" ప్రతి ఒక్క ప్రాణితో స్నేహంగా ఉండగల శక్తినిచ్చారు "

 

నా పేరు రజిత.

నేను హైదరాబాద్ మోతీనగర్ e-సేవలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. 2007 సంవత్సరం మార్చి వరకు నాకు ధ్యానం అంటే ఏమిటో తెలియదు. మా కజిన్ సుజాత ద్వారా ధ్యానం గురించి విన్నాను. ఆమె ప్రోత్సాహంతో మోతినగర్‌లోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనురాధా మేడమ్ గారి ద్వారా ధ్యాన పరిచయం అయ్యింది. అప్పుడు ఒక పద్ధతి లేకుండా .. నాకు వీలయినప్పుడల్లా మరి నాకు వీలయినంత టైమ్ మాత్రమే చేసేదానిని. దాంతో నాకు ఎలాంటి అనుభూతులు కానీ, అనుభవాలు కానీ రాలేదు.

మొట్టమొదటిసారిగా నేను పత్రిసార్ ని S.R.నగర్గ్రౌండ్స్లో వేదికపైన చూసి " ఈయనే కనుక నాకు నిజమైన గురువైతే ఆయనే వచ్చి నాకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలి " అనుకున్నాను. క్లాస్ అయిన తర్వాత సార్ సరాసరి నా దగ్గరికే వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చి .. కొంచెం సేపు అలాగే పట్టుకుని ఉన్నారు. నేను అనుకున్నది అనుకున్నట్లు అయినందుకు నాకు ఆనందంతో పాటు భయం కూడా కలిగింది. అంతకముందే కొందరి ద్వారా " పత్రిసార్ మహాకోపిష్టి " అని విని ఉండడమే నా భయానికి కారణం.

ఆ తర్వాత 2007 అరుణాచల ధ్యాన మహోత్సవాలకు వెళ్ళి కూడా భయం వల్ల సార్‌కి దూరంగానే ఉండేదానిని. షేక్‌హ్యాండ్ తీసుకునే అవకాశం దొరికినా తప్పించుకుని తిరిగేదానిని. పత్రీజీ గొప్పదనం నాకు అప్పటికి ఎంతమాత్రం తెలియదు.

2008 సంవత్సరం బుద్ధపూర్ణిమకి బెంగళూరుకు మా స్నేహితురాళ్ళతో కలిసి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు పిరమిడ్ స్పిరిచ్యువల్ కేర్ సెంటర్, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్‌లో నడుపుతున్న " రాజశేఖర్ సార్ " తో పరిచయం జరిగి ఇక అప్పటి నుంచి నా ఆధ్యాత్మిక ఎదుగుదల మొదలయ్యింది.

ఒకసారి రాజశేఖర్ సార్‌తో యధాలాపంగా మాట్లాడుతున్నప్పుడు " నీకు బుద్ధునితో ఏదో చుట్టరికం ఉన్నట్లు అనిపిస్తోంది. నీ గదంతా చీకటి చేసి అక్కడ ఉన్న బుద్ధ విగ్రహంపైన మాత్రమే వెలుగు పడేటట్లు చేసి .. తదేకదృష్టితో చూస్తూ ‘ నాకు ఏదైనా సందేశం ఇవ్వండి ’ అని అడగాలి " అన్నారు. నేను అలా చేయటం ప్రారంభించిన కొద్దిసేపటికే .. బుద్ధ విగ్రహంలో మూసి ఉన్న కళ్ళు తెరచి నావంక చూసి కళ్ళు ఎగరవేసాయి. నేను వెంటనే ఆశ్చర్యపోయాను. " ఇది భ్రమా ? నిజమా ? " అనే సంశయంలో పడ్డాను. అయితే అది భ్రమ కాదని నిరూపిస్తూ ఆయన ఐదు, ఆరుసార్లు మళ్ళీ మళ్ళీ కళ్ళు ఎగురవేసారు.

