" హాట్సాఫ్ టు .. పత్రీజీ "

నా పేరు సువర్ణ, ఊరు చెన్నై.

నేను 2004 సంవత్సరం నవంబర్ నెలలో ధ్యానానికి వచ్చాను.

నేను మొట్టమొదట పత్రీజీ ని మా ఇంటివద్ద ధ్యానకేంద్రంలో ఉండే ఫోటోలో చూసాను. ఫోటో చూస్తేనే మంచి వ్యవహార దక్షత, శైలీ ఉన్న "పెద్ద ఎగ్జిక్యూటివ్" లా అనిపించారు కానీ .. దానిలో "బ్రహ్మర్షి పత్రీజీ" అని వ్రాసి ఉంది. మరి "బ్రహ్మర్షి కావాలంటే ‘వేలకు వేల సంవత్సరాలు తపస్సు చేయాలీ, ఎంతో కష్టపడాలీ’ అని పురాణాలు, ఇతిహాసాలు గోషిస్తూన్నాయి. ఈయన వయస్సు చూస్తే అరవై సంవత్సరాలు కూడా దాటినట్టు లేదు. మరి ఇంత చిన్న వయస్సులో ‘బ్రహ్మర్షి’ కావడం ఎలా సాధ్యం ?" అనే అనుమానం కలిగింది.

"సరే లే! పేరుకు ముందు ఏదో ఒకటి వేసుకోవడం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఈయన కాస్త వెరైటీగా .. ‘బ్రహ్మర్షి’ అని వేసుకున్నారు. అయినా ఎవరెట్లా పోతే నాకేం ? ఎవరేదైతే నాకేం ? వచ్చామా, ధ్యానం నేర్చుకున్నామా, వెళ్ళామా అని ఉండాలి కానీ, ఇదంతా మనకెందుకు ?" అనిపించింది.

కానీ వెంటనే మనస్సులో "మనం పిరమిడ్ సంస్థకు వచ్చి, ఈ సంస్థ నేర్పిస్తున్న ధ్యానవిద్యను నేర్చుకుని, ఆ విద్య ద్వారా జీవితంలో బాగుపడాలని అనుకున్నప్పుడు, ఆ సంస్థ ఫౌండర్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందా ? లేదా ?" అన్న ప్రశ్న మళ్ళీ నాలో తలెత్తింది ! నాటి ఆ ప్రశ్నకు సమాధానం నాకు అతితొందర్లోనే దొరికింది.

ఆ తర్వాత "ధ్యానాంధ్రప్రదేశ్ విజయోత్సవాలు - 2004" హైదరాబాద్‌లో జరిగినప్పుడు సార్‌ని చూడడం జరిగింది. ఎంతో సింపుల్‌గా ధవళ వస్త్రాల్లో సార్ ఒక్కరే స్టేజీ మీద ఉన్నారు. ఆ రోజు చీఫ్‌గెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖామాత్యులు శ్రీ K.జానారెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నా ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా అతి సాదాసీదాగా సార్ ఉండడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.

"మన దగ్గరకు ఎవ్వరు వచ్చినా మనతోపాటు మనలాగే మన దగ్గర ఉండాలి కానీ, ఎవ్వరికోసం మనం మారం" అని సార్‌ని చూసిన వెంటనే నేను అందుకున్న సందేశం. అక్కడ సభలో సార్ అతిథులను ఆహ్వానించడం, వెళ్ళేవారిని సత్కరించి సాగనంపడం, ఆర్గనైజర్స్ కు సూచనలు ఇవ్వడం, మధ్యమధ్యలో తాను మాట్లాడటం, అందరిచేత చప్పట్లు కొట్టించడం, ఇలా ఏకకాలంలో అన్ని పనులు చేయడం చూసి "సవ్యసాచి" అన్న పదానికి నిజమైన అర్థం ఇదే అని తెలిసింది. అంతకు మునుపు సార్‌ని ఫోటోలో చూసి " 'వయస్సు మళ్ళినవారు' అనుకుని చాలానే మోసపోయాను" అన్న పరమసత్యం నాకు తెలిసింది.

ఆ ధ్యానయజ్ఞంలో ప్రతిరోజూ ఒక గ్రేట్ మాస్టర్‌ను సభకు పరిచయం చేస్తూ .. మొదటి రోజు ఆంజనేయస్వామి తల్లి అంజనాదేవి మళ్ళీ జన్మ తీసుకున్న శేషు మేడమ్ గారిని పత్రిసార్ పరిచయం చేస్తున్నారు. ఇంతలో స్టేజీ మీద సార్‌తో పాటు ఉన్న ఇతర మాస్టర్స్ స్టేజీ వదిలి వెళ్ళిపోతూంటే సార్ వెంటనే "I don't want any movement" అని గట్టిగా అన్నారు. అంతే .. ఎక్కడి వారక్కడ శిలాప్రతిమల్లా చలనం లేకుండా స్తంభించి పోయారు. అప్పుడు తెలిసింది .. పత్రిసార్ మాటకు పిరమిడ్ సొసైటీలో ఎంతటి విలువుందో .. మరి సార్ మాటలంటే ధ్యానులకది ఎంతటి శిరోధార్యమో ..

