" ధ్యానం లేని జీవితం .. ప్రాణం లేని శరీరం "

సికింద్రాబాద్ .. గాంధీ హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా .. వృత్తిరీత్యా ఎంతో బిజీగా వుండే డా || B. ఇందిర గారు వృత్తితో పాటు ధ్యాన ప్రచారాన్ని కూడా అంతే పట్టుదలతో నిర్వహిస్తున్నారు. ఒక డాక్టర్‌గా ధ్యానం వల్ల మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలమనే సత్యాన్ని ఘంటాపథంగా తెలియజేస్తూన్న .. డా || ఇందిర గారికి మరి ఈ ఇంటర్వ్యూలో సహకరించిన సికింద్రబాద్ పిరమిడ్ మాస్టర్ S.రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు ..


రాజశేఖర్ : ధ్యాన జీవితానికి ముందు మీ వివరాలు చెప్పండి !

డా|| ఇందిర : నా పేరు ఇందిర. వృత్తిరీత్యా గైనకాలజిస్ట్‌ను. ప్రవృత్తిరీత్యా సత్యాన్వేషకు రాలిని. మాది అనంతపురం జిల్లా ధర్మవరం. నేను ఎన్నుకున్న తల్లిదండ్రులు దేవరాజ్, జానకమ్మ గార్లు. మా కుటుంబం యావత్తూ, నా చిన్నతనం నుంచీ, సత్యసాయిబాబా భక్తులు కావటంతో నేను పదవతరగతి చదివేరోజుల్లో సత్యసాయిబాబా నాన్నగారికి కలలో కనిపించి " అమ్మాయిని నా అనంతపురం కాలేజీలో ఇంటర్‌మీడియట్ చదివించు " అని చెప్పారట.

ఆ రోజుల్లోనే సెలవల్లో సత్యసాయి విద్యార్ధినులందరూ స్పిరిచ్యువల్ కోర్సెస్ కోసం ఊటీ కాలేజీ యాజమాన్యం తరపున వెళ్ళేవారం. దానిలో " మెడిటేషన్ " కూడా ఒక భాగమే కానీ నేను దాన్ని అప్పట్లో నామమాత్రంగానే చేసేదాన్ని. అంతకుముందు రోజుల్లో కూడా నేను నిద్రలో " ఆస్ట్రల్ ట్రావెలింగ్ " చేసేదాన్ని. కానీ అవగాహన లేకపోవడంతో " ఏవో వింత కలలు " అనుకునేదాన్ని. తర్వాత M.B.B.S చదవాలనుకున్నప్పుడు పుట్టపర్తిలో సత్యసాయిబాబాని కలిసి " నేను డాక్టర్‌ని కావాలి " అని అడిగితే " తప్పకుండా అవుతావు " అన్నారు. నా విశ్వాసమో మరేమో గానీ ఆయన మాటే మంత్రమై నేను ఎంట్రన్స్ బ్రహ్మాండంగా వ్రాయటం M.B.B.S లో చేరటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఇలా డాక్టర్‌ని అయ్యాను.

రాజశేఖర్ : మన పిరమిడ్ ధ్యాన పరిచయం మరి పత్రీజీ పరిచయ విశేషాలు చెప్పండి.

డా|| ఇందిర : ఇప్పటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ " అక్కిరాజు మధుమోహన్ " గారు మా బావగారి కుమారుడే కావడంతో ఆ చుట్టరికంరీత్యా ఆయన నన్ను " శ్వాస మీద ధ్యాస " ధ్యానం చేయమని ప్రోత్సహించేవారు. 1999 డిసెంబరులో కర్నూలులో జరిగిన ధ్యానయజ్ఞానికి ముందు మధు నన్ను కర్నూలు బుద్ధా పిరమిడ్ కు తీసుకువెళ్ళి ధ్యానం చేయించారు. ఆ సమయంలో కింగ్స్ ఛాంబర్ అంతా ఖాళీగా వుంది. నేను ఒక్కదాన్నే కూర్చుని ధ్యానం చేస్తుండగా హఠాత్తుగా నన్ను ఎవరో ఆనుకుని కూర్చున్నట్లు అనిపించింది. అది మగస్పర్శ అనిపించటంతో నేను చిరాకుగా కళ్ళుతెరిచి చూసాను. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు.

ఆ తర్వాత మధుమోహన్ గారు నన్ను యజ్ఞవాటికకు తీసుకువెళ్ళి పత్రిసార్‌ను పరిచయం చేసారు. సార్ ఏమి మాట్లాడలేదు కానీ నా కళ్ళల్లోకి చాలా లోతుగా చాలాసేపు చూసారు. ఆయన కళ్ళ నుంచి వస్తున్న కాంతిపుంజాలను చూడలేక నేను కళ్ళు వాల్చేశాను.

