" మిలటరీ ఆఫీసర్ "
అసలైంది, ఆత్మస్వరూపాన్ని తెలిపేది ధ్యానం

" నాయనా నరేంద్ర, ఈ నాటితో నీ జపయోగం ముగిసింది ; అసలైంది, ఆత్మస్వరూపాన్ని తెలిపేది ధ్యానం ; దీన్ని గురించి పూర్తిస్థాయిలో బోధించగల ఏకైక గురువు ఒకరు వున్నారు; నీ జన్మకారణం ఆయనతో కలిసి పనిచేయటమే”


రాజశేఖర్ : విశేష ధ్యానప్రచారం నిర్విరామంగా చేసే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌లో మీరు ప్రముఖులు. మీ గురించి పాఠకులకు సవివరంగా చెప్పండి సార్.

నరేంద్ర : నా పేరు నరేంద్ర ముదల్కర్. హైదరాబాద్ లోనే మరాఠీ కుటుంబంలో జన్మ తీసుకున్నాను. గత యాభై సంవత్సరాలుగా మా పూర్వీకులు ఇక్కడే స్థిరపడ్డారు. " దుర్గాజీరావు ", " ప్రమీలాబాయి " నా జన్మకారకులు. మేము ముగ్గురం అన్నదమ్ములం, ఒక సోదరి. బట్టల వ్యాపారం మా వృత్తి. 1993 లో M.com పూర్తిచేసాను.

ఇప్పుడు మన " పిరమిడ్ సొసైటీ " ఎలా వుందో అప్పుడు " స్వాధ్యాయం " అనే సంస్థ ముంబయిలో వుండేది. దాని ఫౌండర్ శ్రీ పాండురంగశాస్త్రీ అటోలే. ఆ సంస్థ బ్రాంచ్ హైదరాబాద్ లోనూ అప్పుడూ, ఇప్పుడూ కూడా వుంది.

19-10-1991 న వారి పుట్టినరోజు సందర్భంగా 3,000 మంది స్కూటర్ ర్యాలీగా బయలుదేరి ఔరంగాబాద్ వెళ్తున్నారు. ఒక్క మనిషి కోసం ఇంతమంది వెళ్ళటం వింతగా తోచి కేవలం ఆసక్తితో నేను కూడా వారివెంట వెళ్ళాను. ఆ రోజు అక్కడ చేరిన జనసమూహం ఒక లక్షమంది. సంస్థ వారు ర్యాలీగా వెళ్ళిన మాకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చి పాండురంగశాస్త్రి గారిని కలిసే అవకాశం ఇచ్చారు. ఎంతో తేజోమయంగా వున్న ఆయనను చూడగానే నాకు మతిపోయినట్లయింది. ఆయన వైబ్రేషన్స్ నాకు చాలా హాయిగా అనిపించాయి. నన్ను చూడగానే ఆయన " ఏంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ‘ మిలటరీ ఆఫీసర్ ’ ను పంపించారు ? " అన్నారు. నాకు విషయం ఏమిటో అర్థం కాలేదు. ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో నూనూగు మీసాలతో సన్నగా వుండే నన్ను ఆయన అలా ఎందుకు అన్నారో తెలియలేదు కానీ వారి ఆ రోజు బోధనకు ప్రభావితుడినై హైదరాబాద్ చుట్టుప్రక్కల ఆయన ప్రవచనాలు ప్రచారం చేసేవాడిని.

రాజశేఖర్ : వాళ్ళ సంప్రదాయం ఏంటి ?

నరేంద్ర : వారు ఎక్కువగా గీతాప్రచారానికి ప్రాముఖ్యతను ఇచ్చేవారు. " త్రికాల సంధ్య " అంటారు. " రోజుకు మూడుపూటలా చేయవలసిన గీతాశ్లోకాల పఠన మానవాళికి ఎంతో అవసరం " అన్న ఉద్దేశ్యం వారిది. ప్రతి ఊరికీ వెళ్ళి ప్రజలందరికీ నేర్పేవారు. ఇది నాకు నచ్చటంతో .. ఒక్క ప్రక్క నుంచి చదువుకుంటూనే విస్తృత ప్రచారం చేసి ఆ సంస్థలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలిగాను.

ఆ సంస్థ కూడా మనలాగానే " గుళ్ళు గోపురాలు " లాంటి వాటికి వ్యతిరేకమే. వాటికంటే ఈ ప్రచారంలో కొంత గొప్పతనాన్ని గుర్తించాను. ఎవరు ఏ గొప్పతనాన్ని అర్థం చేసుకున్నా అది పదిమందికీ పంచాలనే కోరిక కూడా అప్పుడే కలిగింది. ఇంకా ఇంకా పెరిగింది. " ఇక్కడ నేర్చుకోవలసింది అయిపోయింది " అనిపించగానే ఇంకా లోతులు తెలుసుకోవటానికి ముంబయిలోని " తత్వజ్ఞాన విద్యాపీఠం " లో జాయిన్ అయ్యాను. రెండు సంవత్సరాలు అక్కడే ఉండిపోయాను. అక్కడి బోధనలు అసంఖ్యాకంగా వినటమే కాకుండా వాళ్ళు రికమెండ్ చేసిన ఎన్నెన్నో పుస్తకాలు చదివాను. కానీ నా దాహర్తి తీరలేదు. ఎందుకో .. " అసలు గమ్యం ఇది కాదు " అని బలంగా తెలిసేది.

