" ధ్యానం ద్వారా .. అసామాన్య గృహిణిగా మారాను "

నా పేరు రాజేశ్వరి ; మాది నెల్లూరు.

" సామాన్య గృహిణిని " అయిన నన్ను " అసామాన్య గృహిణి " గా పత్రిసార్ మాటలలో తీర్చిదిద్దబడటం కేవలం అసమాన అనన్య సామాన్య జగద్గురు బ్రహ్మర్షి పత్రీజీ వారి కృప.

నా ధ్యాన జీవితానికి పధ్నాలుగు ఏళ్ళు నిండాయి ! పత్రిసార్‍తో నా అనుబంధం మరువలేనిది, మరుపురానిది ! ఆ రోజుల్లో పత్రిసార్ తరచుగా నెల్లూరుకు వచ్చేవారు ! ధ్యానం క్లాసు పూర్తయిన తర్వాత నా దగ్గరికి వచ్చి " ఎలా వుంది మేడమ్ ఈ రోజు క్లాస్ ? " అని అడిగేవారు. ఆనందం నిండిన కళ్ళతో " చాలా బాగుంది సార్. వంద పేజీలతో నింపాల్సిన విషయాన్ని ఒక చిన్న వాక్యంలో ఇమిడ్చి చెప్పటం మీకే సాధ్యం " అనేదాన్ని.

గంటలు గంటలు ధ్యాన సాధన .. ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు ! సత్సంగం చెప్పటం, వినటం, స్వాధ్యాయపర్వంలో నిరంతరం జ్ఞానుల జ్ఞానంతో నిండిన ఇంగ్లీషు, తెలుగు స్పిరిచ్యువల్ బుక్స్ విస్తారంగా చదవటం .. 1996 లోనే " శ్రీమతి అరుణ " గారి " మెస్సేజెస్ ఆఫ్ ఫార్టీ మాస్టర్స్ " పుస్తకం తెలుగులోకి అనువదించటం .. ఆ తర్వాత " శ్రీ ముక్తానంద పరమహంస " గారి " చిత్‌శక్తివిలాస్ " ఇంగ్లీష్ పుస్తకం తెలుగులోకి అనువదించటం జరిగింది ! చిత్రంగా శ్రీ ముక్తానందగారికి ఆ పుస్తకం 21 రోజులలో తయారయింది. నాకు కేవలం 21 రోజులలో అనువాదం ముగిసింది. పత్రిసార్‌కి ఆ రెండు పుస్తకాలు అందివ్వటం .. నిండు సభలో సార్ నన్ను మెచ్చుకోవటం .. ఆ తర్వాత వెంటనే నెల్లూరు నుంచి ప్రచురితమయ్యే " ధ్యానపురి " కి శ్రీ స్వామి గారితో పాటు నన్ను కూడా " ఎడిటర్ " గా నియమించటం జరిగింది !

నిండు సభలో సార్ నన్ను తన ప్రక్కన కూర్చోబెట్టుకుని " అసామాన్య గృహిణి " అని మెచ్చుకున్నారు కూడా. గడప దాటి బయటికి వెళ్ళని నా చేత వ్రాయించారు ; నేను నిమిత్తమాత్రురాలిని " అన్నాను నెల్లూరు సాయిబాబా మందిరంలో సార్‍తో. సార్ చిరునవ్వు నవ్వారు. " నా జన్మజన్మల గురువు మీరే సార్ " అన్నాను. దానికీ సార్ చిరునవ్వే సమాధానం.

ఎన్నో ధ్యాన కార్యక్రమాలలో పౌర్ణమి, అమావాస్య ధ్యానాలు ఇంట్లో ధ్యానుల చేత చేయించటం .. మండల ధ్యానాలు చేయించటం .. మహిళలు అందరం కలిసి ధ్యానవిహారాలు చేయటం జరుగుతోంది. మా కుటుంబాలు ధ్యానమయం అయ్యాయి.

" ధ్యానమే నా ఊపిరి " గా నా జీవితం తయారయింది. పాంప్లెట్స్ విరివిగా ఇంటింటికీ పంచటం .. గ్రామగ్రామాల్లో ధ్యానం క్లాసులు నిర్వహించటం .. " మైపాడు " లో " శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యానమందిరం " 10*10 సైజులో నిర్మించటం .. పత్రీజీ ఆశీస్సులతో జరిగింది . మండలం రోజులు కేవలం నీరు మాత్రమే త్రాగి వుండటం జరిగింది. మామూలుగా విపరీతమైన ఆకలితో వుండే నాకు ఆ రోజుల్లో ఆకలి వేయకపోవడం వింత అనుభవం.

బెంగళూరు, శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞాలకు హాజరై అంతులేని శక్తినీ, ఆనందాన్నీ నింపుకుని వచ్చాం. ఆ ఉత్సాహంతో మండలం రోజులు ఒకే సిట్టింగ్‌లో మూడుగంటలపాటు విజయవంతంగా ధ్యానం చేయటం జరిగింది. కొత్త ఉత్సాహంతో, కొత్త ఊపిరి పోసుకున్నవారితో కలిసి మా మహిళల గ్రూప్ విస్తారంగా నెల్లూరు జిల్లాలోని గ్రామాలు పట్టణ ప్రాంతాలు అన్నీ ప్రచారం చేయడం క్లాసులు నిర్వహించడం అందరిచేత " ధ్యానాంధ్రప్రదేశ్ " చందాలు కట్టించటం జరుగుతోంది .

ప్రతిరోజూ, ప్రతి క్షణం ధ్యానం కోసమే. పుస్తకాలు, CDలు ప్రసంగాల ద్వారా ప్రతిరోజూ మేమంతా సత్సంగం చెప్పుకుని పంచుకుంటున్నాం సంవత్సరాల తరబడి. " ధ్యానం ద్వారా రోగనివారణ " తో ఎంతోమంది ఆరోగ్యవంతులయ్యారు . చీకటి నింపుకున్నవారంతా వారి జీవితాలలో ఆనందం జ్ఞానం నింపుకుని ధ్యాన సాధన ద్వారా జీవితం ధన్యం చేసుకుంటున్నారు.

అమెరికా వెళ్ళినప్పుడు " పెన్సిల్వేనియా " లోని " ఫిలడెల్ఫియా " లో నా ధ్యానప్రచారం అద్భుతంగా జరిగింది ! ఈ ధ్యాన భాగ్యం వల్ల ఎన్నెన్నో గతజన్మలు చూసుకున్నాను, " నేనెవరు ? ", " ఎక్కడి నుండి వచ్చాను ? ", " ఎక్కడికి వెళ్తాను ? " .. తెలుసుకోవడం, టెలిపతీ, ఆటోరైటింగ్ నిరంతర జ్ఞాన ప్రవాహాలు అందుకోవటం, ఇంకా ఎన్నో ఎన్నో అనుభవాలు .. అంతా ధ్యానమయమే !

- రాజేశ్వరి,
నెల్లూరు

Go to top