" సార్ ఏం చేసినా దానికి ఒక అర్ధం వుంటుంది "

 

నా పేరు విజయలక్ష్మి. 1998 సెప్టెంబర్ ఫస్టు ధ్యానం మొదలుపెట్టాను. 1999 జనవరి మొట్టమొదటి సారి ట్రెక్కింగ్‌కు తిరుమల వెళ్ళాను. జాబాలి తీర్ధంలో పత్రిసార్ 'పిరమిడ్ పార్టీ' గురించి చెప్పారు. అప్పుడ్డు "ఆధ్యాత్మిక సంస్థకు రాజకీయం ఎందుకు?" అన్న ప్రశ్న వచ్చింది. కానీ సార్ మీద ఉన్న గురి., "సార్ ఏం చేసినా దానికి ఒక అర్ధం ఉంటుంది" అని నాకు తెలుసు. తరువాత నన్ను నిలబడమన్నప్పుడు అసలు రాజకీయం అంటే తెలియదు. ఇంట్రస్ట్ అంతకంటే లేదు, సార్ పాంప్లెట్ ఇచ్చినప్పుడు అర్ధం అయ్యింది. "ఎవరైతే యోగితత్వంతో ఉంటారో, వారు పాలకులైతే ప్రపంచం రామరాజ్యం అవుతుంది. యోగి అవ్వాలంటే ధ్యాన సాధన ద్వారా అవుతారు. అలాంటి వారిని మీరు పాలకులుగా ఎన్నుకోండి" అని అన్నారు. "మాకు ఓటెయ్యండి" అని ఎక్కడా అడగలేదు. నన్ను చాలా మంది, "మీకు డబ్బుండా? ఎలక్షన్లు తమాషానా?" అని అడిగారు. "మాకు ఆత్మజ్ఞానముంది, దానితో ప్రజలను వాళ్ళు సరియైన రీతిలో ఆలోచించడానికి కావల్సిన మార్గాన్ని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మా ధ్యేయం అదే" అని చెప్పాను. నామినేషన్ వేసాం. సెలక్టయ్యాను.

నాకున్న ధ్యేయం ఒక్కటే. ఈ మెసేజ్ ప్రజలకి చేరాలి. చక్కటి కరపత్రాలు ఇచ్చారు. నా వరకు నేను. సనత్‌నగర్ అన్ని ఏరియాలకు న్యూస్ పేపరు ద్వారా ఈ కరపత్రాలు వెళ్ళేలాగా "యంగ్ పిరమిడ్ మాస్టర్స్" సహాయంతో ప్రజలకు చేరేలాగా చేశాను.

ఎన్నికల రిజల్టులో నాకు 900 ఓట్లు వచ్చాయి, నేను చాలా ఆనందపడ్డాను. కనీసం 900 మందికి మా ధ్యేయం అర్ధం అయ్యిందని. ప్రతి మనిషి తన్ను తాను తెలుసుకున్న రోజు, ఎలా ఉండాలో అర్ధం అయిన రోజు ఈ భూమి భూతలం స్వర్గం అన్నది నిజమవుతుంది. ప్రతి ఒక్క మనిషి ధ్యానం చేసి, జ్ఞానం పొంది యోగులుగా అయిన రోజు ఈ భూమే రామరాజ్యం.

ఇది ఒక అద్భుతమైన ప్రణాళికకు నాందీ ప్రయత్నమే. ఈ "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" యొక్క ఆవిర్భావం. ఇదే, నా అనుభవం, నా అనుభూతి.

మళ్ళీ సార్ ఈ ప్రణాళికకు నాకు ఏ పని అప్పచెబితే ఆ పనిచేయటానికి, నేను సర్వత్రా రెడీగా ఉంటాను. ఎందుకంటే అధోగతికి వెళ్తున్న ఈ భూమి, దీనిపై ఉన్న మానవాళి సరియైన స్థితికి రావటానికి 'శ్వాస మీద ధ్యాస' ఒక్కటే మార్గం. నా ఆఖరి శ్వాసవరకు ఈ భూమి మీద పత్రీజీ వెంటే ఉంటాను.

 

G.విజయలక్ష్మి
సారధీ స్టూడియో వెనుక
అమీర్‌పేట్, హైదరాబాద్

Go to top