" పత్రీజీ అంటే మాకు ఎంతో, ఎంతో ప్రాణం ! "

 

 

నా పేరు " ప్రణీత ".

హైదరాబాద్ " MGIT " లో నేను " B.E.(IT) Final year " చదువుతున్నాను. నేను 2000 సంవత్సరం జనవరి చివరి వారంలో మా అమ్మ " M. నిర్మలాదేవి " ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. నాకు అప్పుడు 11 సంవత్సరాల వయస్సు. అందరి పిల్లల్లాగె నాకు కూడా ధ్యానం అంతగా చేయాలనిపించకపోయేది. కానీ మా అమ్మ ఇంట్లోనే పిల్లలందరికీ ధ్యానం క్లాసులు పెట్టి ప్రతిరోజూ మెడిటేషన్ చేయించేవారు. దాంతో నేను కూడా బలవంతంగా కూర్చునేదాన్ని.

ఆ రోజుల్లోనే " పత్రీజీ అక్కగారైన సుధా ఆంటీ " తో కలిసి పత్రిగారి ఇంటికి వెళ్ళాను. సుధా ఆంటీ .. మా ఆంటీ " డాక్టర్ అరుణ మిట్టపల్లి (చికాగో) " గారికి చాలా సన్నిహిత మిత్రురాలు. అందువల్ల సుధా ఆంటీ వల్లనే మా అమ్మగారు ధ్యానంలోకి రావడం, ఆ తరువాత మా ఇంట్లో ధ్యానం క్లాసులు పెట్టడం, నన్ను మా అమ్మ పత్రీజీని దర్శించుకోవడానికి పత్రీజీ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది.

ఆ రోజు " ఫిబ్రవరి 17, 2000 ". నా వయస్సు 11 సంవత్సరాలు ; నా చిన్ని జీవితంలోనే చాలా అద్భుతమైన రోజు (ఆ విషయం అప్పట్లో నాకు తెలియదు) ! పత్రీజీ మహారాష్ట్రలో ధ్యానం క్లాసులు ముగించుకుని వచ్చారు. నాతోపాటు మా కుటుంబసభ్యులు సరళ అత్తమ్మ. వాళ్ళ పిల్లలందరూ .. అందరమూ పత్రీజీ దగ్గరికి వచ్చాం.

పత్రీజీ మమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టారు. నేను ధ్యానంలో కూర్చోగానే ఒంటి నిండా ఏదో ప్రాకుతున్నట్లు, చక్కటి రంగులు కనపడటం మరి అద్భుతమైన ఎన్నో కట్టడాలు కనిపించడం, వెంటవెంటనే కొన్ని స్లైడ్స్ మార్చుతూన్నట్లుగా ఎన్నో దృశ్యాలు వెంటవెంటనే కనిపించసాగాయి. ఇంతలో పత్రీజీ " O.K " చెప్పగానే ఆ లోకంలోంచి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.

ఆ చిన్న వయస్సులో .. ధ్యానం చేస్తే ఇలాంటి అనుభవాలు వస్తాయని కూడా నేను వినని ఆ సమయంలో .. ఎంతో అధ్బుతమైన అనుభవాలు పొందటం అనేది ' పత్రీజీ ' లాంటి అత్యంత .. అత్యంత .. అద్భుతమైన గురువు యొక్క సాంగత్యాన్ని పొందటం నా పూర్వజన్మ సుకృతం మాత్రమే.

' పూర్వజన్మ ' అంటే గుర్తుకువచ్చింది. నేను ధ్యానం నేర్చుకున్న రెండు నెలల్లోనే నా పూర్వజన్మ బాగా చూసుకోగలిగాను. అప్పుడు నేను ఏడవతరగతి చదువుతున్నాను. అది ఏప్రిల్ నెల. నేను పరీక్షల కోసం చదువుకూంటూండగా నా లోపలి నుంచి ఒక వాయిస్ " నువ్వు హుయాన్‌త్సాంగ్ " అంటున్నట్లు తెలిసి భయం వేసి మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చెప్పగానే .. మా అమ్మ కూడా కొద్దిగా ఖంగారు పడి పత్రిగారికి ఫోన్ చేసి .. జరిగిందంతా చెప్పి .. " నాకు భయం వేస్తోంది సార్ " అనగానే పత్రిసార్ " మీకు పిచ్చిపట్టింది, మీ అమ్మాయికి పూర్వజన్మ తెలిసింది .. మీరేమీ ఖంగారు పడక్కర్లేదు " అని మందలించడం జరిగింది. సంవత్సరాల తరబడి తపస్సులు చేసే ఋషులకు కూడా సాధ్యం కాని పూర్వజన్మల జ్ఞానం కలగటం అనే విషయాన్ని అతి సింపుల్‌గా తేల్చేయడం పత్రీజీకే సాధ్యం! దటీజ్ పత్రీజీ !!