అప్పుడు గుర్తుకువచ్చింది " గాయత్రీమాత " .. నా తల్లి నా చిన్నప్పటినుంచి ఉగ్గుపాలతో రంగరించి నేర్పిన గాయత్రీ మంత్రం స్మృతిలోకి తెచ్చుకుని " ఆధ్యాత్మికతను అసాంతం ఆస్వాదించాలి. నీవే నాకు తరుణోపాయం చెప్పాలి " అని ఆ మాతను ప్రార్థించి .. ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల నిరంతర మంత్రజపం చేసాను. ఐదులక్షలలో ఆఖరి ఒకటి జపిస్తూండగా నేను బాహ్యస్మృతిని కూడా కోల్పోయాను. ఆ తర్వాత ఎన్నో లక్షల తల్లుల ఆత్మీయ, అలౌకిక మమకారం గల " ఒక నూతన స్పర్శ " నన్ను తాకింది. పొత్తిళ్ళలో బిడ్డను హత్తుకున్నట్లుగా తన హృదయానికి హత్తుకుంది. కళ్ళు తెరిచి చూసాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. సూర్యకాంతిని మించిన ప్రకాశంతో .. ఎర్రని చీరతో .. ఆర్ద్రంగా, అనురాగంతో వున్న కళ్ళతో ‘ స్త్రీమూర్తి ’ దర్శనం ఇచ్చింది.

రాజశేఖర్ : ఆమె ఎవరో అడగలేదా ?

నరేంద్ర : అడిగాను. " నువ్వు ఎవరికోసం కష్టపడ్డావో ఆమెనే నేను ; గాయత్రిని " అన్నారు ఆమె.

రాజశేఖర్ : ఆమె ఆకృతి ఎలా వుంది ?

నరేంద్ర : మామూలుగా మనం ఫోటోలలో ఎలా చూస్తామో అలాగే వుంది. నిజస్వరూపంలో దర్శనమిస్తే మనం గుర్తించలేం కాబట్టి ఆమె అలా వచ్చారనిపించింది.

నేను ఆ మాతృమూర్తికి నమస్కారం పెట్టాను. అప్పుడు ఆమె " ఏ లాభాన్ని కోరి సామాన్యులకు సాధ్యంకాని అన్ని జపాలు చేసావు ? " అన్నారు. నేను కొంత అయోమయానికి లోనయ్యి " మిమ్మల్ని దర్శించాలని " అన్నాను. ఆమె ఎంతో సంతోషభరితురాలై " నీకు ఏం కావాలో అడుగు తక్షణం ఇస్తాను " అన్నారు. " జనన మరణాంతరం కూడా నా దగ్గరి నుంచి ఎవ్వరూ లాక్కోలేనిది నాకు ప్రసాదించు " అన్నాను. ఆమె చిరునవ్వు నవ్వి " నువ్వు ఏం కోరుతున్నావో నీకు తెలుసా ? " అన్నారు. " నాకు అంత స్పష్టంగా తెలియటం లేదు కానీ నాకు అదే కావాలి " అన్నాను. " నువ్వు కోరుకున్నది ఇస్తే దాన్నేం చేసుకుంటావ్ ? " అంది ఆమె.

" ప్రపంచమంతా అస్తవ్యస్తంగా, అల్లకల్లోలంగా, అశాంతిగా వుంటోంది. దేనివలన అన్నింటికీ ఉపశమనం కలిగి ఊరట, తృప్తి, ఆనందం కలుగుతాయో ఆ అసలైన ఆధ్యాత్మిక స్థితిని వరంగా ఇస్తే నేను ప్రపంచమంతా ప్రచారం చేస్తాను " అన్నాను. అప్పుడు ఆమె " నాయనా నరేంద్ర నరేంద్ర, ఈ నాటితో నీ జపయోగం ముగిసింది. అసలైంది, ఆత్మస్వరూపాన్ని తెలిపేది ధ్యానం. దీన్ని గురించి పూర్తిస్థాయిలో బోధించగల ఏకైక గురువు ఒకరు వున్నారు. నీ జన్మకారణం ఆయనతో కలిసి పనిచేయటమే " అన్నారు. అప్పుడు నేను " అమ్మో,! ఇంతటి బృహత్కార్యం చేయటానికి నాకు శక్తి సరిపోదు. నువ్వు భౌతికంగా నాతో కలిసి వుంటే నేను నిరంతర శక్తిసంపన్నుడిని అవుతాను " అన్నాను.

అప్పుడు ఆమె " ఇది చాలా పెద్ద కోరికే. నీకు ఏం కావాలో అది ఇస్తాను అనటం ఒక కారణమైతే .. లోకకళ్యాణార్థం అడిగావు కాబట్టి ‘ నీ కూతురి ’ గా పుట్టి నీ ఇంటిని పుట్టింటిని చేసుకుంటాను " అని చెప్పి అదృశ్యమయ్యారు. నేను ఇంక మాత చెప్పిన " మహితాత్ముడి " కోసం అన్వేషణ మొదలుపెట్టాను. ఈ అన్వేషణలో ఒక భాగంగా మా ఇంటిప్రక్కవారు ఒకసారి నాతో " నీ అన్వేషణ మొదలుపెట్టి రెండు సంవత్సరాలు దాటింది కదా, మేము ఆ మధ్యకాలంలో ఒకసారి ‘ కర్నూలు పిరమిడ్ ’ కు వెళ్ళి ధ్యానం చేసి అపరిమిత ఆనందం పొందాం. మీ ఆధ్యాత్మిక చింతన, అన్వేషణ అత్యధికంగా వున్నాయి కాబట్టి మీరు కూడా వెళ్ళివస్తే బాగుంటుంది " అన్నారు.

దాంతో నేను, మా అమ్మగారు, వి. శ్రీనివాసాచారి అనే మా మిత్రుడు కలిసి " కర్నూలు పిరమిడ్ " కు వెళ్ళాం. అప్పుడు అక్కడ ఉన్నవారు మాకు ధ్యానం నేర్పారు. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు వారంరోజులపాటు ధ్యానం నిర్విరామంగా చేసి అలౌకిక ఆనందం పొంది సరిగ్గా ఎనిమిదవ రోజున హైదరాబాద్ వచ్చేద్దామని పిరమిడ్ గేట్ బయటకు వచ్చాం. నేను ‘ ఆటో ’ పిలవటమే ఆలస్యం. ఒకటి రెండు నిమిషాలలో పిలిచేవాడిని కూడా. అకస్మాత్తుగా మా ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి ముందు క్రిందికి పాదం మోపినవారు బ్రహ్మర్షి పత్రీజీ. లోపలికి వస్తూనే " నువ్వు లోపలికి రా " అని సైగ చేసారు. నేను, అమ్మ, శ్రీనివాసాచారి లోపలికి వెళ్ళాం.

