" అనుక్షణం ఆనందంగా వుంచేలా చేసేదే .. ధ్యానం "

 

నా పేరు పారిజాత.

మాది బస్వాయపల్లి. మహబూబ్‌నగర్ జిల్లా. నాకు రెండు కాళ్ళు పూర్తిగా పనిచేయవు. నాకు 9-10-2008 న " బాల్‍రాజు " అనే మాస్టర్ వల్ల ధ్యాన పరిచయం కలిగింది. విజయదశమి రోజు జరిగిన పత్రీజీ క్లాసుకు వెళ్ళాను. ధ్యానం చేయనప్పుడు నాకు ఎక్కువగా తలనొప్పి వచ్చేది. ఇప్పుడు నాకు అస్సలు తలనొప్పి అంటే తెలియదు.

నాకు రెండు మూడు రోజులకు ఒకసారి జ్వరం వచ్చి ఐదు ఆరు రోజుల వరకు వుండేది. నేను ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా మళ్ళీ జ్వరం రాలేదు.

నేను ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఇక నాకు ఒక వారం రోజులు జ్వరం వచ్చేది. నా ముఖమంతా నిర్జీవంగా హీనంగా అయిపోయేది. మళ్ళీ కోలుకోవడానికి ఒక వారంరోజులు పట్టేది. ఇప్పుడు రోజుల తరబడి బండ్లపై ప్రయాణం చేసినా ఆరోగ్యంగా ఉంటున్నాను.

నాకు బయటికి వెళ్ళాలంటే చాలా భయంగా వుండేది. ఎందుకంటే నేను వికలాంగురాలిని కాబట్టి రకరకాలుగా ఆలోచనలు వచ్చేవి. " ఎలా వెళ్ళాలి ? ఎలా వుంటుందో ? " అనే రకరకాల ఆలోచనలు నన్ను ముందుకు వెళ్ళనిచ్చేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా ధైర్యం వచ్చేసింది ! ఎందుకంటే నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులందరూ నాకు చాలా అనుకూలంగా నడుచుకుంటున్నారు ! ఏ కార్యక్రమానికైనా, ఏ పనికైనా " వెళ్ళాలి " అనుకుంటే నా స్నేహితులు నాకు ఎప్పుడూ సహకారం అందిస్తారు.

ధ్యానం చేయకముందు మా ఇంట్లో అందరం ఎప్పుడూ టెన్షన్‌తో బాధపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా ఆనందంగా వుంటున్నాం.

మా ఇంట్లో అందరం ధ్యానం చేస్తాం. మా నాన్నగారికి 20 సంవత్సరాల క్రితం గొంతునొప్పి ఎక్కువగా వుండేది. ఏది తిన్నా గొంతులో ఇరుక్కుని బాధపడుతూ ఉండేవాడు. అందువలన వేరే ఊరికి వెళ్ళినా కూడా ఏమీ తినేవారు కాదు. ఇప్పుడు అన్నీ తింటున్నారు ! మా నాన్న గారికి డొక్కల్లో నొప్పి ఎక్కువగా వుండేది. ఇప్పుడు ధ్యానం చేయడం వలన ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు !

మా ఇంట్లో అందరం ధ్యానం చేయడం వలన మా నాన్న, మా తమ్ముడు మంచి స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. ధ్యానం చేయకముందు వాళ్ళిద్దరూ పరమశత్రువుల్లా ఉండేవారు. కానీ ఇప్పుడు స్నేహితులై చాలా చాలా ఆనందంగా వున్నారు.

ఆ అమ్మ ధ్యానంలోకి వచ్చాక ప్రతిక్షణం ఆనందం అనుభవిస్తొంది. ఇంతటి ఆనందం మేము ఎప్పుడూ " చూస్తాం " అని అనుకోలేదు. కానీ మేమందరం ధ్యానంలోకి వచ్చాక ప్రపంచంలో వున్న ఆనందం అంతా మా దగ్గరే వుంది అనిపిస్తుంది . అందుకే మా కుటుంబంలో అందరూ ధ్యాన ప్రచారం కూడా బాగా చేస్తారు .

మాకు దగ్గరగా వుండే ఊళ్ళకు వెళ్ళి ధ్యానం క్లాసులు పెడతాం ! అందుకు మా కుటుంబంలో అందరూ మరి నా స్నేహితులు మా గ్రామ ప్రజలందరూ సహాయం చేస్తారు. మేమందరం వెళ్ళి ధ్యానం చెప్తాం !

