" మాది సంపూర్ణంగా ధ్యాన కుటుంబం "

 

మారం శివప్రసాద్‌గా నేను చాలామంది పిరమిడ్ మాస్టర్లకు తెలుసు. గత ఐదు సంవత్సరాలుగా నేను (21-11-98) ధ్యానియోగిని. నాకు ధ్యానం నేర్పినది ఆదోని పిరమిడ్ మాస్టర్ ప్రేమ్‌నాథ్.

గత ఒకటిన్నర సంవత్సరం నుండి నా సమయాన్ని 75శాతం ధ్యాన ప్రచారానికీ, 25 శాతం కుటుంబానికీ వినియోగిస్తున్నాను. నాకు స్వధర్మం, కుటుంబ ధర్మం, సంఘ ధర్మం అంటూ వేరేగా ఏమీ లేవు. ఒకటే ధర్మం-అది ధ్యాన ప్రచార ధర్మం. నాకుటుంబం కూడా అందులోనే. బ్రహ్మర్షి పత్రీజీ ఆదేశంపై గత ఆరు, ఏడు నెలలు నుండి 'అదిలాబాద్' జిల్లా ధ్యాన ప్రచార కన్వీనరు గానూ, పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్టుకు హైదరబాదు సిటీ కన్వీనరు గానూ ఉండి ఆత్మ నివేదనతో 'సేవ'(ధ్యాన ప్రచారం) లో ఉన్నాను.

ఒకప్పుడు పత్రి సార్ చెప్పినవి అర్ధం చేసుకోలేక, వాటిని పాటించలేక 'సంఘర్షణ' పడేవాడిని. ప్రతి చిన్న విషయానికీ 'ఆత్మన్యూనతాభావం'తో బాధపడేవాడిని. అయితే రెండున్నర నెలల క్రితం పత్రీజీ ఒక సందర్భంగా చాలా ఎక్కువ స్థాయిలో మందలించారు. అటు తరువాత గోవాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ 'పాల్ విజయ్‌కుమార్' నన్ను తమ ఘాటు మందలింపుతో కుదిపేసారు. ఈ రెండు సంఘటనల తరువాత నాలో ఉన్న 'నేను' అనే 'ఈగో', ఆత్మన్యూనతాభావం, నా పట్ల నాకు ఉన్న చిన్నచూపు అన్నీ తొలగిపోయి, ఒక పొర (block) విడిపోయింది.

ఈ మధ్య మాస్టర్ తారావిశాల్‍తో పరిచయం కలిగింది నాగైడ్ మాస్టర్, నా గతజన్మ గురువు అయిన "షిర్డీబాబా" తారావిశాల్‌కి కూడా గైడ్ మాస్టర్ కావడం, మా ఇద్దరి అభిప్రాయాలూ ఒకే స్థాయిలో ఉండటం, ఆలోచనలూ, అనుభవాలూ ఇద్దరం పంచుకోవడం వల్ల ఇంకా ఎన్నో బ్లాక్స్ తొలగిపోయాయి. నా ధ్యాన సేవకు మెచ్చి 'పత్రీజీ', 'బాబా' కలిసి నాకు 'తారా విశాల్' సాంగత్యం లభించేలా చేశారు.

జీసస్ క్రైస్ట్ ప్రవచించిన " Judge ye not " అనే మహావాక్యం నాలో ఎనలేని మార్పులను తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం, చేస్తున్న పని తప్ప వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఆత్మతృప్తిగా జీవించడాన్ని అలవాటు చేసుకుంటున్నాను.

నేను ప్రస్తుతం కన్వీనరుగా ఉన్న ఆదిలాబాదు జిల్లాకు తారావిశాల్‌ను కన్వీనరుగా పత్రీజీ నియమించారు. నన్ను నిజామాబాద్ జిల్లా చూడమన్నారు. వారి (పత్రిసార్) స్వంత జిల్లా అయిన నిజామాబాద్ ధ్యాన ప్రచార బాధ్యతను ఇంతవరకూ ఎవ్వరికీ అప్పజెప్పకుండా, ఎన్నో సందర్భాలలో "నా స్వంత జిల్లాను నేనే చూసుకుంటాను" అని చెప్పిన పత్రిసార్ ఇప్పుడు నన్ను నిజామాబాద్ జిల్లా చూడమని చెప్పడం నాకు నిజమైన ప్రమోషన్. ఇంతటి గౌరవం పొందిన ఈ మాస్టర్ జన్మ ధన్యం.

