ ప్రసాద్ గారు: మనం పిరమిడ్ మాస్టర్లం! ఏ పని చేసినా నియమబద్ధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొంత భాగాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చడానికీ మరి రోడ్డుపై పిరమిడ్ ఆర్చ్ నిర్మాణానికీ అవసరమైన ఫీజులు కట్టి మరీ గ్రామ పంచాయితీలో కావలసిన పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాం.

T.వాణి: ప్రాంగణంలో విగ్రహాలు బాగా ఏర్పాటు చేసినట్లునారు..!"
రఘురామ్ ప్రసాద్ గారు: చాలామంది ఇదే అడుగుతున్నారు. "PSSM ‘విగ్రహారాధన కూడదు’ అంటోంది కదా .. మరి ఈ విగ్రహాలు ఏంటి?" అని.

"విగ్రహం" అన్నది "శిల్పకళ"కు ప్రతీక. ఇక్కడ మనం మనకు మన ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని తెలియజేసిన మహాత్ముల విగ్రహాలను .. సందర్శకులకు స్ఫూర్తిని కలిగించడానికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం కానీ .. వాటికి ఆరాధనలు, ధూప ధీప హారతులు మరి నిత్యపూజలు చెయ్యడం లేదు.

ధ్యానంలో కాంతి గ్రహవాసులు ఇచ్చిన సందేశాన్ని అనుసరించి ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానిని పూలమొక్కలతో .. పూల తీగలతో సుందరీకరించాం. మాతోపాటు ఇక్కడికి వచ్చిన ఎంతోమంది ధ్యానులు ఆకాశం నుంచి కాంతిపుంజాలు ఈ ప్రాంగణంలోకి దిగి రావడం తమ తమ భౌతిక నేత్రాలతో దర్శించారు కూడా! అందుకే ఇక్కడ పత్రీజీ సూచన మేరకు UFO లకు విడిదిగా ఒక "స్పేస్-షిప్ స్టేషన్"ను కూడా నిర్మించడం జరిగింది.

T.వాణి: "ఇక్కడ జరిగే కార్యక్రమాలకు వచ్చే వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా?"
రఘురామ్ ప్రసాద్ గారు : ఇక్కడ ప్రతినెలా వారం రోజుల పాటు హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ "శ్రీ T.శ్రీనివాసరావు" గారు మరి ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో "పౌర్ణమి ధ్యాన సప్తాహం" మరి "హరికృష్ణ", "పార్వతి" గార్ల ఆధ్వర్యంలో "నక్షత్రలోకాలు వర్క్‌షాప్స్" జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలలనుంచీ ధ్యానులు ఇక్కడికి వచ్చి వీటిలో పాల్గొంటూంటారు.

ఇక భోజనాల విషయానికి వస్తే "విశ్వకల్యాణం కోసం తలపెట్టిన ఈ మహయజ్ఞంలో అంతా పత్రీజీయే చూసుకుంటారు" అన్న గొప్ప నమ్మకంతో మేము ఉంటాము. కాబట్టి ఎప్పుడూ ఏ లోటూ లేకుండా అన్నీ నిండుగా జరిగిపోతూనే ఉన్నాయి. బియ్యం, పప్పులూ, సరుకులూ అన్నీ కూడా ఇంకా ఉండగానే మళ్ళీ సమృద్ధిగా ఎవరో ఒకరి ద్వారా ఇక్కడికి వచ్చి చేరిపోతూనే ఉన్నాయి. అలా ఏర్పాటు చేస్తోన్న ఆస్ట్రల్ మాస్టర్లందరికీ కృతజ్ఞతలు!!

పత్రీజీ కలలకు ప్రతిరూపం అయిన ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉంటూ .. పట్టుదలకూ మరి అంకిత భావానికీ ప్రతిరూపంగా ఉన్న "శ్రీమతి నలజాల సరోజ మేడమ్" గారితో కలిసి పనిచేస్తూ .. ఆర్థికంగా మరి భౌతికంగా నా సేవలను అందించగలిగే అవకాశం రావడం నాకు ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పత్రీజీకి నా కృతజ్ఞతలు.

 

హనుమకొండ రఘురామ్ ప్రసాద్

- కాస్మిక్ వ్యాలీ -ఖమ్మం
-98480 60240

 

Go to top