"ధ్యాన ప్రచారం నన్ను కోటీశ్వరుడిని చేసింది"

 

నా పేరు "సురేష్ రెడ్డి".

గుంటూరు జిల్లాలోని "తూబాడు" అనే గ్రామంలో క్రైస్తవమతానికి చెందిన ఒకానొక వ్యవసాయదారుల కుటుంబంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రుల కుటుంబంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రులు "శ్రీ లూర్థు మర్రెడ్డి" గారు మరి "శ్రీమతి లూర్థు మేరీ" గార్లు. మా తల్లిదండ్రులకు మేము మొత్తం ఏడుగురు సంతానం.

నేను 5వ తరగతి వరకు మా స్వగ్రామంలోనే ఉన్న " RCM ప్రైమరీ స్కూల్" లో, ఆ తరువాత ఫిరంగిపురం లోని " సెయింట్ పాల్స్ హైస్కూల్" లో 10వ తరగతి వరకు చదివాను. "ఆంధ్రా యూనివర్సిటీ" నుంచి దూరవిద్యలో B.com పూర్తి చేశాను.

చిన్నప్పుడు మాకు రైసుమిల్లు ఉండేది. ఈ మిల్లు ఆవరణలో మేము కోళ్ళు, పందులు మరి పావురాళ్ళను ఎంతో ప్రేమగా పెంచేవాళ్ళం. కానీ పండుగలు, పబ్బాలు రాగానే అలా ప్రేమగా పెంచిన వాటినే ఆహారం కోసం నిర్దయగా చంపి వండుకుని తినేవాళ్ళం. దాంతో ఇక ఆరడగుల ఆజానుబాహులయిన మా నాన్నగారికి మూడుసార్లు పక్షవాతం వచ్చి మంచానికి అంకితమై పోయారు.

వారిని చూడడానికి వచ్చిన బంధువులు "పావురాయి రక్తంతో కాళ్ళు, చేతులూ మర్దన చేస్తే పక్షవాతం తగ్గుతుంది" అని మూర్ఖపు సలహాలు ఇచ్చేవాళ్ళు! బుద్ధిలేని మేము వాళ్ళ సలహాలు విని పాపం ఆ చిన్న పావురాళ్ళను పట్టి చంపి అలాగే చేసే వాళ్ళం. రోగం తగ్గకపోగా మా నాన్న మరింతగా కుంచించుకుపోయి చనిపోయారు.

ఆ తరువాత కూడా రెండుసార్లు కోళ్ళఫారాలు నిర్వహించి .. మరింత విపరీతంగా మాంసం తింటూ మరిన్ని పాపాలను మూటకట్టుకోవడం జరిగింది! ఆ కర్మల ఫలితమే నన్ను ఉబ్బసం వ్యాధికి గురిచేసింది. ఆ వ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే ఒక్కోసారి నాకు ఊపిరి కూడా అందక ప్రత్యక్ష నరకం అనుభవించేవాడిని. అప్పుడు ఎమర్జెన్సీగా హాస్పిటల్‌లో నాకు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టేవాళ్ళూ.

అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఇలా రకరకాల వైద్యాలకోసం వేల రూపాయలు ఖర్చు అయ్యేవి. విపరీతంగా మందులు వాడడం వలన వాటి సైడ్ ఎఫెక్ట్‌లతో నేను విలవిలలాడి పోయేవాడిని. ఎవరయినా దేవుడు ప్రత్యక్షమై "నీకు కోటి రూపాయలు కావాలా లేక ఆరోగ్యం కావాలా?" అంటే మాత్రం టక్కున "ఆరోగ్యమే కావాలి" అని కోరుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయాను నేను! నా వ్యాధి తీవ్రతను చూసి నా భార్య "సంధ్య" ఎంతో భయపడుతూ చర్చిలకు వెళ్ళి నా కోసం ప్రార్థనలు కూడా చేసేది.

