" పత్రీజీ గురించి వ్రాయడం ఒక వరం "

 

హలో, నా పేరు లక్ష్మీ, మాది అనంతపురం. నేను 1999 జూలైలో ధ్యాన జీవితంలోకి ప్రవేశించాను.

నిరాశ, నిస్పృహలతో, అనారోగ్యంతో సతమతమవుతూ ఉన్నప్పుడు " ఆనాపానసతి " దొరికి, పట్టుబట్టి ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. నిత్యధ్యానసాధన, నిత్యసత్యశోధనలో ఉన్న నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో సంఘటనలతో అపురూపమైన జ్ఞానాన్ని అందించి " నువ్వు రాయివి కాదు రత్నానివి .. ధ్యాన రత్నానివి " అని తేల్చేసారు జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ.

పత్రీజీ గురించి వ్రాయడం ఒక వరం. ఆయన మాటలలో, చేష్టలలో, స్పర్శలో, చూపులలో .. వెరసి ఆయన ప్రతి కదలికలో కూడా మర్మగర్భంగా జ్ఞానం ఇమిడి ఉంటుంది. అంతర్ముఖులమై, శ్వాసానుసంధానులమై ఆయనను అనుసరించినప్పుడు వారి ఆంతర్యం కొంతవరకు అందుకోవచ్చు.

" మిస్టరీ ఆఫ్ ది మాస్టరీ "

సార్‌తో కలిసి నేను, ప్రతాప్ రెడ్డిగారు, సాయికుమార్ రెడ్డిగారు, రవిచంద్ర గారు ఒకసారి " శివమొగ్గ " వెళుతున్నాము. " అందరినీ ‘ గ్రేట్ మాస్టర్స్ ’ అనేస్తుంటారు సార్ .. ఏంటో ఈ మిస్టరీ ? " అని నా మనస్సులో ఎన్నాళ్ళుగానో ఒక సందేహం ఉండేది. ఇంతలో సార్ " ప్రతాప్, ఒక ప్రశ్న అడగవయ్యా , మంచి కాన్స్‌ప్ట్ చెప్తా " అన్నారు.

" ధ్యానంలో అన్నీ తెలుసుకోవచ్చని మీరే చెప్తారు కదా సార్, కాబట్టి అన్నింటి గురించి ధ్యానంలో తెలుసుకుంటా, కానీ మీ గురించి మాత్రం తెలుసుకోలేను. మీ గురించిన జ్ఞానం కావాలి .. అది చెప్పండి సార్; ఎందుకంటె మొన్న ఆ ఊర్లో చాలా కష్టపడి చాలామందిని పిలిచి క్లాసు బాగా చెప్తారు ’ అనుకుంటే తీరా మీరు వచ్చి మైకు సరిగ్గా పనిచేయలేదని .. మైకు విరగగొట్టి ఆ మైకు పిల్లాడిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి రసాభాస చేస్తిరి. ఆ దెబ్బతో నిన్న ఈ ఊర్లో జనం రాలేదు.

" ఎవరి లక్ష్యం వారే నిర్దేశించుకోవాలి "

" ‘ ఇక ఈ రోజు మాకుంటుంది పూజ ’ .. అని మేం భయపడి దూరంగా ఉంటే మీరేమో .. అద్భుతమైన కాన్స్ ప్ట్ లతో, జోకులతో క్లాస్ చెప్పి .. మమ్మల్ని పొగిడి సంతోషపెడ్తిరి, మొన్నేమో అలా, నిన్నేమో ఇలా .. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్తే, మీ గురించి అంతా తెలిసినట్లే " అన్నారు ప్రతాప్ సార్.

దానికి పత్రిసార్ గట్టిగా నవ్వి " గదేరా బేటా మాస్టరీ అంటే. అది నీకు తెలిస్తే నీవు అక్కడ కూర్చోవు, నేను ఇలా కూర్చోను. ‘ సార్ ఇలా చెప్తారు, ఇలా ఉంటారు, మెచ్చుకుంటారు, తిడ్తారు ’ .. అంటూ అన్నీ నీవనుకున్నట్లే చేస్తే నేను నీ ఊహల్లో బందీనౌతా కదా. అప్పుడు నేను విముక్తాత్మను ఎలా అవుతాను ?. కాబట్టి నీ ఊహల్లో కూడా బందీ కాకుండా ఉండడమే ‘ నా మాస్టరీ ’ " అంటూ మాస్టర్ మిస్టరీ ని విడగొట్టారు పత్రీజీ.

