" బంగారూ .. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి "

 

నా పేరు వెంకటేశ్వర్లు.

ఒక వ్యక్తి పెరిగిన పరిస్ధితులు అతని జీవితం పై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అలాగే నా చిన్నతనం నుంచి కూడా మా ఇంట్లో ఎలాంటి పూజలు కానీ, దేవుని ఫోటోలు కాని ఉండేవి కావు.నిరక్షరాస్యులైన నా తల్లి తండ్రులది ఒకటేమార్గం ! "ఎవ్వరికీ హాని చేయవద్దు .. వీలుంటే సహాయం చేయాలి"

నేను కూడా అవే భావాలతో పెరగడం వలా నాకు "అందరికీ మంచి చేయాలి" అన్న లక్ష్యం ఉండేది. అందుకోసం నేను నాక్కు అందుబాటూలో ఉన్న విప్లవ పార్టీల భావాలనూ మరి మార్గాన్నీ అనుసరిస్తూ వుండే వాడిని. అవసరం అనుకుంటే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమై ఉండేవాడిని. ఈ "బాబాలు", "గురువులు" అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నేను ఇంటర్ చదివే రోజుల్లో .. సత్యసాయిబాబాకి వ్యతిరేకంగా పాటలు విని, పాడి ఆనందించేవాడిని.

 

తరువాత కాలక్రమంలో ఎన్నో ఒడిదుడుకులు చవిచూసాక B.Com రెండవ సంవత్సరం చదువుతూ ఉన్నప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది ! "నా భావాలు మంచివే కానీ .. మార్గం మంచిది కాదు ; వాటివల్ల క్షణికావేశంలో విలువైన జీవితం కోల్పోవలసి వస్తుంది" అని తెలుసుకుని .. నా మార్గం మార్చుకున్నాను.

 

1999వ సంవత్సరంలో కలిగిన పత్రీజీ పరిచయ భాగ్యం నా జీవితాన్ని సమూలంగా మార్చివేసింది ! నాలో ఉన్న భావాలకు ఒక మంచి మార్గం మరి మంచి గురువు దొరకడం ఎన్ని జన్మల పుణ్యఫలమో, ఎన్ని జన్మల ఎదురుచూపో !!

 

ధ్యానం వల్ల నా విప్లవ భావజాలంలోని నెగెటివిటీ అంతా తుడిచిపెట్టుకుని పోతూ .. మహాత్ముల జీవితాలను క్రొత్తకోణంలోంచి చూడడం మొదలైంది. అప్పటి వరకు శ్రీ సత్యసాయి పట్ల నాకు ఉన్న దృక్కోణం మారిపోయి .. ఒక మనిషి తన ఆధ్యాత్మిక శక్తిలో సకల వనరులు ఉన్న ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపించడం .. నిజంగా అజేయం ! వారు అద్భుతం ! వెంటనే ఆ మహానుభావుడిని స్వయంగా చూడాలని కోరిక కలిగి పుట్టపర్తికి వెళ్ళగా .. అది వెంటనే నేరవేరింది !

 

ప్రత్యేకంగా అయిన తరువాత .. వారి కరుణాంతరంగ హృదయాన్ని మననం చేసుకుంటూ, వారి ప్రేమ పూర్వకమైన చూపులను గుర్తుకు తెచ్చుకుంటూ అక్కడే ప్రశాంతి నిలయంలో నేను ధ్యాన వృక్షం క్రింద కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చున్నాను.

 

ధ్యానంలో బాబా వారు కూడా ఆస్ట్రల్ గా వచ్చి నా ప్రక్కనే కూర్చుని నాతో పాటు ధ్యానం చేసారు ! "నేను, అందరిలోనూ, అన్నింటిలోనూ, అంతటా వ్యాపించి ఉన్నా" అంటూ వారు నాక్కు తమ విశ్వరూపాన్ని దర్శనం ఇచ్చారు ! ఈ నా దివ్యచక్షువు అనుభవంతో అప్పటి వరకు ఎక్కడో ఏ మూలో బాబా వారిపై నాకు ఉన్న కాస్త అయిష్టత కూడా తొలగిపోయి .. నా అజ్ణానానికి నేనే బాధపడ్డాను !

 

అప్పటి నుంచి ఎప్పుడు ఇల్లు వదలి ధ్యాన ప్రచారానికి బయలుదేరినా .. బాబా నాక్కు ఆస్ట్రల్ గా దర్శనం ఇచ్చి ఎంతో ప్రేమతో "బంగారూ ! .. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి .. నీ ఇంటినీ, నీ వాళ్ళనూ నేను చూసుకుంటాను !" అంటూ సందేశం ఇచ్చారు. అందుకే నేను మన రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా ధ్యాన ప్రచారం, ఎలాంటి బాధ, కష్టం లేకుండా చేయగలుగుతున్నాను !

 

అంతటి అనంతమైన షరతులు లేని ప్రేమను బాబా వారి నుంచి పొందిన నేను .. మళ్ళీ అలాంటి ప్రేమను పత్రీజీ నుంచి పొందుతూ అదే ప్రేమను అందరికీ పంచుతున్నాను.

 

సత్యం తెలియక ముందు మనం అజ్ణానంతో భౌతిక స్ధాయిలోనే ఉండి .. ఆత్మ స్ధితిలో ఉన్నవారిని ద్వేషిస్తాము. కానీ ఆ ఆత్మ స్వరూపులకు తెలిసింది షరతులు లేని ప్రేమ మాతమే ! అది అనంతమైంది ! ప్రేమ స్వరూపులే .. ఆత్మ స్వరూపులు మరి ఆత్మ స్వరూపులే .. దైవ స్వరూపులు !

 

బాబా తమ చివరి రోజుల్లో కూడా .. చక్రాల కుర్చీలో కూర్చుని అమాయకంగా ఒక చిన్న పిల్లవాడిలా అందరికీ దర్శనం ఇచ్చేవారు ! ఏం జరిగినా వారు ఎవ్వరినీ నిందించలేదు. అందుకే బాబా వారి జీవితమే .. వారు మనకు ఇచ్చిన దివ్య సందేశం ! వారు అచరించిన బంగారు సూక్తి .. "హార్ట్ నెవర్ .. హెల్ప్ ఎవర్" అన్న దానినే మనం కూడా ఆచరించుదాం !!

 

 S. వెంకటేశ్వర్లు
ఇల్లందు

సెల్ : +91 9440979220

Go to top