అలాంటి స్థితిలో 2001 సెప్టెంబర్ నెలలో నాకు ఒక మిత్రుడి ద్వారా "ధ్యాన" పరిచయం జరిగింది. ధ్యానం చేయడం మొదలు పెట్టిన మొదటి పది రోజుల్లోనే నేను గాలిలో తేలుతూన్నంత ఆనందంగా అయిపోయాను. తరచుగా వచ్చే ఆస్తమా అటాక్‌లు క్రమంగా తగ్గుముఖం పట్టడం జరిగింది.

ఇక నేను శుద్ధ శాకాహారిగా మారిపోయాక అంతవరకు అపసవ్యంగా తిరిగిన నా జీవితచక్రం ఇక సవ్యంగా తిరగడం మొదలయ్యింది.

మొట్టమొదటిసారిగా జీవితంలో "అసలైన ఆనందం" అంటే ఏమిటో రుచి చూశాను. నా మనస్సులో ఉన్న ఎన్నెన్నో భ్రమలూ మరి నా వ్యక్తిత్వానికి ఉన్న ఎన్నెన్నో ముసుగులూ తొలిగిపోయి అసలు నేనెంటో నాకు అర్థం అయ్యింది. అప్పటివరకు ఒకానొక మూర్ఖుడిలా జీవించిన నేను ధ్యానం తరువాత ఒకానొక మనిషిలా నన్ను నేను గుర్తించుకుని .. ఒకానొక దేవుడిలా ఎదగడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో నేను చదివిన "సేత్‌విజ్ఞానం" నాకు కర్మ సిద్ధాంతాన్ని విశేషంగా బోధించింది.

మేము ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులకు హైదరాబాద్‌లో ఒకసారి "డా||న్యూటన్ కొండవీటి" గారిచే ఏర్పాటు చేయబడిన "పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ప్రోగ్రామ్" లో నా భార్యతో కలిసి పాల్గొన్నాను.

అక్కడ అందరం గాఢ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా డా||న్యూటన్‌గారు "మెల్లిమెల్లిగా గతంలోకి వెళ్ళండి" .. "తల్లి గర్భంలోకి వెళ్ళండి" .. "గత జన్మలలోకి వెళ్ళండి" అంటూ సూచనలు ఇస్తున్నారు. అది విని నేను, నా శ్రీమతి "ఇదంతా వట్టి ట్రాష్" అంటూ మాలో మేమే నవ్వుకున్నాం.

క్రైస్తవ మతంలో ఎక్కడా గత జన్మల ప్రస్తావన ఉండక పోవడంతో నేను ఈ సబ్జెక్ట్ ఎప్పుడూ విని ఉండలేదు. దాంతో "ఈ పిరమిడ్ వాళ్ళకు పిచ్చి పట్టింది; ప్రస్తుత జన్మలో హాయిగా ఉండకుండా ఈ గత జన్మల గోలేంటి? ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే చాలాదా?" అనుకుని ఇంటికి వచ్చేశాం.

ఆ తరువాత కొన్ని రోజులకు మా "సంధ్య" ధ్యానంలో ఉండగా తనను తాను ఒకానొక జన్మలో ఒక హిందువుగా స్పష్టంగా చూసుకోవడం జరిగింది. నాకు కూడా గత మూడు నాలుగు జన్మలుగా స్వామీ వివేకానంద కాలంలోనూ, జీసస్ క్రైస్ట్ కాలంలోనూ మరి అశోక చక్రవర్తి కాలంలోనూ ఉన్నట్లూ .. మరి అప్పుడు కూడా సంధ్య నేను భార్యాభర్తలుగా ఉన్నట్లూ ధ్యాన అనుభవం వచ్చింది.

