"ధ్యానం వల్ల విద్యార్ధులు ఎంతో లాభం పొందుతున్నారు"

 

నా పేరు యిళ్ళ శ్రీరామమూర్తి.

నాకు మొట్టమొదటిసారిగా ధ్యాన పరిచయం విజయవాడ పిరమిడ్ మాస్టర్ శ్రీ J.రాఘవరావు గారి భార్య మేడమ్ పద్మగారి ద్వారా 2001 నవంబర్‌‍లో జరిగింది. వెనువెంటనే వారిరువురూ 2001 డిసెంబర్ 10 నుండి 10 రోజులు మాతోపాటు కోనసీమలో ధ్యానప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

బ్రహ్మర్షి పత్రీజీ గారి 2002 జనవరిలో 150 మంది సీనియర్ మాస్టర్స్‌తో పాటు కోనసీమకు విహారయాత్రగా వచ్చి ధ్యానప్రచారం చేశారు. అప్పుడు ఆయనను నేను మొట్టమొదటిసారి అంతర్వేదిలో చూడటం జరిగింది.
అప్పుడు అమలాపురంలో జరిగిన సభలో బ్రహ్మర్షి పత్రీజీ గారు అమలాపురం S.K.B.R. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మంథా సాంబశివశాస్త్రి గారిని ప్రెసిడెంట్‌గా, నన్ను కార్యదర్శిగా "కోనసీమ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ"ని స్థాపించారు. 2003 సంవత్సరానికి కోనసీమను 'ధ్యానసీమ'గా మార్చాలని చెప్పారు. తరువాత మేము కోనసీమలోనే మొదటిదైన "యోగద పిరమిడ్ ధ్యాన కేంద్రా"న్ని శ్రీ సాంబశివ శాస్త్రి గారింటిలో ప్రారంభించాము.

ఈ ధ్యాన ప్రచార కార్యక్రమంలో సీనియర్ మాస్టర్లు అయినటువంటి శ్రీ Y.J. శర్మగారు, రాజకుమారి గారు, V.V.రమణ, వాసంతి మేడమ్ గార్లు, రఘునాధరావు గారు, చక్రపాణి, జయశ్రీ దంపతులు మరి తటవర్తి వీరరాఘవరావు గారు మాకు ఎంతో సహకరించారు. ఇప్పటికి మేము కోనసీమలో 43 ధ్యానకేంద్రాలను స్థాపించాము.
ఈ రెండు సంవత్సరాల కాలంలో బ్రహ్మర్షి పత్రీజీ గారు కోనసీమకు ఐదు సార్లు వచ్చి చివరిసారిగా ఈ సంవత్సరం నవంబర్ 2న వారు మాకు ఇచ్చిన గడువుకు నెల రోజుల ముందుగానే కోనసీమను "ధ్యానసీమ"గా ప్రకటించడమైంది. మా ఈ ధ్యాన ప్రచారానికీ, ధ్యానకేంద్రాల వ్యవస్థాపనకూ ఒకరోజు ధ్యానయజ్ఞానికీ రిటైర్డు ప్రిన్సిపాల్ శాస్త్రి గారి అమ్మాయి శ్రీమతి గంటి రాధామాధవి, శ్రీమతి N.పద్మగారు, శ్రీ ఆశపు వీరభద్రేశ్వరావు గారు, శ్రీ రాంబాబు గారు ఎంతగానో తమ సహకారాన్ని అందించారు.

నాకు రోడ్డు ప్రమాదంలో వెన్నుముక బాగా దెబ్బతిని కనీసం కూర్చోలేకపోయేవాడిని. అప్పుడు హైదరాబాద్ యశోధ హాస్పిటల్స్‌లో చూపించుకుంటే, "ఇది మందులకు గానీ, ఆపరేషన్‌కు గానీ తగ్గదు" అని చెప్పారు. ఆ తరుణంలో నేను అర్ధికంగా చాలా నష్టపోయి, మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు నాకు ఈ ధ్యాన పరిచయం కలిగింది. ధ్యానం చేపట్టటంవల్ల నా ఆరోగ్యం పూర్తిగా చక్కబడి మంచం మీద విశ్రాంతిగా ఉండవలసిన నేను ఇప్పుడు బైక్ మీద రమారమి 40,000 కిలోమీటర్లు తిరిగి ధ్యానప్రచారం చేశాను.

ఈ ధ్యానం వలన విద్యార్ధులు ఎంతో లాభం పొందుతున్నారు. అమలాపురంలో గుబ్బల రవితేజ అనే ఏడవ తరగతి విద్యార్ధికి ధ్యానం వలన 600 మార్కులకి గాను 596 మార్కులు. జిల్లాకే మొదటి వానిగా వచ్చి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే బహుమతి అందుకున్నాడు.


యిళ్ళ శ్రీరామమూర్తి
అల్లవరం, తూర్పుగోదావరి జిల్లా

Go to top