"మండపేట అంతా ధ్యానమయం"

 

నా పేరు "సత్యసుధ".

మా వారి పేరు "శ్రీనివాస్ గారు" మరి మా అమ్మాయిలు "అఖిల", "తన్మయి". మాది సంపూర్ణ ధ్యాన శాకాహార కుటుంబం.

నేను, మా పిన్నిగారయిన ఈతకోట పిరమిడ్ మాస్టర్ "కృష్ణవేణి" గారి ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను. కానీ చాలారోజులపాటు ధ్యానసాధన చెయ్యలేదు. 2004 సంవత్సరంలో రకరకాల అనారోగ్య సమస్యలతో నేను బాధపడుతూ ఉన్నప్పుడు "ధ్యానం చేస్తే జబ్బులన్నీ తగ్గిపోతాయి" అని ఇదివరలో విన్న విషయం గుర్తుకు వచ్చి 2004 జూలై 7 నుంచి ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను. "రోగాలన్నీ తగ్గిపోయాక మందులు మానేసినట్లు ధ్యానం కూడా మానేద్దాంలే" అనుకున్నాను.

అనుకున్నట్లే కొద్ది రోజులకే నాకు ఉన్న సకల అనారోగ్యాలూ మటుమాయం అయిపోయాయి. దాంతోపాటే మానసికమైన చికాకులు కూడా దూరమై నేను జీవితంలో అసలయిన ఆనందం అంటే ఏమిటో అనుభవించడం మొదలయ్యింది. దాంతో "అసలు దీనికంతటికీ కారణమయిన మహానుభావుడిని ఎలాగైనా చూడాలి" అన్న కోరికతో రాజమండ్రి పట్టణంలోని ఒక కల్యాణ మండపంలో పత్రీజీ కార్యక్రమం జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్ళాను. ధ్యానకార్యక్రమం అయిపోయాక పత్రీజీ నన్ను దగ్గరికి పిలిచి "మీ పేరేంటి?" అని అడిగారు.

"సత్యసుధ" అని నేను చెప్పగానే "దాని అర్థం మీకు తెలుసా?" అని అడిగారు మళ్ళీ.

"‘సత్య’ అంటే సత్యమండీ .. ‘సుధ’ అంటే అమృతమండీ" అని చెప్పాను.

"అయితే దానిని అందరికీ పంచండి" అని చెప్పి వెళ్ళిపోయారు.

ఇక ఆ తరువాత నుంచీ నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా "నీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు; నీ జ్ఞానాన్ని అందరికీ పంచు, నువ్వు దీనికోసమే వచ్చావు" అని నా లోపలినుంచే నాకు పదే పదే ఎవరో చెబుతూన్నట్లు అనిపించి ధ్యానం అసలు కుదిరేది కాదు.

దీని గురించి మా పిన్నిగారిని అడుగగా "అవి నీ అంతరంగంలోంచి వస్తున్న సందేశాలు" అని చెప్పారు. కానీ నాకు ఒకటే సందేహం. "నాకు ఏం వచ్చు అని నా జ్ఞానాన్ని అందరికీ పంచాలి?" అని!

అలా ఒక ఇరవైరోజులు గడిచాక "పత్రీజీ మండపేట వస్తున్నారట .. అందుకు ఏర్పాట్లు నువ్వే చెయ్యాలి" అని రాజమండ్రి మాస్టర్స్ చెప్పారు.

ఇక నాకు ఒకటే ఖంగారు! వెంటనే పాంఫ్లెట్స్ ప్రింట్ చేయించుకుని ఇంటింటికీ పంచి పత్రీజీకి మా ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేశాను.

పత్రీజీ వచ్చినరోజు ఆశ్చర్యకరంగా 600 మంది హాజరు అయ్యారు. నా చేతికి మైకు ఇచ్చి సార్ నా అనుభవం చెప్పమన్నప్పుడు ఏనాడూ నలుగురిలో మాట్లాడి ఎరుగని నేను అన్ని వందలమంది ముందు పదిహేను నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడేశాను.

ఆ తరువాత ఇక ఎప్పుడూ నేను ధ్యానంలో కూర్చున్నా "నీ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు; రోడ్ల మీద పరుగెత్తు .. తలుపులు కొట్టి వాళ్ళను బయటికి పిలిచి ధ్యానం నేర్పు; మండపేట అంతటా పబ్లిక్ పిరమిడ్‌లు కట్టు" అంటూ విజన్స్ మరి సందేశాలు వచ్చేవి. సరే ధ్యానం చెబుదామని ఎవ్వరి దగ్గరకు వెళ్ళినా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించక పోయేవాళ్ళు. పైగా "ఈజిప్ట్ దేశంలో శవాలను పెట్టే పిరమిడ్‌లను ఇక్కడ కట్టమంటావేంటి?అందులో ధ్యానమేంటీ?" అని నన్ను కోపగించుకునే వాళ్ళు.