ధ్యానంలోకి రాకముందు విపరీతంగా మాంసం తిన్న నేను ధ్యానిగా మరి శుద్ధ శాకాహారిగా మారిన తరువాత ఇంతకాలంగా మలినమైన నా దేహాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి 25 రోజులపాటు కేవలం తేనె, నీళ్ళు త్రాగి ఉన్నాను. ఆ సమయంలో నా శరీరంలోని ప్రతి ఒక్క కణం విశ్వశక్తితో శుద్ధి చేయబడడం మరి నా DNA మార్పు చెందడం నేను ధ్యానంలో చూసుకున్నాను. అప్పటినుంచి నేను పొందిన ఆత్మానందం అందరూ పొందాలన్న కోరికతో ధ్యానప్రచారం మొదలుపెట్టాను.

"నేను జన్మించిన క్రైస్తవ సమాజానికి ధ్యానం అందించాలి" అని నాకు ధ్యానంలో వచ్చిన సందేశంతో ఇక ఆ దిశగా నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. కోళ్ళఫారం బిజినెస్ మూసివేసి హైదరాబాద్‌లోనే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూకట్‌పల్లి వసంత్‌నగర్ పిరమిడ్ మాస్టర్ "రమాదేవి మేడమ్" మరి పైమా మాస్టర్ "సౌమ్య" గార్ల సహకారంతో జీడిమెట్లలో ఉన్న దేవాలయాలలో నిరంతర ధ్యాన శిక్షణా తరగతులను నిర్వహించాను.

అలా రెండు సంవత్సరాలు గడిచాక చెన్నైలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. కానీ ఎందుకో అక్కడ ఇమడలేక సతమతమవుతూన్న తరుణంలో "ఇష్టం లేకపోతే చేప అయినా సరే నీటిలోంచి బయటికి రావాలి" అని ఒక పుస్తకంలో చదివి ఏం చెయ్యాలో అడుగుదామని హైదరాబాద్‌లో ఉన్న పత్రీజీ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే US నుంచి
తిరిగివచ్చిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్ "నేను ఏం జాబ్ చెయ్యాలి సార్?" అని అడుగుతూంటే "సార్ ఏం చెబుతారో" అని నేను కుతూహలంగా వింటున్నాను.

"సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్ జాబులు ఎవ్వరయినా చేస్తారయ్యా! బుద్ధుడు, జీసస్, వివేకానందుడి వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెళ్ళి ఆ ఉద్యోగాలు చేయండి. అందుకు మీకు అన్ని అర్హతలూ ఉన్నాయి" అని చెప్పారు.

అంతే! ఇక నాకు నా గమ్యం, దిశ, లక్ష్యం అన్నీ అర్థం అయిపోయి పూర్తి ధ్యానప్రచారంలో మునిగిపోయాను! అయితే ఉద్యోగపరంగా నెలనెలా వచ్చే జీతం ఆగిపోవడంతో ఆర్థికంగా నలిగిపోతూ మెహదీపట్నంలో ఉన్న మా అపార్ట్‌మెంట్ యొక్క బ్యాంక్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా కట్టలేకపోయేవాడిని. దాంతో ఇక ఆ అపార్ట్‌మెంట్ అమ్మాలని నిర్ణయించుకున్నాను.

"‘ధ్యానం ..ధ్యాన ప్రచారం" అంటూ ఉద్యోగం సద్యోగం మానేసి తిరుగుతున్నాడు; ఇక ఇప్పుడు ఇల్లు కూడా అమ్మేసి ఏం చేస్తాడో" అంటూ అందరూ ఖంగారు పడుతూన్నా కూడా నేను "చేసేది విశ్వకళ్యాణం కనుక నా మంచి చెడ్డలు ఆ విశ్వమే చూసుకుంటుంది" అన్న ధైర్యంతో పత్రీజీ మీద భారం వేసి ఇల్లు అమ్మేశాను! బ్యాంక్ సెటిల్‌మెంట్ చేసేసి మిగిలిన డబ్బులతో గుంటూరులో ఒక స్థలం కొని ఇక ధ్యాన ప్రచారంలో మునిగిపోయాను.

