" ధ్యానం ద్వారా .. నాలో పరివర్తన "

 

నా పేరు అల్లం రవి.

నేను వరంగల్ సెంట్రల్ జైలులో జీవితఖైదీ శిక్షను అనుభవిస్తున్నాను. నేను చేయని నేరానికి నాకు యావజ్జీవశిక్ష పడటంతో "నన్ను అనవసరంగా శిక్షకు గురిచేసిన వారి మీద కక్ష్య తీర్చుకోవాలి" అనుకుని చాలా ఆవేశానికి లోనయ్యాను. దాంతో రాత్రి నిద్రపోయేవాడిని కాదు.

జైలులో నేను పిరమిడ్ ధ్యానం వారి క్లాసులు విని ధ్యానం చేసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నా శత్రువు అనుకునే వారిని కూడా క్షమించాను ! నా కోపం కూడా తగ్గి జైలులో ప్రతిరోజు మా ఖైదీ సోదరులకు ధ్యానం నేర్పుతున్నాను.

నేను జైలు నుంచి విడుదల అయ్యి బయటికి వెళ్ళిన తరువాత మా ఊరిలో పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను. ఈ ధ్యానాన్ని మాకు అందించిన బ్రహ్మర్షి పత్రీజీ గారికి మా యొక్క ధ్యానభివందనాలు.

ఇదివరలో "జైలు నుంచి బయటకు వెళ్ళగానే నా శిక్షకు కారణమైన వారిపై పగ తీర్చుకోవాలి" అనే ఉక్రోషంతో గడిపే నన్ను ధ్యానం మార్చివేయడంతో పాటు ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న నాలోంచి ఎన్నెన్నో ఆత్మజ్ఞాన సందేశాలు బయటకు తెచ్చింది. అలా నాకు ధ్యానంలో వచ్చిన మెస్సేజ్‌లు వ్రాసి పంపుతున్నాను. "ధ్యానాంధ్రప్రదేశ్" పత్రిక లో ప్రచురించగలరు.

నిత్యం ధ్యానం చెయ్యటం వల్ల మనలో మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యంగా వుంటాం, వాక్కులో నిర్మలత్వం ఏర్పడి వాక్కు పవిత్రం అవుతుంది, సరియైన దృష్టికోణం ఏర్పడుతుంది. దానివల్ల మానసిక స్వచ్ఛత ఏర్పడుతుంది. నిరుపయోగంగా వున్న ఇనుము తుప్పుపట్టిపోతుంది. నిశ్చలంగా ఉన్నటువంటి నీరు స్వచ్ఛత కోల్పోతుంది. ధ్యానం లేని జీవితం జీవిత పరమార్థాన్ని కోల్పోతుంది.

అసలు సుఖం, దుఃఖం ఆనందం, విషాదం అనేవి ఎక్కడో లేవు. మన ఆలోచనల్లోనే వున్నాయి. సరియైన ఆలోచనావిధానం ద్వారానే మనిషికి ఆనందం. ధ్యానం చెయ్యటం వల్లనే చక్కటి ఆలోచనావిధానం అలవడుతుంది.

ఎవరికోసమో ధ్యానం చెయ్యటం కాదు .. మనకోసమే మనం ధ్యానం చెయ్యాలి.

కోపష్టితనం ఎవ్వరూ ఇష్టపడరు. కోపిష్టికి ఇంట్లో మరి బయట అందరూ శత్రువులు అవుతారు. అతికోపం పిచ్చివానిగా తయారుచేస్తుంది. కనుక కోపం అనే శత్రువుకు దూరం కావాలంటే ప్రతిఒక్కరూ ధ్యానం చెయ్యాలి. ప్రతిఒక్కరూ ధ్యానం చేయించాలి.

"జైలు కాదు .. దేవాలయం"

వరంగల్ కేంద్ర కారాగారంలో " లీగల్ సర్వీస్ కమిటీ " ఏర్పాటుచేసిన మెడిటేషన్ వర్క్‌షాప్ కార్యక్రమంలో జైలు ఖైదీలను ఉద్దేశించి .. జిల్లా జడ్జి శ్రీ రజాక్ గారు మాట్లాడుతూ "జైలుకు వచ్చేవారు అందరూ నేరస్థులు కారు. మీరు జైలుకు వచ్చామని బాధపడవద్దు. మార్పుకోసం వచ్చారు. మీకు మేం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రతి అంశంపై అవగాహన కలిగేవిధంగా కృషిచేస్తాం. ఈ ప్రపంచంలో తప్పు చేయని మనిషి లేడు. కానీ ప్రతిసారీ చేసిన తప్పును తలచుకుని బాధపడవద్దు. ప్రతిఒక్కరూ మానసిక పరివర్తన చెందటానికి ప్రయత్నించాలి. ఏ పని చేసినా అది మంచిదా ? చెడ్డదా ? ఏది చెయ్యాలి ? ఏది చెయ్యకూడదు ? అని ఆలోచించి చెయ్యాలి. మీరు ఏదైనా పని చేసేముందు ఎవ్వరినీ అడగవలసిన అవసరం లేదు. మీ దృష్టికోణాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచి ఆలోచనలు వస్తాయి. ధ్యానం వల్ల మీకు సాటిమనుష్యుల పట్ల ప్రేమ కలిగి మీతోటి వారికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా మారిపోతారు " అని జడ్జిగారు తన సందేశం వినిపించారు.

జైళ్ళ శాఖ I.G. గారు జైలు ఆవరణలో 18*18 పిరమిడ్‌కి శంఖుస్థాపన చేసారు.

 

అల్లం రవి

Go to top