" అడుగడుగునా అద్భుతాలే "

 

నా పేరు సరోజ.

శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం కోసం విజయవాడ పిరమిడ్ మాస్టర్ J. రాఘవరావు గారు పంపించిన 10,000 కరపత్రాలతో పాటు ఇంకో 30,000 కరపత్రాలను మేము కూడా అచ్చు వేయించి ఖమ్మం జిల్లా అంతటా పంపిణీ చేయించాము. ఈ సారి జిల్లా నుంచి ఎక్కువమంది క్రొత్త ధ్యానులను యజ్ఞానికి తీసుకుని రావాలన్న సంకల్పంతో మాస్టర్లందరం విశేషంగా కృషి చేసాం.

ఇందుకోసం 2009 డిసెంబర్ నెల పత్రిక బ్యాక్ కవర్‌పేజీలో వేసిన సందేశాలతో పాటుగా శ్రీశైలం ధ్యాన సమాచారాన్ని 10'X10' ఫ్లెక్స్ మీద వేయించి ఖమ్మం బస్ట్స్టాండ్ ఎదురుగా పెట్టించాము. దానిని చూసి ఎంతోమంది క్రొత్తవాళ్ళు ఫోన్లు చేయడం మరి ధ్యానయజ్ఞానికి రావడం జరిగింది. ఆ ఫ్లెక్స్ ను తీసుకుని వస్తూంటే నా కారుకు యాక్సిడెంట్ కాబోయి కూడా ఏదో అదృశ్యశక్తి మమ్మల్ని అసంకల్పితంగా ప్రక్కకు జరిపినట్లు మేం రక్షించబడ్డాం.

ఎనిమిది బస్సులు, పది కార్లలో ఇంకా కొంతమంది ట్రైన్లలో ఖమ్మం, మధిర, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మణుగారు వాటికి సంబంధించిన గ్రామాలలోని 400 మంది క్రొత్తవారు, 150 మంది పాతవాళ్ళు శ్రీశైలం రావటం జరిగింది. దీనికోసం ఆయా ప్రాంతాలలోని మాస్టర్స్ అద్భుతంగా పాటుపడ్డారు.

అద్భుతాలకే అద్భుతం అయిన శ్రీశైలం ధ్యానయజ్ఞంలో ఎన్నో విశేషాలు ..

డిసెంబర్ 26 వ తేదీన అఖండ ధ్యానం చేసేటప్పుడు పత్రీజీ వేణువు వాయిస్తూంటే నేను కూడా అదే సమయంలో అలాగే వేణువు ఊదడం .. అది అంతా విశ్వవ్యాప్తమవడం, ఆయన పాట పాడుతూంటే, నేను కూడా అదే పాట పాడటం, అది విశ్వవ్యాప్తమవడం, ఫ్లూట్, సితార వాయిస్తూ ఉన్నప్పుడు ప్రతి నరం, ప్రతి అణువు, ప్రతి కణజాలం అద్భుతంగా వయొలిన్ మీటినట్లు, సితార్ వాయించినట్లు పరవశించిపోయాయి. ‘ చైతన్య స్వర సమ్మేళనం ’ విశ్వవ్యాప్తమయినట్లు అన్పించింది.

డిసెంబర్ 27 వ తేదీన ఉదయం అఖండధ్యానం చేసేటప్పుడు పత్రీజీ ఫ్లూట్ వాయిస్తున్నారు. ఒక ప్రక్క సితార్, మరొక ప్రక్క ఢమరుకం అద్భుతంగా అనిపించాయి. అప్పుడు ఒక అద్భుతదృశ్యం చూసాను. విశ్వశక్తి చాలా ఎక్కువగా .. ఎంత ఎక్కువగా అంటే మాటలతో చెప్పలేము .. అంత ఎక్కువగా తయారయి, పరుగు పరుగున ఉరుకుతూ, దూకుడుగా రావటం, అది అందరిమీదా జల్లుగా కురుస్తూ మంచుపర్వతం మీద కూర్చున్న అనుభూతి కలిగింది. అప్పుడు సార్ కళ్ళు తెరవమన్నారు. కళ్ళు తెరిచినా కొద్దిసేపు ఆ అనుభూతి అలాగే ఉన్నది. ఒళ్ళంతా చల్లగా ఉంది. అంతా శివమయం. శివగంగలు కూడిన ఆ తరుణం నవసృష్టి నిర్మాణానికి నాందియే కదా.

ధ్యానయజ్ఞంలో జరిగిన ప్రోగ్రాంలు చూసిన తరువాత రూమ్‌లోకి వెళ్ళి అక్కడ చేస్తూ కూర్చోవటం, ఒకరోజు రూమ్‌కు వెళ్ళగానే కళ్ళుమూతలు పడి వెంటనే ఒక దృశ్యం కనిపించింది. చాలా ఎత్తుగా ఉన్న, ఎంత అంటే చాలా, భూమిమీద ఎవరూ అంత ఎత్తు ఉండరు. 10,12 అడుగుల పత్రీజీ, ఆయన వెనుక గ్రహం చాలా స్పష్టంగా కనిపించారు.

శ్రీశైలం యజ్ఞం ఎంతో బాగా జరిగింది. అతిరధమహారథులైన ఎంతోమంది మాస్టర్స్ ఈ మహా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు.

పత్రిసార్ చాలా ఆనందంగా 30 సంవత్సరాల తన కలలు నిజమయిన వేళ, ధ్యాన ప్రభంజనంలా ఉన్న శ్రీశైలంలో ఎక్కడ చూసినా ఆయనే కనిపించారు.

గ్రామాలలో వారిని కలిసి శ్రీశైలంలో జరిగిన విశేషాలు గురించి ముచ్చటించినప్పుడు, ఇష్టంగా పత్రీజీ తో షేక్‌హ్యాండ్ తిసుకోవటం, పత్రీజీ మాటలు ఎంతో శ్రద్ధగా వినడం, ఆయన ఎంతో తేలిక పదజాలంతో ఎంతో విడమిర్చి, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు గొప్పగొప్ప సత్యాలను ఎరుకపరచడం వల్ల ఆయనను తాము ఎంతో ఇష్టపడుతూ, ఆయనను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి గురువు దొరికినందుకు తమ ఆనందం వ్యక్తం చేసారు.

ఇక 2010 అమరావతి మహా యజ్ఞానికి సకల ప్రపంచదేశాలు కదిలి వస్తాయేమో. ‘ ధ్యాన మాహాచక్ర’ కు ఆకాశం పందిరి, భూమి స్టేజీని నిర్మించడం తప్ప వేరే దారిలేదు. వెల్కమ్ టు ధ్యాన మహాచక్ర.

 

N. సరోజ
ఖమ్మం

సెల్ : +91 8019317995

Go to top