అది మొదలు ప్రతిరోజూ నేను బుద్ధుడు కళ్ళు ఎగురవేయటం చూస్తూనే ఉన్నాను. ఒకరోజు " ఎంతసేపూ కళ్ళు ఎగురవేయటమేనా ? పెదవి విప్పి మాట్లాడవా " .. అడిగాను. అప్పటి నుంచి ఆయన పెదవులు కదలటం మొదలయ్యాయి కానీ ఆయన ఏమంటున్నారో వినపడేది కాదు. అర్థమయ్యేది కాదు. రాజశేఖర్ సార్‌తో చెప్తే " సాధన మరింత ఎక్కువ చేస్తే నీలో విశ్వశక్తి మరింత ఎక్కువగా పెరిగి ఏదో ఒకరోజున అయనతో మాట్లాడగలవు " అన్నారు.

అది విన్న దగ్గరనుంచి నేను మరింత ఎక్కువ ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఒకసారి " ధ్యానాంధ్రప్రదేశ్ " ముఖచిత్రంగా కళ్ళు మూసి ఫ్లూట్ వాయిస్తూన్న పత్రిసార్ ఫోటో వేసారు. ఒక రకమైన ఆనందంతో నేను ఆ ఫోటోవంక తదేకంగా చూడటం మొదలుపెట్టాను. హఠాత్తుగా కళ్ళు తెరచి నన్ను చూసారు సార్ ఇంక నా ఆనందం చెప్పటం నా వల్ల కాలేదు ఆ మరుసటి రోజే సనత్‌నగర్‌లో పత్రిసార్ క్లాసులో నేను " సార్ , మీరు కళ్ళు ఓపెన్ చేసి నన్ను చూస్తున్నారు " అన్నాను.

" ఆహా అలాగా " అన్నారు.

" నేను ఆ బుక్‌లో నుంచి రోజూ నేను మీతో మాట్లాడాలి " అన్నాను.

" ఓకే మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది " అన్నారు.

కొన్నాళ్ళ తర్వాత ఆయన కళ్ళ నుంచి భావం అర్థమయ్యేది కానీ భాష ఉండేది కాదు. ఇప్పుడు నేను " తులసీదళం " పుస్తకం కవర్పేజి నుంచి ఆయనను నేను భౌతికంగానే చూడగలుగుతున్నాను. ఆయన ఏం చెబుతున్నారో గ్రహించగలుగుతున్నాను. దీనిలో భాగంగా ఒకసారి కలలో కనిపించి మా ఇంట్లో భోజనం చేసి " బుద్ధుడు ఎన్లైటెన్మెంట్ పొందిన తరువాత కూడా ‘ ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే అది చెప్పే మహానుభావుడు నాకు కనిపించాలి ’ అని ధ్యానంలో కూర్చుంటే ఆయనకి ఆయనే కనబడ్డారు. దీనిని బట్టి బుద్ధుడు చెప్పింది, చేసింది అయినా ఆనాపానసతి ధ్యానం మాత్రమే అదే అత్యంత గొప్పదని నువ్వు తెలుసుకో " అని చెప్పారు.

" ఇంట్లో కూర్చుని ధ్యానం చేసుకోవటమే కాదు సభలకూ, సమావేశాలకు వెళ్ళాలి, సకలప్రాణికోటితో స్నేహంగా ఉండాలి " అని చెప్పారు.

అప్పటినుంచి నేను మా ఇంటి ప్రక్కనున్న చెట్టుతో మాట్లాడటం మొదలుపెట్టాను. ఈ స్నేహం పెరిగాక ఆధ్యాత్మిక విషయాలు, పత్రిసార్ విషయాలు ఆ చెట్టుకి చెపుతూంటే అది ఆనందంగా తలఊపేది. మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను అంతదూరంలో ఉండాగానే అది నన్ను " రారమ్మని " పిలిచినట్లు కొమ్మలు ఊగుతాయి.