అప్పటికే అక్కడ కర్నూలు ధ్యానులు పదిమంది వరకు వున్నారు. సార్ వారందరినీ పిలిచి " మన సంస్థలోకి ‘ సింహం ’ వచ్చింది ; గట్టిగా చప్పట్లు కొట్టండి " అని కొట్టించారు. మొదటిరోజులలో పాండురంగశాస్త్రి గారు " మిలటరీ ఆఫీసర్ " అని ఎందుకు అన్నారో, ఇప్పుడు సార్ “సింహం “ అని ఎందుకు చెప్పారో అప్పట్లో నాకు తెలియలేదు. నేను కాస్త తికమకలోపడ్డాను. ఇంతలో సార్ " నీ స్కూల్ విద్యాశిక్షణ అయిపోయింది ; ఇప్పుడు కాలేజీకి వచ్చావు ; ఇంక నీ జీవితధ్యేయం ధ్యానప్రచారమే " అన్నారు. నాకు చటక్కున గాయత్రీమాత " నీ జపయోగం ముగిసింది ; ఇంక ధ్యానయోగమే, " అన్న మాటలు గుర్తుకువచ్చి "ఆ మాత చెప్పిన మహనీయుడు సారే " అని అంతరాత్మలో గట్టిగా అనిపించింది. సార్ గాయత్రీమాత అనుభవాన్ని ఆ విధంగా ధృవీకరణ కూడా చేసారు.

రాజశేఖర్ : ఇంక అక్కడి నుంచి పత్రిసార్‌తో మీ సాన్నిహిత్యం ఎలా ఎంతకాలంలో పెరిగింది ?

నరేంద్ర : ఇప్పుడూ, అప్పుడూ కూడా సార్ ఇంటికీ, మా ఇంటికీ వున్న దూరం పదినిమిషాల నడక మాత్రమే. ఈ సౌకర్యం వలన నేను సార్‌ను ఎన్నోసార్లు కలవటం .. ఎన్నెన్నో ఊర్లు కలిసి ప్రయాణించటం జరిగింది. ఈ అనుభవాల వలన " ఏదో వుంది .. ఇంకా ఏదో వుంది " అనే సందేహాస్పద భావం పోయి " ఆ ఉన్నదేదో ఈయన దగ్గరే వుంది ; ఈయన చెప్పే ధ్యానంలోనే వుంది ; ఈయనే నా అన్వేషణకు మూలపురుషుడు " అని పూర్తి ధృవీకరణ జరిగింది. అక్కడి నుంచి నా ధ్యానప్రచారం అత్యంత ముమ్మరంగా, వేగంగా సాగింది.

పత్రిసార్ వలన నాకు అనంతమైన, అవధులు మించిన అనురాగం ఎలా వుంటుందో స్పష్టంగా అర్థమైంది. మమకారానికి మరోపేరు పత్రీజీ. " సద్గురు సాన్నిధ్యం " ఒక " గురువు " లాగా కాకుండా ప్రియాతిప్రియమైన " స్నేహమాధుర్యాన్ని " వెదజల్లింది.

అప్పటినుంచి ఇప్పటివరకూ కూడా ఎప్పుడు సార్ ప్రక్కన కూర్చున్నా చాలు ఆయన అంతరాలలో వున్న ఎన్నో విచిత్ర విశేష ఆధ్యాత్మికతలు నా అంతరాత్మకు అందుతూ వుంటాయి. మేము మాట్లాడుకోవటం తక్కువ. మౌనంగా కూర్చుంటే అలా అలా అలలలా వస్తూంటాయి. అవే నేను స్టేజీ మీద కూర్చోగానే నా ప్రయత్నం లేక్ండా ప్రవాహంలా వచ్చేవి. పత్రీజీ Consciousness & Energy ఎప్పుడూ నాతోనే వుంటోంది. ఆ శక్తి నాతో ధ్యానప్రచారం చేయిస్తోంది. నేను కేవలం ఒక పరికరంలా వుండడం వలన స్వామికార్యం - స్వకార్యంలా నా స్వవికాసం అవుతూ వచ్చింది.

రాజశేఖర్ : మీ ఆధ్యాత్మిక అనుభవాలు ఇంకా వివరించండి.

నరేంద్ర : రోజురోజుకూ ఆధ్యాత్మికం యొక్క అవగాహన పెరుగుతూ " కర్మసిద్ధాంతం " అన్నది బాగా ఆకళింపు అయ్యింది. ముఖ్యంగా భౌతికతకూ, ఆధ్యాత్మికతకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని అవగతం చేసుకోగలిగాను.

నా ధ్యానప్రచారంలో ప్రతి శనివారం రాత్రి ఏదో ఒక ఊరు వెళ్ళి అక్కడే పడుకుని ఆదివారం అంతా క్లాస్ చెప్పి రావటం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. ఈ పరంపరలో ఓసారి శంషాబాద్ దగ్గర ‘ గొల్లపల్లి ’ కి బయలుదేరాను. అప్పటికే నాకు తీవ్రమైన జ్వరం వుంది. దానికి తగ్గట్లుగానే అంతకుముందు రోజు కాలు మడతపడి ఇంతలావున ఉబ్బి వుంది. నడవటమే కష్టంగా వున్నా అలాగే వెళ్ళి ఆ ఊర్లో బస్ దిగాను. నా చేతిలో బరువుగా వున్న లగేజీ కూడా వుంది. దిగినచోట అంతా నిర్మానుష్యంగా వుంది. నాకు ఒక్కసారిగా నీరసం ముంచుకు వచ్చింది. " ఇంత అనారోగ్య స్థితిలో లగేజీ మోసుకుంటూ దాదాపు ఒక కిలోమీటర్ నడవటం అవసరమా ? " అని కూడా అనిపించింది. " తిరిగి శంషాబాద్ వెళ్ళిపోదాం " అన్నంత విరక్తిభావం.