ఇదంతా ఒక ఎత్తు అయితే మా కుటుంబంలో ఈ మధ్య జరిగిన ఒక అద్భుతం మరొక ఎత్తు. మా చిన్నమ్మాయి "దీపిక"కు కుడికంటికి '7' పవర్ ఉంది. సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుంటూ ఉండేది. పైగా సైట్ క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ విషయాన్ని పత్రీజీ గారితో ప్రస్తావించడం జరిగింది. దానికి ఆయన "మీ అమ్మాయిని మూడు రోజులు చీకటి గదిలో వెలుగు ఏ మాత్రం పడకుండా ఉంచు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది." అన్నారు. ఆరోజు సెప్టెంబర్ 22 అని గుర్తు. అమ్మయిలకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఈ ప్రాసెస్ అమలు చేయాలని అనుకున్నాం.

మా పెద్ద అమ్మాయి "మౌలిక"కి కూడా '2' ఉండటం వల్ల పరీక్ష అయిపోయిన రోజే (24-9-2003) రాత్రి 10 గంటల నుండి ఇద్దరినీ పూర్తి చీకటి గదిలో ఉంచి చాలా తక్కువ వెలుతురు ఉన్న జీరో బల్బు వేసి, ఇద్దరికీ కళ్ళకు నల్లగుడ్డ కట్టాం. నేనూ, నా శ్రీమతి వారితో కలిసి అంత్యాక్షరి ఆడాం, పాటలు పాడి వినిపించాం. కథలు చెప్పాం, వారి అల్లరినీ, కోపాన్నీ సహనంతో భరించాం. మా పెద్ద అమ్మాయి 48 గంటలు ఉండింది. చిన్నమ్మాయి 72 గంటలు ఉండింది. మూడవరోజు ఒక్కత్తే ఉండటం వల్ల చిన్నమ్మాయి చేసిన అల్లరి, సతాయింపూ భరింప శక్యం కాలేదు. అయితే ఈ ప్రోసెస్ మొదలుపెట్టినప్పుడు మేం చేసిన సంకల్పం ఏమంటే "ఓ మాస్టర్ పత్రిసార్, మీరు చెప్పిన సలహాను మేం త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నాం. మాలో అణుమాత్రమైనా, పరమాణు మాత్రమైనా ఏ సందేహమూ లేదు. చూపు వచ్చినా Okay. రాకున్నా Okay. ఫలితం గురించి ఏలాంటి దిగులూ లేదు. 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన' అని తరుచు మీరు చెప్పే భగవద్గీత సూక్తి మాకు శిరోధార్యం. మా అమ్మాయిలు ఈ ప్రాసెస్ పూర్తి అయ్యేవరకూ వారిని మీరే చూడాలి." అని దృఢసంకల్పం చేశాం. మాకు చూపు గురించిన వర్రీయే లేదు. పత్రీజీ వాక్కు పట్ల సంపూర్ణ విశ్వాసం అంతే.