శ్రీశైలంలో కలిగిన అనుభవాలు :

" నేను ఎత్తుకుని వెళ్తాను "

బస్వాయపల్లి నుంచి మేము 31 మంది శ్రీశైలంలో జరిగిన తాండవ శివ సంగీత నృత్య ధ్యాన మహాయజ్ఞం కు వచ్చాం. అక్కడ ఏడు రోజులు ఏడు క్షణాలు అనిపించింది. అసలు స్వర్గం అంటే చనిపోయిన తరువాత అనుభవిస్తారు అంటారు. కానీ ఆ స్వర్గం మేము తాండవ శివ సంగీత నృత్య ధ్యాన మహాయజ్ఞం లో అనుభవించాం ! ధ్యాన మహాయజ్ఞంలో గురువుగారు ఒక మాట అన్నారు. అది ఏమిటంటే " ట్రెక్కింగ్ వెళ్ళని వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు కాలేరు " అని. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే " నేను నడవలేను ; నేను ఎలా వెళ్తాను ? " అని.

కానీ రాత్రి క్లాసు అయిపోయి రూమ్‌కు వెళ్తూంటే మహబూబ్‌నగర్ రవికిరణ్ అనే మాస్టర్ నన్ను మా తమ్ముడు జగదీష్‍ను పిలిచి " రేపు మీరు అక్కమహాదేవి గుహలు ట్రెక్కింగ్ కు వెళ్ళండి " అన్నారు. కానీ నేను మా తమ్ముడితో " నాకు నడవడం రాదు కదా ! అడవి అంతా నువ్వు ఒక్కడివే ఎత్తుకోవడం చాలా కష్టమవుతుంది " అన్నాను. కానీ మా తమ్ముడు " నేను ఎత్తుకుని వెళ్తాను " అన్నాడు. మేము మా ఊరివాళ్ళతో కలసి ట్రెక్కింగ్ వెళ్ళాం. అప్పుడు అనిపించింది " మనం ఏం అనుకుంటే అది వెంటనే జరిగిపోతుంది " అని ! " గురువుగారు ఎప్పుడూ మన వెంటే వుంటారు " అని తెలిసింది. నేను ఎప్పుడూ తిరగలేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం అన్ని చోట్లకు తిరుగుతున్నాను !!

మా తమ్ముడు నన్ను ఎప్పుడూ చంటిపిల్లలా ఎత్తుకుని ప్రతి క్లాసుకు తీసుకువెళ్తాడు. నన్ను ట్రెక్కింగ్‍కు పంపినందుకు " రవికిరణ్ " మాస్టర్‍కు నా కోటి కోటి ధన్యవాదాలు !!

ప్రకృతి అందాలు చూస్తూంటే నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది ! ధ్యాన మహాయజ్ఞంలో ఐదు రోజులు గడిచిపోయాయి. ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలాయి. ఇక నాకు దిగులు మొదలైంది. ఎందుకంటే ఇంకా రెండు రోజులు వుంది. ఈ రెండు రోజుల్లో నేను గురువు గారిని కలుస్తానా ? అందరూ వెళ్ళి షేక్‌హ్యాండ్స్ ఇస్తున్నారు. " ముప్పైవేలమంది జనాల మధ్య నేను ఎలా వెళ్తాను ? " అనుకునేదాన్ని. " నేను కనీసం గురువుగారికి షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వలేను " అని ఏడుపు కూడా వచ్చింది. కానీ భోజన సమయంలో నేను ఒక సోఫాలో కూర్చున్నాను. గురువు గారు నేను కూర్చున్న సోఫా ప్రక్కన వచ్చి కూర్చున్నారు. తక్షణమే నేను లేచి ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చాను ! అప్పుడు నా దిగులంతా ఒక్క క్షణంలో మాయమైంది ! అప్పుడు అనిపించింది " మన మనస్సులో ఏం అనుకుంటే అది ఆప్పుడే గురువుగారికి తెలిసిపోతుంది " అని. ఆ రోజే నేను గురువుగారిని రెండుసార్లు కలిశాను. మా కుటుంబం అంతా గురువుగారిని కలిసింది . ఇక ఆ రోజు మా ఆనందానికి అవధులు లేవు .

అనుక్షణం ఆనందంగా వుండేలా చేసేదే ధ్యానం. ఈ అపురూపమైన ధ్యానాన్ని అందించిన గురువుగారైనా పత్రీజీకి మా కుటుంబ సమేతంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఊరిలో ఇప్పుడు 50% ప్రజలు ధ్యానం చేస్తున్నారు !! మా ఊరిలోని ప్రతి ఇంట్లో ధ్యానం చేసేలా చేయడమే నా జీవిత ధ్యేయంగా ఎంచుకున్నాను. మా ఊరిని " ధ్యాన గ్రామీణం " గా చేస్తాను. పాఠకులందరికీ నా వినతి ఏమిటంటే " ధ్యానం చేయండి ! చేయించండి !! "

 

- M. పారిజాత,
బస్వాయపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా,
ఫోన్ : 9949925011

Go to top