" పత్రీజీ రుణాన్ని ఎలా తీర్చుకోగలం .. ? "

నా పేరు వరలక్ష్మి.

మాది విజయవాడ. నా భర్త కోనేరు సుభాష్ చంద్రబోస్ గారు.

1998 మే నెల 24 వ తేదీన ఆరోగ్యం కోసం విజయవాడ పిరమిడ్ మాస్టర్ ముఖర్జీ గారి ద్వారా ఈ ధ్యానంలోకి ప్రవేశించిన నాకు మొదటిరోజే మూడవకన్ను తెరుచుకుంది. 4 వ రోజున ధ్యానంలో పత్రీజీ అడవిలో ఉన్న అన్ని జంతువులనూ తన ఒడిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ కనిపించారు. 7వరోజున పత్రీజీని గుంటూరులో కలిసాను. ధ్యానంలో చూసిన మహానుభావుడు కళ్ళ ఎదుట ప్రత్యక్షదైవంలా దర్శనమీయటం నాకు ఒక మరుపురాని అనుభూతి.

రోజుకు ఇరవై గంటల పాటు ధ్యానం చేసాను. రాత్రింబవళ్ళు అపారమైన నా ధ్యాన సాధనతో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాను.

" గురువంటే మామూలుగా మనిషే " అన్న స్థితిలో ఉన్న నా ప్రయాణం అంచెలంచెలుగా ఆయన ఎవరో తెలుసుకుంటూ ఈ పదకొండు సంవత్సరాలుగా అనంతంగా సాగుతూనే ఉంది. ఆయన అర్థమవటం చాలా కష్టమని నాకు అర్థమయింది. ఏది ఏమైనా సరే ఈ జన్మలో ఆయన్ని వదలకుండా .. త్రికరణశుద్ధిగా ఉంటేనే నాది ఆఖరిజన్మ అవుతుంది కనుక దానికోసం ఏమైనా చేస్తాను. ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాను. ఆ ఓర్చుకోవటం కూడా ఆయనే నేర్పారు .. దటీజ్ పత్రీజీ.

ఎన్నో అనుభవాలు, ఎన్నెన్నో సందేశాలు ఆస్ట్రల్ మాస్టర్స్ దగ్గర తీసుకున్నాను కానీ పత్రీజీ ఇచ్చిన సందేశాలు, ఆత్మజ్ఞానాలు సూక్ష్మశరీరయానంలో ఆయన ఇచ్చిన సమయ మార్గాల విశిష్టత, గీజా పిరమిడ్ రహస్యాలు, భూమి లోపలకు పాతాళలోకం దాకా డైమెన్షన్స్ ఎలా మార్చుకుని ప్రయాణం చేయాలో, అవిదిత యదార్థం అంటే అర్థం కానటువంటి పదార్థం .. ఈ పదార్థమే శరీరం .. శరీరం ద్వారా మత్రమే సత్యం అర్థం అవుతుంది .. శరీరం పరమధర్మం, పరలోక ధర్మాన్ని ఇహలోక ఆలోచనలతో మాట్లాడకూడదనీ, ఈ శరీరంతోటే ఆత్మస్థితిలో ఆఖరిజన్మ చేసుకునే విధానాన్ని వెతికి వేసారిపోయిన నాకు ఆ మహాజ్ఞానాన్ని కరతలామలకం చేసి అందించారు పత్రీజీ.

2000 సంవత్సరం మే నెలలో విజయవాడలో మూడు రోజుల " బుద్ధ పౌర్ణమి యజ్ఞం " మాకు అప్పగించారు. దాని నిమిత్తం మేము జగ్గయ్యపేట అశ్వాపురం నుంచి భద్రాద్రి దాకా వెళ్ళి ధ్యానం గురించి, యజ్ఞం గురించి చెప్పి .. తిరిగి ఇంటికి వచ్చిన నేను ఆ రోజు బాగా అలసిపోయాను. ఉదయమే పాలు తోడువేసి .. అప్పజెప్పిన పని ఎలా చేసారో పైమా మాస్టర్లను అడుగుతూ బిజీగా ఉన్నాను. ఆ సమయంలో ఒక బోయవాడు బిక్షకు వచ్చాడు. బిజీగా ఉన్న నేను గేటులోపల నుంచి బయటకు వస్తూ బోయవానికి ఐదు రూపాయలు ఇవ్వబోయాను.

వెంటనే అతను " ఆపదవుందని తెలిసీ సీత లాంటి సాధ్వీమణి గీతదాటి వచ్చి మరీ భిక్ష వేసింది. లోపల ఉండి బయటకు భిక్ష వేసే మహాతల్లిని నిన్నే చూసాను " అన్నాడు.