తర్వాత సార్ రాత్రి 12.00 గంటలకు అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారు. కూర్చున్న మరుక్షణం అచ్చం నాలాగానే వున్న ఆకారం పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. నేను కళ్ళు మూసుకునే నిశ్చేష్టురాలినై చూస్తున్నాను. నా ఆ ఆకారం సందుల వెంట, గొందుల వెంట పరుగెత్తి ఒక మందిరం లాంటి ప్రదేశానికి చేరింది. అక్కడ ఒక భారీ ఆకారం కూర్చుని వుందని తెలిసిందే తప్ప ఆయన ముఖం నాకు కనిపించలేదు. " భయపడ్డావా ? " అన్న స్వరం మాత్రం వినిపించింది. ఆ తర్వాత ఆయన మోకాళ్ళ నుంచి క్రింది పాదాలు వరకు కనిపించింది. ఆ పాదాల బొటనవేళ్ళు ఒకదానితో ఒకటి మెలితిరిగి వున్నాయి. " కలిసి వున్నవ్రేళ్ళను విడతీయి " అని వినిపించింది. నేను చాలా ప్రయత్నం చేసాను కానీ నా వల్ల కాలేదు.

అప్పుడు నాకు ఆయన " షిర్డీసాయి " అని తెలిసింది. అలాగె ఒక బొటనవేలు ఈ శరీరం అనీ, రెండవది ఆత్మ అనీ .. ఈ రెండూ కలిసిమెలిసి ఉన్నట్లున్నా అవసరమైనప్పుడు విడతీసే శక్తిని పొందాలనే పాఠం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాననీ తెలిసింది. అంతలోనే " దుఃఖరాహిత్యమే జన్మరాహిత్యం అని తెలుసుకో " అని వినిపించింది. ఆ కంఠస్వరం పత్రిసార్‍దే..

తర్వాత ఇంటికి వెళ్తే నేను ఏనాడు చూడని " సెల్ఫ్ రియలైజేషన్ " అనే పుస్తకం నా టేబుల్ మీద వుంది. దాంట్లోని కొన్ని వాక్యాలు నన్ను బాగా ఆకర్షించాయి. అందులో ఒకటి " ది సోల్, ది ఫామ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యు .. ఆత్మ అంటే భగవంతుని యొక్క స్వరూపం మరి అది నీలోనే వుంది " .. రెండవది " ఇఫ్ యు డిలే డూయింగ్ మెడిటేషన్ ఫర్ ఫైవ్ మినిట్స్, యు ఆర్ వేస్టింగ్ డికేడ్స్ ఇన్ యువర్ లైఫ్ .. నువ్వు ధ్యానం చేయటం ఐదు నిమిషాలు ఆలస్యం అయితే నీ జీవితంలో కొన్ని దశాబ్దాలు వ్యర్థం అయినట్లే . "

ఇక ఈ సందేశాల పట్ల నేను సుదీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాను. నా భర్త చాలా మంచివారు. మాది చాలా అనుకూల దాంపత్యం. నా పిల్లలు కూడా యోగ్యులే. సిరిసంపదలు కూడా మాకు తగినన్ని వుండేవి. మాది చింతలు లేని చక్కని కుటుంబం. అన్నీ వుండి కూడా ఏదో తెలియని వెలతి .. ఏదో తెలుసుకోవాలనే ఆర్తి అనుక్షణం నన్ను వెంటాడుతూ వుండేవి. ఈ లోటు వలనేనేమో నేను ధ్యానానికి బాగా దగ్గరయ్యాను. దానికి తోడు పరమయోగ్యుడైన నా భర్తకు భరించలేని వెన్నునొప్పి మొదలైంది. ఆపరేషన్ తప్పనిసరనీ, అప్పుడు కూడా తగ్గుతుందని చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. అప్పుడు ఆయన గంటలు, గంటలు కర్నూలు పిరమిడ్‌లో కూర్చుని రెండునెలలు ధ్యానం చేసి ఆ నొప్పిని శాశ్వతంగా పోగొట్టుకున్నారు. దాంతో మా ఇంటిల్లిపాదికీ ధ్యానం యొక్క అవసరం తద్వారా ఆనందం కొట్టొచ్చినట్లు తెలిసి మా కుటుంబం అంతా ధ్యానకుటుంబం అయిపోయింది.

రాజశేఖర్ : పత్రిసార్‌తో మీకున్న అనుభవాలు చెప్పండి.

డా|| ఇందిర : 2000 సంవత్సరంలో నేను కర్నూలు నివాసిని కావటం .. పత్రిసార్ కూడా కర్నూలులోనే వుండటం .. నాకు బాగా కలిసివచ్చింది. పత్రిసార్ ధ్యానప్రచారరీత్యా కర్నూలులో ఎక్కువ ఉండేవారు కాదు. వస్తే మాత్రం తప్పనిసరిగా క్లాసు వుండేది. ఇక నేను ప్రపంచాన్నే మరచి ఆయన క్లాసులకు వెళ్ళేదాన్ని. అంతటి సుమధుర విజ్ఞాన వీచికలు అవి అయితే ఆయన ఎంత తేలిక భాషలో చెప్పినా కొన్ని అర్థమయ్యేవి కావు. మరి మన లోకాతీతమైన సబ్జెక్టులు కదా అవి ; దాంతో చిన్నపిల్లలు కూడా అడగనంత అమాయకంగా అయోమయమైన ప్రశ్నలు అడిగేదాన్ని. సార్ ఎంతో ఓపికగా, ఓర్పుగా సందేహనివృత్తి చేసేవారు. ఏనాడూ విసుక్కునేవారు కాదు.