ఎక్కడి నుంచి వచ్చాడో .. చీకటిలో నుంచి పుట్టుకొచ్చినట్లుగా .. నల్లగా వున్న ఒక పదిహేను సంవత్సరాల కుర్రవాడు వచ్చాడు. ఫలానా అని చెప్పలేని ఏదో కళ ఉట్టిపడుతోంది. కాకీ నిక్కరు, తెల్లని చొక్కా వేసుకుని వున్నాడు. " నీ లగేజీ నేను మోస్తా సార్ " అంటూ ఊరి దాకా తీసుకువచ్చాడు. తన పేరు ‘ గోవర్ధన్ ’ అనీ, తన వ్యాపారం ‘ పాలవ్యాపారం ’ అనీ చెప్పాడు. తర్వాత రోజు క్లాసుకు తప్పక వస్తానని గట్టిగా చెప్పాడు. కానీ రాలేదు. నేను అరాతీస్తే అసలు ఆ పేరు గల పదిహేను సంవత్సరాల ‘ గోవర్ధన్ ’ అనే పాల వ్యాపారి ఆ ఊళ్ళో లేనేలేడని తెలిసింది.

తర్వాత పత్రిసార్‌తో చెప్తే " ఓరి ఓరి, కృష్ణుడితో లగేజీ మోయించావా ? " అనేసరికి నిర్ఘాంతపోవటం నా వంతు అయింది. గోపాలురకోసం గోవర్ధనపర్వతాన్ని ఎత్తిన నల్లనయ్య నా ఒక్కడి కోసం వచ్చి లగేజీ మోయటం ధ్యానప్రచారం అంటే ఆయనకు ఎంత మక్కువో పెద్దపెట్టున అర్థమైంది.

రాజశేఖర్ : ఇది చాలా బాగుంది , ఇలాంటివి మరికొన్ని.

నరేంద్ర : మరోసారి వారంరోజుల అవిశ్రాంత ధ్యానప్రచారం చేసి విపరీతంగా అలిసిపోయి వున్నాను. మరుసటిరోజు ప్రొద్దున్నే మహారాష్ట్ర లోని " డెగ్లూరు " అనే ఊరుకు ప్రయాణం. ఎన్నో ఊర్ల తర్వాత వచ్చే ఊరు అది. సీట్లో కూర్చున్న మరుక్షణం అంతులేని నిద్ర. కండక్టర్ రావటం, టికెట్ తీసుకోమనటం ఏమీ తెలియదు. అక్కడ నిద్రపోయిన నేను డెగ్లూరు లోనే నిద్రలేచాను. నేను, మరొకాయన తప్ప మరెవరూ లేరు. నేను తెల్లబోయి ఆయన వంక చూసాను. ఆయన మందహాసం చేసి " మీరు డెగ్లూర్‌లో దిగుతారని నాకు తెలిసిపోయింది. మీ నిద్ర చెడగొట్టడం ఇష్టంలేక నేనే టికెట్ తీసుకున్నాను. ఈ ఊర్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి ? " అన్నారు. నేను తేరుకుని " ముందు మీరు ఎవరో చెప్పండి? " అన్నాను. ఆయన మరో చిరుమందహాసం చేసి " నా పేరు దత్తు ; మీరు ఎవరింటికి వెళ్ళాలో చెప్పండి " అన్నారు. నేను తేరుకుని " సత్యనారాయణ గారింటికి " అని చెప్పాను. వెంటనే ఆయన " ఓహో ! సత్యానారాయణా ? మనవాడే ; మేమిద్దరమూ బాగా తెలిసినవారమే " అని నన్ను దించి అటో ఎక్కించి ప్రక్కన కూర్చున్నారు. నేను బస్ ఫేర్ తీసుకోమని ఎంత బలవంతం చేసినా " తీసుకుంటానులే " అంటూ నన్ను మాటలలో పెట్టేసారు. సత్యానారాయణ గారింటికి వెళ్ళాం. ఆయన నన్ను ఇంటిముందు దించి " నేను వెళ్ళివస్తాను " అన్నారు. " అదేంటి ‘ సత్యనారాయణ గారు బాగా తెలుసు ’ అన్నారు కదా లోపలికి రండి " అన్నాను. " మరోసారి వస్తాను " అని ఆయన ఆటో ఎక్కేసి హడావుడిగా వెళ్ళిపోయారు.

లోపలికి వెళ్ళాక సత్యనారాయణ గారికి ఈ కథంతా చెప్తే ఆయన ‘ దత్తు ’ అనే ఆయన ఎవరూ నా జీవితంలో ఇంతవరకు తటస్థపడలేదు " అన్నారు. చాలా తర్జనభర్జనల తర్వాత .. మరికొంత ధ్యానం తర్వాత ఆయన " దత్తాత్రేయుడు " అని నిర్ణయించుకున్నాం. ధ్యానం, ధ్యానప్రచారం అంటే మాస్టర్స్‌కు చెప్పలేనంత ప్రీతి అనటానికి ఇది మరో మచ్చుతునక.

