" ధ్యానం .. నన్నే ఓ చూపు చూసింది "

 

 

నా పేరు దినేష్ చారి.

మాది హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లాలో అజీజ్‌నగర్ అనే గ్రామం.

"ఉచిత ధ్యానం .. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస" అనే అక్షరాల గోడ .. క్రింద హైదరాబాద్ స్పిరిచ్యువల్ ఇండియా ఆఫీస్ చిరునామా మరి ఫోన్ నెంబర్ నా 19 సంవత్సరాల జీవితాన్ని శాసిస్తుందని అప్పుడు అనుకోలేదు ! ధ్యానమంటే ఇంత సింపుల్‌గా చెప్తున్నారు. ఓ చూపు చూద్దాం" అనుకున్నాను. కానీ నాకు ఆ తర్వాత తెలిసింది "ధ్యానం .. నన్నే ఓ చూపు చూసింది" అని !

నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. దాంతో నేను అమ్మమ్మవాళ్ళ దగ్గర చదువుతూ అలాగే కులవృత్తి అయిన బంగారం పని నేర్చుకుంటూ ఉండేవాణ్ణి. అమ్మకు ముగ్గురం మగసంతానం. స్వయంగా చిత్రకారుణ్ణి. ఏ పుస్తకాలు చూసినా చదవాలనే ఆత్రుత ఉండేది. 16 సంవత్సరాల వయస్సప్పుడే "బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ?", "కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి ?", "ప్రదక్షిణాలు ఏ కారణం చేత చేయాలి ?", "నేను అంటే ఎవరు ?", "నేను నేనుగా ఎందుకు ఉన్నాను ?", "నేను జన్మించడానికి కారణం ఏమిటి ?", "ఈ భూమికి నా అవసరం ఏమిటి ?" అని ఆలోచిస్తూ నా చేతిని గిల్లి చూసుకుంటూ శరీరాన్ని నిమిరి ఆ భావాతీత క్షణాలు అప్పుడప్పుడూ గడిపి ఆశ్చర్యచకితుణ్ణి అయ్యేవాణ్ణి !!

2005 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో బస్సులో ప్రయాణిస్తూంటే .. "ఉచిత ధ్యానం ; ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస" అనే గోడపైన వ్రాసిన వ్రాతను చదివి బస్సులో నుంచి దిగాను రన్నింగ్‌లోనే ! .. కానీ దూకింది జన్మజన్మల కర్మల మోక్ష మార్గంలోకి. మరి అప్పటి నుంచి నా రూటే సపరేటయిపోయింది.

నా మొదటి 15 నిమిషాల ఆనాపానసతి ధ్యానం స్పిరిచ్యువల్ ఇండియా ఆఫీస్‌లో మల్లికార్జున్ సార్ ద్వారా చేసాను. మొదటి అనుభవంలోనే శరీరం ఓ ముద్దలా అయినట్లు తల భారంగా ఉన్నట్టు గమనించాను. ఆశ్చర్యం ఏమిటంటే ? ధ్యానం అయిపోయిన తర్వాత రోడ్డుపై నడుస్తూ ఉంటే అంతరిక్షంలో వ్యోమగామిలా తేలుతూ ఉన్నట్టు అనిపించి, ఎంతో ఆహ్లాదాన్నీ, ఉత్సాహాన్నీ అనుభవించటం జరిగింది.

ఆ మరుసటి రోజు సాయంత్రం 5గం||లకు హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో .. ధ్యాన ఘంటసాల శరత్‌చంద్ర పద్యాల గాత్రం, బ్రహ్మర్షి పత్రీజీ యొక్క వ్యాఖ్యానం .. ఎలాగైనా వెళ్ళాలనిపించింది. కానీ ఎలా ?" అని ఆలోచిస్తూ ఆ రోజు నిద్రలోకి జారుకున్నాను.

ఉదయం ప్రోగ్రాం మీద ధ్యాస ! కానీ పనికి వెళ్ళాలి, లేకపోతే చార్మినార్ వద్ద మా వర్క్ గురువైన G. సుభాష్ గారు కోప్పడతారు. దిగులుగానే షాప్‌కి వెళ్ళాను కానీ పని మీద ధ్యాస లేదు. మెల్లిగా గురువుగారి దగ్గరకు వెళ్ళి "మా ఇంట్లో ఫంక్షన్ ; మావాళ్ళు సాయంత్రానికల్లా వచ్చేయమన్నారు" అన్నాను. ఆయన నా కళ్ళలోకి చూస్తూ "సరే పో" అన్నారు. నా ఆనందానికి అవధుల్లేవు. విచిత్రం ఏమిటంటే ? .. అబద్ధం చెప్పానని ఒకింత బాధపడ్డా నిజంగా ఆ రోజు సాయంకాలం వేళ నా శరీరం అనే ఇంట్లో పెద్ద వేడుకే జరిగింది.

