" ధ్యాన శక్తివల్లే .. ఆరోగ్యం "

 

నా పేరు A.V. సుబ్బారెడ్డి.

నేను మదనపల్లిలో పీడియాట్రిక్ మరియు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల తో కూడిన 22 పడకల " భవ్య చిన్న పిల్లల ఆసుపత్రి " ని మరి " మదనపల్లి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ " అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ధ్యాన మార్గంలో నా వయస్సు కేవలం ఒకటిన్నర సంవత్సరాలు.

మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి పత్రీజీ ని 2008 వ సంవత్సరం నవంబర్ 3 వ తేదీన కడప జిల్లా " తాళ్ళపాక " లో కలిసే భాగ్యం నాకు లభించింది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి 10.30 వరకు పత్రిసార్‌తో పాటు వున్నాను . ఉదయం నుంచి సాయంత్రం లోపల పత్రిసార్‌తో వున్న ప్రతిక్షణం, పత్రిసార్ యొక్క ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి కదలిక నాకు ' సాయిబాబ ' లాగా అనిపించాయి ! అంతకముందు నేను చదివిన " సాయి లీలామృతం " లోని సంఘటనలు నాకు కళ్ళకు కట్టినట్లుగా కనిపించాయి ! ఆ రోజుతో నా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి కొరత తీరింది. పత్రిసార్ నా గురువు ! ఇక మీదట పత్రిసార్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటా, ప్రతి ఆదేశం నాకు వేదవాక్యం, పత్రిసార్ ఏం చెబితే అది చేయడమే నా పని. పత్రిసార్ పాదాల చెంత నా జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను.

ఒక డాక్టర్‌గా వైద్యశాస్త్రం గురించి తెలిసిన వ్యక్తిగా, జబ్బులు ఏ విధంగా వస్తాయనే పాథోఫిజియాలజీ .. pathophysiology .. తెలిసిన వ్యక్తిగా, మందులు వాడినప్పుడు అవి శరీరంలో ఏ విధంగా పనిచేసి జబ్బులు తగ్గిస్తాయో తెలిసిన వ్యక్తిగా, అదే సమయంలో ధ్యానిగా ధ్యానం యొక్క ప్రయోజనాలు తెలిసిన వ్యక్తిగా, ధ్యానం చేసినప్పుడు, ఆలోచనారహితస్థితికి వెళ్ళినప్పుడు మన మెదడులో, శరీరంలో, ఎండోక్రైన్ గ్లాండ్స్‌లలో శాస్త్రబద్ధంగా జరిగే మార్పులను తెలుసుకుని, వీటన్నింటీనీ బేరీజు వేసుకున్న తరువాత " ధ్యానం సర్వరోగ నివారిణి " అనీ .. " సరైన ధ్యాన సాధన చేస్తే జలుబు నుండి క్యాన్సర్ వరకు అన్ని రకాల జబ్బులనూ శాస్త్రబద్ధంగా మరి ఆధ్యాత్మికంగా పూర్తిగా నయం చేసుకోవచ్చు " అనీ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.

" జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణాం " అన్నారు కదా, ధ్యానం వల్ల జ్ఞానం వలన సర్వకర్మలు కాలి బూడిదై మనం కర్మవిముక్తులు అవుతాం. " పూర్వజన్మకృతం పాపం, వ్యాధిరూపేణ పీడ్యతే " గత జన్మలలోని పాపకర్మలు ఈ జన్మలో రకరకాల రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి. ధ్యానం ద్వారా మనం జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానంలో సర్వపాపకర్మలు దగ్ధమై, మనం ఆ పాప కర్మల నుంచి విముక్తులై వ్యాధుల బారి నుంచి రక్షించబడతాం ; మరి ధ్యానస్థితిలో ఉన్నప్పుడు అలోచనా రహితస్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవేశించే కాస్మిక్ ఎనర్జీ .. విశ్వశక్తి .. శరీరంలోని అన్ని కణాలనూ ఉత్తేజితం చేయడం వలన శరీరంలో అన్ని అవయవాల సామర్థ్యం పెరుగుతుంది ; జబ్బులు నయం కావడం జరుగుతుంది ; రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ధ్యానం వల్ల జబ్బులు నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని వైద్య విజ్ఞాన శాస్త్రబద్ధంగా కూడా వివరించవచ్చు : ఉదాహరణకు B.P. మరి షుగర్ జబ్బులు :

రక్తనాళాలలో రక్తం ఎంత ప్రెషర్‌తో ప్రవహిస్తుందో, ఆ ప్రెషర్‌నే " బ్లడ్ ప్రెషర్ " లేదా " B.P. " అంటాం. శరీరంలో జరిగే రకరకాల మార్పుల వల్ల కానీ, మానసిక వొత్తిడుల వల్ల కానీ, వంశపారంపర్యంగా కానీ లేదా రక్తనాళాలకు సంబంధించిన జబ్బుల వల్ల రక్తనాళాలలో జరిగే మార్పుల వల్ల కానీ " B.P. జబ్బు " వస్తుంది. మొత్తం మీద కారణం ఏదైనా చివరిగా వాటి ప్రభావం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల .. B.P. పెరిగి B.P. జబ్బు, రక్తపోటు జబ్బు వస్తుంది.

