" మాకు ఈ అవకాశం రావడం ఎన్నో జన్మల పుణ్యం "

హైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ .. "అశోక బిల్డర్స్" ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ K. విజయభాస్కర్ రెడ్డి గారు .. నిరాడంబరులు, నిగర్వి మరి మైత్రేయ తత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్నేహశీలురు. 2012, డిసెంబర్ ధ్యానమహాచక్రం - 3 మరి ప్రపంచ ధ్యాన మహాసభలు -1 కడ్తాల్ .. మహేశ్వర మహాప్రాంగణంలో 11 రోజుల పాటు జరుపుకోబోయే శుభ సందర్భంలో పిరమిడ్ ట్రస్ట్ వైస్ చైర్మన్ అయిన వీరు .. మరి వారి భార్య శ్రీమతి నీరజారెడ్డి గారితో ఇన్నర్ వ్యూ .. ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకుల కోసం ..

మారం శివప్రసాద్, సెల్ : 9347242373


 

మారం : విజయభాస్కర్ రెడ్డి గారూ, మీ గురించీ, మీ ధ్యాన జీవితం గురించీ తెలియజేయండి!

విజయభాస్కర్ రెడ్డి : నా పూర్తి పేరు కొరప్రాలు విజయభాస్కర్ రెడ్డి. మా అమ్మ శ్రీమతి సుజాతమ్మ మరి మా నాన్న శ్రీ రఘనందన్ రెడ్డి గారు. మాది మహబూబ్నగర్ జిల్లా, కడ్తాల్ దగ్గరలోని అనుమాస్పల్లి గ్రామం.

నా భర్య "నీరజ" మరి మాకు ఇద్దరు పిల్లలు .. "అజితేష్", "నిఖిత". ఇద్దరూ అమెరికాలో BBA కోర్సు చదువుకుంటున్నారు. హైదరాబాద్ లోనే పేరుగాంచిన "అశోక బిల్డర్స్" కు నేను ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ని. ఇది కాక ఇంకా కొన్ని బిజినెస్లతో రోజుకు 24 గం||లు కూడా సరిపోవు ఒక్కోసారి!

అలాంటీ సమయంలో ఒకసారి .. 2002 లో .. సికిందరాబాద్ " ఓల్డ్ వాసవీనగర్ లో ధ్యాన శిక్షణా తరగతి" అని ఒక కరపత్రం నా చేతికి రావడం జరిగింది. దానిలో ముద్రించి వున్న"ధ్యానం చేసే విధానం" కూడా చాలా సింపుల్గా ఉంది! "ఒకసారి వెళ్ళి చూసి వస్తే పోతుంది" అనిపించింది. అలా ఎంతో తీరిక చేసుకుని వాసవీనగర్కు వచ్చాను. నా భగ్యవశాత్తు ఆరోజు కార్యక్రమానికి బ్రహ్మర్షి పత్రీజీ కూడా వచ్చారు !

సరే .. అందరినీ కూర్చోబెట్టి వేణు ధ్యానం చేయించారు. ఆ కాస్సేపు నాకు ఎంతో రిలీఫ్ గా అనిపించింది. ఏదో తెలియని ఆనందం నా శరీరం అంతా నిండిపోయిన ఫీలింగ్ ! పత్రీజీ పద్ధతి .. వారు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాలను కూడా .. చాలా సింపుల్గా సైంటిఫిక్గా వివరిస్తూంటే .. నాకు చాలా నచ్చింది ! అదే విషయం పత్రీజీతో కరచాలనం చేసి మరీ చెప్పాను ఎంతో ధైర్యంగా !

ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్పాలి ! అదేమిటంటే .. ఎంత గొప్ప వాళ్ళకయినా .. పైకి ఎంత గంభీరంగా కనిపించినా ఒక్కోసారి లోలోపల ధైర్యం సడలుతూ వుంటుంది. ఎంత పెద్ద బిజినెస్ మాన్ని అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ బలహీనత నాలోనూ ఉండేది. అది నాకే నచ్చేది కాదు. అయితే ధ్యాన సాధన మొదలు పెట్టాక కొన్నాళ్ళకు తరచి చూసుకుంటే .. నాలోని ఆ బలహీనత లేకుండా పోయింది ! అది చాలా సందర్భాల్లో నన్ను నేను పరీక్షించుకుని మరీ చూసుకున్నాను. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ధ్యానం వల్ల నాకు గొప్ప లాభం .. అన్ని సందర్భాల్లో కూడా నేను నిర్భయంగా, ధైర్యంగా వుండగలగడం !