పత్రిసార్ దగ్గర ప్రతిఒక్కరూ నేర్చుకోవలసిందీ, తెలుసుకోవలసిందీ వారి ఓర్పు, సహనం. "వినదగు నెవ్వరు చెప్పిన" అన్నట్లు ఎవ్వరేం చెప్పినా ఆసాంతం ఓపికగా వింటారు ! ఆ తర్వాత దానికి చక్కని పరిష్కారం చూపిస్తారు. ఒక్క ఓర్పు, సహనమే కాదు ప్రతి ఒక్క గుణానికి కూడా పత్రీజీ ప్రతీకగా నిలుస్తారు.

ఆదరణతో ప్రతి ఒక్కరికీ షేక్‌హ్యాండ్ ఇచ్చి పరామర్శించడంతో .. 'ప్రేమ' ; ధ్యాన జగత్తును సంకల్పించడం ద్వారా ఈ భూమిమీద ప్రతిఒక్కరినీ ధ్యానిగా చేయాలనడంతో .. 'దయ' ; మానవజాతినే కాకుండా జంతుజాలాలనూ రక్షించడానికి ప్రతి ఒక్కరినీ శాకాహారులను చేయడంతో .. 'కరుణ' ; వెనుకటి ఆస్థిపాస్తులు ఏమి లేకపోయినా, ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టడంతో .. 'త్యాగం' ; కోపంతో తిట్టడం, కొట్టడం ప్రదర్శిస్తూ .. 'రౌద్రం' ; సేవ, డబ్బు ప్రమేయం లేకుండా ప్రతిఒక్కరికీ ఆత్మజ్ఞానం ఉచితంగా అందివ్వడంతో .. 'సేవ ..’ ఇలా అన్ని గుణాలనూ అద్భుతంగా ఆచరణలో చూపిస్తారు.

తన వయస్సు వారినే కాకుండా అందరినీ .. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడం, హాస్యచతురత, టైమ్ పంక్చువాలిటీ, అంతకుమించి పాకశాస్త్ర నైపుణ్యంలో అభినివేశం కలిగివుండడం !

"పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" నెలకొల్పడం ద్వారా సుస్థిరపాలనకు పూనుకుని దేశాభిమానాన్ని చాటడం, స్పోర్ట్స్ ముఖ్యంగా క్రికెట్ వల్ల అభిమానం .. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఒక్క గుణానికి ఉన్నతస్థాయిలో పత్రిసార్ ఉదాహరణగా నిలుస్తూ, అందరినీ ఉత్తేజపరుస్తున్నారు.

గాంధీమహాత్ముడు అహింసకు ప్రతీక, మదర్‌థెరిస్సా సేవా సౌభాగ్యానికి ప్రతీక, జీసస్ కరుణకు ప్రతీక మరి పత్రీజీ పై మూడింటితో పాటుగా మరెన్నింటికో ప్రతీకగా నిలుస్తున్నారు. "మల్టీడైమెన్షనల్ పర్సనాలిటీ" అన్నదానికి సజీవ ఉదాహరణ పత్రీజీ.

సార్ ప్రతిఒక్కరినీ "గ్రేట్ మాస్టర్స్" అంటూ పొగడడం చూసి, మనచేత పనులు చేయించుకోవడానికి ఆయన ఇలా అంటారేమో "మనమేంటి ? మాస్టర్స్ ఏంటి ? అందులో గ్రేట్ ఏంటి ? అంతా ఉట్టిదే !" అనుకున్నాను.

కానీ నిజంగా మన సంగతి మనకు తెలియకున్నా మనం ఏ పని చేయడానికి యీ జన్మ తీసుకున్నామో తెలియకపోయినా .. ఏ పనైతే మనవల్ల అవుతుందో, ఆ పనే మనకప్పగించి, మనమేం చేయడానికి ఈ భూమిమీదకు వచ్చామో ఆ పనే మనచేత చేయిస్తారు సార్" .. అన్న సంగతి అర్థమైన తర్వాత సార్ ఏం చెప్పినా .. దానికి వెంటనే "ఒకే సార్" .. "అలాగే సార్ .." చేస్తాను సార్ అంటూ మారు మాట్లాడక ఆ పని చేయడం నేర్చుకున్నాను !