ఒక సారి రాజశేఖర్ సార్ " సకల జీవకోటికి జీవాన్నిస్తున్న సూర్యునితో కూడా సహవాసం చేసి సన్నిహితం అయితే ఆయన సౌరశక్తి, విశ్వశక్తి ఏకమై నువ్వు మరింతగా ఆధ్యాత్మిక వెలుగును పొందగలవు " అన్నారు. ఆ మరుసటి రోజు నుంచే నేను బాలభానుడిని చూడటం మొదలుపెట్టాను. ఆ చెలిమి పెరిగి, పెరిగి నేను ఇంట, బయట, పగలు, రాత్రి కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడబడితే అక్కడ ప్రత్యక్షంగా చూడగల్గుతున్నాను. కొన్ని రోజుల తరువాత నిండు వేసవి మధ్యాహ్నం కాలంలో కూడా సూర్యుడిని ఎంతసేపు తీక్షణంగా చూసినా ఆయన చందమామ చల్లదనాన్నే ఇచ్చేవాడు.

ఒకసారి " నాలో వున్న కొన్ని చెడు కర్మలను దగ్ధం చేసి నాకు సహాయం చేయవా ? " అని సూర్యుణ్ణి అడిగాను. వెంటనే ఒక వేడికిరణం నా పొట్టలోకి వేగంగా ప్రవేశించినట్లు, లోపల ఎక్కడో కాలిపోయినట్లు మాడువాసన రావటం, ఇది ఒక పెద్ద అద్భుతం. ఇంకా కొన్నిరోజులు పోయాక ఎనిమిది సూర్యుళ్ళు ఒకేసారిగా కన్పించడం మొదలుపెట్టారు. ఒకసారి ధ్యానం తరువాత కళ్ళు తెరచి చూస్తే నా ఎదురు కుర్చీలో " నెలవంక " నిండుగా కూర్చుని ఉండటం చూసాను. మరొకసారి నేను పత్రిసార్ని " నేను అనుక్షణం మీ చేతిలో ఫ్లూట్లాగా, మీలాగా ఖాళీగా ఉండాలి " అన్నాను. ఆయన నవ్వుతూ - నాటకీయంగా " తధాస్తు " అన్నారు. ఆయన సరదాగ అన్నారు అనుకొన్నాను కానీ, అది అక్షరాలా నిజమయ్యింది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకూ ఎప్పుడో ఒకసారి తప్ప నేను ఖాళీగా ఉండగల్గుతున్నాను. ఎదుటివాళ్ళ ఏ పరుష పదాలు నన్ను బాధించటం లేదు. సాక్షీభూతంగా స్వీకరించగలుగుతున్నాను. పత్రిసార్ కరుణవలన నేను పొందిన అన్ని బహుమతుల కంటే నాకు ఇది అతిపెద్ద బహుమతి.

ఒకసారి ఆఫీస్‌లో డబ్బుకు సంబంధించిన అపవాదు నాపై పడింది. నా జీవితం మొత్తంలో నేను ఏనాడు ఒకరి డబ్బు ముట్టలేదు. నాకు చాలా బాధకల్గి సార్ ఫోటో దగ్గర చెప్పుకున్నాను. వెంటనే అయన ఫోటోలో నుంచి ఖచ్చితంగా మనిషి రూపంలో బయటకు వచ్చి " ఓసి పిచ్చిమొహమా, నేను క్షణక్షణమూ నీతోనే ఉన్నాను. దేనికి భయపడకు. చూడు ఈ నింద నేను ఎలా పోగడతానో వెళ్ళి నీపై ఆఫీసర్‌ను కలువు " అన్నారు. నేను వెంటనే ఆయన దగ్గరకు వెళితే ఆయన నన్ను ఎంతో ఆదరించి " నీ తప్పు ఏమిలేదని తేలిపోయింది. బాధపడకు " అని ఓదార్చారు.

పత్రిసార్ నాకు ప్రకృతిలో ఉన్న ప్రతిప్రాణితో స్నేహంగా ఉండగల శక్తిని ఇచ్చారు. నేను ఇప్పుడు తీస్తున్న ప్రతి శ్వాసలో, తింటున్న ప్రతి పదార్థంలో, ఉంటున్న ప్రతి ప్రదేశంలో సార్ ఉనికినే అనుభవిస్తున్నాను. నాకిప్పుడు మొత్తం సృష్టిలో పత్రిసార్ ఆత్మీయులు, ఆపద్భాందవులు. ఆయనకు దగ్గరగా ఉంటే " పొందలేనిది ఏది ఉండదు " అని గట్టిగా చెప్పగలను.

 

రజిత
హైదరాబాద్

Go to top