ఇక "ధ్యానం" అనే ఇంత మంచి ఆయుధం మన చేతికి చిక్కాక వదిలేస్తామా ఏంటి ? ఆ మహాసాగరంలో పూర్తిగా మునిగిపోయాం .. మరి పూర్తి శాకాహారుల్లా మారిపోయాం !!

నీరజ : మా బాబు ఇండియాలో వున్నప్పుడు "ఓషో" పుస్తకాలు తెగ చదివేవాడు. "నేను ఎప్పుడూ ధ్యానస్థితిలోనే వుంటాను మమ్మీ !" అనేవాడు. ఎవ్వరినీ విమర్శించనీయడు. మా పాప కూడా అంతే !

అంత గొప్ప సంస్కారులు మా పిల్లలుగా పుట్టడం మా అదృష్టం! నేను ఎప్పుడయినా, ఎవరినయినా ఏదో ధోరణిలో వుండి విమర్శిస్తే .. "మమ్మీ ! వాళ్ళను గురించి విమర్శించే హక్కు నీకు లేదు. ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం ! నువ్వు ధ్యానం చెయ్యి .. నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకున్న తరువాతే ఇంకొకరి గురించి మాట్లాడు" అనేవారు నిక్కచ్చిగా !

"ఏంటీ ? వీళ్ళు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా అనేస్తున్నారు" అని బాధవేసేది కానీ .. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక అర్థం అవుతోంది .. మా పిల్లలు మాకంటే ఎంతటి ఉన్నత ఆత్మలో !!

మారం : మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు మేడమ్?

నీరజ : అదే చెప్తున్నాను, మా వారు ధ్యానంలోకి వచ్చాక కొన్ని నెలలకు నేనూ వచ్చాను. మా వారేదో ధ్యానం గురించి చెప్తూంటే ఊరికే అలా వింటూండేదాన్ని కానీ .. ప్రత్యేకంగా నాకు ఆసక్తి వుండకపోయేది. దానికి కూడా కారణం ఉంది " ఈ గురూజీలు ఊరికే కాళ్ళు మొక్కించుకోవడం తప్ప మనకు ఒరగబెట్టేది ఏమి వుండదు" అని నేను చిన్నప్పటినుంచి వినడం వల్ల .. ఆధ్యాత్మికత అంటే నాకు చాలా అయిష్టంగా ఉండేది.

ఒకానొక సందర్భంలో మా వారు ధ్యానం క్లాసుకు రమ్మంటే .. "నేను ససేమిరా రాను" అని ఏడ్చేసాను కూడా!

అయినా వారు నన్ను వదలకుండా .. ఒకరకంగా బలవంతంగా అనే చెప్పాలి .. ధ్యానం క్లాసుకు తీసుకుని వెళ్ళారు. " ఆ గురూజి కాళ్ళు మాత్రం పట్టుకోను " అని ముందే కండీషన్ పెట్టి .. చాలా కోపంగా ఆ క్లాసుకు వెళ్ళాను.

అంతకు ముందు ఒకసారి నేను రైల్వేస్టేషన్ లో సరదాగా అక్కడ ఉన్న "కాయిన్ వేసి బరువు చూసుకునే మిషన్" ఎక్కి నా బరువు చూసుకున్నాను. బయటికి వచ్చిన కార్డు చూసుకుంటే .. " ఒక కోలముఖం గల వ్యక్తి పరిచయం వల్ల నీ జీవితంలో పెను మార్పు వస్తుంది" అని ప్రింట్ చేసి ఉంది. అది చదివి నవ్వుకుని ఆ కార్డ్ పడేసాను. అది జరిగి కూడా చాలా సంవత్సరాలైంది. మరి దాదాపు దానిని నేను మరిచేపోయాను. కానీ చిత్రంగా ధ్యానం క్లాసులో బ్రహ్మర్షి పత్రీజీ ని చూడగానే నాకు చాలా కాలం క్రితం జరిగిన కార్డు విషయం గుర్తుకు వచ్చి " ఆ కోలముఖం గల వ్యక్తి వారే" అని నా అంతరంగం నుంచి ఎంతో బలంగా సందేశం వచ్చింది. అంతే ఇక ధ్యానంలో కూర్చుండిపోయాను.

