" పత్రీజీ నోటివెంట ఏ మాట వృధాగా రాదు "

 

నా పేరు శ్రీ లక్ష్మి.

నేను ధ్యానంలోకి అడుగుపెట్టింది డిసెంబర్ 1998 లో. అప్పటినుండి పత్రీజీ ని కలిసిన ప్రతిసారీ ఎన్నో క్రొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను!

నేను మొట్టమొదటిసారి పత్రీజీ ని కర్నూలులో కలిశాను. అప్పుడు ఆయన అక్కడ టేబుల్ మీద ఉన్న "ప్రవక్త" అనే పుస్తకం తీసి, దాని వంక చూడకుండానే ఒక పేజి తెరిచి "ఇది చదవండి" అంటూ ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయారు. అందులో "మీ పిల్లలు మీద్వారా వచ్చారు; వాళ్ళు మీ పిల్లలు కారు; అటాచ్‌మెంట్స్ లో డిటాచ్‌మెంట్ చూడాలి" అని వ్రాసి వుంది. "నాకు పిల్లలంటే చాలా అనుబంధం కాబట్టి ఇచ్చారేమో" అని అనుకున్నాను. తరువాత కూడా చాలాసార్లు పిల్లల గురించీ, అనుబంధాల గురించీ చెప్పేవారు నాతో. కానీ ఆయన ఒక మహా ఈవెంట్ కి పది సంవత్సరాల ముందు నుండే నన్ను ప్రిపేర్ చేసారని 2008 మార్చి 14 న మా పెద్దపాప దేహత్యాగం చేసిన రోజున తెలిసింది. పత్రీజీ సర్వం తెలిసిన మహాజ్ఞాని అయినా కానీ ... ఏమీ తెలియనట్లుండే నిగర్వి. దటీజ్ పత్రీజీ!

మొదట్లో మేం విజయవాడలో ఉండేవాళ్ళం. అక్కడ సార్ ఒకరోజు "మేడమ్ మీ వాక్‌క్షేత్రం బాగుంటుంది; మీరు క్లాసెస్ తీసుకుంటారు; ప్రపంచానికి చక్కటి సందేశాలిస్తారు" అన్నారు. అప్పుడు "నేను ‘నేనేంటీ’?, ‘క్లాసెస్ తీసుకోవడమేంటి?’ ‘నేను ఎలా చెప్పగలను?’" అనుకున్నాను. ఇది జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత నేను స్కూల్స్ కి వెళ్ళి పిల్లలకు ధ్యానం నేర్పడం మొదలుపెట్టాను! ఇప్పటికిదాకా ఎన్నో వేలమంది పిల్లలకు ధ్యానం నేర్పాను! ఎన్నో క్లాసెస్ తీసుకుంటున్నాను! తన శిష్యులలోని బలాలు గుర్తించి, ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందడుగు వేసేలా చేస్తారు పత్రీజీ! ఆయన నోటివెంట ఏ మాట వృధాగా రాదు ...అని నాకు అర్థం అయ్యింది. ఆయన మాటలు గొప్ప శక్తిపాతాలు. దటీజ్ పత్రీజీ!!

మావారు .."శ్రీరామ్" గారు .. ఉద్యోగరీత్యా ముంబాయిలో నాలుగు సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు నేను, పిల్లలు మొదట్లో విజయవాడలో, తర్వాత హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. పత్రీజీ కి ఎప్పుడూ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పటం అలవాటు లేదు. కానీ ఆ రోజు సార్ ఇంటికి వెళ్ళినప్పుడు నా లోపలి నుండి "సర్ ని అడుగు" అనిపించింది. అప్పుడు నేను పత్రీజీని "సర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు మేం ఒకచోట, శ్రీరాం ఒకచోట? ఇంకా ఎన్నాళ్ళీ పరీక్ష మాకు?" అని అడిగాను. ఆయన నా వంక చూసి "‘TATA కంపెనీ’ నా జేబులో వుంది; నేను చెప్పగానే పంపించేస్తారు మీ ఆయన్ని" అన్నారు. నేనేమీ మాట్లాడలేదు. ఒక నమ్మకంతో ఇంటికి వచ్చేశాను.

తర్వాత పదిరోజులలో TATA కంపెనీ వాళ్ళు శ్రీరామ్ ని పిలిచి మేం పిలిచినప్పుడల్లా మీరు ముంబాయి వచ్చారు, అందుకని మీరు మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండి, హైదరాబాద్ నుండి వర్క్ చెయ్యండి" అని చెప్పారు! ఇది నిజంగా ఒక అద్భుతం, మిరాకిల్!! ఎందుకంటే, తన పోస్టింగ్ ముంబాయిలో తప్పించి హైదరాబాద్‌లో లేదు, ఇక్కడి నుండి అక్కడకు వర్క్ చెయ్యమన్నారు. ఇది చాలా అరుదు! ఇది నా గురువు నాకిచ్చిన అద్భుతమైన వరం! "గురువెప్పుడూ తన శిష్యులను చూసుకుంటారు" అనే దానికి మహానిదర్శనం ... దటీజ్ పత్రీజీ!!