ఆయనతో కలిసి వుండటం అనేది అప్పుడూ ఇప్పుడూ కూడా అత్యంత ఆనందదాయకమైంది .. ఆత్మీయపూర్వకమైంది కూడా " ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే ఆయనకు అంత ఎక్కువ ఆత్మీయులమైపోతాం " అనేది నిర్వివాదాంశం. అప్పటి రోజులలో ఆయన చుట్టూ పదిమందే వున్నా .. ఇప్పుడు లక్షలమంది. ప్రాపంచిక కోరికలకు అంతూ పొంతూ వుండదు కాబట్టి వాటిని కొంతవరకైనా తగ్గించుకోమని చెప్పేవారు. గంటల తరబడి ధ్యానం చేయాలనుకోవటం, పిరమిడ్లు కట్టించాలనుకోవటం కూడా కోరికలే కదా అంటే " అవి కోరికలు కావు ; పుట్టిన ప్రతివారి కర్తవ్యం " అనేవారు.

ఆయనను జాగ్రత్తగా గమనిస్తూ వుంటే ప్రతి కదలికలోనూ మనం ఎన్నో నేర్చుకోవచ్చు. తాను చేయగలిగినదాన్ని మాత్రమే చెప్పటం ఆయన ప్రత్యేకత. అవసరమైనప్పుడు ఎందరికైనా సహాయం చేయటంలో ఆయనంత ఆపద్భాందవులు మరి కారుణ్యమూర్తి మరెవ్వరూ వుండరు.

రాజశేఖర్ : ఒక ఉదాహరణ చెప్పగలరా ?

డా|| ఇందిర : ఒక్కటేం ఖర్మ. వంద చెప్పగలను. కానీ మీరు " ఒక్కటే " అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఒకసారి పత్రిసార్ మరో ఇరవై మందిమి కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళాం. సార్ స్పీడ్ మీకు తెలుసు కదా బస్సు దిగటం ఆలస్యం .. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్నారు. ఆయన వేగాన్ని అందుకోలేక అందరూ పరుగులు పెట్టి ఆయనను కలుసుకున్నారు. నా చేతిలో ఒక బరువైన సూట్‌కేస్ వుంది. దాన్ని మోయలేక నేను చాలా వెనుకబడిపోయాను. వాళ్ళందరూ దాదాపుగా కనుమరుగవుతున్న తరుణంలో సార్ హఠాత్తుగా వెనుతిరిగి నన్ను చూసి ‘ జెట్ ’ వేగాన్ని మించి నా వైపుకు పరుగెత్తి రావటం మొదలుపెట్టారు. ఆయనతో పాటు వున్న మన ధ్యానులు, చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చేష్టలుడిగి చూసేంత ' రన్నింగ్ రేస్ ' అంది. మిగతావారు కూడా పడుతూ లేస్తూ పరుగెత్తుకొచ్చారు. ఇంతకీ ఆయన వచ్చింది నా సూట్ కేస్ మోయటానికి. ఇంతటి కరుణాసముద్రుడు మరొకరు వుండటం అనేది జరగని పని. తలచుకున్నప్పుడల్లా ఇప్పటికీ నా కళ్ళవెంట నీళ్ళు కారతాయి.

ఎప్పుడైనా మా ఇంటికి వచ్చేవారు. భోజనం చేసేవారు. ఎంతో ఆత్మీయంగా వేల సంవత్సరాలుగా అనుబంధం వున్న వ్యక్తిలా ఉండేవారు. సకల ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైనా సర్దుకుపోయే తత్వం ఆయనది. కటికినేలనైనా, పట్టుపరుపునైనా ఆయన సమానంగా స్వీకరించేవారు. ఇప్పుడు కూడా అంతే. " నేను ఒక గురువుని " అని కానీ, " ప్రత్యేకమైన సదుపాయాలు కావాలి " అని కానీ ఆశించని అసాధారణమైన పరమోన్నతులు మన పత్రీజీ. సింపుల్ లివింగ్, మైత్రేయబుద్ధత్వం, వర్తమానంలో జీవించటం .. ఇవన్నీ కూడా ఆయనకు వెన్నెతో పెట్టిన విద్యలు.

జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా అనుభవించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఆయనకు వంట చేయటం అన్నది మహా సరదా; కష్టపడటం మహా సరదా. ఎండలో ఎంత దూరమైనా నడవటం సరదా. క్రికెట్ చూడటం, సినిమాలకు వెళ్ళడం .. ఇలా అదీ ఇదీ అని కాదు ప్రతి క్షణమూ అది ఎలాంటిదైనా సరదాగ, సంతోషంగా తీసుకోవటం ఆయనకు ఒక్కరికే చెల్లుతుంది.