ఇప్పుడు .. నా ఈ 21 వ సంవత్సరాల వయస్సులో .. ఎన్ని అధ్యాత్మిక విషయాలను ఇంటర్నెట్ లోనూ, పుస్తకాల ద్వారా మరి పత్రీజీ సందేశాల ద్వారా ఎంత అయితే తెలుసుకున్నానో, అప్పుడు .. నా పదకొండు సంవత్సరాల వయస్సులోనే పత్రీజీ వద్ద చేసిన ఒక గంట ధ్యానంలో ఎన్నో విజన్స్ రావటం, పూర్వజన్మ తెలుసుకోవటం, ఇతరుల పూర్వజన్మలను చూడగలగటం, ఆరా చూడగలగటం తెలిసి పోయింది. దటీజ్ పత్రీజీ !!

ఈ క్రమంలో నాకు ధ్యానం చేసినప్పుడల్లా ప్రముఖ టిబెట్ గురువు " లోబ్‌సాంగ్ రాంపా " గారి నుంచి సందేశాలు అందుతూండేవి. పూర్వజన్మల గురించీ, ఆరా, కర్మ మొదలైన వాటి గురించీ మా మధ్య ఎంతో సంభాషణ జరిగేది. ఆ చిన్నతనంలోనే మొట్టమొదటిసారిగా " పూర్ణాత్మ " మరి " అంశాత్మ " ల గురించి నాకు ఎంతో అద్భుతంగా వివరించారు రాంపాగారు. "

ఎప్పుడైతే వివిధ అనుభవాల ద్వారా ఒక ఆత్మ తనను తాను ఉద్ధరించుకుంటూ ఉన్నతదిశగా సాగిపోతూ వుంటుందో .. ఆ క్రమంలోనే అది ఒక భగవంతుడిలా రూపుదిద్దుకుంటుంది .. మరి మనమందరం ఇలాగే పరణామం చెందాం. మనందరం కూడా ఒకానొక పూర్ణాత్మ నుంచి.. విడివడి మానవజన్మ తీసుకున్న అంశాత్మలమే " .. అంటూ రాంపా మాస్టర్ వివరంగా తెలియజేసారు!

ఒకసారి ధ్యానంలో నన్ను నేను ఒక బుద్ధిస్ట్ మాంక్‌గా చూసుకున్నాను. అతను నా చేయిపట్టుకుని ఒక తటాకం వద్దకు తీసుకెళ్ళి నన్ను అందులోకి చూడమని చెప్పాడు .. నా శరీరం అందులో కనపడుతూ .. క్రమంగా ఎంతో అద్భుతంగా ఏడు శరీరాలుగా విడిపోయింది. ఆ మరుసటిరోజు నేను నా ప్రక్క మీద పడుకుని నిద్రపోతూండగా .. అకస్మాత్తుగా ఒక ఏలియన్స్‌తో కూడిన " స్పేస్‌షిప్ " నా రూమ్‌లోకి రావడం మరి నేను వెంటనే నిద్రలోంచి లేచి, ఆ షిప్పును కళ్ళారా చూడటం జరిగింది. దటీజ్ ప్రణీత !!

నా చిన్నతనం నుంచీ నాకు ఆస్త్మా వుండేది. అటాక్ వచ్చినప్పుడల్లా విపరీతంగా బాధపడుతూ ప్రాణం పోతున్నంత బాధను అనుభవించేదాన్ని. ఎన్నెన్నో మందులు వాడాల్సి వచ్చేది. అలాంటిది ధ్యానం మొదలుపెట్టిన కొద్దికాలానికే ఆస్త్మా వ్యాధి సంపూర్ణంగా మరి సమూలంగా నయమైపోయింది. ఇప్పుడు నేను హాయిగా శ్వాస పీల్చుకోగలుగుతున్నాను ఏ కాలంలోనైనా !!