రెండురోజుల తర్వాత చీకటి గది నుండి వెలుపలికి వచ్చిన '2' పవర్ ఉన్న పెద్దమ్మాయి, మూడురోజుల తరువాత వెలుపలికి వచ్చిన '7' పైగా పవర్ ఉన్న చిన్నమ్మాయిలకు మేం ఊహించినట్లుగానే చక్కగా చూపు వచ్చింది. ఈ మహాద్భుతం జరిగిన తరువాత ఒక వారం రోజులకు పత్రిసార్ సిటీకి వచ్చారు. అమ్మాయిలిద్దరినీ వారింటికి తీసుకెళ్ళాం. విషయం విని, అమ్మాయిలద్దరితోనూ విషయమంతా చెప్పించుకుని, పత్రిసార్ వారి తల్లిగారికి కూడా ఈ విషయం వినిపించారు. సార్ చాలా ఆనందపడ్డారు. ఇంకా చెప్పారు కదా, "మరొక రెండు రోజులు పౌర్ణమి సమయంలో చీకటిగదిలో ఉంచండి; మరలా తరువాత వచ్చే పౌర్ణమికి ఒకరోజు ఉంచండి" అని. అదేవిధంగా అక్టోబరులో పౌర్ణమి సమయంలో రెండు రోజులు, నవంబరులో పౌర్ణమి సమయంలో ఒకరోజు అమ్మాయిలిద్దరూ చీకటిగదిలో వున్నారు. ఇప్పుడు వారిద్దరికీ చూపు చక్కగా ఉంది. గత ఒకటిన్నర నెల నుండి అసలు ఇద్దరూ అద్దాలు పెట్టుకోవడం లేదు. ఒకరోజు అద్దాలు పగిలిపోయినప్పుడు నానా గందరగోళం చేసి అద్దాలు చేయించుకున్న మా చిన్నమ్మాయి ఒకటిన్నర నెలలుగా అద్దాలు పెట్టుకోవడం లేదు. అతి చిన్న అక్షరాలు కూడా స్పష్టంగా చదవగలుగుతోంది. నాకు టెస్ట్ చేయించాలని కూడా అనిపించలేదు.

ఇక మా అబ్బాయి "విఠల్ ప్రసాద్" విషయం. వాడు అందరిలో పెద్ద. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. తెనాలిలో చదువుతూండేవాడు. నాకు ఎందుకో గత ఐదారునెలల నుండి వాడి గురించి ఎన్నో ఇబ్బంది పెట్టే మనస్సును మెలిపెట్టే భావనలు వచ్చేవి. అలాగే రెండు నెలల క్రితం చెస్ట్ పెయిన్ అని నానా గందరగోళం చేశాడు. నాకు మందులు వాడటం అస్సలు నచ్చదు. టెస్ట్ చేయిస్తే నిల్ రిపోర్టు వచ్చింది. అయిన వాడు ఇబ్బంది పడుతూనే ఉండేవాడు. పదిహేనురోజుల క్రిందట సడన్‌గా తెనాలికి నేనూ, మాస్టర్ తారావిశాల్ వెళ్ళాం. వాడితో, విశాల్ దాదాపు మూడుగంటలు మాట్లాడాడు. చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు. విశాళ్ సలహా మీద వాణ్ణి వెంటనే సికింద్రాబాద్ తీసుకువచ్చాను. పత్రిసార్ దగ్గరికి తీసుకువెళ్ళాను. సార్ వాడిని "మూడురోజులు ఎక్కువుగా మాట్లాడాకుండా చక్కగా ధ్యానం చేయి" అన్నారు. ఆరోజు రాత్రి వాడు ఒక్కడే కర్నూలు "బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం"కు వెళ్ళి, పత్రిసార్ చెప్పినట్లు మూడురోజులు ధ్యానం చేసి వచ్చాడు. వచ్చిన వెంటనే పత్రిసార్‌ని కలిసి వాడి ఎక్స్‌పీరియన్స్ చెప్పాడు. ఇప్పుడు హాయిగా, ప్రశాంతంగా ఉన్నాడు.