అసాధ్యాలను సుసాధ్యాలు చేయటం ఆయనకు ఎంతో ఇష్టం. దానికి ఎన్నో ఉదాహరణలు. కర్నూలు దగ్గర " లక్ష్మీజగన్నాధగట్టు " చూడండి. ఇప్పుడు ఎలా వుందో .. ఒకప్పుడు మాకు తెలిసిన జగన్నాధగట్టుకూ దీనికీ ఎంత వ్యత్యాసం అంటే .. ఎండకూ వెన్నెలకూ వున్నంత వ్యత్యాసం. అసలు పత్రిసార్ ఎక్కడ వుంటే అక్కడ నూతనోత్సాహాలు వెల్లివిరుస్తాయి. నాకైనా అంతే .. ఎవ్వరికైనా అంతే ...

రాజశేఖర్ : సంవత్సరాల తరబడి చేసిన ధ్యాన ఫలితంగా మీ వృత్తిలో వచ్చిన వ్యక్తిగత మార్పులు ఏమిటి ?

డా|| ఇందిర : కావలసినన్ని వున్నాయి. వృత్తిలో నైపుణ్యత అపరిమితంగా పెరిగింది. చేసే ఆపరేషన్ పట్ల నూటికి నూరుశాతం అంకితభావం ఏర్పడింది. ఎంతోమంది ఇతర డాక్టర్లలా ఒత్తిడితో కాకుండా అలవోకగా, ఆనందంగా చేయగల నిబద్ధత, సమర్థత వచ్చాయి.

రాజశేఖర్ : ధ్యానం నేర్చుకోకముందు మీ జీవితంలో ఏమైనా విషాద సంఘటనలు జరిగాయా ?

డా|| ఇందిర : ఒకే ఒక్కటి జరిగింది. నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. ఆయన మీద ఈగ వ్రాలినా సహించేదాన్ని కాదు. ఆయనకు కూడా నా పైనా అవ్యాజమైన ప్రేమానురాగాలు వుండేవి. కాస్తంత వయస్సు మీరాక ఆయనకు అతిభయంకరమైన వ్యాధి వచ్చింది. ఎందరు డాక్టర్ల చుట్టూ తిరిగినా ఎవ్వరివల్లా కాక చేతులెత్తేస్తారు. మలం, మూత్రం అన్నీ మంచం పైనే. ఘడియ ఘడియకూ మంచం మీద ఎగిరెగిరి పడుతూ ఉండేవారు. ప్రతి క్షణం ఆయాసపడుతూ ఉండేవారు. ఆయన నరకయాతన స్థితిని అనిక్షణం గమనిస్తూ వున్న నాకు కన్నీరు ఆగేది కాదు. ఆయన దగ్గరకు వెళ్ళలేక, వెళ్ళకుండా ఉండలేక కన్నీరుమున్నీరుగా ఏడ్చేదాన్ని.

పదేపదే నా మనస్సు " మెర్సీ కిల్లింగ్ " మీదకు వెళ్తూ వుండేది. చట్టబద్ధత కాకపోవటం ఒక కారణం కాగా, చేతులారా మా నాన్నను చంపుకోలేక నిస్సహాయురాలిగా ఉండేదాన్ని. ఎంతోకాలం తర్వాత ఒకరోజు పూర్తి మౌనం పాటించి షిర్డీ సాయిబాబాకు చెప్పుకున్నాను. " నువ్వే కనుక కరుణామయుడివి అయితే సాధారణ మానవుల మీద, నాలాంటి నిస్సహాయుల మీద నీకు ప్రేమ వుంటే .. తెల్లవారేసరికి ఈ భయంకర బాధ నుంచి మా నాన్నకు విముక్తి కలిగించు " అని.

మరుసటిరోజు పొద్దున్నే మా నాన్న శరీరం నిస్తేజంగా పడివుంది. ఎంతో దుఃఖం వచ్చినా ఆయన ప్రతి క్షణం పడ్డ బాధ గుర్తుతెచ్చుకుని " ఫర్వాలేదులే " అని సరిపెట్టుకున్నాను. అయితే ఆయన భౌతికశరీరం కాలిపోయింది కానీ ఆయన సూక్ష్మదేహం నా చుట్టూ తిరుగుతూ వుండేది. అప్పట్లో ఆత్మజ్ఞానం అంతగా లేకపోవటం వలన నాకు అంతా అయోమయంగా వుండేది. కానీ నిరంతర ధ్యాన సాధన వల్ల అసలు సంగతి తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను.

రాజశేఖర్ : ఏమిటి ఆ అసలు సంగతి ?

డా|| ఇందిర : " ఒక ఆత్మను .. అది వచ్చిన పని పూర్తిచేసుకోనివ్వకుండా .. అలా అర్థాంతరంగా మరణశాసనాన్ని మనం లిఖించకూడదు ; అది సృష్టి రచనకే విరుద్ధం " అని ధ్యానంలో మాస్టర్స్ చెప్పారు. " జంతుజాలం పట్ల, పక్షిజాతుల పట్ల మనం చూపే హింసాప్రవృత్తి కూడా ఇలాంటిదే " అని చెప్పి .. " అది షిర్డిసాయి ఇచ్చిన మరణం కాదు ; అంత గొప్ప మాస్టర్లు ఎప్పుడూ ఇలాంటి పిచ్చి కోరికలను పట్టించుకోరు " అనీ చెప్పారు. అంతేకాదు నా ఆత్మశక్తి వల్లనే ఆయన ప్రాణం వదలాల్సి వచ్చిందని కూడా చెప్పారు. దాంతో నా బాధ అంతా ఇంతా కాదు.