28-12-1999 తేదీన " కర్నూలు ధ్యానమహాయజ్ఞం " లో సార్ నన్ను మాట్లాడమని స్టేజీ మీదకు పిలిచారు. వెళ్ళి సార్ ప్రక్కన కూర్చున్నాను. ఒక్కసారిగా కోమాలోకి వెళ్ళిపోతున్న అనుభూతి కలిగింది. గంటానలభైనిమిషాలపాటు నేను చెప్పిన మాటలు నావి కావు. అసలు " నేను మాట్లాడుతున్నాను " అని కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నేను స్టేజీ దిగుతూంటే పత్రిసార్ " నీ అనుభవం ఏంటి ? " అని అడిగారు. నేను " సార్ కూర్చున్న మరుక్షణమే పైనుంచి అదివేగవంతమైన మెరుపుకిరణం నా లోపలి శరీరాలలో మెరుస్తూ ప్రవహించింది. నాకు అంతే తెలుసు " అన్నాను. అప్పుడు సార్ నోటివెంట " ఛానెలింగ్ " అనే మాట వెలువడింది. అప్పటివరకు అలాంటిది ఒకటి వుందని కూడా నాకు తెలియదు. అప్పుడు సార్ " మాట్లాడింది నువ్వు కాదు, వివేకానందుడు " అని చెప్పారు. ఇది మరో వింత అనుభూతి .. అనుభవం.

ఒక సందర్భంలో సార్‌తో నేను " సార్, ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు మీరు చెప్పిందే తడవుగా నేను ఒక్కడినే ఏ సంకోచం లేకుండా ఏకాకిగా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వేయి ఏనుగుల బలంతో వస్తున్నాను. ఇలా సంకోచరహితంగా వెళ్ళగలగటానికి కారణం ఏంటి సార్ ? " అని అడిగాను. అప్పుడు సార్ " ఓ నరేంద్ర, ఇప్పుడు నువ్వు ఎందరో నరులకు .. ‘ మీరే నారాయణులు ’ అని చెప్పటానికి వచ్చావు. కాబట్టి నరులమని భావించేవారికి ‘ మనమే ధ్యానేంద్రులం ’ అని నూరిపోస్తున్నావు.

ఇది బాగుంది. కానీ పూర్వజన్మలో నువ్వు నరహంతకుడైన హిట్లర్ వద్ద విశేషాధికారాలు గల మిలటరీ ఆఫీసర్‌గా వుండి .. అప్పుడు కూడా ఒంటరిగానే కొన్ని లక్షలమంది చావుకు కారకుడివి అయ్యావు. కాబట్టి ఈ జన్మలో నువ్వు చంపిన అన్ని లక్షలమందికి ఆత్మజ్ఞానం అందించాల్సిన అవశ్యకత వుంది. అందుకే ఒంటరిగా వెళ్తున్నావు. చర్యకు ప్రతిచర్య సహజమే కదా " అన్నారు. ఓహో, ఇందుకా పాండురంగశాస్త్రీ గారు నన్ను ‘ మిలటరీ ఆఫీసర్ ’ అన్నది అనుకున్నాను.

ఇలాంటిదే మరొకటి చెప్తాను. నేను పుట్టకముందు నుంచి కూడా మా కుటుంబం యావత్తు ప్రతినెల ‘యాదగిరిగుట్ట ’ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళేవారట. అలా వెళ్ళిన ఒక నెలలో మా అమ్మగారు నెల తప్పటం .. ఆపై నేను పుట్టటం జరిగిందట. కాబట్టి స్వామి పేరు కలిసివచ్చేలా నా పేరును ‘ నరేంద్ర ’ అని పెట్టారట. ఆ తర్వాత నేను కాస్త పెద్దయ్యాక అనంతపురం మాస్టర్ మణి మేడమ్ మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో కాసేపు ధ్యానం చేసి " ఏంటి ? మీ ఇంటిపైన సింహం కనిపిస్తోంది " అని అడిగారు. మేం ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయాం. అప్పుడు ఆమే మళ్ళీ ధ్యానంలో కూర్చుని మాస్టర్స్‌ను సందేశం అడిగితే " నరేంద్ర పూర్ణాత్మ నరసింహస్వామి ; అందుకే సింహం కనిపించింది " అని మాస్టర్స్ చెప్పారట. ఇది వినీవినగానే .. నాకు సార్‌తో మొదటి పరిచయం .. ఆయన మొదటి మాట " మన సంస్థలోకి సింహం వచ్చింది ; చప్పట్లు కొట్టండి " గుర్తుకువచ్చింది. మహానుభావులు వేరువేరుగా వున్నా ఎంత ఏకీకృత ఆత్మతో పనిచేస్తారో అర్థమైంది.

రాజశేఖర్ : మీకు అర్థమైందంతా మా అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు.

నరేంద్ర : ఒకసారి హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో వున్న ‘ జోగిపేట ’ లో .. మరో ఐదు ఊర్లలో క్లాసులు చెప్పి నేను, నా తమ్ముడు ‘ దేవేందర్ ’ హైదరాబాద్‌కు రాత్రి 11.00 గంటలకు మోటార్‌బైక్‌పై బయలుదేరి పది కిలోమీటర్లు వచ్చాం. హఠాత్తుగా ముందు టైర్ పంక్చర్ అయి గాలిపోయింది. టైర్ ‘ పప్పుపప్పు ’ అయింది. ఎటూ కదలలేని స్థితి. మరో ముప్ఫై కిలోమీటర్ల వరకు పంక్చర్ వేయించుకోవటానికి కూడా సరియైన ఊరు లేదు. అప్పుడు మా తమ్ముడు " మనం ఇంత మంచిపని చేసి వస్తూంటే ఏంటి ఈ విఘ్నాలు ? పత్రిసార్ పట్టించుకోరా ?? " అన్నాడు. తప్పనిసరి పరిస్థితులలో నెమ్మదిగా బయలుదేరాం. కొద్దిదూరం వెళ్ళేసరికి అత్యంత ఆశ్చర్యకరంగా మేమిద్దరం దిగ్భ్రాంతి చెందే విధంగా టైర్లో ఫుల్‌గా గాలి నిండింది. మేము శరవేగంగా నిర్విఘ్నంగా హైదరాబాద్ వచ్చి పడుకున్నాం. ఉదయం లేచి చూస్తే మళ్ళీ టైర్ పంక్చర్ అలాగే వుంది. ధ్యానప్రచారానికి సృష్టి ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి ఎన్ని సంఘటనలో.