అయితే మారిన రాజకీయ పరిస్థితులవల్ల నేను కొన్న స్థలం రేటు అతికొద్ది సమయంలోనే వందల రెట్లు పెరిగి ఇప్పుడు కోటి రూపాయలకు చేరి .. నన్ను కోటిశ్వరుడిని చేసింది!

ధ్యాన ప్రచారానికి నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా తిరుగూతూన్న క్రమంలో ఒకసారి ఆక్సిడెంట్‌కు గురి కావడం జరిగింది. కానీ ఏ మాత్రం గాయాలు కాకుండా ఎవరో కాపాడినట్లు బయటపడడం "ధర్మో రక్షతి రక్షితః" అన్న వేద వాక్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఇలా ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న చాలా మిషనరీ స్కూల్స్‌లో, ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలలో మరి పోలీస్ శిక్షణా కేంద్రాలలో నేను ధ్యాన ప్రచారాన్ని నిర్వహించి దాదాపు మూడు లక్షలమంది విద్యార్థులకు ధ్యానవిద్యను అందించడం జరిగింది!

ఆ తరువాత స్కూల్స్ యాజమాన్యాల కోరిక మేరకు అధ్యాపకులకు కూడా ప్రత్యేక ధ్యాన శిక్షణను అందిస్తూ ఉన్నాను. ఈ దిశగా విద్యార్థులు, అధ్యాపకులు ఎదుర్కొనే పలు సమస్యలకు ధ్యాన పరిష్కారాలు చూపిస్తూ "అధ్యాపకులు - ఆధ్యాత్మికత" అన్న పుస్తకాన్ని రూపొందించడం జరిగింది!

ఇందులో విద్యార్థులు ఎదుర్కొనే .. అర్థంలేని భయాలు, ఫోబియాలు, అనారోగ్యాలు, సబ్జెక్ట్‌పట్ల మరి టీచర్ల పట్ల ఉండే వ్యతిరేక భావనలు, ఆత్మన్యూనతలు, ఆత్మహత్యలు .. వంటి పలు సమస్యలను చర్చించడం మరి నిరంతర ధ్యాన సాధన ద్వారా వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో సూచించడం జరిగింది.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను పెంచుకోవడానికి ధ్యానశక్తి ఎలా ఉపయోగపడుతుందో వివరించిన తీరును ఎందరో విద్యార్థులు ప్రయోగపూర్వకంగా చేపట్టి చక్కటి ఫలితాలను పొందడం జరిగింది.

ఇంతవరకు దాదాపు 8,200 పుస్తకాలను ప్రచురించడం .. మరి అందులో 2,000 పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందచేశాం.

నా ఈ ధ్యాన ప్రస్తానంలో నా సహధర్మచారిణి "సంధ్య" నాకు వెన్నంటే ఉంటూ, అనుక్షణం తన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. M.Sc., M.Ed.చదివిన తాను లెక్చరర్‌గా పనిచేస్తూ నాకు సపోర్ట్‌గా కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తోంది. మా అమ్మాయి "సృజన" నిరంతరం ధ్యానం చేస్తూ చక్కగా చదువుకుంటూ ఇంటర్‌మీడియట్‌లో కాలేజీ ఫస్ట్ వచ్చి పలు అవార్డులను అందుకుంది.

"నా విజయానికి కారణం ధ్యానమే" అని ఖచ్చితంగా చెబుతుంది. మా అబ్బాయి "శ్రేయంత్" కూడా అక్కకు తగిన తమ్ముడిగా ఉంటూ ఉత్తమ విద్యార్థిగా నిలుస్తున్నాడు. తల్లితండ్రులుగా ఇది మాకెంతో గర్వకారణం!

 

కొలుకుల సురేష్ రెడ్డి 

మల్కాజ్‌గిరి- హైదరాబాద్
-94931 76428

Go to top