నా అంతరంగాన్నీ, నా హృదయాన్నీ, నా మనస్సునూ కదిలించి వేసిన ఆ ధ్యానం నాకు ఎంతో గొప్పగా అనిపించింది. కార్యక్రమం అయిపోయాక నా ప్రమేయం ఏమి లేకుండానే "ట్రాన్స్" లో కదిలి వెళ్ళినట్లుగా వెళ్ళి .. బ్రహ్మర్షి పత్రీజీ పాదాలకు శిరస్సువంచి మనస్ఫూర్తిగా నమస్కరించి .. ప్రక్కకు వెళ్ళిపోయి నిశ్శబ్దంగా కూర్చుండిపోయాను !

కాస్సేప్పటికి అంత మందిలో కూడా పత్రీజీ నన్ను వెతుక్కుంటూ వచ్చి .. వంగి నా కాళ్ళకు మ్రొక్కారు.

అంత గొప్ప తేజోమూర్తి అయిన గురువు అలా వచ్చి నా కాళ్ళకు మ్రొక్కుతూ ఉంటే .. నేను అవాక్కై పోయాను. ఇక అంతే ఆ క్షణంలో నాకు పత్రీజీ యొక్క విశిష్టత అర్థమై .. అప్పటి వరకు స్వామీజీల పట్ల నాలో ఉన్న దురభిప్రాయం మాయమైపోయింది. పత్రీజీ లోకకల్యాణం కోసమే ఈ భూమి మీదకు వచ్చారు అనీ .. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మమ్మల్నీ వారి దగ్గరకు చేర్చిందనీ నాకు అర్థమైంది.

ఇక నాకు ధ్యానంలో సిల్వర్, గోల్డ్ కలర్స్ కనబడటం .. నా చుట్టూ అనేకరకాల పుష్పాల వాసన రావడం, వేంకటేశ్వర స్వామి శంఖు చక్రాలు స్పష్టంగా కనబడటం జరిగేవి. శరీరం అంతా ఒకలాంటి శక్తితో నిండిపోయి ఎన్నో సార్లు గాలిలో తేలిన అనుభూతిని నేను పొందాను. చాలా సార్లు పత్రీజీ వచ్చి నా ప్రక్కనే కూర్చున్నట్లూ .. గౌతమబుద్ధుడు నా ప్రక్కనే నిలబడినట్లూ .. నేను చూసుకున్నాను. ధ్యానం చేసిన రోజుకూ మరి చెయ్యని రోజుకూ తేడా నాకు స్పష్టంగా అర్థమైపోతూండేది !

ఒకసారి మేము యాదగిరిగుట్ట వెళ్ళి వస్తూంటే .. నా కడుపుమీద టచ్ చేస్తే కూడా తట్టుకోలేనంత విపరీతమైన నొప్పి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే ధ్యానం చేశాను. ఆంజనేయ స్వామినీ, పత్రీజీ తలచుకుని అలా .. నిద్రలోకి వెళ్ళిపోయాను మంత్రం వేసి చేసినట్లుగా .. తెల్లవారేసరికి నొప్పి చేతితో తీసివేసినట్లుగా పోయింది!

మారం : చాలా బాగుంది మేడమ్ ! కడ్తాల్ మహాపిరమిడ్ కు వైస్ చైర్మన్ గా మీ వారు నియమింపబడినప్పుడు .. మీరెలా అనుభూతి చెందారు ?!

నీరజ : ఈ అనుభూతిని నేను మీతో తప్పకుండా పంచుకోవాలి! ఎందుకంటే .. వృత్తిపరంగా మరి వ్యాపారపరంగా మా వారు చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంచేతే వారు మహాపిరమిడ్ బాధ్యతను చేపట్టడానికి తటపటాయించారు అయితే .. "కడ్తాల్ దగ్గర ఉన్న అనుమాస్ పల్లి కాకతాళీయంగానే అయినా స్వస్థలంగా ఉన్న మాకు .. ఈ అవకాశం రావడం ఎన్నో జన్మల పుణ్యం. కాబట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోబోయే ఈ గొప్ప పిరమిడ్ నిర్మాణ బాధ్యతలను స్వీకరించడానికి మా వారు వెంటనే ముందుకు రావాలి" అని సంకల్పం చేసుకుని ధ్యానం చేసాను.