రాజశేఖర్ : మరి ఏం చేసారు ? పత్రిసార్‌కు చెప్పారా ?

డా|| ఇందిర : లేదు. నేను చేసిన తప్పు పనికి పత్రిసార్‌ను బాధ్యత తీసుకోమని కోరటానికి మనస్కరించలేదు. " ఎవరి తలనొప్పిని వారే, ఎవరి క్యాన్సర్‌ను వారే నయం చేసుకోవాలి " అని పత్రిసార్ నోట చాలాసార్లు వినటమే దానికి కారణం. స్వీయధ్యానసాధనతోనే మా నాన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకున్నాను.

మా తల్లితండ్రుల సంతానమంతా అన్నివిధాలా హాయిగా వున్నాం. మాతో పోల్చుకుంటే మా తమ్ముడు ఒక్కడే కాస్తంత తక్కువ దశలో వున్నాడు. తాను దేహంతో ఉన్నప్పుడే తమ్ముడిని కూడా మంచి స్థితిలో చూడాలనే నాన్న తాపత్రయం తీరలేదు. తాను బ్రతకాల్సినంత కాలం వారిని నేను బ్రతకనిచ్చి వుంటే వాడికి ఏదైనా ఏర్పాటు చేసేవారేమో .. దానికి అవకాశం లేకుండా నేను చేసిన అనాలోచితమైన పని వలన ఆయన రెండు విధాలా నష్టపోయారు. " నా కాలం తీరకపోవటం వలన కొంత, తమ్ముడి స్థితిని బాగుచేయలేకపోవటం వలన కొంత, నా ఆత్మ క్షోభిస్తోంది " అని బాధతో చెప్పారు.

వెంటనే నేను ధ్యానంలో కూర్చుని చేసిన మొదటి పని నాన్నకు ఆత్మక్షమాపణలు చెప్పి .. తమ్ముడికి తప్పకుండా మంచిస్థితినీ, వసతినీ ఏర్పాటుచేస్తానని ప్రమాణం చేసాను. మరుక్షణం నాన్న ఆత్మ శరవేగంతో ఎగిరిపోయింది. అది ఎక్కడికి వెళ్తోందో తెలుసుకోవాలనే కుతూహలంతో నేను కూడ ఆస్ట్రల్ బాడీని రిలీజ్ చేసి వెంబడించాను. కానీ దానికి ఆస్ట్రల్ కార్డ్ కనెక్షన్ లేకపోవడం వలన, నేను ఇంకా శరీరధారణగా వున్న కారణంగా ఆ వేగాన్ని అందుకోలేక తిరిగి శరీరంలోకి వచ్చేశాను. ఇక అప్పటి నుంచి నేను కాస్త మనశ్శాంతిగా ఉంటున్నాను.

రాజశేఖర్ : మీ పూర్వజన్మలు చూసుకున్నారా ?

డా|| ఇందిర : ఆహా సలక్షణంగా చూసుకున్నాను. నేను క్రితం జన్మలో ఒక యోగిని. మగజన్మ తీసుకుని ' బ్రహ్మచారి ' గా వున్నాను. అప్పటి నా అందమైన కుటీరం, నా నిత్యావసరాలైన మట్టికుండలు మొదలైనవి ఇప్పుడు కూడా ఎప్పుడు తల్చుకుంటే అప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ యోగజీవితం వల్లనే పత్రిసార్ సాంగత్యం లభించటం, మొదటిరోజులలోనే ఆలోచనారహితస్థితి .. అద్భుత అనుభవాలు కలగటం జరిగిందని అనిపిస్తూ వుంటుంది. మరో జన్మలో ఈ నా భర్తకే భర్యగా వున్నాను. చాలా పేద స్థితి మాది. కూలీ, నాలీ చేసుకుని బ్రతికేవారం. అప్పుడు కూడా అన్యోన్యదాంపత్యం మాది. చిత్రంగా నాకు అప్పుడు ఏ రంగు చీరలు ఇష్టమో ఇప్పుడు కూడా అవే రంగు చీరలు ఇష్టం. ముఖ్యంగా " ఎరుపురంగు " అప్పుడూ ఇప్పుడూ కూడా చాలా చాలా ఇష్టం.

రాజశేఖర్ : మరి ఇప్పుడు ధ్యానంలో మీ ఆస్ట్రల్ బాడీని చూసుకోలేదా ?

డా|| ఇందిర : ఇన్ని చేయాలనే కోరిక ఉన్నదాన్ని అది చేయకుండా వుంటానా ? ఎక్కువసార్లు మా భార్యాభర్తలిద్దరమూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రక్కప్రక్కన కూర్చుని సూక్ష్మశరీరయానం చేస్తూంటాం. అలాంటి సందర్భంలో రెండుమూడుసార్లు నేను శరీరంలోంచి బయటకు వచ్చినా మరి నా భర్త గారి స్థూలదేహాన్నికూడా ఒకింత కుతూహలం, ఉత్సుకతతో చూసేదాన్ని. " రెండు దేహాలు కూడా ‘ మావి ’ కావు .. దేహాలు కేవలం తాత్కాలిక నివాసాలు " అనిపించేది. డాక్టర్‌గా అంతర్ అవయవాలనూ, ధ్యానిగా అంతర్ ప్రపంచాన్నీ చూడగలిగే భాగ్యం దక్కింది నాకు.

