" బొగ్గు లాంటి నన్ను ' ఆనాపానసతి ' వజ్రంలా మార్చింది "

నా పేరు గణేష్.

మాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం. " ఒక మోటార్ మెకానిక్ " గా, "కుంగ్‌ఫూ మాస్టర్ " గా వుంటూ జీవనం సాగిస్తున్న నాకు " ఆనాపానసతి ధ్యానం " పరిచయమైంది.

" మోటార్ మెకానిక్‌గా పనిచేస్తూ హాయిగా జీవిస్తున్నాను " అనుకుంటూన్న నాకు నాలో తెలియకుండా అభద్రతాభావం చోటుచేసుకుని .. భయం ఆందోళన ఎక్కువయ్యాయి. ఆత్మవిశ్వాసం కోల్పోయాను. అసలు నాకు ఇది ఎందుకొచ్చిందో తెలియదు. విపరీతమైన టెన్షన్ వచ్చేది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగాను " ఏమిలేదు " అనేవారు. కానీ నాకు రోజురోజుకూ మానసిక వ్యాధి పెరుగుతూ వుండేది. దాంతో ఇక నేను " చనిపోతానేమో " అనుకుంటూ ఉండేవాడిని. ఇలా వుండగా 2007 జూన్ లో నాకు ఒక పిరమిడ్ మాస్టర్ కనిపించి " ధ్యానం చేస్తే బాగుంటుంది .. అదే పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుంది” అని పిరమిడ్ అడ్రస్ ఇచ్చి కొత్తపేటలో " సత్య పిరమిడ్ " దగ్గరికి వెళ్ళమని చెప్పారు.

వెంటనే మరుసటిరోజు వెళ్ళి పిరమిడ్‌లో ధ్యానం చేసాను. ఇరవైనిమిషాలలో నాకు ఏదో తెలియని చక్కటి అనుభూతి కలిగింది. పరమశివుడు ధ్యానముద్రలో కనిపించడంతో ఎంతో హాయిగా అనిపించింది ! ఆ రోజు నుంచి ప్రతిరోజూ ధ్యానం చేయడం ప్రారంభించాను. ధ్యానంలో కొందరు మాస్టర్స్ నుంచి " నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇదే ; దీన్ని విడిచిపెట్టవద్దు " అని సందేశం వచ్చేది. అప్పటి నుంచి ప్రతిరోజూ ధ్యానం చేస్తూ నాలో వున్న అభద్రతాభావాన్ని పదిహేనురోజులలో తొలగించుకున్నాను. ఆరునెలలుగా మనోవ్యాధితో బాధపడుతూన్న నేను ఇంత తొందరగా దాని నుంచి బయటికి రావడం నన్ను ఆశ్చర్యచకితుడిని చేసింది.

అప్పటి నుంచి " నేను పొందిన ఈ ఆనందాన్ని అందరికీ పంచాలి " అని చక్కటి పిరమిడ్ పుస్తకాలు చదువుతూ .. సజ్జనులతో సాంగత్యం చేస్తూ .. నాకు ఎదురైన ప్రతివారికీ ధ్యానం గురించి చెప్పడం ప్రారంభించాను. ప్రతి ఊరూ తిరిగి ధ్యానం చెబుతూ వున్న నన్ను మన పిరమిడ్ సొసైటీస్ వాళ్ళు " పైమా ప్రెసిడెంట్ " గా ఉండమని చెప్పడంతో ఆ బాధ్యతను తీసుకుని అన్ని విద్యాలయాలకూ వెళ్ళి యువత అందరికీ ధ్యానం చెప్పేవాడిని !

2009 ఫిబ్రవరిలో బ్రహ్మర్షి పత్రీజీ తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు రావులపాలెం నుంచి అమలాపురం వరకు " శాకాహార బైక్ ర్యాలీ " ఎంతో అద్భుతంగా మన మాస్టర్లందరూ కలిసి జరిపించారు ! ఈ ర్యాలీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. " ఎంత మంచి పని చేసావురా " అంటూ పత్రీజీ నాకు ఒక ముద్దు పెట్టారు ! అప్పటి నుంచి అది నాకు ‘ పునర్జన్మ ’ గా మారింది ! అప్పటి నుంచి అది నా ఆధ్యాత్మిక పురోగమనం వేగవంతమైంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి జిల్లా అంతటా అలసట లేకుండా ఎంతో పని చేయటం నాకు ఎంతో అనుభవజ్ఞానాన్ని నేర్పించింది, ఎంతో ఆనందాన్ని కలిగించింది. నిజంగా పిరమిడ్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో నేనూ ఒక పిరమిడ్ మాస్టర్‍గా వుండటం ఎంత గొప్ప భాగ్యమో వర్ణించలేను !

పెద్దగా చదువుకోలేకపోయనా ఈ రోజు నేను ఎన్నో కాలేజీల్లో .. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని 56 మండలాల్లో పిరమిడ్ మాస్టర్ " శ్రీ దాట్ల రాయ జగపతిరాజు " గారి ఆధ్వర్యంలో జరిగిన " అహింసా శాంతి ధ్యాన ప్రసార యాత్ర " లో జిల్లా అంతా తిరిగి క్లాసులు చెబుతున్నాను. " అహింసా పరమో ధర్మః " అనే సూత్రాన్ని ఆచరిస్తూ .. " ఈ సృష్టిలో ఏ జీవి కూడా హింసకు గురికాకూడదు " అని చెబుతూ వుంటే నా హృదయం పులకరిస్తుంది, ఆనందం వెల్లివిరుస్తుంది. " సృష్టితల్లి అన్నీ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంది " అనే ఈ యొక్క సూత్రాన్ని నేను అనుసరిస్తూ పూర్తి సమయం ధ్యానానికి అంకితం చేస్తున్నాను.

2010 సెప్టెంబర్ మొదటి వారంలో దాట్ల రాయజగపతిరాజు గారి ఆధ్వర్యంలో జరుగబోతోన్న " అహింసా శాకాహార పాదయాత్ర " రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు .. 600 వందల కిలోమీటర్ల పాటు .. జరగబోయే ఈ యాత్రలో యువత అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.

' బొగ్గు ' గా వున్న నన్ను ' వజ్రం ' గా మార్చిన పిరమిడ్ సొసైటీకి, మరి జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీకి కోటి కోటి ధ్యాన ధన్యవాదాలు !

గణేష్,
తూర్పుగోదావరి జిల్లా

Go to top