ఒకసారి నాకు .. స్కూల్‌లో మెట్ల మీద నుంచి పడిపోవటంతో దెబ్బ తగిలి మెడ విపరీతంగా నొప్పి పెట్టింది. " మందులు అస్సలు వాడకూడదు " అనుకుని ధ్యానానికి కూర్చోగానే కాస్సేపటికి ఒక అందమైన వెండి రంగులో వున్న తెల్లని మెత్తని చేయి నా మెడపై అలా మెత్తగా రాయడం .. మరి నా మెడనొప్పి క్షణాల్లో మాయం కావడం జరిగింది! ఈ విషయం మా అమ్మ "షాలినీఆంటీ " ని అడగగా ఆవిడ " ఆస్ట్రల్ మాస్టర్స్ కొందరు డాక్టర్లుగా ఇలా హీలింగ్‌లు చేస్తారు " అని చెప్పారు. ఇలా మా స్నేహితుల విషయంలో కూడా ఏవైనా అనారోగ్యాలుంటే అందరం ధ్యానం ద్వారా హీలింగ్‌లు చేసుకునేవాళ్ళం సరదాగ.

ధ్యానం ద్వారా నేను ఎంతో ఆత్మశక్తిని పొంది నా విద్యార్థి జీవితంలోని ప్రతి దశనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా ముగించుకుంటూ ప్రతి ఒక్క సంఘటననూ ధైర్యంగా ఎదుర్కొన్నాను. స్కూల్లో మరి కాలేజీలో కూడా " ఒక లీడర్ " లా ఉండగలిగే సత్తాను నాకు ధ్యానం సమకూర్చి పెట్టింది. " ఇంజనీరింగ్ తరువాత అమెరికా వెళ్ళి M.S. చేయాలా, వద్దా ? " అని ఆలోచనతో వున్న నేను పత్రీజీ సూచనమేరకు ఉద్యోగం చేయడానికి నిర్ణయించుకున్నాను. ఎకడమిక్స్ పరంగా నాకంటే ఎక్కువ టాలెంట్స్ ఉన్నవాళ్ళను కూడా త్రోసిరాజనుకుంటూ .. ఒకదాని తర్వాత ఒకటిగా ఒక్క నెలలోనే మూడు మల్టీనేషనల్ కంపెనీలు " C.S.C ", " Teach for India " మరి " Birla soft "ల్లో ఉద్యోగాల ఎంపిక నేను చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ! " ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగావకాశాలు లేవు, ప్చ్ " అంటూ పెదవి విరుస్తూ నిరాశపడే యువతను మరి వాళ్ళ తల్లిదండ్రులను ధ్యానం మాత్రమే వారిలో ఆశావహ దృక్పథాన్ని కలుగజేస్తూ ఒక గమ్యానికి తప్పక చేరుస్తుంది.

ఈ రోజు నేను ఆత్మవిశ్వాసంతో ఎంత పెద్ద సభలోనైనా వేలమంది ముందు అయినా ధైర్యంగా నిలబడి .. మాట్లాడగలను మరి వారిలో కూడా స్ఫూర్తిని నింపగలను " అని పత్రిసర్ శిష్యురాలిగా సగౌరంగా చెప్పగలను ! దటీజ్ ప్రణీత !!

2006 నుంచి 2008 వరకు " పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ " కి వైస్ ప్రెసిడెంట్‌గా నా సేవలు అందిస్తూ అప్పటి పైమా మాస్టర్స్ చందన, హరి, ప్రబోధ్, జీవన్, విజయ్, శ్రీలక్ష్మి, సౌమ్య, భగవద్గీత, సంపత్, పూర్ణ .. ఇలా ఎంతోమందితో కలిసి ఎన్నెన్నో కాలేజీలు, స్కూళ్ళు తిరుగుతూ విద్యార్థులకు మెడిటేషన్ క్లాసులు నిర్వహించేవాళ్ళం. ఆ రోజు ధ్యాన ప్రచారంలో పాల్గొన్న మా గ్రూప్ వాళ్ళంతా ఈ రోజు ఉద్యోగరీత్యా వివిధ దేశాల్లో చక్కగా సెటిల్ అయి సింగపూర్, అమెరికా, ఆస్ట్రియా, బెల్జియం, దుబాయ్, ఆస్ట్రేలియా, లండన్ తదితర దేశాల్లో అద్భుతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇలా మా అందరి జీవితాలను ధన్యం చేస్తూ విద్యార్థిలోకానికి అసలైన విద్యను అందిస్తూ మా అందరితో నిజమైన స్నేహితుడిలా మెలుగుతూ .. పై నుంచి " మీరంతా జగద్గురువులు ; ప్రపంచాన్ని ధ్యానమయం చేయడమే మీ కర్తవ్యం " అంటూ మమ్మల్నిసదా ప్రోత్సహించే ప్రియాతిప్రియమైన పత్రీజీ " సర్ " అంటే మాకందరికీ ఎంతో, ఎంతో ప్రాణం ! దటీజ్ పత్రీజీ !!

