"మన సమస్య .. మన పరిష్కారం "

 

నా పేరు రామ్మోహన్ రావు,

నేను 2005 సంవత్సరంలో నా బావమరిది " ధూళిపూడి చంద్రశేఖర్ " ద్వారా శ్వాస మీద ధ్యాస ధ్యానం నేర్చుకుని .. నిరంతర ధ్యానసాధన ద్వారా .. అందులో ఉన్న లాభాలను విశేషంగా పొంది .. నా జీవితాన్ని ఆనందమయం చేసుకున్నాను.

మా కుటుంబసభ్యులమే కాకుండా నా బంధుమిత్రులందరూ కూడా ధ్యానమార్గంలో ఉండడం వల్ల ఏ ఫంక్షన్ లో మేం కలుసుకున్నా .. ధ్యానానికి సంబంధించిన చర్చలే మా మధ్య జరుగుతూ .. అది ఒక సత్సంగకార్యక్రమంగా ముగుస్తుంది. ఇంతటి జ్ఞానపూర్వకమైన జీవితాలను గడపడానికి దారిచూపిన బ్రహ్మర్షి పత్రీజీ కి కృతజ్ఞతలు .

నిరంతరం ధ్యానప్రచారంతో పాటు అద్భుతమైన ధ్యాన జ్ఞాన సమాచారంతో నిండి వుంటోన్న " ధ్యానాంధ్రప్రదేశ్ " మాసపత్రికకు మేము చందాదారులుగా మారి .. క్రొత్త వాళ్ళను కలిసినప్పుడల్లా వారికి ధ్యానం నేర్పించి .. పత్రిక విశిష్టతను వివరించి వాళ్ళను కూడా పత్రికకు చందాదారులుగా చేరుస్తున్నాం. నిరంతర " స్వాధ్యాయయజ్ఞం " లో ఇలా పాలుపంచుకుంటూన్నందుకు మేమంతా ఎంతో గర్వపడుతున్నాం .

అయితే " ఈ నెల పత్రిక మాకు ఇంకా అందలేదు " అంటూ మా కాలనీలో ఎవరో ఒకరు నాకు ఫోన్ చేయడం మరి ఒక్కోసారి నాకు కూడా పత్రిక సకాలంలో అందకపోవడం నన్ను ఆందోళనకు గురిచేసేది , దాంతో నేను మా కాలనీని ఒక ప్రయోగక్షేత్రంగా తీసుకుని ఈ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టాను.

ముందుగా " ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక " ఆఫీసులో వాకబు చేసి .. వారి షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా పత్రికలు పోస్ట్ అయిపోయిన సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా తీసుకుని .. లోపం ఎక్కడ జరుగుతోందో శోధించాను.

ఆ తరువాత మా కాలనీ పోస్ట్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి సిబ్బందికి ధ్యానం గురించి తెలియజేసాను. ముందు వాళ్ళు " మాకెందుకులే ? " అని కాస్త తటపటాయించినా .. ధ్యానప్రచారంలో దిట్టలం అయిన మనం వారిని వదులుతామా ? పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విరామసమయాల్లో వారిచే ధ్యానసాధన చేయిస్తూ వచ్చాను.

పట్టువదలకుండా వారికి ధ్యానానికి సంబంధించిన సమాచారాన్నంతా చేరవేస్తూ వాళ్ళను కూడా " ధ్యానాంధ్రప్రదేశ్ " పత్రికకు చందాదారులుగా చేరుస్తూ వచ్చాను.

పత్రిక అమృతత్వాన్ని రుచిచూసిన వాళ్ళు .. ప్రతినెలా " అది ఎప్పుడు వస్తుందా ? " అని ఎదురుచూస్తూ .. " ఇంకా రాలేదేమిటి ? " అని నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. పత్రిక సరఫరాలో జరుగుతోన్న జాప్యాన్ని నేను వారికి వివరించి .. పోస్టల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఎక్కడో ఒక స్థాయిలో అవి నిలిచిపోవడం వల్ల కలుగుతోన్న ఇబ్బందినీ మరి పత్రిక అందని చందాదారులు పడే తపననూ వివరించాను.

ఇక అప్పటి నుంచి పోస్ట్మాస్టర్ మొదలుకుని, పోస్ట్మ్యాన్ వరకు సిబ్బంది అంతా కూడా పత్రిక రావడం ఒక్కరోజు లేట్ అయినా .. తమకంటే పై స్థాయిలో ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో వాళ్ళే వాకబు చేసుకుంటూ .. అవి ఎక్కడ ఆగిపోయి ఉన్నాయో తెలుసుకుంటూ .. పత్రిక సకాలంలో అందేట్లుగా చర్యలు తీసుకుంటున్నారు .

" ఏదైనా తనదాకా వస్తేనే " .. అన్నట్లుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు తమకు కలిగిన ఇబ్బందిని తామే సరిచేసుకుంటూ .. దానివల్ల కాలనీ ఇబ్బందిని కూడా దూరం చేస్తూన్నారు. ఇప్పుడు మా కాలనీలో " ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక అందడంలేదు " అన్న కంప్లయింట్ పూర్తిగా తగ్గిపోయింది .

కాబట్టి ఫ్రెండ్స్ , సమస్య మూలంలోనే దాని పరిష్కారం దాగి వుంటుంది కనుక .. మనం కాస్త ఎరుకతో అడుగులు వేస్తూంటే ఆ సమస్య పరిష్కరించబడటంతో పాటు .. మనకు ధ్యానప్రచార పుణ్యం అనే బహుమతి కూడా దక్కుతుంది .

 

పులి రామ్మోహన్రావు
అసిస్టెంట్ ఇంజనీర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
సెల్ : +91 94402 88246

Go to top