ఈ రోజు ప్రతిఒక్కరికీ కావలసింది డబ్బు, సైన్స్, టెక్నాలజీ మాత్రమే కాదు, వీటన్నిటికన్నా ముందు ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అభిమానం .. మరి వీటన్నిటినీ మించిన గాఢమైన స్నేహం ! ఇవన్నీ కొరవడడం వల్లనే మానవ జీవితాల్లో ఇంతటి ఆటుపోట్లు మరి సంఘంలో ఇంతటి కల్లోలం.

అయితే ఇవన్నీ కూడా పత్రిసార్ దగ్గర పుష్కలంగా ప్రతిఒక్కరికీ దొరుకుతాయి ! దీనివల్ల ప్రతిఒక్కరూ మానవత్వం నింపుకున్న దైవాలుగా మలచబడుతున్నారు!

స్త్రీల పట్ల సార్ చూపిస్తున్న గౌరవమర్యాదలు అనన్య సామాన్యం. స్త్రీ శక్తిని ఇంతగా వినియోగించుకుంటోన్న గొప్ప గురువు మరి ప్రవక్త ఈ భూమిమీద మరొకరు కానరారు ! గౌతమబుద్ధుడు కూడా తాను బుద్ధత్వం పొందడానికి భార్యతో చెప్పకుండా వెళ్ళాడట. తీరా తాను బుద్ధత్వం పొందాక చేసిన మొదటిపని తనతోపాటు అంతకుమునుపు సాధన చేస్తోన్న నలుగురిని తన శిష్యులుగా చేసుకుని మార్గం చూపించాడు. కానీ .. అంతకన్నా ముందు .. కపిలవస్తుకు పరిగెత్తుకు వచ్చి, యశోధరతో "నేను సాధించాను, నేను తెలుసుకున్నాను, నేను పొందాను రా ! నువ్వు కూడా సాధన చేసి నిర్వాణాన్ని పొందు" అంటూ భర్తగా తన కర్తవ్యాన్ని నెరవేర్చి ఉండవలసింది. కానీ ఆ పని చేయలేదు. బుద్ధుడి జీవితంలో వేలెత్తి చూపించదగ్గ సంఘటన ఏదైనా ఉందా అంటే అది యశోధర విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు మాత్రమే ! కానీ పత్రీజీ బుద్ధత్వాన్నీ, నిర్వాణాన్నీ కలిపి "సంసారయుత నిర్వాణం" అనే షార్ట్ కట్ మార్గాన్ని మనకి చూపి, తాను దాన్ని ఆచరిస్తూ, తనతోపాటు తన అర్థాంగిని కూడా బుద్ధత్వం వైపు నడిపిస్తున్న ప్రథమ బుద్ధుడు !

పత్రీజీ జీవిస్తున్న కాలంలో నేను కూడా ఈ భూమిపై ఉండడం నా పూర్వజన్మ సుకృతం ! అందులోనూ స్త్రీగా పుట్టడం నాకు మరింత అదృష్టం. "ఆత్మజ్ఞానానికి స్త్రీ, పురుష బేధం లేదు, వారి వారి ప్రయత్నం, సాధన, అభిరుచిని బట్టి అత్మ ఎదుగుదల ఉంటుంది, పైగా స్త్రీ అంటే శక్తిస్వరూపిణి, ఆత్మజ్ఞానంలో పురుషుడి కన్నా స్త్రీనే ప్రకృతి పరంగా మరింత అర్హురాలు" అంటూ స్త్రీ జాతి యావత్తుకు వారు అందిస్తున్న చేయూత, ఇస్తూన్న ప్రోత్సాహం సృష్టిలోనే అపురూపం ! దీనికి కొసమెరుపుగా వారు నిర్వహిస్తున్న "మహిళా ధ్యానయజ్ఞాలు" స్త్రీ లోకానికి మరింత వన్నెను చేకూరుస్తూండగా స్త్రీలోకం .. కై మోడ్చి .. వారికి తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది.

"స్వర్గం అన్నది ఎక్కడో లేదు, అది ఈ భూమిమీదే ఉన్నది. ప్రతిఒక్కరూ ధ్యానం చేయడం ద్వారా .. హింసను విడనాడడం ద్వారా .. ఆరోగ్యం పొందడం ద్వారా .. ఆనందంగా జీవించడం ద్వారా ..స్వర్గమన్నది ఈ భూమిమీదె ఆవిష్కరింపబడుతుంది " అన్న పరమసత్యాన్ని తెలియజేస్తూ, ప్రతిఒక్కరినీ దైవాలుగా మలుస్తున్నారు .. పత్రీజీ.

వారి సాంగత్యంలో .. "ఈ భూమి మీద భౌతిక జీవితం గడపడం ఎంతో సౌఖ్యం, మరెంతో హాయి" అన్న సంగతి తెలిసిపోయింది. హ్యాట్సాఫ్ టు పత్రీజీ!!

- సువర్ణ,
చెన్నై

Go to top