ఆ తరువాత 2007 లో బ్రహ్మర్షి పత్రీజీ మా వారికి మొదట ట్రస్టీగా .. ఆ తరువాత వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించినప్పుడు వారు కూడా సంతోషంగా ఒప్పుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగించింది ! నా సంకల్పశక్తి ఇలా వాస్తవ రూపం దాల్చినందుకు నా సంతోషానికి హద్దే లేదు !

విజయభాస్కర్‌ రెడ్డి : మొదట్లో " నావల్ల అవుతుందా ?" అని తటపటాయించినా .. ఆ తరువాత బ్రహ్మర్షి పత్రీజీ మీదే భారం వేసి ట్రస్ట్ బాధ్యతలను చేపట్టాను. చేసేదీ, చేయించేదీ వారే ! కాకపోతే విశ్వకల్యాణంలో మనల్ని కూడా భాగస్వాములను చేస్తూ మన జన్మలను ధన్యం చేసుకునే అవకాశం ఇస్తూంటారంతే ! " ఎస్ బాస్ " అనుకుంటూ వెళ్ళడమే మన పని !

మారం : ట్రస్ట్ బాధ్యతలు చేపట్టాక మీరు తీసుకున్న నిర్ణయాలు ?

విజయభాస్కర్ రెడ్డి : విశ్వకల్యాణం మరి విశ్వశాంతి .. ఈ రెండింటి కోసం నిర్మించబడుతోన్న 180*180 మహేశ్వర మహా పిరమిడ్ .. ఒక మహా నిర్మాణం ! ఒకే సారి 7,000 మంది ధ్యానులు కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా రూపిదిద్దుకుంటోన్న ఇది 75 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఉంది. దీని ప్రక్కనే 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన చెరువు ఉండడం ఒక ఎత్తైతే .. చుట్టూ కొండలతో మూడు వేల ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆవరించి ఉండడం ఇంకోఎత్తు ! అంటే పూర్తిగా ప్రకృతితో మమేకం అయి ఉన్న మిక్కిలి సారవంతమైన స్థలం అది. ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసినప్పుడు పత్రీజీ కూడా తమ పూర్ణసంతృప్తిని వ్యక్తం చేసారు.

75 ఎకరాల ఈ సువిశాల ప్రాంగణంలో 30 ఎకరాలను మహాపిరమిడ్ కోసం మరి దాని చుట్టూ కావలసిన అవసరాల కోసం కేటాయించాం. ఒకే సారి 7,000 మంది ధ్యానం చేసుకునేట్లు మరి విశాలమైన కింగ్స్ ఛేంబర్లో 500 మంది కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ! మహా పిరమిడ్ బయట మూడు అంతస్థులుగా "ల్యాండ్ స్కేపింగ్ స్టేజీ" లను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క స్టేజి పై ఆరు వేల మంది చొప్పున 18 వేల మంది .. వెరసి పిరమిడ్ లోపలా, బయటా కలిసి 25,000 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపుదిద్దు కుంటున్నాయి. ఇవన్నీ డిసెంబర్ కల్లా పూర్తి ఆయ్యి ధ్యానమహాచక్రం - 3 కి అందుబాటులోకి వస్తాయి.

మిగిలిన స్థలంలో మొదటి విడతగా 120 గదులతో కూడిన గెస్ట్ హౌస్, 60 గదులతో కూడిన 20 డార్మెటరీల నిర్మాణం మొదలయ్యింది.

రెండు ఎకరాల్లో బ్రహ్మర్షి పత్రీజీ కోసం అన్ని హంగులతో కూడిన అందమైన పిరమిడ్ హౌస్, ఆఫీస్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కట్టబోతున్నాం !

ఆరు ఎకరాల్లో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్మెంట్ లోని వివిధ విభాగాలకు చెందిన కార్యాలయాలు, ప్రింటింగ్ ప్రెస్ మరి పబ్లిషింగ్ కార్యాలయాలు, మెగా ఆడిటోరియమ్, యోగా సెంటర్తో పాటు 5000 మంది ఒకేసారి శాస్త్రీయ ప్రయోగాల్లో పాలుపంచుకునే విధంగా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడన ఆంఫీ థియేటర్కు ప్రణాళిక చేసాం.