నేను కొంచెం ఖంగు తిన్నాను. వెంటనే గేట్ తీసి లోపలికి పిలిచాను. వచ్చిన దగ్గరనుంచి ఏవేవో చెప్పడం మొదలుపెట్టి నా భర్తకూ, నాకూ మాత్రమే తెలిసిన ఒక విషయం చెప్పేసరికి నేను నిదానంగా చూసాను. " మీరు యజ్ఞం చేస్తున్నారు ; నరుని కంటికి రాయైనా పగులుతుంది. మీకొక స్ఫటికం ఇస్తాను ; ఇంటిగుమ్మానికి కట్టండి " అన్నారు.

" ఇంటిలో ఉన్నంతసేపు అది రక్షణ ఇస్తుంది. బయటకు వెళితే మెడలో వేసుకుని తిరగాలి కనుక నాకు అక్కరలేదు " అన్నాను.

" మొండిదానివని తెలుసు కానీ, మీ పొట్టలో ఇంతమొండితనం ఉందనుకోలేదు " అన్నాడు. " ఎవరీయన ? నేను తెలిసినట్టు మాట్లాడుతున్నాడు ! " అని నా థర్డ్‌ఐతో చూడబోతే మా ఇద్దరిమధ్య ఒక తెర అడ్డువచ్చింది.

" కొంచెం దాహం ఇవ్వు తల్లీ " అన్నాడు. " నేను బాగా అలసిపోయి ఉన్నా. నన్ను విసిగించవద్దు " అని ఇరవై రూపాయలు ఇచ్చి " బయట భోజనం చెయ్యి " అని చెప్పాను. మళ్ళీ బ్రతిమలాడాడు. " కొంచెం మజ్జిగైనా ఇవ్వండి " అని. నాకు బద్ధకం వేసింది. పాలు తోడుకున్నాయి. కానీ నేను ఇవ్వలేదు. గట్టిగా వెళ్ళిపొమ్మని చెప్పి పంపివేసాను.

మూడు రోజుల తర్వాత ధ్యానంలో కోయదొర కనిపించాడు " ఇతను కనబడుతున్నాడేంటీ ? " అని చూస్తూ ఉండగానే ఆ ముఖం పత్రీజీ ముఖంగా మారిపోయింది. ఒక్కసారి " షాక్ " అయ్యాను. " మీరా వచ్చింది ? ఇలా మారురూపంలో వస్తే నేనెలా గుర్తుపడతాను ? వచ్చింది దొంగో, జ్ఞానో ఎలా తెలుస్తుంది ? " అన్నాను.

" త్రికరణశుద్ధిగా నమ్మినవారి ఇంటిగడప ఏ దొంగ తొక్కలేడు. వేలమందికి ఎవ్వరూ పెట్టలేని విధంగా భోజనాలు పెట్టాను అన్నావుగా .. ‘ వరలక్ష్మి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా నలుగురికైనా అన్నం ఉంటుంది ’ అని గొప్పగా చెప్పావుగా ? " అన్నారు.

నా గుండె కరిగి కన్నీరు అయ్యింది. " అంతటి మహాగురువుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను " అని.

పత్రీజీ వస్తే కాఫీలు, కూల్‌డ్రింక్స్ ఇవ్వటం కాదు. గురువుకి అందరూ చేస్తారు. కానీ ప్రతిఒక్కరిలోనూ గురువుని చూడగలిగినప్పుడే అది " ఎన్‌లైటెన్‌మెంట్ ". అవతలవ్యక్తిలోని ఆకలి గమనించి పెట్టేదే అసలైన జ్ఞానం. ఇంటికి వచ్చిన వారికి అలసిసొలసి ఉన్నా సరే దాహం, కాఫీ, మజ్జిగ ఏదైనా సరే ఇవ్వగలగటమే " అతిథి దేవోభవ " అన్నదానికి అసలైన అర్థం. ఇలా పరోక్షంగానూ మరి ప్రత్యక్ష అనుభవం ద్వారా నాకు జ్ఞానోదయం కలిగించిన మహానుభావుడు పత్రీజీ.

1999 సంవత్సరంలో విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ప్రెసిడెంట్ J.రాఘవరావు గారు, నాగలక్ష్మి,కృష్ణ గారి ఆధ్వర్యంలో విజయవాడ నుంచి బదరీనాథ్ వరకూ ధ్యానయాత్ర సాగింది. ఆ యాత్రలో హరిద్వార్‌లోని భారత్ భవన్ లో యోగుల శిల్పాలు చూడటానికి వెళ్ళాం. ఆ సమయంలో చేతిలో మ్యాగజైన్స్, పాంప్లెట్స్ ఉన్నాయి. ఒకరు " ఇది ఎంతకి ఇస్తారు ? " అని ఒక మ్యాగజైన్ తీసుకుని ఇరవై రూపాయలు తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఒక ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాన్ని వారు అలా కొనడం చూసి కొన్ని కోట్ల వ్యాపారాలు చేసినా రాని ఆనందం నాకు కలిగింది.

