" తిట్టిపోసిన పిరమిడ్ మాస్టర్లను వెతుక్కుంటూ వెళ్ళాను "

 

నా పేరు రాజేష్.

వృత్తిపరంగా .. నేను ఆటోడ్రైవర్ను. క్రితం సంవత్సరం మా మోటూరు గ్రామం రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూండగా .. గుడివాడ నుంచి ఒక ధ్యానప్రచార రథంలో పిరమిడ్ మాస్టర్లు వచ్చి .. ఆ ఉత్సవాలకు హాజరైన భక్తులకు ధ్యానప్రచారం చేయడం మొదలుపెట్టారు.

అది చూసిన నేను " తిన్నది అరగక తిరుగుతారు , కళ్ళు రెండూ మూసుకుని మేం కూర్చుంటే .. మా బంగారు గొలుసులు ఎత్తుకెళ్దామనుకుంటున్నారా? " .. " మమ్మల్ని ‘ మాంసం తినకూడదు ’ అని చెప్పడానికి మీరెవరు? " అని వాళ్ళను నానామాటలు అన్నాను. అయినా వాళ్ళు అవేవీ లెక్కచేయక .. నన్ను వదిలేసి మరింత మందికి ధ్యానం గురించి చెప్తోంటే .. " మొండి ఘటాలు " అనుకుని నవ్వుకున్నాను.

ఆ తరువాత కొంతకాలానికి నేను ఆర్థిక మరి అనారోగ్యం పాలుకావడంతో ఆర్థికంగా మరి మానసికంగా చాలా దెబ్బతిన్నాను. ఎందరో దేవుళ్ళకు మ్రొక్కుకుంటూ, పూజలు చేస్తున్నా కూడా నాకు కోలుకునే దారి కనపడలేదు.

ఎటూ పాలుపోని తరుణంలో " ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది " అన్న గుడివాడ పిరమిడ్ మాస్టర్ల మాట గుర్తుకువచ్చి .. వాళ్ళ ధ్యానప్రచార వాహనాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. చివరికి దానిని వెతికి పట్టుకుని దాని మీద వ్రాసి వున్న ఫోన్ నెంబర్లో మాట్లాడాను.

ఫోన్లో గుడివాడ పిరమిడ్ మాస్టర్ శ్రీ ఋషికర్ రావుగారు మాట్లాడి .. " ఏం ఫరవాలేదు , రేపు ఉదయం రండి .. మా ఇంటిపైన ఉన్న పిరమిడ్ లో కూర్చుందాం " అన్నారు. ఆనాడు మా ఊరికి వచ్చినప్పుడు వారిని తిట్టిపోసినందుకు " వాళ్ళు నన్ను ఏమంటారో ? " అనుకుని కాస్త భయపడ్డాను.

కాస్త బెరుకుగానే వెళ్ళి మర్నాడు తెల్లవారుజామునే వారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. వారు నన్ను ఎంతో ఆదరణతో లోపలికి పిలిచి .. నాకు ధ్యానం గురించి వివరించి .. నాతో పదిహేను నిమిషాలు ధ్యానం చేయించి .. స్పిరిచ్యువల్ సి.డి.లు చూపించారు , రెండు గంటలపాటు వారితో గడిపిన నేను ఎంతో ఆత్మతృప్తితో బయటికి వచ్చాను .

ధ్యానం ద్వారా క్షమాగుణంలాంటి దైవలక్షణాలు ఎలా పెంపొందుతాయో .. ఆ పిరమిడ్ మాస్టర్ను చూస్తే నాకు అర్థం అయ్యింది .

నా మామూలు దినచర్యలో భాగంగా ఆటోనడుపుతూ వెళ్ళిన నేను .. నాలో కలుగుతోన్న మార్పును గమనించాను. ప్రతిరోజూ ఉండే చిరాకు గానీ, అలసట గానీ లేకుండా .. కాస్సేపు నడపగానే ఎక్కడో ఒక దగ్గర ఆటో పార్క్ చేసి పడుకోవడం లాంటివి కానీ లేకుండా శరీరం అంతా తేలిగ్గా వున్నాఅనుభూతిని పొందాను.

" కేవలం పదిహేను నిమిషాల ధ్యానంతోనే ఇంత మార్పు నాకు కలిగితే .. మరి అంతకంటే ఎక్కువసేపు అది కూడా రోజూచేస్తే .. మరింత ఆరోగ్యం పొందవచ్చు " అన్న ఆలోచనతో ఉత్సాహంతో ఉన్న నన్ను చూసి మా ఆవిడ వివరం అడిగింది. ధ్యానం గురించి, మాంసాహారంతో వచ్చే అనర్థాల గురించీ ఆమెకు కూడా వివరించి .. " ఇక నుంచి మనం శాకాహారులుగానే ఉందాం " అని నిర్ణయం తీసుకున్నాం .

ఆ తరువాత భీమవరం .. " తటవర్తి వీరరాఘవరావు " గారి మూడు రోజుల ఆత్మ - జ్ఞాన శిక్షణ శిబిరానికి వెళ్ళి అక్కడ అద్భుతమైన ధ్యానశిక్షణను పొందాను . అక్కడ 1000 శాకాహార పుస్తకాలు కొని ఇంటికి వచ్చాక .. న్యూస్పేపర్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి వాటిని న్యూస్ పేపర్ లో పెట్టి ఇంటింటికీ పంపించాను .

మా బంధుమిత్రులు అందరికీ .. మరి నా ఆటోలో ప్రయాణంచేసే వాళ్ళకూ .. ధ్యానం -శాకాహారం కరపత్రాలు పంచుతూ నా వృత్తితో పాటు ధ్యానప్రచారం కూడా చేసుకుంటున్నాను . మా ఇంటిపై 9X9 పిరమిడ్ కట్టి .. గుడివాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ప్రెసిడెంట్ " ధ్యానరత్న " శ్రీమతి రాజకుమారి మేడమ్తో ప్రారంభోత్సవం చేయించాము .

ధ్యానప్రచారం చేయడానికి మా ఊరికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లను తిట్టీపోసిన నేనే .. వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళు అందించిన ధ్యానవరంతోనే .. నన్ను నేను అద్భుతంగా మలచుకున్నాను.

ఇలా నన్ను " యోగి " గా మార్చి, నా ద్వారా మరిన్ని కార్యక్రమాలు జరిపిస్తూ, నన్ను ముందుకు నడిపిస్తున్న ధ్యానానికీ బ్రహ్మర్షి పత్రీజీ కి నా ఆత్మ ప్రణామాలు .

 

రావుల పాటి రాజేష్
సెల్ : +91 98666 98014

Go to top