ఇంకొకటి కూడా చెప్తాను. ప్రతి ఆదివారం ధ్యానప్రచారానికి ‘ మెదక్ ’ వెళ్ళేవాణ్ణి. అలా ఒకసారి వెళ్ళినప్పుడు క్లాస్ అయిన తర్వాత 200 మందితో ధ్యానం మొదలు పెట్టించాను. ఇంతలో కుంభవృష్టి మొదలైంది. జనం చెల్లాచెదురుగా లేచారు. నేను వెంటనే పత్రిసార్ను తలచుకుని " సార్, ఇది మీ ప్రోగ్రామ్. వర్షం పెంచి ధ్యానాన్ని భగ్నం చేస్తారో, లేదా వర్షం ఆపేస్తారో మీ ఇష్టం " అన్నాను. అంతే మేం వున్న ప్రదేశం తప్ప మిగిలిన చుట్టుప్రక్కల ప్రాంతమంతా కుంభవృష్టి కురిసింది. మా ఎవ్వరి మీద నీటిచుక్క కూడా పడలేదు. ప్రకృతి మా ధ్యాన సమూహానికి మాత్రమే గొడుగు పట్టినట్లుగా వుంది ఆ దృశ్యం. ఆ సభకు హాజరైనవారందరిదీ ఆశ్చర్యమే ఆశ్చర్యం.

పత్రిసార్ లీలలు అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అంతగా ఆశ్చర్యపోలేదు. కానీ వచ్చిన వారందరూ నిర్ఘాంతపోయి ఆ రోజు ధ్యానంలో నిర్వికల్ప సమాధి స్థితి పొందారు. ఈ అనూహ్యమైన అద్భుత సంఘటన ఆ ఊరు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. దాంతో ఎన్నో ఊళ్ళు శాకాహారులుగా, ధ్యానులుగా మారిపోయాయి. దాని ఫలితంగా యాభైలక్షల విలువ చేసే పిరమిడ్ వచ్చింది. దాని ప్రారంభం రోజున పత్రిసార్ " ఇది నా పిరమిడ్ కాదు ; నరేంద్ర పిరమిడ్ " అనటం ఆయన ఆత్మ సౌందర్యానికి పరాకాష్ట వెంటనే నేను " అంతా మీదే సార్ ; నాది అంటూ వేరే ఏమీ లేదు ; నేను నిమిత్తమాత్రుడిని మాత్రమే " అన్నాను. ఇలా మేమిరువురమూ ఒకరినొకరం ప్రశంసించు కోవటంలో పొందిన ఆనందం అన్యలోకాలకు మాత్రమే అర్థమవుతుంది.

రాజశేఖర్ : మీకు కానీ, మీ ప్రక్కవారికి కానీ సంభవించబోయే మంచిచెడ్డల గురించి ఏమైనా తెలుస్తూ వుంటాయా ?

నరేంద్ర : ఇవి నాకు ఎక్కువగా కలలో కనిపిస్తూ వుంటాయి. ఒక్కొక్కసారి నేను అనుభవించవలసిన ప్రాపంచిక, మానసిక, శారీరక ఇబ్బందులు కూడా కలలో అనుభవించటం జరుగుతూ వుంటుంది. చాలాసార్లు ఇలా జరిగాక " ఇదంతా ఏమిటి ? " అని ధ్యానంలో కూర్చుంటే " ఇలలో అనుభవించవలసిన చెడుకర్మలన్నీ నా సూక్ష్మశరీరం ద్వారా అనుభవింపజేసి నిజజీవితంలో ఇక్కట్లు ఉండకుండా వుండటం కోసం పత్రిసార్ మరి కొందరు మాస్టార్స్ సహకారం అందిస్తున్నారు " అని స్పష్టంగా తెలిసింది. అంతేకాదు ప్రతి నిమిషమూ దగ్గరుండి చూసుకుంటే తప్ప సాగని నా వ్యాపారం నా ముమ్మర ధ్యానప్రచారం వలన నేను కన్నెత్తి చూడకపోయినా కూడా ఏదో అదృశ్యశక్తి నడిపిస్తున్నట్లుగా అద్భుతంగా సాగుతోంది.

ఐదు సంవత్సరాలక్రితం పన్నెండు సంవత్సరాలపాటు నా నమ్మినబంటుగా నా వ్యాపారాన్ని నడిపించిన ఒక ఉద్యోగి తన స్వంత కార్య నిమిత్తం పని మానేశాడు. " ఇప్పుడు ఎలా ? నేను ధ్యానప్రచారం మానేసి చచ్చినట్లు షాపులో కూర్చోవలసిందేనా ?? " అనిపించగానే ఎవరో చెప్పి పంపించినట్లుగా పాత ఉద్యోగి కంటే సర్వసమర్థుడైన మరో వ్యక్తి షాపును వెతుక్కుంటూ రావడం జరిగింది. ఇది ఒక అద్భుతం. నిజానికి ఆ క్షణంలో మా ఇద్దరికీ ఒకరి అవసరం మరొకరికి ఎంతైనా వుంది. ఇలా వుంటాయి మన పత్రిసార్ కరుణా కటాక్ష వీక్షణాలు.

రాజశేఖర్ : కొంతమంది జాతకాలు, హస్తసాముద్రికాల పిచ్చిలో పడి తిరుగుతూ వుంటారు ; దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?

నరేంద్ర : పత్రిసార్‌తో పరిచయానికి ముందు మనలో చాలామందికి వున్న ‘ పిచ్చి ’ నాకు కూడా వుండేది. దేనికీ అతీతుడిని కాను. పెళ్ళికి ముందు దేశంలోనే పెద్ద పేరున్న జోతిష్యుడికి నా జాతకచక్రం చూపిస్తే " పెళ్ళి, పిల్లలు , ధనం లేని యోగం నీది ; అష్టకష్టాలమయం నీ జీవితం ; జీవచ్ఛావంలా బ్రతకడమే తప్ప వేరే దారి లేదు " అని చెప్పాడు. దాంతో నేను హతాశుడినయ్యాను. కానీ ధ్యానప్రచారం వలన అతను లేవు అన్నవి అన్నీ లెక్కకు మించి నాకు దక్కాయి.

