" ధ్యానం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది "

 

నా పేరు శర్మ.

నేను ధ్యానం లోకి రాకముందు ఓంకారం, గాయత్రీ మంత్రం బ్రహ్మముహూర్తంలో ప్రాణాయామం వగైరా చేస్తూండడం వల్ల దేహపరమైన ఎన్నో లాభాలు పొంది నాకు తెలిసిన వారందరికీ చెబుతూండేవాడిని.

"ధ్యానం చేయడం వల్ల శారీరక పరమైన లాభాలే కాకుండా మానవసికపరమైన, ఆత్మపరమైన లాభాలు ఎన్నో వస్తాయి" అని మా కార్యాలయంలో పనిచేసే "స్వామి" గారి ద్వారా తెలుసుకున్నాను.

 

తర్వాత 2003 నవంబరులో మా "ఎజి కాలనీ" లోనే ధ్యానం క్లాసులు జరుగుతున్నాయని తెలుసుకుని, నా భార్యతో పాటు వెళ్ళాను ; అక్కడ వెంకటరమణ, ఆయన శ్రీమతి క్లాసులు నిర్వహిస్తూండేవారు. వారం, పదిరోజులు నాకు ఎటువంటి అనుభవాలూ రాలేదు.

 

" ధ్యానంలో కళ్ళు మూసుకున్నంత మాత్రాన .. ఏం జరుగుతుంది ? ఎలా జరుగుతుంది .. ఎందుకు జరుగుతుంది ?" అంటూ అక్కడికి వచ్చిన వారందరినీ అడుగుతూండేవాడిని. వారు చెప్పినా నాకు ఏమీ బోధ పడేది కాదు.

 

ఆ తర్వాత పత్రీజీ "పతంజలి యోగ సూత్రాలు" సిడి చూశాను. పౌర్ణమి రోజు క్లాసుకి వెళ్ళాను. కొంతసేపు ధ్యానం.. విరామం .. తర్వాత ధ్యానం .. ఇలా చేస్తూండగా సుమారుగా రెండు గంటలకు ఎంతో విశ్వశక్తి నాలోకి ప్రవేశించిన అనుభూతి పొందాను ! అది కరెంటు తీగలో ప్రసరించిన అనుభూతి రాత్రంతా పౌర్ణమి ధ్యాన జాగరణ చేసినా .. ఇంటికి వచ్చి నిద్రపోదామని ప్రయత్నిస్తే .. ఎంతకూ నిద్ర రాకపోగా .. ఎంతో ఉత్సాహం ! కనీ వినీ ఎరుగని .. ఎంతో ఆనందం చెప్పనలవి కాని .. అనుభూతిని పొందాను ! ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా తెలిసిన వారికి తెలియని వారికి ధ్యానం గురించి చెప్పడమే, ధ్యానం చేయించడమే జరుగుతోంది!

 

రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాలలో, అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్ధల్లోనూ, కమీషనర్, ఆంధ్రప్రదేశ్ సెక్రెటేరియట్ లో కాకుండా దేవాలయాల్లో, విద్యాలయాల్లో .. ఇలా పామరుల నుంచి అందరికీ నేర్పించడం, ఎంతో నేర్చుకోవడం కూడా జరుగుతోంది ! షిరిడీ, ఒరిస్సాలలో కూడా ప్రచారం చేయడం జరిగింది !

 

పత్రీజీ ప్రతి మాట, ప్రతి కాన్సెప్టు ఎంతో స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా .. నాలోని జడత్వాన్నీ, అలసత్వాన్నీ పోగొట్టి నన్ను కార్యోన్ముఖుణ్ణి చేస్తునే ఉన్నాయి. వారికి నా శతకోటీ ధ్యాన ప్రణామాలు.

 

పత్రీజీతో వెళ్ళిన ఎనిమిది ట్రెక్కింగుల్లో .. ప్రకృతి ఒడిలో ఎలా స్వేచ్ఛగా, హాయిగా .. సుఖాల్లోనే కాకుండా కష్టాల్లో ఎలా సర్దుకోవాలో, తోటి వారితో ఎలా ప్రవర్తించాలో .. ప్రతి జీవరాశి నుంచీ ప్రతి సంఘటన నుంచీ ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్నాను.

 

బ్రహ్మర్షి పత్రీజీ గారితో కైలాస మానససరోవర యాత్ర చేయాలన్న కోరిక .. 2007వ సంవత్సరంలో నెరవేరటం .. నిజంగా నాకు ఎనలేని తృప్తిని ఇచ్చింది ! వారికి నా హృదయపూర్వక కృతజ్ణతలు!

 

P.L.N.శర్మ

సెల్ : 9246151377

Go to top