నేను ఆరవ తరగతిలో ఉండగానే నాకు ఒక అద్భుతమైన అనుభవం జరిగింది. మా స్కూల్‌లో భవన నిర్మాణం పని జరుగుతూ వుంది. నా క్లాస్‌రూమ్ రెండవ అంతస్థులో వుండి క్రింద అంతా గ్రానైట్ రాళ్ళు ఇనుపచువ్వలు పడి వున్నాయి. బరువైన పుస్తకాల బ్యాగ్‌తో నేను మెట్లు ఎక్కుతూ .. ఒక్కసారిగా తూలి క్రిందపడిపోతూ వుండగా " రెండు చేతులు " మృదువుగా నన్ను పొదివి పట్టుకుని మళ్ళీ మెట్ల మీద నిలబెట్టాయి ! అది ఎవరో .. మీకు ఇప్పటికే తెలిసిపోయి వుంటుంది. ఎవరో కాదు ఆ మాస్టర్ పత్రిసార్ ! " నాకు ఎవరి సంగతి తెలియదు ఎవరిని వారే ఉద్ధరించుకోండి " అంటూనే ఎవరినీ కదిలించినా ఇలాంటి అద్భుతమైన అనుభవాలు మన పిరమిడ్ మాస్టర్ల జీవితాల్లో ఎన్నో వున్నాయి. దటీజ్ గ్రేట్ పత్రీజీ !!

ఒకసారి నేను స్కూలుకు తయారవుతూంటే మా అమ్మ నాకు జడలు వేస్తూ T.V లో ఎవరో స్వామీజీ ప్రవచనం చూస్తూ వుంది. నేను కూడా యథాలాపంగా T.V. చూస్తూండగా అకస్మాత్తుగా పత్రిసార్ కనపడటం .. నాకు రాంపా మాస్టర్ పత్రిసార్ యొక్క సప్తశరీరాలు చూపించడం మరి " పత్రిసార్ ఈజ్ సెవెన్త్ బాడీ మాస్టర్ " అని రాంపా మాస్టర్ చెప్పటం అంతా కన్నుమూసి తెరిచేలోగా జరిగింది. వెంటనే నేను మా అమ్మతో " పత్రిసార్ సెవెన్త్ బాడీ మాస్టర్ అమ్మా ! అందుకే ' సర్ ' చెప్పే విషయాలు అందరూ రిసీవ్ చేసుకోలేరు " అని చెప్పగానే, అమ్మ డాక్టర్ K. న్యూటాన్ అంకుల్‌కి ఫోన్ చేసి .. ఏడు శరీరాల గురించి అడగగానే .. అంకుల్ ఏడు శరీరాలు అంటే ఏమిటో వివరించారు !

ఇలా ఈ చిన్ని " శ్వాస మిద ధ్యాస " అనే ధ్యానం నా చిన్నతనం నుంచి ఎన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ వచ్చింది.

మరి ఈ " శ్వాస మీద ధ్యాస " ప్రపంచానికంతా పరిచయం చేసి ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన మార్పు తీసుకువచ్చిన ( " నేనేమీ మార్పు తీసుకురాలేదు అని పత్రిసార్ అంటూంటారు " ) పత్రిసార్‌కి హ్యాట్సాఫ్ ! దటీజ్ పత్రీజీ !!

మన పైమా మాస్టర్ " P.జీవన్ " .. " పిరమిడ్ మాస్టర్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేయాలని వుంది " అని పత్రిసార్కు చెప్పగానే పత్రిసార్ దానికి " Yes " అంటూ ఒక కార్యవర్గాన్ని ఏర్పాటుచేసి నన్ను " వైస్ ప్రెసిడెంట్ " గా వుంచారు ! నేను అప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా పైమాలో నా కంటే వయస్సులో పెద్దవాళ్ళు వున్నా నన్ను ఆ పోస్టుకు పత్రిసార్ సెలెక్ట్ చేయటం నాలో ఎంతో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అప్పటి నుంచి పైమా ఏర్పాటుచేసే అన్ని కార్యక్రమాల్లో బాగా చురుకుగా పాల్గొంటూ ఉండేదాన్ని.