రాజశేఖర్ : ఇంతకీ గాయత్రీమాత మీ ఇంటిని ఎప్పుడు పావనం చేసింది ?

నరేంద్ర : 26 ఆగస్ట్, 1996 సాయంత్రం 5.00 గంటలకు బాబు పుట్టాడు. సరిగ్గా 26 ఆగస్ట్, 2004 లో అదే 5.00 గంటలకు పాప పుట్టింది. పాపకు పుట్టుకతో నోరు లేదు. డాక్టర్స్ " మా పర్యవేక్షణలో ఉంచుకుంటాం ; పాపను ఇప్పుడిప్పుడే మీకు ఇవ్వం " అని చెప్పారు. దాంతో కుటుంబసభ్యులందరం షాక్ అయిపోయాం. నేను వెంటనే అమెరికాలో వున్న పత్రిసార్కు ఫోన్ చేశాను. ఆయన " రేపు ప్రొద్దున వస్తున్నాను ; ఎయిర్‌పోర్టుకు రా, సరాసరి ఆస్పత్రికి వెళ్దాం " అని చెప్పారు. నేను, సార్ ఆస్పత్రిలో ప్రవేశించడం .. డాక్టర్స్ మా బేబీని మాకు అప్పగించడానికి మా ఇద్దరికీ ఎదురుగా రావడం ఒకేసారి జరిగింది. డాక్టర్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ తండ్రిని నేను అక్కడే వున్నా కూడా పాపను పత్రిసార్ చేతిలో పెట్టారు. సార్ కాస్సేపు చేతిలో ఉంచుకుని " ఏం దిగులు పడవద్దు ; అంతా బాగుంటుంది " అన్నారు.

అంతటి మహానుభావులు చెప్పినప్పటికీ నా టెన్షన్ తగ్గలేదు. ఆ రాత్రి ధ్యానంలో " లక్షలమందికి ధ్యానం చెప్పిన నొరు నాది ; నా పాపకు నోరు లేకుండా చేయడం ఏం న్యాయం ?సాక్షాత్తు గాయత్రీమాత నోటికే ఆటంకమా ? " అని నేను దుఃఖిస్తూ మాస్టర్స్‌ను ప్రశ్నించాను. ఆకస్మికంగా ఆకాశం నుంచి కొన్ని వందల నల్లని ఆకారాలు నా వైపుకు దూసుకు వస్తున్నాయి. నాకు భయం వేయలేదు కానీ నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాను. వారికీ, నాకూ మధ్యలో ఒక ఆజానుబాహుడు రెండు చేతులూ చాచి వాళ్ళ వైపుకు తిరిగి నాకు కనిపించారు. వెంటనే వాళ్ళు మాయమయ్యారు.

నేను ఆశ్చర్యపోయి " మీరు ఎవరు ? " అని అడిగాను. ఆయన " నా పేరు ‘ తాజుద్దీన్ బాబా ’, షిర్డీసాయి సమకాలికుడను; నేనుండగా మీ పాప గురించి భయమేల ? " అన్నారు. " నా పాపకు నోరు ఎప్పుడు వస్తుంది ? " అని అడిగితే ఆయన మూడువ్రేళ్ళు చూపించారు. అంటే " మూడురోజులలో " అని అర్థం చేసుకున్నాను. అప్పుడు నేను ఆయనతో " నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ; ఏ బాంధవ్యంతో వచ్చి నన్ను ఆదుకున్నారు ? " అని అడిగాను. " ఇదంతా మీ పత్రిసార్ మహత్యం ; ఆయన ఆస్ట్రల్ లోకంలో నన్ను పిలిచి ‘ నువ్వు వెళ్ళి నరేంద్రనూ, అతని కుటుంబాన్నీ, వ్యాపారాన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వుండు ’ అని, ఇచ్చిన ఆజ్ఞానుసారమే నా ఈ ఆగమనం అని చెప్పారు.

" మనం గొప్పగా చెప్పుకునే ఎందరో ఆస్ట్రల్ మాస్టర్ల బాస్ మన సుభాష్ పత్రీజీ " అనే సత్యం నాకు అప్పుడే తెలిసింది. తాజుద్దీన్ బాబా సైగ చేసినట్లుగా పాపకు మూడురోజులలో నోరు వచ్చింది. తర్వాత పత్రిసార్ను కలిసి ఇదంతా చెప్తే " ‘ అంతా బాగుంటుంది ’ అని అప్పుడే చెప్పాను కదా " అని సింపుల్‌గా చెప్పేశారు.

నా అనుభవాల ద్వారా .. చాలామంది అనుభవాల ద్వారా నాకు కూడా " మనకు కొండంతగా కనిపించే కష్టాన్ని సార్ రవ్వంతగా భావించి .. అల్లంత దూరంలో ఉండగానే ఆపేస్తారు " అని అర్థమైంది.మనందరి సమస్యలు ఆయనకు తెలుసు. అవసరమైనప్పుడు ఆదుకుంటారు.

మనందరి భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. " పాప గొప్ప డాన్సర్ అవుతుంది " అని చెప్పారు. అంతేకాదు .. పత్రిసార్ ముందు ఒకమాట, వెనుక ఒకమాట చెప్పేవారు .. " మనం చాటున ఏం చేసినా, ఏం మాట్లాడినా సార్‌కు తెలియదులే " అనుకునేవారు, " నేను సంస్థకు ఎంతో వర్క్ చేస్తున్నాను, నేను లేకపోతే సంస్థకు చాలా నష్టం " అనుకునేవారు గొప్ప అజ్ఞానంలో కూరుకుపోతున్నారు. కొండొకచోట ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా కూడా కుంచించుకుపోతున్నారు కుడా; ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. ఈ సత్యాన్ని మనందరం గ్రహించాలి.