" వ్యక్తి ముఖ్యం కాదు "

హోస్పేట్ నుండి ఎమ్మిగనూరుకు కారులో సార్‌తో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సార్ " మేడమ్, దిసీజ్ యువర్ ఫైనల్ స్పిరిచ్యువల్ B.Ed ట్రైనింగ్ క్లాస్. జాగ్రత్తగా వినండి. ఎప్పుడూ కూడా ఒక మాస్టర్‌కు ఏ వ్యక్తి కూడా ముఖ్యం కాదు. వ్యక్తిని పట్టుకోవద్దు, వ్యక్తి చెప్పిన శాస్త్రం మనకు ముఖ్యం. జ్ఞానం అందరి నుంచి తెలుసుకోవాలి. సాధన మాత్రం ఇదే చేద్దాం. ఇంతకంటే సుళువైంది ఏదైనా మీకు దొరికితే నాక్కూడా చెప్పండి, నేను చేస్తాను. ఇక నుంచి మీ దారిని మీరే నిర్మించుకోవాలి. మీ లక్ష్యం మీరే నిర్దేశించుకోవాలి. ఎవ్వరిమీదా ఆధారపడవద్దు " అని నన్ను ఆజ్ఞాపించి ఆ రోజు నుండి ధ్యానజగత్ నిర్మాణంలో నేను సైతం పాలుపంచుకుని నా జీవితలక్ష్యం నేను నెరవేర్చుకునేలా చేసుకుని విముక్తురాల్ని అవడానికి అవకాశం కల్పించారు జగద్గురువు పత్రీజీ.

అనంతపురంలో తులసి మేడమ్ ఇంట్లో .. సార్ ఉన్నప్పుడు నేనూ అక్కడికెళ్ళా. అందరూ దూరంగా ఉన్నారు, సోఫాలో పడుకున్నారు సర్. 90 లేక 100 కేజీల ఒక మనిషి సార్ పైకి ఎక్కి తొక్కుతున్నాడు. " అందరికీ అయింది పూజ, నీకుందిలే పో .. " అని అన్నారు బయటివాళ్ళు.

నేను నిశబ్దంగా వెళ్ళి సార్‌కు ఎదురుగా కూర్చున్నాను. " లక్ష్మీ మేడమ్ మీకు తెలుసా? .. నాకు కళ్ళు నెత్తిమీదికొచ్చాయి. మీరెవరూ నాకు కనబడరు .. నేనిక కింద తిరగను, పైనే తిరుగుతా " అన్నారు.

" దానిదేముంది లెండి సార్; మీరెలా అనుకుంటే అలా జరుగుతుంది. విమానాలలో తిరుగుతారు లెండి. అప్పుడు కూడా ఇప్పుడు మీ దగ్గరే నేను ఎలా ఉన్నానో అలానే ఉంటా సార్ " అన్నాను నేను.

వెంటనే సార్ " అంత వుందా నీకు, మహా, మహా వికెట్లన్నీ పడిపోయాయి నా దెబ్బకు. నీవు నాకొక లెక్కా .. ‘ ఉఫ్ ’ మని ఊదేస్తా " అంటూ నా కళ్ళలోకి ఊదుతూ చూసారు ఓ ఐదు నిమిషాలు. నేనూ రెప్పలార్పకుండా అలాగె చూస్తున్నా. వెంటనే తలమీద తడ్తూ " లక్ష్మీమేడమ్ చాలా గట్టిదే ; నిలబడుతుంది " అన్నారు. దటీజ్ పత్రీజీ !!

ఇంకొకసారి సార్‌తో కలిసి కారులో మైసూరు వెళ్తున్నాను. " సార్, మీరు చెప్పిన కాన్స్‌ప్ట్స్ చాలామంది నేర్చుకుని చెప్తున్నారు. మీలా చాలామంది పాటలు కూడా పాడుతున్నారు. సబ్జెక్టు చాలామంది చెప్తున్నారు. మీలోని క్వాలిటీస్‌ని ఒక్కొక్కరుగా అన్నీ చేయగలుగుతున్నారు. ఫ్లూట్ మాత్రం ఎవరూ వాయించలేక పోతున్నారు సార్. అసలు మీలో మీకు నచ్చిన క్వాలిటీ ఏదిసార్ ? " అంటూ నా సందేహాన్ని వెలిబుచ్చాను.