5:20 నిమిషాలకల్లా ఆ స్థలానికి పరుగు పరుగున వచ్చి చేరుకున్నాను. ఒక్కొక్కరుగా స్టేజి పైకి రాసాగారు. అందరి మధ్యలో ప్రత్యేకంగా ఆరెంజ్ రంగు వస్త్రాలు ధరించి ఒక ఆజానుబాహులు తెల్లగెడ్డంతో .. పత్రీజీ కనిపించారు. ఆయన స్టేజీపై ఉన్న వారందరినీ పరిచయం చేస్తూ చిన్నపిల్లాడిలా అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ తిరుగుతున్నాడు. ఆహా ఏం నిరాడంబరత ! ఏం తేజస్సు ! పరిచయాలు అయిపోయాయి. ఇక తన గూర్చి చెప్తారేమో అనుకున్నా ! మైకు తీసుకుని "అందరూ కళ్ళు మూసుకోండి" ధ్యానం చేద్దాం అన్నారు. వెంటనే కళ్ళు మూసుకున్నాను. మొదట్లో కాస్త కష్టంగానే ఉండింది. ఎప్పుడూ లేద్దామా అనిపించింది. పత్రీజీ ససేమిరా కళ్ళు తెరవద్దంటారు ! వరదలాగా బుర్రలో ఎక్కడెక్కడి ఆలోచనలు ఒళ్ళంతా నొప్పులు కొంతసేపు అలాగే ఉన్నాను. మెల్లిమెల్లిగా మార్పు రాసాగింది.

మొదట అర్థవంతమైన పాత సినిమా పాటలైతే తరువాత "వీరబ్రహ్మేంద్రస్వామి", "యోగి వేమన" పద్యాలు, ఘంటసాల కంఠంతో శ్రీ శరత్‌చంద్ర చక్కటి వాద్యబృందం ఒకవైపు, ఇంకోవైపు పద్యాలు విడమర్చి అందులో సారాన్ని బోధించి, చెవుల ద్వారా నేరుగా అంతరాత్మను మేల్కొల్పుతోన్న ఆ మహానుభావులు పత్రీజీ.

నాలో ఉరకలేస్తున్న నాస్తికవాదం .. పరమగురువుల సమక్షంలో పటాపంచలైంది ! నా అన్వేషణ ఫలించింది. ఎక్కడా నిలకడగా ఉండలేని నేను. రెండు గంటల అఖండధ్యానంలో మైమరచిపోయాను ! సమయం అయిపోయింది. కళ్ళు తెరిచాను. నా ఆనందాన్నంతా అందరితో పాటు చప్పట్లతో వెలిబుచ్చాను. ఆ వర్ణనాతీత ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాను. కళ్ళు మూసినా తెరచినా పత్రీజీ చెప్పిన వాక్కులు ఆ రోజు నుంచి నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి !

ప్రస్తుతానికి నా వయస్సు 24 సంవత్సరాలు. ఇప్పుడు నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఎవరి సహాయం లేకుండా నా సమస్యలను నేను గౌరవించి పరిష్కరించుకోగలను. ఒకప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా ఆందోళన, భయం, విసుగు, చిరాకు, విపరీతమైన కోపం, అనారోగ్య సమస్యలు ఉండేవి. రోజుకు కనీసం ఒక గంటసేపు ధ్యానం చేస్తాను. విరివిగా ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటూ మన సొసైటీలో దొరికే అరుదైన పుస్తకాలు చదువుతుంటాను. సజ్జనసాంగత్యం చేస్తూ ధ్యానానుభవాలు అందరితో పంచుకుంటాను.

ఇక అత్యంత ముఖ్యమైన విషయం శాకాహారం ; నేను చిన్నప్పుడే పెరిగిన వాతావరణాన్ని బట్టి మాంసం భుజించేవాణ్ణి. ఆదివారం వచ్చిందంటే ముక్క లేకుండా ముద్ద దిగేదికాదు. ఐదు సంవత్సరాల క్రితం ఏ రోజయితే పత్రిగారి నోటివెంట "మాంసాహరం - పాపాహారం" అనే పలుకులు విన్నానో ఆ రోజునే బస్సులో కళ్ళుముసుకుని అరగంట సేపు అనుకున్నాను "నేను శాకాహారిని, నేను శాకాహారిని" అని. ఆ రోజు నుంచి పూర్తిగా శుద్ధ శాకాహారినై పోయాను !

చిన్నప్పటి నుంచే ధ్యానం చేయండి, చేయించండి. మీ పిల్లలను "పైమా" లో చేర్చండి. "హ్యాపీ ధ్యానజగత్".

 

దినేష్
అజీజ్‌నగర్
రంగారెడ్డి జిల్లా

సెల్ : 9848141404

Go to top