రాజశేఖర్ : మనసా - వాచా - కర్మణా మీ ప్రతి మాటతో ఏకీభవిస్తున్నాను.

నరేంద్ర : ఒకసారి సార్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒక క్లాసుకు వెళ్ళాను. క్లాస్ ఏర్పాటుచేసినవారు మంచి భోజనం ఏర్పాటు చేసారు. కారణం ఏమిటో సార్‌కు, వారికే తెలియాలి కానీ సార్ " నరేంద్ర, మనం బయలుదేరుదాం " అని చెప్పారు. నేను కారు వెనుక సీట్లో, సార్ ముందు సీట్లో కూర్చున్నారు. సరిగ్గా సికింద్రాబాద్ తాజ్‌మహల్ హోటల్ దగ్గర కారు ఆపించి " భోంచేద్దాం " అన్నారు. నాకు అప్పటికే ఆకలిగా వుంది. కానీ .. " అక్కడ కమ్మని భోజనం వుంది కదా, ఈ హోటల్ భోజనం చప్పచప్పగా వుంటుంది " అనుకున్నాను. వెంటనే సార్ " నరేంద్రా, ఏంటో అనుకుంటున్నట్లున్నావ్ " అన్నారు. నేను తత్తరపడి " ఏం లేదు సార్" అన్నాను. అప్పుడు సార్ " అన్ని రకాల భోజనాలు తినాలయ్యా; అప్పుడే సమతుల్యత " అన్నారు. నేను తేలుకుట్టిన దొంగలా మౌనం వహించాను.

దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నారాయణగూడలో మా షాపు ముందర రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టారు. దానిలో భాగంగా నా షాపు మొత్తం తీసివేసే ప్రమాదస్థితి. అప్పుడప్పుడే ఆర్థికంగా బాగా పుంజుకుంటున్నాం. అంతులేని నిస్సహాయతతో నేను " నా జీవనోపాధి అయిన నా షాపుపోతే నా కుటుంబం యావత్తూ వీధిన పడుతుంది. పత్రిసార్,మీరే గట్టెక్కించాలి " అని గట్టిగా సార్‌కి మనస్సులో విన్నవించుకున్నాను. మూడునెలలపాటు సాగిన ఆ విస్తరణ సరిగ్గా మా షాపు ముందుకు వచ్చేసరికి ఆగిపోయింది. తర్వాత పత్రిసార్ని కలిసినప్పుడు నేనేమీ మాట్లాడకుండానే సార్ " షాప్ సేఫా ? " అన్నారు. నేను మౌనంగానే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సార్ మనందరితో ప్రతిక్షణం కలిసేవుంటారు అనడానికి ఇది మరో ఆధారం.

మొన్నీ మధ్య సార్ ఇంట్లో ఉన్నప్పుడు సార్ " నరేంద్రా, నువ్వు నీ దేహానికి గౌరవం ఇవ్వడం లేదు ; అది నీకు గౌరవం ఇవ్వదేమో చూడు " అన్నారు. నేను మామూలుగానే " ఏమో సార్, నేను బాగానే తిని తిరుగుతున్నాను " అన్నాను. ఆ తర్వాత రెండురోజులకు నేను క్లాస్‌కి వెళ్దామని ట్రైన్ ఎక్కాను. హఠాత్తుగా నా కడుపులో విపరీతమైన నొప్పి వచ్చి నా శరీరం మెలికలు తిరిగిపోతోంది. నాకు సహాయంగా ఎవరూ లేరు. " నేను చచ్చిపోతున్నానేమో " అన్న ఫీలింగ్ వచ్చి కళ్ళు మూసుకున్నాను.

వెంటనే పత్రిసార్ హుటాహుటిన నలుగురు డాక్టర్లతో సహా నా బోగీలోకి ఆస్ట్రల్గా ప్రవేశించారు. ముందుగా పత్రిసారే నా నోట్లోకి ఆయన చేయి పోనిచ్చి నా కడుపులో నుంచి పెద్ద ‘ నల్లముద్ద ’ తీసి కిటికీలో నుంచి బయటకు విసిరివేశారు. మిగతా డాక్టర్స్ సార్ సూచనల మేరకు చేయవలసిన పని చేసారు. ఆ వెంటనే నాకు స్పృహ రావటం, చాలా పెద్ద వాంతి చేసుకోవటం జరిగి నేను చాలా హాయిగా అయిపోయాను. ఆ తర్వాత సార్ నేను వినేటట్లుగా " సృష్టిలో వున్న దేన్నైనా సరే ప్రేమించకపోయినా, గౌరవించకపోయినా ఇక్కట్లు తప్పవు " అని మరెవరికో చెప్తున్నట్లుగా నాకు పాఠం నేర్పారు.

రాజశేఖర్ : నేను కూడా ఈ ఇంటర్వ్యూ వలన చాలా పాఠాలు నేర్చుకున్నాను ; చాలా థాంక్స్ ; చివరిగా మీ సందేశం ?

నరేంద్ర : ఆనాపానసతి ధ్యానాన్ని మించిన సత్యం లేదు ; పత్రిసార్ని మించిన పరమాత్ముడూ లేడు. ఆయన వ్యక్తి కారు ; అవధులు దాటిన అనంతమైన శక్తిస్వరూపులు. నా జీవితం ఆయనకు అంకితం. పుట్టిన ప్రతి వ్యక్తీ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా ఈ సత్యాన్ని కనుగొన్నప్పుడు దానికి మించిన ఎన్లైటెన్మెంట్ లేదు. ఈ స్వస్థితిని అందరూ పొందాలని నా ఆకాంక్ష.

 

- నరేంద్ర ముదల్కర్,
సికింద్రాబాద్

Go to top