" నా ఫ్లూట్ నాకిష్టం .. కానీ అంతకంటే నేను ఎక్కువ ఇష్టపడేది నా గాత్ర సంగీతాన్ని. ఎందుకంటే నాలాంటి వాయిస్ ఇంకెవరికీ లేదు. అందుకే నా గాత్ర సంగీతమంటేనే నా కిష్టం. సరే కానీ మేడమ్, నా గురించి అంతా ఏమనుకుంటున్నారు ? మన మూవ్మెంట్ ఎలా సాగుతోంది ? గడిచిన సంవత్సరానికీ, ఈ సంవత్సరానికీ తేడా ఎలా ఉంది ? " అంటూ సార్ అడిగారు.

" గడిచిన సంవత్సరంలో విప్లవంలా సాగిన మన మూవ్మెంట్ ఈ సంవత్సరం ప్రభంజనంలా సాగుతోంది. ఇక మీ గురించి కొత్త కొత్త మాటలు వింటున్నాను సార్. మీకు ఈ మధ్యలో కోపం తగ్గిందట .. మీరు మారారట. ‘ పత్రిసార్ ముందులా లేరు చాలా మారారు ’ అని అంటున్నారు సార్ " అని చెప్పాను.

" అవునా, అలా అంటున్నారా, కానీ నేనేమీ మారలేదుగా, మారింది నేను కాదు. వాళ్ళే, వాళ్ళకే జ్ఞానం పెరిగింది మేడమ్ " అన్నారు సార్.

సార్‌తో కలిసి నేను పైమా ఆనంద్, ప్రదీప్ బెంగళూరు వెళ్తున్నాం. ప్రదీప్ అడిగాడు " సార్, మీతో ఉండాలంటే ఎలా ఉండాలి ? " అని.

" ఏముంది చలిమంట ముందు ఎలా ఉంటావో అలా ఉండాలి. మంట బాగుంది కదా వెచ్చదనం ఇస్తుంది అని కౌగలించుకుంటే ఏమవుతుంది ? కాలిపోతావు .. ఎంతదూరంలో ఉంటే బాగుంటుందో అంత దూరంలో ఉండాలి. అలాగె ఇక్కడ కూడా ‘ సార్ నవ్వుతూ ఉన్నారు ’ అని అతి చేస్తే అంతే .. కాలిపోతారు " అంటూ గురువు దగ్గర ఎలా ఉండాలో .. క్రొంగొత్త రూపంలో తెలిపారు పత్రీజీ. దటీజ్ పత్రీజీ.

ఇలా ఎన్నో, ఎన్నెన్నో అద్భుత సంఘటనలు, చేష్టలతో, చూపులతో, చేతలతో మాటలతో మనకు జ్ఞానాన్ని అందిస్తూ మనల్ని మాస్టర్లుగా మలుస్తోన్న పత్రీజీ కి మనమేమి ఇవ్వాలి ? మన నుంచి అసలు ఆయన ఏం ఆశిస్తున్నారు ? .. ఆ పరమగురువు మాటలలోనే విందాం.

అనంతపురంలో ఒక ప్రోగ్రాం ముందురోజు సార్ నాకు ఫోన్ చేసి " ఏంటి మేడమ్, అంతా రెడీనా ? ప్రోగ్రాం ఏంటి ? అని అడిగారు. " సార్ మీరు రావడం .. ర్యాలీ, ఆ తర్వాత క్లాస్. మరి మీకు ‘ ప్రెష్ అప్ ’ ఎక్కడ ఏర్పాటు చేయాలి ? మా ఇంట్లో అంటే మా ఇంట్లో .. అని అందరూ అడుగుతున్నారు. మీరు ఎక్కడ ఏర్పాటు చేయమంటే అక్కడ ఏర్పాటు చేస్తాం " అన్నా.

" అవును మేడమ్ అందరూ ‘ మా ఇంట్లో కాలుపెట్టండి ’ ‘ మా ఇంటికి రండి ’, ‘ మా ఇంట్లో దిగండి ’, అనే వాళ్ళే వీళ్ళందరూ. ఇంటిలోపలే పని చేసేవాళ్ళు నాకొద్దు. నాకు ’ఇంటిలోపల’ పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ‘ ఇంటి బయట ’ నా యొక్క ఆశయానికి అనుగుణంగా పని చేసేవాళ్ళు నాకు కావాలి " అన్నారు .. దటీజ్ పత్రీజీ.

అర్థం అయింది కదండీ ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నారో, అదే .. ధ్యానజగత్తు కై ధ్యానప్రచారం.


లక్ష్మీ
అనంతపురం

Go to top