ఇంతలో ఒక సన్యాసి పాంప్లెట్ తీసుకుని మ్యాగజైన్ 15 రూపాయలకు అడిగాడు .. నేను ఇవ్వలేదు. " సన్యాసికి మోక్షం లేదు సంసారంలోనే నిర్వాణం .. అని వ్రాసారు ? " అని అడిగాడు.

" అవును. సన్యాసికి సంసారంలోని కష్టాలు ఏం తెలుస్తాయి ? వీరందరూ వసతి కల్పించి భోజనాలు పెడుతూ ఉంటే మీకు నొప్పేం తెలుస్తుంది ? ఎట్టి పరిస్థితుల్లో మీకు మోక్షం రాదుగాక రాదు " అని ఖచ్చితంగా చెప్పి మ్యాగజైన్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాను.

అక్కడ లిఫ్ట్‌లో ముగ్గురు చొప్పున పై అంతస్తులోకి వెళ్ళి ఒక్కొక్కటి చూస్తూ క్రిందికి రావాలి. లిఫ్ట్ ద్వారా తప్ప ఇంకొక దారిలేదు. మేము లైన్ లోపల నుంచుని ముగ్గురం పైకి వెళ్ళాం. మాకంటే ముందే ఓ సన్యాసి అక్కడ కనిపించాడు. " బయట ఉన్న ఇతను మాకంటే ముందెలా వచ్చాడు ? " అన్న ఆలోచన రాలేదు. పట్టించుకోనూ లేదు, మేము అలా చూస్తూ చివరి అంతస్థులోకి వచ్చాం. అక్కడ నా దగ్గరగా వచ్చిన సన్యాసి అటూ ఇటూ చూసి " సన్యాసి దగ్గర డబ్బులుంటాయా ? ఆ పుస్తకం నాకు ఫ్రీగా ఇవ్వండి " అన్నాడు. అప్పుడు నేను " మేము బుక్స్ వ్యాపారానికి రాలేదు. ఫ్రీగా పంచడానికే తెచ్చాం " అంటూ ఒక బుక్ ఇచ్చాను.

రెండుచేతులతో ఆ పుస్తకాన్ని పట్టుకుని తలవంచి "ధన్యోస్మి " అని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి !

యాత్ర సాగించి విజయవాడ వచ్చిన ఒక నెల తర్వాత " యాత్రలో మీ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి ? " అని అడిగారు సార్. ఇదేంటి నెల తరువాత మళ్ళీ అడుగుతారు అన్నీ చెప్పేసాం. రాసాం, అనుకున్నాను. నాకు అర్థం కాలేదు. " హరిద్వార్‌లో అనుభవం ఏమిటి ? " అని, ధ్యానంలో వచ్చిన అనుభవాలు వెతుకుతున్నాను. గుర్తురాలేదు.

అప్పుడు సార్ " కొందరి బుర్రలో మట్టి ఉంటుంది, ఏంచేస్తాం ? " అని వెళ్ళిపోయారు. నేను చాలా బాధపడ్డాను. " నా బుర్రలో మట్టి ఉందంటారా ? "అని చాలాకోపంతో " ఇది ఏదో తేలేదాకా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోను " అని ధ్యానంలో కూర్చున్నాను. ఆ సన్యాసి కనిపించాడు. కొంచెంసేపటికి నవ్వుతూ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నిర్ఘాంతపోయాను.

మళ్ళీ పరీక్షా నాకు ? ఆ సన్యాసిని ఎన్ని మాటలన్నాను. నాకు శివుడంటే చాలా ఇష్టం. " నాకేంటి ఇలా జరిగింది ? " అనుకున్నాను. ఆ రోజు రాత్రికి తిరుపతి నుంచి పత్రీజీ ఫోన్ చేసి " నేనొక కవిత చెపుతాను, విను " అంటూ " తిట్టే దీవెనాయాగా, మట్టే మాయమాయెగా, గట్టే తెగిపోయెగా, గుట్టూరట్టాయెగా " అని చెప్పారు.

అంతటి పరమశివుడు " ధన్యోస్మి " అని మ్యాగజైన్‌ని వెంటపడి మరీ తీసుకుంటే పత్రీజీ తన స్వహస్తాలతో మెరుగులు దిద్దే " ధ్యానాంధ్రప్రదేశ్ " ని మనం ఏమిచ్చి కొనుక్కోగలం ? పత్రీజీ రుణాన్ని ఎలా తీర్చుకోగలం .. ? దటీజ్ పత్రీజీ.

అంచెలంచెలుగా నన్ను ఈ మాయలో నుంచి బయటపడేస్తూ, మోక్షమార్గంలోకి తిసుకువెళ్తోన్న పత్రీజీ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక సూర్యుడిని ఏ దృష్టితో చూస్తామో .. పత్రీజీ ని చూసినప్పుడు కూడా నాది అదే స్థితి. రూపరాహిత్యస్థితి !!!

వరలక్ష్మి,
విజయవాడ

Go to top