అది చూసి నాకు చాలా బాధగా ఉండేది.

"ఛ .. మండపేట ఇలా ఉండకూడదు; ఇదంతా ధ్యాన శాకాహార మయం చెయ్యాలి, పిరమిడ్ శక్తితో నిండిపోవాలి" అనుకుని "సార్! నేను ఒక్కదాన్నే అయిపోయాను. నాకు ఒక సపోర్ట్ కావాలి; మీరే చూడండి సార్" అంటూ ధ్యానంలో పత్రీజీకి మొరపెట్టుకున్నాను.

అంతే కొద్ది రోజులకే మండపేట "మాజీ MLA శ్రీ V.V.S. చౌదరి" గారు హైదరాబాద్ "జయలక్ష్మి గార్డెన్స్‌లో పత్రీజీని చూసి వారి క్లాస్ విని .. మండపేటకు వారిని ఆహ్వానించారట" అని తెలిసి ఎంతో సంతోషించాను. ఎంతో ఉన్నత భావాలు కలిగిన చౌదరిగారు ఏదైనా సరే చాలా గట్టిగా పట్టుకుంటారని పేరు. అన్నదానేలేంటి .. పూజలేంటి .. వారి ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అలాంటి దాతృత్వగుణ సంపన్నుల సహకారం నాకు దొరకడంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

పత్రీజీ క్లాస్ తరువాత ఇక మండపేట స్వరూపమే మారిపోయింది! మా ఇంటి ప్రక్కవీధిలో ఉన్న చౌదరిగారి "సత్యసాయి మందిరం"లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ధ్యానతరగతులు నిరంతరంగా జరిగేట్లు వారు ఏర్పాటు చేశారు. T.V.లో స్క్రోలింగ్ ఇప్పించడం, "స్పిరిచ్యువల్ రియాలిటీ" C.D. లు ప్రదర్శించడం చేశారు. 2007లో చౌదరిగారు అయ్యప్ప స్వామి గుడి దగ్గర 14'X14' పిరమిడ్‌ను కట్టించారు!

దానిని ప్రారంభం చేస్తూ పత్రీజీ "ఇక్కడ ఇంకా పెద్ద మెగా పిరమిడ్ వస్తుంది" అని చెప్పారు. అన్నట్లే కొద్ది రోజులకు ఆ పిరమిడ్ దగ్గర ధ్యానుల రద్దీ పెరిగిపోవడంతో ఒక పెద్దాయన వచ్చి "మేము కూడా ఏదయినా మంచి పని చేద్దామనుకుంటున్నాము. ఒక మెగా పిరమిడ్ కడితే ఎలా ఉంటుంది?" అన్నారు.

ఆ తరువాత 2008లో వారు 40 లక్షల రూపాయల ఖర్చుతో పూర్తి పాలరాతితో నిర్మించిన "కొనగళ్ళ సత్యనారాయణ మరి విజయ కుమారీల A.C. ధ్యాన మందిరం" పూర్తి కావడం మరి 3000 మందితో పత్రీజీ క్లాస్ మరి 1500 మందితో శాకాహార ర్యాలీ అత్యద్బుతంగా జరిగింది.

ఆ పిరమీడ్‌లో అనేక మౌనధ్యానాలు, శాకాహార ర్యాలీలు, పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు జరుగుతూ వస్తున్నాయి. ఆ తరువాత ఒక పబ్లిక్ స్థలంలో చౌదరి గారే మరొక 20'X20' పిరమిడ్‌ను కూడా కట్టించారు.

ఇలా "మండపేట అంతా పిరమిడ్‌ల మయం అవుతోంది" అన్న సంతోషంతో మేము మా స్వగృహంపై కూడా 10'X10' పిరమిడ్‌ను నిర్మించుకోగా మార్చి 11వ తేదీన మా "25వ వివాహ వార్షికోత్సవం" సందర్భంగా పత్రీజీ ఇక్కడికి విచ్చేసి దానిని ప్రారంభించి దానికి "శ్రీ సుధ పిరమీడ్ ధ్యాన మందిరం" అని పేరు పెట్టారు.

750 మంది ధ్యానుల సమక్షంలో వారి చప్పట్లే బాజా భజంత్రీలుగా పత్రీజీ మా కల్యాణవేడుక జరిపించి మాకు బ్రహ్మానందాన్ని పంచారు. వారికి మా ఆత్మపూర్వకమైన ధన్యవాదాలు.

 

సత్యసుధ - మండపేట
తూర్పుగోదావరి జిల్లా
-93466 99990

Go to top