" ప్రతి రోజూ ఒక పండుగే "

 

నా పేరు S.R.ప్రేమయ్య.

గతంలో రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించాను. సంఘసేవకునిగా జిల్లాలో అనేకా మెగా హెల్త్ క్యాంపులను నిర్వహించాను. ట్రేడ్ యూనియన్ నాయకునిగా పనిచేశాను. నా శ్రమను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ‘2001-2002 శ్రమశక్తి అవార్డు’ కు నన్ను ఎంపిక చేసింది. 1-5-2002న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. సెయింట్ ఆన్స్ గ్రామర్ స్కూల్ నెలకొల్పి దానికి కరెస్పాండెంట్ కొనసాగుతున్నాను.

క్రైస్తవ కుటుంబంలో జన్మించిన నేను, చిన్ననాటి నుండి చర్చికి వెళ్తూ, క్రైస్తవ సిద్ధాంతాలతో అదే విశ్వాసంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాను. పదిహేను సంవత్సరాల క్రితం నాకు అమెరికా నుండి ప్రతినెలా 25 డాలర్ల చొప్పున ఆర్ధిక సహాయం వచ్చేది - సువార్త ప్రకటించమని. డబ్బు తీసుకుని దేవుని సేవ చెయ్యడానికి నా మనస్సు అంగీకరించలేదు. నాకు డాలర్స్ పంపవద్దని స్పాన్సర్స్‌ను కోరాను. అయినప్పటికీ నాకున్న వనరుల మేరకు సువార్త సేవ కొనసాగించాను.

జూలై 2000 సంవత్సరంలో S.S.Y. సాధన చేశాను. ఆధ్యాత్మికంగా ఇంకా ఎంతో తెలుసుకోవాలని కోరిక పెరిగింది. మా పాఠశాల పోషకులైన పిరమిడ్ మాస్టర్ కోటేశ్వరగుప్త గారి ద్వారా పిరమిడ్ ధ్యానశిక్షణ తరగతిని 2002 నవంబర్ 17న సెయింట్ ఆన్స్ గ్రామర్ స్కూల్ లో ఏర్పాటు చేయడం ద్వారా నాకు ఈ ధ్యానపరిచయం మరి పిరమిడ్ మాస్టర్స్ ఉమామహేష్ Dr.హరికుమార్ గార్ల పరిచయం కలిగింది.

ఆరంభంలో ధ్యానం సరిగ్గా కుదిరేది కాదు. కొద్ది రోజులకి మాంసం మానేసాను. అప్పటినుండి ధ్యానం బాగా కుదురుతోంది. నాకు గా ధ్యానం చేసుకున్న దానికన్నా ఇతరులచే ధ్యానం చేయించడంలో ఉన్న ఆనందం మహా గొప్పగా ఉంటోంది. "2004 నాటికి ధ్యానాంద్రప్రదేశ్" చేయాలన్న సంకల్పంతో అహర్నిశలూ పరిశ్రమిస్తున్న నా ప్రియతమ గురువు బ్రహ్మర్షి పత్రీజీ గారి కల నిజం కావాలంటే, నా జిల్లా ధ్యాన జిల్లాగా మారాలని ఆరాట పోరాటాల మధ్య నా మనస్సు కొట్టిమిట్టాడుతోంది. తదనుగుణంగానే పనిచేస్తున్నాను. నాకు సహకారమందిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ సదా కృతజ్ఞుడను. ధ్యానాన్ని ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆంధ్రా M.P.లకూ I.A.S అధికారులకూ ఈ డిసెంబర్ 10న సాయంత్రం 6.00 గంటలకు ఆంధ్రప్రదేశ్ భవన్, న్యూఢిల్లీలో "ధ్యాన మహోత్సవం" బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆధ్వర్యంలో జరపడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.

నేను గ్రహించిన వాస్తవాలు: మతాలు మానవుణ్ణి స్వతంత్రంగా ఉండనివ్వవు. మతాల మూలంగా అసలు సత్యాలు మరుగున పడ్డాయి. మతాల మూఢవిశ్వాసాల నిర్భందంలో ఉన్న ఆత్మలకు బుద్ధుడి సందేశాలయిన "ఆనాపానసతి" ; "అప్పో దీపో భవ"లను చేరవేసే క్రమంలో మన పత్రీజీ గారి యత్నం ఫలించే రోజు నేను తప్పక కొత్తకోట మహబూబ్‌నగర్ చూస్తానని నిండు విశ్వాసం నాకు ఉంది. అదే పత్రి గారి ప్రణాళిక "2012 నాటికి ధ్యాన జగత్" అదే - సత్యయుగం. పత్రి గారి బాటలో పయనిద్దాం సత్యయుగ వారసులవుదాం.

ది కొత్తకోట పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షునిగా మరి 'ధ్యానాంధ్రప్రదేశ్' మాసపత్రికకు మహబూబునగర్ జిల్లా కన్వీనర్‌గా బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆశీస్సులతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాను.

ఈ ధ్యానంలో నా జీవితం ఓ మలుపు తిరిగింది. అదే పత్రీజీ గారి సహవాసం (పిరమిడ్ కుటుంబం). శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతలతో నా విధి నిర్వహణలో ప్రతిరోజూ ఒక పండుగ చేసుకుంటున్నాను. అందరూ ఇలాగే పండుగ జరుపుకోవాలని నేను తెలుసుకున్న సత్యం అందరూ తెలుసుకోవాలని (నాకోరిక) నా సందేశం.

ధ్యానం చేద్దాం, ధన్యులమవుదాం.

 

S.R.ప్రేమయ్య
కొత్తకోట
మహబూబ్‌నగర్ జిల్లా

Go to top