ఆ తరువాత B.E. 1st Year నుంచి మా కాలేజీలో జరిగే " నిర్వాణ ప్రోగ్రామ్ " ను కండక్ట్ చేయడానికి కావలసిన ఫండ్స్ కలెక్ట్ చేయటం ఎన్నోM.N.C కంపెనీలకు మా ఫ్రెండ్స్ను వెంట తీసుకెళ్ళి ఆ కంపెనీ H.R. లతో ధైర్యంగా మాట్లాడి ఒప్పించి ఎంతో ఫండ్ రైజింగ్ చేసి ఇతర ఆర్గనైజింగ్ కార్యక్రమాలను చూసుకుంటూ B.E. Final Year కు వచ్చేసరికి కాలేజీలో జరిగే ఎన్నో కార్యక్రమాల్లో " ప్రణీత ఏదైనా ఆర్గనైజ్ చేయగలదు " అని మా ప్రొఫెసర్స్ దృష్టిని ఆకర్షించటం జరిగింది. ఇలాంటి ఆర్గనైజింగ్ కెపాసిటీస్ నాకు ఎలా అబ్బాయో .. మీ అందరికీ ఇప్పటికే తెలిసిపోయి వుంటుంది. దటీజ్ పత్రీజీ !! దటీజ్ ప్రణీత !! నాకు ఈ ధ్యాన సాధన వల్లనే ఏ విషయం గురించి ఆలోచించినా అవలీలగా ఆ సబ్జెక్ట్ అంతా అందుతూ వుండేది. యువత ఇప్పుడే మాకెందుకు ధ్యానం అంటూంటారు. కానీ ధ్యానం ఎక్కువగా చేయవలసింది వారే. ఎంతో అత్మవిశ్వాసంతో జీవితంలో నిలద్రొక్కుకుని ముందుకు వెళ్ళడానికి ఈ ధ్యానం నాకెంతో తోడ్పడింది. నేను B.E 1st Year లో జాయిన్ కాగానే 1st Year లో వున్న అన్ని ఫాకల్టీ స్టూడెంట్స్కు కలిపి ఒక కామన్ మీటింగ్ ఏర్పాటుచేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి తెలియజెప్పడానికి " మీలో ఎవరైనా అరగంటసేపు ఏదైనా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మీద మాట్లాడండి " అంటే ఒక్కళ్ళూ ముందుకు రాలేదు. " మీలో ఎవ్వరూ మాట్లాడలేరా ? " అంటూ ఆర్గనైజర్ అంటూంటే పత్రిసార్ను ఒక్కసారి తలచుకుని డయాస్ ఎక్కాను. అరగంటసేపు అనర్గళంగా మెడిటేషన్ గురించి మాట్లాడాను. అడగడుగునా నన్ను పత్రిసార్ ఆస్ట్రల్గా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నట్లు వుండటం వల్లే ఇంత ధైర్యంగా ఎన్ని వేలమంది ముందైనా మాట్లాడగలుగుతున్నానని మాత్రం గట్టిగా చెప్పగలను. దటీజ్ గ్రేట్ పత్రీజీ !!

2005 సంవత్సరంలో నన్నూ, " శ్రీచందన " నూ పత్రిసార్ ఆదోని, కర్నూలు, ధర్మవరం ఆ దగ్గర వుండే పల్లెలు అన్నీ తిప్పి అక్కడ జరుగుతున్న అన్ని ధ్యానసభల్లో మమ్మల్ని ఇద్దరినీ వేలాదిమంది ముందు మాట్లాడించారు ! ఆ తరువాత మేము ప్రయాణం చేసే సమయంలో కూడా ఎలా మాట్లాడాలో ఒక కన్నతల్లిలా, తండ్రిలా మరి శిక్షణనిచ్చే గురువులా అంతా వివరించేవారు ! " పత్రిసార్కు కోపం ఎక్కువ " అని అందరూ అంటూంటారు. కానీ ఆ పైపై కోపం వెనుక వున్న అమృత హృదయంలో వున్న అద్భుతమైన ప్రేమను మేమిద్దరం ఎంతో .. ఎంతో అనుభవించాం ! ఆ మూడురోజులూ మా జీవితంలో మరువలేని మధురానుభూతిని మిగల్చాయి !!

నేను, చందన సార్తో ఆ ట్రిప్ తర్వాత ఎంతో ఎంతో జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందాం .. మరి " ఆత్మపరంగా ఎంతో ఎంతో ఎదిగాం " అనిపించింది. ఆ మూడురోజులు ఒక బంగారులోకంలో విహరించినట్లుగా అనిపించింది. ఆ తరువాత " నేనిప్పుడు సింగపూర్లో ఇంత వర్క్ చేయగలుగుతున్నాంటే అప్పుడు సర్ నుంచి లభించిన స్ఫూర్తే " అని చందన అంటూ వుంటుంది. దటీజ్ అవర్ పత్రీజీ !!

 

ప్రణీత
హైదరాబాద్

Go to top