ఒక డాక్టర్‍ను అయి వుండి మెడిటేషన్ ప్రాముఖ్యత ప్రతి పేషెంట్‌కు నొక్కి నొక్కి మరీ చెప్పటంతో ప్రతివారికీ ఆరోగ్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా ఇవ్వగల అవకాశం వచ్చింది. " దీనికోసమే నేను డాక్టర్‌ని అయ్యాను " అని తర్వాత అంతర్వాణి కూడా తెలిపింది.

ధ్యానంలో మాస్టర్ స్థితిని పొందాక నేను చేయబోయే ఆపరేషన్‌లో ఏమేం కాంప్లికేషన్స్ వస్తాయో ముందే తెలిసేది. దీనివలన తల్లికి ప్రసవ సమయంలో B.P., మూర్ఛ లాంటివి రాకుండా, మరి అంతేకాకుండా గర్భస్థ శిశువు ఎదుగుదలలో లోపం వుంటే వెంటనే ముందు జాగ్రత్తలు తీసుకోగలిగేదాన్ని. గర్భంతో వున్న ఏ స్త్రీ అయినా ముందు నుంచే ధ్యానం చేస్తే ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా కూడా లాభం పొందుతారనీ, ధ్యానం వలన తల్లుల మానసిక, శారీరక స్థితులు బాగుండటమే కాక మాస్టర్స్ సహాయ సహకారాల వలన యోగులు పుట్టే అవకాశం కూడా వుందని వారికి సవిస్తారంగా తెలియ జేస్తుంటాను.

రాజశేఖర్ : డాక్టర్ వృత్తిలో భాగంగా ఇంకా ఏమైనా అద్భుతాలు వున్నాయా

డా|| ఇందిర : ఒకసారి రాత్రి 2.00 గంటల వరకు కుటుంబనియంత్రణ ఆపరేషన్స్ చేసి అలసిపోయి పడుకున్నాను. మరుసటిరోజు 8.00 గంటలకు మరో పెద్ద ఆపరేషన్ వుంది. నెమ్మదిగా నిద్రపట్టి మళ్ళీ తెల్లవారుజాము 4.00 గంటలకు మెలకువ వచ్చింది. అప్పుడు వచ్చింది అనుమానం " పొద్దున్నే ఆపరేషన్ వుంది కదా ఆపరేషన్ థియేటర్ అంతా శుభ్రం చేసి సిస్టర్స్ రేపటి ఆపరేషన్‍కు కావలసిన సామగ్రి పెట్టారో లేదో " అని. మళ్ళీ ఇలా నిద్రపట్టడం .. నా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయి థియేటర్‌కు వెళ్ళి అక్కడ క్లీన్‌లీనెస్‌నూ, సిద్ధం చేసిన సామగ్రినీ చూసి తృప్తిపడింది. అప్పుడు థియేటర్‌లో టైమ్ 2:00 గంటలు చూపిస్తోంది. " ఇప్పుడు 4:00 గంటలు అయినట్లు ఇంట్లో చూసాను కదా ఇక్కడ 2.00 గంటలు చూపిస్తోంది ఏంటి రాత్రి 2.00 గంటలకు కదా నేను ఇంటికి వెళ్ళాను. అదే టైమ్‍ను 4.00 గంటలకు చూపిస్తోంది ఏంటి ఈ గడియారం ? " అనిపించగానే .. " ఆస్ట్రల్ బాడీకీ, ఆస్ట్రల్ లోకాలకూ ' టైమ్ ' అనేది వుండదు. కాబట్టే నువ్వు శరీరంతో చూసిన ఆ రెండు గంటలు ఇప్పుడూ కనిపిస్తోంది " అని నా అంతర్వాణి నుంచి సందేశం వచ్చింది. ఇలా ఎన్నో, ఎన్నో అనుభవాలు.

మనందరికీ బాగా తెలిసిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ " పాల్ విజయ్‌కుమార్ " గారి తల్లి మరణం ఒక సంవత్సరం ముందుగానే తేదీ, నెలతో సహా కనిపించటం .. అది పాల్ సర్‌తో చెప్పటం .. ఆమె సరిగ్గా ఆ తేదీకే మరణించటం .. ఒక దాని వెనుక ఒకటి జరిగిపోయాయి. మా అత్తగారి మరణం తేదీ, టైమ్ కూడా ఐదురోజుల ముందే తెలిసింది. అలాగే పాల్ విజయ్‌కుమార్ గారి భార్య డెలివరీ అప్పుడు విపరీతంగా నొప్పులు వచ్చి ఆమె B.P. బాగా పెరిగిపోయింది. ఏ డాక్టర్ తక్షణ కర్తవ్యమైనా వెంటనే ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీయాలి. అలా చేసినందువల్ల శిశువు ఖచ్చితంగా చనిపోతుంది. కానీ మాకు పెద్ద ప్రాణం ముఖ్యం. కానీ నేను ఆమెను మౌనంగా నొప్పిని భరించి 2.00 గంటలు మెడిటేషన్ చెయ్యమన్నాను. ఆమె అక్షరాలా పాటించింది. తర్వాత నాలుగున్నర కేజీల అత్యధిక బరువుతో చాలా చక్కని బాబు పుట్టాడు. మెడికల్ సైన్స్‌కు అతీతమైన " స్పిరిచ్యువల్ సైన్స్ " ఎంత బాగా పనిచేసిందో తెలిసి ఇలా నా వృత్తిలో నా మెడిటేషన్ నాకు ఎంతగానో ఉపకరిస్తోంది.

