" నా జీవితంలో పూర్తి మార్పు "

 

నా పేరు తొమ్మం నాగేశ్వరరావు. మా ఊరు ఇల్లందు, ఖమ్మం జిల్లా. నా వయస్సు 71 సంవత్సరాలు.

నేను ఇల్లందులో ఆరు నెలల నుంచి ధ్యానానికి వెళ్తున్నాను. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఇల్లందులో జరిగిన బ్రహ్మర్షి పత్రీజీ వేణుగాన ధ్యాన కార్యక్రమంలో పాల్గొని గొప్ప అనుభూతి పొందాను.

పదినెలల క్రితం .. శ్రీ భద్రాద్రి గారి పరచయంతో నా జీవితం మలుపుతిరిగింది. ప్రతి ఆదివారం ఓంకార క్షేత్రంలోని పిరమిడ్‌కి, ఆ తర్వాత శ్రీ భద్రాద్రి గారి ఇంటికి వెళ్ళి ధ్యానం చేయటం మొదలుపెట్టాను.

ధ్యానం మొదలు పెట్టాక నా జీవితంలో పూర్తి మార్పు వచ్చింది. కుటుంబంలో ఘర్షణలు, భార్యాపిల్లలతో తగాదాలు, వ్యాపార సంబంధమైన ఇబ్బందులు తొలగి చాలా హాయిగా జీవిస్తున్నాను. నా అలవాట్లలో చాలా మార్పు వచ్చింది. కోపం, ఆవేశం, క్షణికోద్రేకం అన్నీ పోయాయి.

ఇప్పుడు నన్ను చూసి మా కుటుంబసభ్యులు అంతా ధ్యానం చేస్తున్నారు. పూజల్లో సమయం వృధా కాకుండా పవిత్ర మనస్సుతో, ఆత్మనిగ్రహంతో ధ్యానం చేస్తున్నాం.

గత జూలైలో పిప్పళ్ళప్రసాద్ గారి పాటలతో చెడు అలవాట్లు అన్నీ మానేయటం .. ఆగస్ట్‌లో జగపతిరాజు గారి ‘ప్రేమతత్వం’ ఉపన్యాసంతో జీవరాసులనూ, ప్రకృతినీ ప్రేమించటం, పంచభూతాలకు నమస్కారం చేసుకోవటం మొదలు పెట్టాము. సెప్ట్ంబర్లో సురేష్‌బాబు గారు, నరసింహం గార్లు ఉపన్యాసాలు విన్న తరువాత "వాకింగ్, యోగ, ఆసనాలు S.S.Y. మొదలైన వాటన్నింటికంటే ధ్యానం మిన్న" అనీ,"ధ్యానం ద్వారానే ఏదైనా సాధించవచ్చు" అనీ తెలుసుకున్నాను.

నవంబర్‌లో భీమవరంలో శిక్షణ అనంతరం ధ్యానం చేస్తూనే, ధ్యాన కార్యక్రమాల విస్తరణ కార్యక్రమం మొదలుపెట్టాను. డిసెంబర్లో సికింద్రాబాద్ రాజశేఖర్ గారి క్లాసుతో ఇంకా మార్పు వచ్చి పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నాను.

ఖమ్మం జిల్లాలోనే .. ఇల్లందు నుంచి శ్రీశైలం కార్యక్రమానికి ఎక్కువ నిధులు సేకరించి పంపించాము. శ్రీశైలంలో కదళీవనానికి 300 మందితో కూడిన ట్రెక్కింగ్ కార్యక్రమంలో 7 కి.మీ. రాళ్ళతో కూడిన కొండలు నా 71 సంవత్సరాల వయస్సులో కూడా ధ్యానశక్తితో పత్రీజీ గారి ఆశీస్సులతో మొదటివాడిగా ఎక్కాను.

నేను R.S.S. లో 50 సంవత్సరాలు, చిన్నజియ్యర్స్వామి కార్యక్రమాలలో పది సంవత్సరాలు, స్వచ్చంద సంస్థ అయిన అప్పటి లోక్‌సత్తాలో 10 సంవత్సరాలు, వాసవీక్లబ్లో 10 సంవత్సరాలు పనిచేసినా లేని ఆత్మతృప్తి, పిరమిడ్ ధ్యానం ద్వారా, ధ్యానకార్యక్రమాల ద్వారా అనంతంగా పొందాను.

శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత (1) వారంలో ఒకరోజు పూర్తి సమయం ధ్యానప్రచారం కోసం పనిచేయటం, (2)వారంలో ఒకరోజు ఉపవాసం, ఆరోగ్యం మరి జాతీయ సంపద ఆదా, (3)నెలకు రూ|| 200/-లు వెచ్చించి ప్రచార కరపత్రాలు వగైరా సామగ్రిని వినియోగించటం వంటి కార్యక్రమాలు విధిగా చేపడుతున్నాం.

పౌర్ణమి కార్యక్రమాలు, ఆదివారం ఏకతాధ్యానం బాగా జరుగుతున్నాయి. ధ్యానుల అందరిచేత అనుభవాలను చెప్పించటం, క్రొత్తవారిని తీసుకురావటం, ధ్యానసందేశాలు చెప్పించటం జరుపుతున్నాము.

చివరగా, నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా బస్సుల్లో, ఆటోల్లో, రైళ్ళలో, పెళ్ళిళ్ళలో .. "ధ్యానం ఎందుకు చేయాలి ?, మాంసం ఎందుకు తినకూడదు ?" అనే సమాచారంతో కరపత్రాలు వేలసంఖ్యలో ముద్రించి పంచి ప్రచారం చేస్తున్నాను.

భుజానికి సంచీ తగలించుకుని, కరపత్రాలు, చిన్న చిన్న పుస్తకాలు, C.D.లు అందులో పెట్టుకుని వీధివీధికీ, ఇంటింటికీ ప్రచారం మొదలుపెట్టాను.

"మాంసాహారం మానండి, శాకాహారులు కండి .. శక్తిని పొందండి" అనే సందేశాలతో శాకాహారర్యాలీలు చేస్తూ బ్రహ్మర్షి పత్రీజీ ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాం.

 

 

తొమ్మం నాగేశ్వరరావు
ఇల్లందు

Go to top