ఆరు ఎకరాల్లో అన్ని సాంకేతిక హంగులతో కూడిన వంటశాల మరి 15,000 మంది ఒకేసారి కుర్చుని భోజనం చేసే విధంగా సువిశాలమైన డైనింగ్ హాల్స్ రూపుదిద్దుకోబోతున్నాయి.

ఇరవై ఎకరాల్లో అక్కడ సహజసిద్ధంగా ఏర్పడి ఉన్న గండశిలలు ఆధారంగా .. అత్యద్భుతమైన ' రాక్ గార్డెన్ ' మరి " ఆయుర్వేద వనం " రూపుదిద్దుకోబోతోంది. ఆ " రాక్ గార్డెన్ " లో " అఖండ ధ్యానం " చేసుకునే విధంగా 108 చిన్న చిన్న పిరమిడ్ నిర్మాణాలు కూడా ప్రణాళిక ఉన్నాయి.

ఇవే కాకుండా, మన స్థలం ప్రక్కన 25 ఎకరాల్లో స్వతస్సిద్ధంగా ఏర్పడి ఉన్న చెరువును అద్భుతమైన " బోటింగ్ లేక్ " గా రూపొందించబోతున్నాం ! ఇందుకు గాను దాని చుట్టూ టాంక్ బండ్లాగా రెయిలింగ్ నిర్మించి .. ఆ ఫుట్ పాత్ పై స్పిరిచ్యువల్ మాస్టర్స్ విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నాం !

ఇంకా మన శ్రీరామ్ గోపాల్ గారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా " గుప్తుల కాలం " నాటి " నలందా విశ్వవిద్యాలయం " తరహాలో భవిష్యత్తులో " స్పిరిచ్యువల్ యూనీవర్సిటీ " నెలకొల్పాలని ప్రణాళిక లు సిద్ధం చేసుకుంటున్నారు ! అది సాక్షాత్కరించే రోజు కూడా మరెంతో దూరంలో లేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అద్భుతమైన ప్రణాళికలు వున్నాయి. సాధ్యమైనంత వరకు 2012 డిసెంబర్ కల్లా కొన్నింటినైనా పూర్తిచేసి .. ధ్యానమహాచక్రం - 3 కోసం అందుబాటులో వుంచుతాము. నేను ట్రస్టీ గా చేరినప్పటికీ .. ఇప్పటికీ జరిగిన పనుల విధానం మరి మహా పిరమిడ్ నిర్మాణం చూస్తోంటే .. మన మిగతా ప్రణాళికలు అన్నీ కూడా మరింత వేగంగా .. అనుకున్న సమయానికి ఖచ్ఛితంగా పూర్తి అవుతాయని ప్రగాఢ విశ్వాసంతో నేను చెప్పగలుగుతున్నాను.

మేనేజింగ్ ట్రస్టీ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నేను చేపట్టిన మొట్టమొదటి పని కడ్తాల్ మెయిన్ రోడ్డు నుంచి మహా పిరమిడ్ వరకు .. సాఫీగా చేరేట్లుగా సువిశాలమైన రోడ్డును నిర్మించడం! దాదాపు 5 కి.మీ నిడివి ఉన్న ఆ రోడ్డును చక్కటి నాణ్యతా ప్రమాణాలతో డీలక్స్ రోడ్డు గా నిర్మించాం ! ఎంతో మంది ధ్యానులు ఈ రోడ్డు నిర్మాణం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. మెయిన్ రోడ్డు నుంచి కేవలం అయిదు నిమిషాల్లో ఎవ్వరైనా పిరమిడ్ను సునాయాసంగా చేరుకోవచ్చు !

ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా భవిష్యత్తులో రూపుదిద్దుకోబోతోన్న ఈ ధ్యానమహాక్షేత్రం .. వివిధ దేశాల జిజ్ఞాసువులకూ, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలకూ ఒక శక్తిక్షేత్రంలా అలరారబోతోంది. "2012 డిసెంబర్లో ధ్యానమహాచక్రం - 3 తరువాత .. 2013 నుంచి ప్రతియేటా ప్రపంచ పిరమిడ్ ధ్యాన మహా సభలు ఇక్కడే జరుగుతాయి " అని బ్రహ్మర్షి పత్రీజీ ఇది వరకే ప్రకటించేసారు .. "మరి నేను నా సమయాన్ని ఇక్కడే ఎక్కువగా గడుపుతాను" అని కూడా వారు తమ నిర్ణయాన్ని తెలియజేసారు !