పోయిన సంవత్సరం..2008 డిసెంబర్ మాసం చివరాఖరిన .. "బెంగళూరు ధ్యానమహాయజ్ఞం"లో ఒకరోజు "డాక్టర్ రేమండ్ మూడీ" గారు క్లాస్ తీసుకున్నారు. ఆయన ఉపన్యాసం అంతా విన్న తరువాత “ఆయనను కలవాలి ; ఆయనతో మాట్లాడాలి” అని చాల బలీయంగా అనిపించింది. కానీ చుట్టూరా విపరీతమైన జనం .. "కలవటం కుదరదేమో" అనుకుంటూ భోంచేయడానికి డైనింగ్‌హాల్‌కి వెళ్ళాను. అక్కడకు పత్రీజీ రేమండ్ మూడీ గారిని భోజనానికి తీసుకువచ్చారు. భోజనం అయిన తరువాత పత్రీజీ ఆయనను వెంటబెట్టుకుని బయటకు తీసుకు వెళ్తున్నారు. చాలామంది జనం వున్నారు. నేను చూస్తూ నిలబడ్డాను. పత్రీజీ వెళ్ళే ఆయన ఒక క్షణం ఆగి"మేడమ్! మీరు వీరిని కలవాలనుకున్నారుగా, కలవండి! అని పిలిచారు! వెళ్ళి షేక్‌హ్యాండ్ ఇచ్చి "ఆయన వెళ్ళిపోతున్నారుగా .. ఇప్పుడు మాట్లాడితే బాగుండదేమో" అని ఆలోచిస్తూంటే, అప్పుడు సర్ ... "మేడమ్! వీరితో మాట్లాడండి!" అన్నారు. చాలా సంతోషంగా అన్పించింది. నా కోరిక తీరినందుకు. నా మనస్సులో కోరిక పత్రిసార్ గ్రహించినందుకు చాలా ఆనందం వేసింది! దటీజ్ పత్రీజీ!!

ధ్యానంలోకి రాకముందూ, షిర్డీ వెళ్ళినప్పుడూ, ఇలా ఏది మనస్సులో అనుకుంటే అది జరిగేది. ఇప్పుడు మళ్ళీ అలా జరిగింది. "ఈయన షిర్డీబాబానే" అనిపించింది! "నా గురువుకి నేను ఏది చెప్పాల్సిన అవసరం లేదు" అనిపించింది. ఇంత బాగా తన శిష్యులను చూసుకుంటున్న పత్రీజీ కి శతకోటి ప్రణామాలు!

పత్రీజీ ని కలిసిన ప్రతిసారీ ఒక గురువుగానే కాదు, ఒక వ్యక్తిగా కూడా ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకుంటూనే ఉన్నాను. "ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతిసారీ భోజనం చేయకుండా, కనీసం ‘టీ’ అయినా త్రాగకుండా రాలేదు" అంటే అతిశయోక్తి కాదేమో. తను భోజనం చేస్తూ, ప్రక్కనున్న వారందరినీ తినమంటూ, ఆయన చూపించే ఆదరణ కన్నతండ్రి ప్రేమను గుర్తుకు తెస్తుంది. వారి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆయన గేటు వరకు వచ్చి పంపిస్తారు!! ఇది ఆయనలోని నిరహంకార తత్వానికీ, ప్రేమ తత్వానికీ నిదర్శనం. ఒక వ్యక్తిగా ఆయనలోని ధర్మనిబద్ధతని చూసి మనమంతా ఎంతైనా నేర్చుకోవచ్చు, దటీజ్ పత్రీజీ.

1998 లో మేం విజయవాడలో ఉన్నప్పుడు, పత్రీజీ అక్కడకు వచ్చినప్పుడు, మేం ఆయనతో ఎంతో సమయాన్ని గడిపేవాళ్ళం. "మేడమ్, షూట్ ఎ క్వశ్చన్ " అనేవారు. ఆయన నోటినుండి "‘ధర్మం’ అంటే ఏమిటి? ‘బుద్ధి’ అంటే ఏమిటి? ‘నెగిటివ్ థింకింగ్’ అంటే ఏమిటి?‘ఎరుకతో కూడిన ఆలోచనలు’ అంటే ఏమిటి? రెండింటికీ ఉన్న తేడా ఏంటి?" ఇలా ఎన్నెన్నో కాన్సెప్ట్స్ ఆయన్ను సూటిగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఇంత చక్కగా నాకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటున్నానంటే పత్రీసార్ నాకు అందించిన దివ్యసందేశాలే దానికి పునాది, క్లాసెస్ తీసుకుంటున్నానంటే ‘సర్’ నాకు అందించిన జ్ఞానమే దానికి పునాది. థ్యాంక్స్ టు పత్రీజీ.

ఒకరోజు సర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లోని ‘రిచార్డ్ బాక్" సందేశాలతో ఉన్న పెయింటింగ్ నాకు చాలా నచ్చింది. పత్రీజీ తో నేను "సర్,ఇది చాలా బాగుంది” అన్నాను. వెంటనే ఆయన "మీరు తీసుకువెళ్ళండి మేడమ్" అని దాన్ని దింపి కారులో పెట్టమన్నారు. ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాను. " అందరినీ సమానంగా చూడండి, అందరిలో ప్రేమతత్వాన్ని చూడండి" అని చెప్పే ఆయన, " ఆయన పాటించేదే చెప్తున్నారు" అనిపించింది. అయన ఏది పాటిస్తున్నారో చేస్తున్నారో అదే చెప్తున్నారు అనిపించింది!! దటీజ్ పత్రీజీ!!

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా ధ్యానులందరికీ ఎక్కడికి వెళ్ళినా ఎంతోమంది ఆత్మబంధువులు ఉన్నారు. ఇంత చక్కటి స్నేహసౌరభాన్ని ఈ సొసైటీ ద్వారా అందరం పొందుతున్నాం. Thanks to Patriji ! And that is Patriji !!!

 

శ్రీ లక్ష్మి
కర్నూలు

Go to top