" మాస్టరీ .. స్లేవరీ "

 

నా పేరు శ్రీదివ్య

నేను హైదరాబాద్ .. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ లో B.E రెండవ సంవత్సరం చదువుతున్నాను.

నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు .. 2004 సంవత్సరంలో మా అమ్మ, నాన్నల ద్వారా ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ప్రతిరోజూ క్రమం తప్పక ధ్యానం చేస్తూ ఉండటం వల్ల నేను తరగతిలో టీచర్స్ చెప్పేది సుళువుగా అర్థం చేసుకుంటూ .. అతి తక్కువ ప్రయత్నంతోనే .. నేను అనుకున్న దాని కంటే ఎక్కువ ఫలితాలను పొందుతూ .. ఇప్పటివరకూ నా చదువులో ఆగ్రస్థానంలోనే ఉంటున్నాను.

స్కూల్లో, కాలేజీలో మరి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా నా ఫ్రెండ్స్ తోనే కాకుండా మా ప్రొఫెసర్లకు కూడా ధ్యానం గురించి అవగాహన కలిగిస్తూ ఉంటాను. మా ఇంజనీరింగ్ కాలేజి ఆడిటోరియమ్లో " మెడిటేషన్ ఎమర్జెన్సీ ఫర్ స్టూడెంట్స్ " అని ఒక పవర్పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి మా ప్రొఫెసర్లతో ‘ శభాష్ ’ అనిపించుకున్నాను. అందుకే అందరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలతో మెడిటేషన్ తప్పక చేయిస్తే వాళ్ళకు జీవితంలో ఏమీ సమస్యలు ఉండవు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.

" ఇవన్నీ చెప్తోంది కదా " అని .. నేనేదో చాలా సీరియస్ టైప్ అనుకునేరు. చదువు, ధ్యానంతో పాటు ఏ సినిమా అయినా .. రిలీజ్ అయిన వారంలోగానే చూసేస్తాను. ధ్యానం చేస్తూనే ఇలా అన్నిటినీ ఎంజాయ్ చేయడం పత్రిసార్ ని చూసి నేర్చుకున్నాం.

2009 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒకసారి " ధ్యానాంధ్రప్రదేశ్ " ఆఫీస్లో పత్రిసార్ ని కలవడానికి వెళ్ళినప్పుడు " ఏమైన ప్రశ్నలున్నాయా ? " అంటూ సార్ నన్ను అడిగినప్పుడు " 2010 సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్ ? " అంటూ మళ్ళీ నేనొక సరదా ప్రశ్న వేస్తే .. సారొక సీరియస్ జవాబు ఇచ్చారు.

" ఇప్పటివరకు అంతా 2009 వరకు .. మనం పొలంలో విస్తృతంగా విత్తానాలు నాటాం. ఇక ఇప్పుడు 2010 సం||లో ‘ పంట కోసుకోవడం ’ అన్నది ప్రారంభం అయ్యింది.

" పిరమిడ్ మాస్టర్లం అందరం కలిసి ఇన్నాళ్ళూ విస్తృతంగా ధ్యానప్రచారం చేసాం. దాని ఫలితంగా ఇక ఇప్పుడు .. 2010 సం|| నుంచి .. యావత్ జనావళి అందరూ ధ్యానంలోకి వచ్చి ‘ జగమంతా ధ్యానమయం ’ అవుతుంది. ఇప్పటివరకు మనం చేసిన, మరి చేస్తూన్న, ధ్యాన ప్రచారానికి మరింత ఫలితంగా ఒక ‘ సునామీ ’ లా క్రొత్తక్రొత్త పిరమిడ్ మాస్టర్లు తయారు కాబోతున్నారు. క్రొత్త క్రొత్త మలుపులతో మనం ఒక క్రొత్త సునామీ ధ్యాన సంవత్సరాన్ని చూడబోతున్నాం " ..

" సర్, మనం అందరం ‘ మాస్టర్ల ’ మే కదా, మరి అసలు మాస్టరీ అంటే ఏమిటి ? " మళ్ళీ నాకు ఒక చిరుసందేహం.

పిస్టల్ నుంచి తూటా వచ్చినట్లు పత్రిసార్ నోట్లోంచి వెంటనే :

" ‘ మాస్టరీ ’ అంటే ‘ స్లేవరీ ’ లేకుండా ఉండడం. ‘ స్లేవరీ ’ అంటే .. ‘ వేరొకరి ఆధీనంలో బ్రతికే బానిసత్వం ’. ‘ మాస్టరీ ’ మరి ‘ స్లేవరీ ’ .. రెండూ కూడానూ మనలోనే .. మన ఆలోచనల్లోనే ఉంటాయి. ఏ విషయం పట్ల అయినా మనం బంధంలో గానీ, భయంలో గానీ ఉంటే అది ‘ స్లేవరీ ’ .. మరి అదే విషయం పట్ల .. బంధం లేకుండా నిర్భయంగా ఉంటూ స్వేచ్ఛగా ఉంటే అదే ‘ మాస్టరీ ’. ధ్యానం ఎల్లప్పుడూ మనపట్ల మనకు సంపూర్ణ అవగాహనను కలుగజేసి మన ఆత్మయొక్క నిరంతర అభయతత్వానికీ మరి స్వేచ్ఛకూ దారితీస్తుంది. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఈ మౌలికమైన సత్యాన్ని అద్భుతంగా ఔపోసన పట్టినవారే. మరి ‘ స్లేవరీ ’ లేని ‘ బానిసత్వం ’ లేని అసలైన సిసలైన మాస్టర్లే.

" ఈ లోకంలో ధ్యానం చేసే ప్రతిఒక్కరూ మాస్టర్లే .. అయితే అందులో ఒకరు 100 శాతం మాస్టర్ కావచ్చు. మరొకరు 89 శాతం మాస్టర్ కావచ్చు. నేను 100 శాతం మాస్టర్ని, మరి నువ్వు 100 శాతం మాస్టర్వా లేక 89 శాతం మాస్టర్వా ? " సూటిగా అడిగారు సర్ .

" 89 శాతమే సార్ " .. సమాధానం ఇచ్చేసా.

అప్పుడిచ్చారు సర్ ఒక ‘ పంచ్ ’ లాంటి మెస్సేజ్ :

" అంటే నీకు నాకు మాస్టరీలో కొంచెం శాతమే తేడా. అయితే ఆ కొంచెం శాతంలోనే లక్షమంది నీకూ నాకూ మధ్యలో ఉంటారు. ఆ కొంచెం శాతంలో ఉన్న లక్షమందిని దాటుకుని ‘ 89 శాతం ’ నుంచి ‘ 100 శాతం ’ చేరటమే నీ జీవితలక్ష్యం కావాలి. ఇదే మరి ప్రతి మాస్టర్ యొక్క జీవితలక్ష్యం కూడా " అంటూ ‘ మాస్టరీ ’, ‘ స్వేచ్ఛ ’, మరి ‘ జీవితలక్ష్యం ’ .. గురించి అద్భుతమైన సందేశాలిచ్చారు పత్రిసార్.


T. శ్రీదివ్య
హైదరాబాద్
E-mail : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top