మారం : " ధ్యానమహాచక్రం - 3 కడ్తాల్ లో " అని పత్రీజీ నిర్ణయం తీసుకోవడం వెనుక పూర్వాపరాలు ఏమిటి?

విజయభాస్కర్ రెడ్డి : సింహాచలంలో ధ్యానమహాచక్రం - 2 జరుగుతోన్నప్పుడు బ్రహ్మర్షి పత్రీజీ " ధ్యానమహాచక్రం - 3 ఎక్కడ నిర్వహించాలి ?" అంటూ సీనియర్ మాస్టర్ల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. నేను మా ఇతర ట్రస్టీలు మరి అనుభవజ్ఞులు గుంటూరు లక్ష్మణరావు గారితో కలిసి సాధ్యాసాధ్యాలు చర్చించుకుని.. "స్వంత ఇంటిలో పండుగ జరుపుకున్నట్లుగా చేసుకుందాం" అని బ్రహ్మర్షి పత్రీజీకి మా సంసిద్ధతను తెలియజేసాం !

పత్రీజీ కూడా మా కోరికను మన్నించి .. "ఒకే" అనేసారు. ఇది హైదరాబాద్ మాస్టర్స్ చేసుకున్న సామూహిక పుణ్యం మరి ఎన్నో జన్మల భాగ్యం !!

2012 .. ఈ సరికే ప్రపంచవ్యాప్తంగా .. ఉత్కంఠ రేపుతోంది ! ఇలాంటి యుగమార్పిడి సమయంలో మాయన్ కేలండర్ ప్రకారం అత్యంత ముఖ్యమైన 11 రోజుల కాలంలో ధ్యానమహాచక్రం - 3 కార్యక్రమానికి .. ఎన్ని వేల మంది హాజరవుతారో ఊహించడం కష్టం ! అయినా రోజుకు మూడు లక్షల మందికి కూడా ఏ రకమైన ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు జరిగేట్లుగా ప్లాన్ చేస్తున్నాం ! ఇందుకు గాను ఎందరెందరో నిపుణుల సలహాలను భారీఎత్తున అన్నదానాలు చేసే గొప్ప గొప్ప సంస్థల పనితీరునూ పరిశీలిస్తున్నాం. వారి నుంచి సలహాలూ, సంప్రదింపులూ స్వీకరిస్తూ .. వీలైనంతవరకు వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానిస్తాం.

"ప్రపంచం అంతా కూడా ధ్యానశక్తిని గుర్తించేట్లుగా ఈ కార్యక్రమాలు జరుపుతాం" అని బ్రహ్మర్షి పత్రీజీ కి మాట ఇస్తూ .. వారు ఆదేశించినట్లుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించేట్లుగా పటిష్టమైన వేదికలను శాశ్వతంగా నిర్మించబోతున్నాం ! 2013 నుంచి ప్రతియేటా ప్రపంచ ధ్యాన మహా సభలు కడ్తాల్లోనే జరుగబోతున్నాయి కనుక ఇవన్నీ మనకు నిరంతరంగా ఉపయోగంలోకి వచ్చేట్లుగానే నిర్మాణాలు సాగుతున్నాయి.

మారం : మేడమ్! మీలో ధార్మిక గుణం .. చాలా అభినందనీయం ! మీ వారు చేసే కార్యక్రమాల పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు?

నీరజ : ముందుగా మా నాన్నగారి గురించి చెప్పాలి ! వారు చాలా ఉదార స్వభావులు. ధార్మిక కార్యక్రమాల పట్ల వారు చాలా నిబద్ధతతో వ్యవహరించేవారు. బహుశా నాలో ఆ గొప్పగుణం మా నాన్నగారి నుంచే వారసత్వంగా వచ్చిందేమో ! వారు తమకు చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికీ .. ధనరూపంలో కానీ, మాట రూపంలో కానీ ఎంతో సహాయం చేస్తుండేవారు. "మనిషిగా పుట్టడం గొప్ప విషయం అయితే .. ఇతరులకు చేయగలిగినంత సహాయం చేయడం చాలా గొప్ప విషయం" అని నేను చిన్నప్పటి నుంచే మా నాన్న గారి నుంచి నేర్చుకున్నాను.