మా కుటుంబం సంపూర్ణంగా ధ్యాన కుటుంబం. మేం ఎవ్వరం మా ఇంట్లో కనీసం విక్స్, జండూబామ్ కూడా వాడం. ధ్యానం చేయడం, ధ్యానప్రచారం చేయడం మా జీవిత ధ్యేయం. నా శ్రీమతి చంద్రకుమారి కూడా వాసవినగర్ లోని ఇతర మాస్టర్లతో కలిసి వివిధ కాలనీలు, దేవాలయాలు తిరిగి కరపత్రాలు పంచి వీలైనంత మందికి ధ్యానప్రచారం చేస్తోంది. ఇక మా ఇల్లు ఎప్పుడూ ధ్యానులతో, ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన వారితో నిత్యకళ్యాణం, పచ్చతోరణంలా ఉంటుంది. దీనికి మాకు విజయవాడ రాఘవరావు దంపతులు ఆదర్శం. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూంటే (పిరమిడ్ మాస్టర్లు కూడా) నాకు ఆశ్చర్యం వేస్తూంటుంది. "ఎందుకు వీరికి అనారోగ్యం వస్తుందా?" అని. ప్రతి ఒక్కరూ చేయవలసినవి రెండే రెండు. ధ్యానం అంటే విశ్వాసం, అణువు, పరమాణువులలో కూడా సందేహం లేకపోవడం. ధ్యానం చేయడం. మేం చేస్తున్నదీ అందరికీ చెప్పేదీ ఇదే.

ఇక అన్నిటికంటే మరొక అద్భుత విషయం - నేను కానీ మా శ్రీమతి కానీ ధ్యానప్రచారంకోసం అయ్యే ఖర్చు గురించి అస్సలు ఆలోచించకపోవడం. ఆలోచించకుండా ఖర్చుకు వెనుకాడకుండా ధ్యానప్రచారం చేసే కొద్దీ, అసలు డబ్బు సమస్యే లేకుండా ఉండటం. నేను ఎక్స్‌పీరియన్స్ అవుతున్న మహాద్భుతం. ఖర్చు చాలా అవుతుంది. కానీ లోటు పడకుండా, అప్పు చేయవలసిన అవసరం లేకుండా డబ్బు అడ్జస్ట్ అవుతోంది. "ఇవ్వు వస్తుంది. పెట్టు; దొరుకుతుంది. చేయి; కలుగుతుంది" అని ఎప్పుడూ పత్రీజీ చెప్పే మాటలే మాకు ఆదర్శం. 49 సంవత్సరాల నాజీవితంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 22 (నా జన్మదినం), షిర్డీ బాబా భౌతికదర్శనం జరిగిన ఆరోజు నుండి నీ జీవితంలో ఒక గొప్ప మలుపు.

నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైన రామచంద్రయ్యశెట్టి, మీనాక్షమ్మ గార్లకూ, నాకు ధ్యానం నేర్పిన అదోని ప్రేమనాథ్ మాస్టర్‌కూ, నాకు పునర్జన్మ ప్రసాదించిన పరమ గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికీ, నాకు అదిలాబాద్ జిల్లా ధ్యానప్రచరంలో నా సహచర మాస్టర్లు శ్రీమతి పార్వతి, శ్రీమతి K.నిర్మలలకూ నా ఆప్తమిత్రుడు కిషోర్‌బాబుకూ, నాకు అత్యంత ఆప్తులు, నా శ్రేయోభిలాషులైన సీనియర్ మాస్టర్లు Y.J.శర్మ, చంద్రశేఖర్ శర్మలకూ, కేవలం కొన్ని రోజుల స్నేహంతోనే అత్యంత ఆప్తుడైన తారావిశాల్‌కూ, సికింద్రాబాద్‌కు నేను వచ్చినప్పటినుంచి ధ్యానప్రచారంలో నాకు ఎంతో సహకరించిన చెల్లెలు అయిన శ్రీమతి M.నిర్మలకూ, నా ప్రాణంలో ప్రాణం, నా జీవిత చుక్కాని, నేను జిల్లాలు తిరిగి ధ్యానప్రచారం చేయడానికి త్రికరణశుద్ధిగా సహకరిస్తున్న నా ఇల్లాలు చంద్రకుమారికీ ఆత్మసాక్షిగా నా ప్రణామాలు. ధ్యానప్రచారానికే ఈ జీవితం అంకితం.

 

మారం శివప్రసాద్
Flat No. 101, Plot No. 31/A
ఓల్డ్ వాసవీనగర్, కార్ఖానా, సికింద్రాబాద్ - 15
ఫోన్ : 37742373, 27742373

Go to top