నేను ఒకసారి నాలుగైదు గంటలు ఆపరేషన్ థియేటర్ లోనే వుండి ఎన్నో మెలకువలు తీసుకోవలసిన సందర్భం వచ్చింది. చాలా క్లిష్టమైన ఆపరేషన్ అది. ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా తల్లీబిడ్డలు ఇద్దరూ చనిపోయే పరిస్థితి. నేను ఆ పనిలో నిమగ్నం అయ్యాను. ఇంతలోనే నేను మాత్రమే చూడవలసిన మరో క్లిష్టమైన స్థితిలో వున్న గర్భిణీకి నొప్పులు తీవ్రంగా వస్తున్నాయని కబురు వచ్చింది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ముందు చూస్తే నుయ్యి .. వెనుక చూస్తే గొయ్యి. వెంటనే నా ధ్యానశక్తిని ధారపోసి " ఆ రెండవ పేషెంట్‌కు నేను వెళ్ళేవరకు నొప్పులు ఆగిపోవాలి " అని సంకల్పించాను. ఆ వెంటనే ఆమె నొప్పులు ఆగిపోవటం .. రెండు ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తిచేయటం జరిగింది.

ఇంటికి వెళ్ళి విశ్రాంతి తిసుకున్న తర్వాత నా వృత్తిలో నాకు ఎంతో సహాయం చేస్తున్నఆస్ట్రల్ మాస్టర్స్‌కూ, మన పత్రిసార్‌కూ వేలవేల కృతజ్ఞతలు తెలియజేసుకుని ధ్యానంలో కూర్చున్నాను. తక్షణం నా మూలాధారం నుంచి ఉవ్వెత్తున ఉబికి ఉబికి వస్తున్న పాతాళగంగ లాంటి వైబ్రేషన్ పైపైకి ఎగిసి ఆకాశగంగ లాగా నా సహస్రారాన్ని దాటి ప్రవహించింది. నా శరీరంలోని ప్రతి అణువూ పరమాణవుగా .. పరమాత్మగా తోచింది. ఆ రోజు నుంచి పదిహేనురోజుల పాటు నేను ఒక ఆనందస్వరూపిణిగా మారిపోయాను. పగలు -రాత్రి తేడా లేకుండా నేను చూస్తున్న ప్రతి ప్రాణి - ప్రకృతి కూడా నాకు ఎనలేని ఆనందాన్ని ప్రసాదించాయి తర్వాత తర్వాత నెమ్మదిగా తగ్గిపోయి నార్మల్‌గా అయిపోయాను.

రాజశేఖర్ : అన్నీ " ఆస్ట్రల్ " అనుభవాలు చెబుతున్నారు ; " భౌతికం " గా ఏమైనా చెప్పండి

డా|| ఇందిర : కర్నూలులో బాగా పేరు పొందిన మసీదు ఒకటి వుంది. దానిలోకి ప్రవేశించటానికి స్త్రీలకు అనుమతి లేదు. నాకు దాని లోపలికి వెళ్ళి ధ్యానం చేయాలనిపించి మసీదు పెద్దలను అనుమతి అడిగాను. ఎన్నో తర్జన భర్జనల తర్వాత వాళ్ళతో సహా నేను లోపలికి వెళ్ళటానికి ఒప్పుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ధ్యానం గొప్పతనం వివరంగా చెప్పి అందరినీ కూర్చోబెట్టాను. గంట తర్వాత నేను " o.k. " చెప్పిన తర్వాత మత పెద్దలందరూ లేచి " మేమందరం ఏనాడు పొందనంత శూన్యస్థితిని పొందాము ; మీరు ఎప్పుడు వచ్చినా స్వాగతం " అనటం నాకు మహదానందాన్ని ఇచ్చింది.

రాజశేఖర్ : " పాతాళలోకాలు " ఏమైనా చూసారా ?

డా|| ఇందిర : ఒకసారి అచ్చం గ్లోబు లాగా వున్న మన భూమి పైభాగంలో కూర్చున్నాను. నా కంటిచూపు భూమి లోపల వున్నఎన్నో పొరలను ఛేదించుకుంటూ దూసుకుపోయింది. అక్కడ కూడా అనేక వింత జీవులనూ సముద్రం లోపలి లోక జీవులనూ చూసాను. అక్కడ నాకు మత్స్యకన్య కూడా కనిపించింది.