మా వారు చాలా పెద్ద వ్యాపారవేత్త. వారు వ్యాపారంలో తాను సాధించిన విజయాలను గురించి చెబుతూంటే, నాకేమీ సంతోషం కలిగేది కాదు. " ఇదేం గొప్ప విషయం కాదు, వారు మరేదో గొప్పపని చేయాలి " అని నేను తరచు అనుకునేదాన్ని. అందరూ చేసేది కాకుండా, నా భర్త ఇంకా ఎదయినా ఒకగొప్ప పనిచేయాలి .. అది కూడా ధార్మికమయింది " అని ఆలోచించేదాన్ని.

పత్రీజీని మేం కలిసిన తర్వాత ధ్యానప్రచారంలో మా పాత్ర నిర్వహించడం మొదలైన తర్వాత, కడ్తాల్, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్ గా మా వారు నియమింపబడిన తర్వాత .. నాలో ఆనందం పొంగిపొరలింది. ఎందుకంటే నా ఎన్నో సంవత్సరాల సంకల్పం అది.

మా నాన్నగారినీ వారి ధర్మబుద్ధినీ చూసి వందలాది మంది తలచుకునేవారు, " అలా నా భర్త కూడా అయితే బాగుండును " అని నేను చేసిన సంకల్పం .. ఈ రోజు వేలాది మంది నా భర్తను ప్రశంసిస్తూంటే కలుగుతున్న మహదానందం నేను మాటల్లో వర్ణించలేనిది ! ఇంతకంటే గొప్ప పనులు చేసేశక్తి మా వారికి వుంది ! పత్రీజీ ఇంకా " 600' * 600' పిరమిడ్ కట్టండి" అని మా వారికి చెపితే .. అంత పెద్ద బాధ్యతను కూడా వారు నిర్వహించగలరు అని నా భర్త పట్ల నాకు విశ్వాసం ఉంది. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది !!

ఎవరికైనా సాయం చేయడానికి కరుణ పొంగి పొర్లుతూంటుంది నాలో ! ఎవరైనా మరెవరినైనా నొప్పిస్తుంటే " వాళ్ళను నొప్పించే హక్కు వీరికెక్కడిది ?" అని నాకు చాలా చాలా బాధకలుగుతూంటుంది. " ఈ భాధ పెట్టేవారు ధ్యానం చేసి మారాలి " అనిపిస్తుంది.

ఎవరైనా ధ్యానప్రచారం కోసం పనిచేస్తుంటే, అలా చేసే వారిని ఎంతైనా ప్రోత్సహిస్తూంటాను. " ప్రతి ఒక్కరూ ఇంకొకరి పట్ల ఈర్ష్య పడకుండా వారి వారి శక్తిమేరకు ఎవరేం చేయగలరో ఆ పనిని .. ధ్యానప్రచారం కానీ .. అహింసా ప్రచారం కానీ మరి పిరమిడ్ నిర్మాణం కోసం కానీ .. తమ శక్తి మేరకు కృషిచేయాలి " అని పిరమిడ్ మాస్టర్లందరికీ మనవి చేస్తున్నాను.

విజయభాస్కర్ రెడ్డి : పత్రీజీలో ఒక గురువునూ, దైవాన్నీ, తండ్రినీ నేను చూసుకున్నాను. పత్రీజీలోని హుందాతనం నన్ను మైమరపిస్తుంది. అలాంటి ధ్యానగురువును పొందడం నా జన్మ జన్మల భాగ్యం !

ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ పొందాలి. ఈర్ష్యాద్వేషాలను వదలాలి. "ధ్యానాంధ్రప్రదేశ్" పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి, ఇతరులతో చదివిస్తే .. ధ్యానం చేసి ఆ పుస్తకంలోని గొప్పవిషయాలను ఆచరిస్తే ఇది ప్రతి ఒక్కరికీ సాధ్యమవుతుంది. మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్లో .. ట్రస్టీలందరూ త్రికరణశుద్ధిగా, అమితశ్రద్ధతో కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు .. భవిష్యత్తులో కూడా మహేశ్వరా మహా పిరమిడ్ నిర్మాణాల్లో .. ఇతర అన్ని కట్టడాల్లో దేశ, విదేశ స్పెషలిస్టుల నైపుణ్యతనూ, సలహాలనూ, వారి సాంకేతిక విజ్ఞానాన్నీ పొంది దానిని ఆచరణలో పెడతాం !

