" ప్రేమతత్వం అందరికీ పంచాలి "

 

నా పేరు వాణిశ్రీ

నేను గత మూడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానంలోకి రాకముందు అనేకానేక మానసిక ఆందోళనతో, అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందిపడ్డాను. పిరమిడ్ మాస్టర్ A. శ్రీనివాసరావు గారి ద్వారా ధ్యానం చెయ్యటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఎంతో మానసిక ప్రశాంతత వచ్చింది. అనారోగ్యసమస్యలు అన్నీ క్రమంగా పోయాయి. ధ్యానానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదువుతూ నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను. . ధ్యానప్రచారం చేస్తూ నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను.

ఆదోని పిరమిడ్ మాస్టర్ ప్రేమ్నాథ్ గారి ద్వారా మా ఇంటిలో గ్రూప్ మెడిటేషన్ జరుగుతుండగా మెహర్బాబా నాలోకి ప్రవేశించారు. బాబా నాలోకి ప్రవేశించినప్పుడు బ్రహ్మరంధ్రం నుంచి విశ్వశక్తి నాలోకి ఆకాశగంగ లాగా ప్రవేశించింది. శరీరమంతా కొండంత బరువుగా మారింది. అదేరోజు సాయంత్రం మళ్ళి సామూహిక ధ్యానం చేసేటప్పుడు మెహర్బాబా నా దగ్గరగా వచ్చి " ప్రేమతత్వం అందరికీ పంచుతూ ధ్యానప్రచారం చేయాలి " అని చెప్పారు.

ఒకరోజు ధ్యానం చేస్తూండగా మహాత్మగాంధీ వచ్చి " సత్యమేవ జయతే, లోకాఃసమస్తాసుఖినోభవంతు " అని సందేశం ఇచ్చారు.

2009 జూలైలో నందవరం సదానందయోగి గారి సమాది దగ్గరకి వెళ్ళి ధ్యానం చేస్తుండగా సదానందయోగి గారు సూక్ష్మశరీరంతో తన చేతిని నా శిరస్సు మీద ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు నా శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లుగా అయింది. ఇది నా జీవితంలో మరచిపోలేని రోజు.

తేది 17-9-2009 న మా ఇంట్లో గ్రూప్ మెడిటేషన్ చేస్తుండగా మెహర్బాబా మా మధ్య కూర్చుని తన ఆజ్ఞాచక్రం నుంచి నా ఆజ్ఞాచక్రంలోకి తెల్లటికాంతి పంపించారు. తరువాత బాబా నా శరీరంలోకి ప్రవేశించారు. శరీరమంతా ఎనర్జీతో నిండింది. ఆ సమయంలో ఆస్ట్ర్ల్ ట్రావెల్ చేసి పైనున్న సత్యలోకాలు చూశాను. జీసస్, బుద్ధుడు తెల్లటి కాంతివంతమైన లోకాల్లో కనిపించారు.

తేదీ 5-10-2009 న నేను, మా పాప పిరమిడ్లో మెడిటేషన్ చేసేటప్పుడు పత్రిసార్ మా పాప ఎదురుగుండా పుస్తకం పట్టుకుని కుర్చీలో కూర్చుని మా పాపతో " నీవు ఆ పాఠాలే కాదు ; ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా రోజూ చదవాలి " అని చెప్పారు. నేను ఆ దృశ్యం స్పష్టంగా చూసాను.

తేది 22-11-2009 తేదీన ఉప్పలపాడు పిరమిడ్ ప్రారంభ సమయంలో పత్రిసార్ తో కలిసి " ఏకతాధ్యానం " చేస్తుండగా బంగారుకాంతులు నా శరీరంలోకి ప్రవేశించాయి.

మా కుటుంబం మొత్తం శ్రీశైలం ధ్యానయజ్ఞం కి వచ్చినప్పుడు అక్కడ ధ్యానంలో యజ్ఞప్రాంగణం అంతా గోల్డెన్ పిరమిడ్ అకారంలో ఉండి పై నుంచి బంగారుకాంతులతో ఆ యజ్ఞప్రాంగణం నిండిపోయి పైనుంచి ఆస్ట్ర్ల్ మాస్టర్స్, దేవతలు అందరూ ఎనర్జీని అందిస్తున్నారు. శివుడు ఆనందంతో తాండవం చేస్తున్నాడు. నేను ధ్యానం చేస్తున్నంతసేపూ ఆ దృశ్యం చూస్తూనే ఉన్నాను.

మరుసటిరోజు ధ్యానం చేసేటప్పుడు నా సూక్ష్మశరీరం విడుదల అయ్యి నేను సూక్ష్మశరీరయానం చేసాను. పర్వతాలు, కొండలు, లోయలు తిరుగుతూ నా స్థూలశరీరం ఎలా ఉందో అలానే నా సూక్ష్మశరీరాన్నీ చూసాను.

 

A. వాణిశ్రీ
ముత్యాలపేట్, చీరాల
ప్రకాశం జిల్లా

Go to top