రాజశేఖర్ : " పాతాళలోకాలు " ఏ మైనా చూసారా ?

డా|| ఇందిర : పెద్దబాబు పేరు " వంశీ " 25 సంవత్సరాలు. M. Tech IIT పూర్తిచేసి U.S.A లో ఉద్యోగం చేస్తూ M.B.A.కు ప్రిపేర్ అవుతున్నాడు. రెండవ బాబు " ప్రశాంత్ ". 17 సంవత్సరాలు. ఏడు సంవత్సరాల చిన్న వయస్సు నుంచే ధ్యానం చేస్తున్నాడు. 2001 కర్నూలు ధ్యాన మహాయజ్ఞంలో ధ్యానం గురించి అనర్గళంగా ప్రసంగించి పత్రిసార్ ప్రశంసలు అందుకున్నాడు. " బుద్ధుడికి వున్న సహస్ర వెలుగురేఖలలో వీడు ఒక వెలుగురేఖ " అని పత్రిసార్ చెప్పటంతో మా భార్యభర్తలం పరమానంద భరితులమయ్యాం.

పెద్దబాబుకు ఏడు సంవత్సరాల క్రితం IIT లో సీటు కోసం ప్రయత్నించాం. ఎంతో మెరిట్ స్టూడెంట్ వాడు. ఇంటర్‌మీడియెట్‌లో తాను ఎంతో బాగా వ్రాశాను అనుకున్న కెమిస్ట్రీలో 16 మార్కులు వచ్చాయి. క్రింద కోర్టులో కేసు వేస్తే కొట్టివేశారు. మా అందరి బాధ అంతా ఇంతా కాదు. అంత బాధలోనూ నా భర్త " దీని అంతు ఏంటో తేల్చుకుంటాను " అని ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో ఆయనకు మాస్టర్స్ కనిపించి " రాజూ నువ్వు వెంటనే డైరెక్టుగా వెళ్ళి చీఫ్ జస్టీస్‌ను కలువు " అని చెప్పారట. చీఫ్ జస్టీస్ కోర్టులో మేము కేసు వేయటం, వేసిన ఇరవైనాలుగుగంటలలో మాకు అనుకూలంగా తీర్పు రావటం జరిగింది అందరితోపాటే మావాడు కూడా సరైన సమయంలోనే IIT లో చేరాడు.

ధ్యానం వలన ఎన్నెన్ని లాభాలో చెప్పలేము " ఈ మంచి పిల్లలు మా ఇద్దరినీ ఎందుకు ఎన్నుకున్నారు ? " అని మాస్టర్సను ధ్యానంలో అడిగితే .. " మీరిద్దరూ ఈ దేశంలో ధ్యాన ప్రచారం చేయటానికి పుట్టారు కాబట్టి .. వారిద్దరూ విదేశాలలో ధ్యాన ప్రచారం చేయటానికి జన్మించారు " అని చెప్పారు ఇప్పటికే మా పెద్దబాబు IIT లో ఇంజనీరింగ్ పూర్తిచేసి U.S.A లో విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నాడు.

రాజశేఖర్ : చాలా చాలా థాంక్స్ మేడమ్ మీ ఈ అనుభవాలు " ధ్యానాంధ్రప్రదేశ్ " పాఠకులకే కాకుండా .. ఇప్పుడిప్పుడే ధ్యానం మొదలుపెట్టిన డాక్టర్లకూ, ద్యానం అంటె ఏమిటో తెలియని డాక్టర్లకు.. కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. చివరిగా మీ సందేశం? మరి ఎవరైనా ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులు ఏవైనా సలహాల కోసం మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మీ చిరునామా ఇస్తే .. ముఖ్యంగా మహిళలు ధ్యానం మరి వైద్యపరంగా కూడా తమకు కలిగె సందేహాలకు మీ సమధానాలు పొందితే బావుంటుంది.

డా|| ఇందిర : తప్పకుండా. ఒక్క వైద్య విద్యేకాదు. ఎవరెవరు ఏ ఏ వృత్తులలో వున్నా ధ్యానం ద్వారా .. ధ్యాన ప్రచారం ద్వారా అత్యంత నైపుణ్యత, నాణ్యత వస్తుందని గ్రహించాం. ధ్యానం లేని జీవితం ప్రాణం లేని శరీరంగా భావించాలి.

ధ్యానం అక్షయపాత్ర సరిగ్గా చేయాలే కానీ సాధ్యం కానిది అంటూ వుండదు. శ్వాస మీద నిరంతరం ధ్యాస వుంచితే ప్రపంచాన్నే కాదు విశ్వాన్నే జయించవచ్చు. ప్రతిఒక్కరూ ధ్యానం చేస్తే తమకు తాము సుఖంగా జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవటమే కాక చుట్టూ ఉన్నవారిని కూడా సుఖసంతోషాలతో జీవింపజేయగలరు. లోకా సమస్తా సుఖినోభవంతు. సకల లోకప్రాణి కళ్యాణ ప్రాప్తిరస్తు.

- Dr. B. ఇందిర,
16-11-408, ముసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్
ఫోన్ : 9440329097

Go to top