మారం : స్వంత వ్యాపారాలతో ఎంతో బిజీగా ఉండే మీరు మహా పిరమిడ్ నిర్మాణపు ట్రస్ట్ వైస్ ఛైర్మన్ బాధ్యతలను ఎలా సమన్వయ పరచుకోగలుగుతున్నారు ?

విజయభాస్కర్ రెడ్డి : ఇదంతా ఆటోమేటిక్ గానే అయినా ఇంత చక్కగా ఎలా సమన్వయపరచుకోగలుగుతున్నానో .. నాకే ఆశ్చర్యంగా ఉంది ! ఒకానొక సందర్భంలో పత్రీజీ చెప్పారు .. "పిరమిడ్ మాస్టర్ అంటే బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆత్మ స్వరూపం " అని!

ఇది ముమ్మూటికీ సత్యం ! ఎందుకంటే ఇదివరకంటే కూడా నేను బహుచక్కగా ట్రస్ట్ తో పాటు బిజినెస్ బాధ్యతలను నిర్వహించుకుంటూ నా కుటుంబానికి మరింత సమయాన్ని కేటాయించగలుగుతున్నాను. స్నేహితుల, బంధువుల శుభకార్యాల్లో తప్పకుండా పాలుపంచుకుంటున్నాను. పదిహేను రోజులకు ఒకసారి నా పాత క్రొత్త మిత్రులతో ఒక రోజును గడపగలుగుతున్నాను ! సంవత్సరంలో నాలుగయిదు దేశాలయినా బిజినెస్ కోసం లేదా విహారయాత్రకోసం కుటుంబ సభ్యులతో కలిసివెళ్ళి వస్తున్నాను.

ప్రతి సోమవారం, శనివారం కేవలం పిరమిడ్ ట్రస్ట్ కోసం నా సమయాన్ని కేటాయిస్తున్నాను !

" వారానికి మూడు ధ్యానం క్లాసులు " తీసుకుంటూ .. నా జ్ఞానాన్ని అందరితో పంచుకుంటున్నాను. ఏ మంచి పుస్తకం దొరికినా చక్కగా చదివేస్తున్నాను!

ఒక్కముక్కలో చెప్పాలి అంటే .. 24 గం|| లను 48 గంటలుగా ఎంజాయ్ చెయ్యగలుగుతున్నాను. ఆలోచిస్తూంటే అర్థం అవుతోంది .. ఇప్పుడు ఏ సమయాన్నైతే ట్రస్ట్ పనులకు వినియోగిస్తున్నానో .. అదంతా నేను గతంలో వృధాగా గడిపేసేవాడినన్నమాట !

ఇక నా ' బిజినెస్ ' అంటారా .. ఇంకా బాగా సాగుతూ ఏ టెన్షన్ లేకుండా ఉంది. ఈ మధ్యనే ఇంకో రెండు లిమిటెడ్ కంపెనీలకు చెందిన బాధ్యతాయుతమైన పదవులను కూడా చేపట్టి .. వాటిని సునాయాసంగా నిర్వహించుకోగలుగుతున్నాను. ధ్యానంలో ఉన్న గొప్పతనం ఇదే ! మనం కాలగర్భంలో మరచిపోయిన శక్తియుక్తులనన్నింటినీ బయటకు లాగి .. మనల్ని ఉన్నత దిశగా నడిపిస్తుంది !

పత్రీజీ కృప వల్ల మా దంపతుల ఆత్మీయభావాలను " ధ్యానాంధ్రప్రదేశ్ " .. ఇన్నర్ వ్యూ ద్వారా పంచుకోవడం మా భాగ్యంగా భావిస్తున్నాం.

మా గృహం ఒక నిత్యకల్యాణం .. పచ్చతోరణం !

మైత్రేయ బుద్ధుడు మా ఇంట్లో స్థిరనివాసం చేస్తున్నాడు !

మా అనుమాస్పల్లి గ్రామం సమీపంలో మహేశ్వర మహా పిరమిడ్ రూపుదిద్దుకోవడం మా భాగ్యం !

Go to top