ఈ జబ్బు ఉన్నవాళ్ళు ధ్యానులు కానప్పుడు జీవితాంతం ఈ కుంచించుకుపోయిన రక్తనాళాలను వ్యాకోపింప చేసే స్వభావం వున్న మందులను ప్రతిరోజూ, జీవితాంతం వాడాలి. దానివల్ల ఆ మందులు, కుంచించుకుపోయిన రక్తనాళాలను మామూలు సైజులో ఉండేటట్లు చేసి బ్లడ్ ప్రెషర్ మామూలుగా వుంటుంది. ఎప్పుడైతే మనం మానసికంగా ఆందళనతో వుంటామో, మరి అవసరానికి మించిన అనేక రకాల ఆలోచనలు చేస్తూ వుంటామో, అప్పుడు మన మెదడులోని థెలామిక్ యాక్టివిటీ, హైపో యాక్టివిటీ పెరుగుతాయి. దీనివల్ల పిట్యూటరీ గ్రంథి మీద వొత్తిడి పెరిగి " అడ్రెనో కార్టికో ట్రాఫిక్ హార్మోన్లు (ACTH) " ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు కిడ్నీల మీద ఉన్నటువంటి సుప్రారీనల్ గ్లాండ్స్ మీద ప్రభావం చూపడం వల్ల " అడ్రేనలిన్ " మరి "నార్ అడ్రేనలిన్ " హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లకు రక్తనాళాలను కుంచింప చేసే స్వభావం వుండడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి " B.P. జబ్బు " వస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనం పూర్తి ఆలోచనారహిత స్థితికి వెళ్ళడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడి మన మెదడులోని " థెలామిక్ మరి హైపోథెలామిక్ " యాక్టివిటీ తగ్గి తద్వారా " అడ్రినో కార్టికో ట్రోఫిక్ " హార్మోన్లు తగ్గడం,మరి దాంతో “అడ్రీనలిన్ మరి నార్ అడ్రేనలిన్” హార్మోన్లు తగ్గడం వలన కుంచించుకుపోయిన రక్తనాళాలు మెల్లమెల్లగా కొంతకాలానికి మామూలు స్థితికి వచ్చి రక్తపోటు మామూలు స్థాయికి వచ్చి కంట్రోల్‍లో వుంటుంది. ఈ విధంగా ధ్యానంలోకి రాకముందు మందులు చేసే పని ఇప్పుడు ధ్యానం వల్ల మన జబ్బును మనమే నయం చేసుకోగలుగుతున్నాం.

అదేవిధంగా షుగర్ జబ్బు, చెక్కర వ్యాధి, ఏ విధంగా తగ్గుతుందో తెలుసుకుందాం. ప్యాంక్రియాస్ గ్రంథిలో జరిగే రకరకాల మార్పుల వల్ల " ఇన్సులిన్ " హార్మోన్‌ని ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గి దాని ఉత్పత్తి తగ్గడం వల్ల " చెక్కర వ్యాధి " వస్తుంది. ఎప్పుడైతే మానసిక ఆందోళనలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయో అప్పుడు మెదడులో థెలామిక్ మరి హైపో థెలామిక్ యాక్టివిటీ పెరగడం వల్ల " పిట్యుటరీ " గ్రంథి మీద వొత్తిడి పెరిగి " కార్టిసోల్ " హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. " కార్టిసోల్ " హార్మోన్లు ప్రాంకియాటిక్ గ్రంథిలోని బీటా కణాల మీద ప్రభావం చూపి వాటి సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా " ఇన్సులిన్ " ఉత్పత్తి " ఆగిపోతుంది. శరీరంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. దీన్నే మనం " చెక్కర వ్యాధి " అంటాం. మామూలుగా ఎప్పుడైతే మన శరీరంలో " ఇన్సులిన్ " శాతం తక్కువ అవుతుందో అపుడు డాక్టర్లు మనకు బయటి నుంచి ఇన్సులిన్‍ను మాత్రల రూపంలో కానీ లేదా ఇంజెక్షన్ల రూపంలో కానీ ప్రతిరోజూ, జీవితాంతం ఇచ్చి చెక్కర వ్యాధిని .. రక్తంలోని చెక్కర శాతాన్ని.. కంట్రోల్‍లో ఉంచుతారు. మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో థెలామిక్ మరి హైపో థెలామిక్ యాక్టివిటీ తగ్గి కార్టిసోల్ హార్మోన్లు తగ్గడం, మరి శరీరంలో ప్రవేశించే " కాస్మిక్ ఎనర్జీ " వల్ల పాంక్రియాటిక్ గ్రంథిలోని కణాలు ఉత్తేజితం కావడం వల్ల " ఇన్సులిన్ " ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో రక్తంలోని షుగర్‍ను " మెటబొలైజ్ metabolize" చేయడం ద్వారా శాతాన్ని తగ్గించి చెక్కెర వ్యాధిని కంట్రోల్‍లో వుంచడం జరుగుతుంది. ఈ విధంగా ధ్యానం చేయనివారిలో మందులు చేసే పనిని ధ్యానం చేసేవారిలో మందులు లేకుండా షుగర్ వ్యాధిని కంట్రోల్‍లో పెట్టడం జరుగుతుంది.

ఈ విధంగా " B.P " మరి " షుగర్ " వ్యాధులే కాకుండా అన్నిరకాల జబ్బులనూ ఇటు ధ్యానం వల్ల శరీరంలో జరిగే శాస్త్రబద్ధమైన రకరకాల బయోకెమికల్, ఫిజియోలాజికల్ రియాక్షన్స్ వల్ల మనం పొందే కాస్మిక్ ఎనర్జీ వల్ల మరి ఆధ్యాత్మిక శక్తి వల్ల మందులు లేకుండా నయం చేసుకోవచ్చు ! మిగతా అన్ని రకాల జబ్బులన్నింటి గురించి కూడా అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు " ధ్యానాంధ్రప్రదేశ్ " ద్వారా తెలుసుకుందాం !!

 

 

Dr.A.V. సుబ్బారెడ్డి
ప్రెసిడెంట్,మదనపల్లె పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ
మదనపల్లె - 517325
సెల్ : 94402 47123

 

Go to top