" నా ఆత్మదీపం వెలిగింది "

 

నా పేరు గీతాంజలి. మాది తిరుపతి. నేను నాలుగు నెలలుగా ధ్యానం చేస్తున్నాను. మా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర " ఆత్మదీపం " ధ్యాన మందిరం 6-4-04 ప్రారంభం జరిగింది. నేను తర్వాత రెండురోజులు ధ్యాన మందిరానికి వెళ్ళాను. అక్కడ రామకృష్ణ మాస్టరు ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పారు. నన్ను ధ్యానంలో కూర్చోపెట్టారు.

మొదటిరోజు:

మామూలుగా నేను పది నిమిషాలు కూడా క్రింద కూర్చోలేకపోయేదానిని. అలాంటిది 45 నిమిషాలు కూర్చున్నాను. అసలు సమయమే తెలియలేదు. నా నోట్లో నీరు ఎక్కువుగా ఊరింది. దానిని మ్రింగాలో ఉమ్మాలో తెలియలేదు. అయినా నేను మ్రింగేసాను. దాన్ని గురించి మాస్టరును అడిగితే అది విశ్వశక్తి లాలాజలంతో కలిసి గంగాజలంగా మారుతుంది. అది అమృతంతో సమానం అని చెప్పారు. ఆ రోజు ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోయాను. ఆ రోజు యోగ నిద్రలో ఏవేవో లోకాలకు పోయాను. అక్కడ మాస్టర్లను చూసి రావడం జరిగింది. ధ్యానం అంటే ఏమో తెలియని నాకు తెలియచేసిన " ఆత్మదీపం " ధ్యానమందిరం కు కృతజ్ఞురాలిని.

రెండవరోజు:

రామకృష్ణ మాస్టరు నన్ను ధ్యానంలో కూర్చోపెట్టి ' శ్వాసను గమనిస్తూ ఉండు. శ్వాస చిన్నదై, నాసికాగ్రంలో స్థితమవుతుంది. అప్పుడు ఆలోచనా-రహిత-స్థితి కలిగి, నీలో విశ్వశక్తి ప్రవేశిస్తుంది. నీ మూడో కన్ను తెరుచుకుంటుంది ' అని అంటున్నారు. నాకు మాస్టరు ఏ విధంగా చెప్తున్నారో నాకు ఆ విధంగానే జరుగుతూ వచ్చింది. మాస్టరు మూడోకన్ను తెరుచుకుంటుంది అంటున్నారు. నాకు వెంటనే మూడోకన్ను తెరుచుకొని గౌతమ బుద్ధుడు దర్శనమిస్తూన్నాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇంత మంచి అనుభవాలు ఇచ్చిన మాస్టరును, వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడండి అని బుద్ధభగవానుని, ధ్యానంలో వేడుకుంటున్నాను. అంతలో షిర్డి సాయిబాబా వచ్చి ' వాళ్ళ సంగతి మేము చూసుకుంటాము. నువ్వు దేన్నీ ఆశించకుండా ధ్యానం చెయ్యి ' అని నా తలపైన మొత్తినారు. ప్రతిరోజు ఏదో ఒక అనుభవం బుద్ధుడు, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, పత్రీజీ, ఆంజనేయస్వామి, జీసస్, అందరిని చూడడం, మాట్లాడ్డం జరిగేది.

నేను ధ్యానంలోకి రాకముందు ప్రతిరోజూ గుడికి వెళుతూ ఉండేదాన్ని. ధ్యానం పరిచయం అయినప్పటి నుంచి గుడికి వెళ్ళడం లేదు. సమయం అంతా ధ్యానంతో సరిపోతుంది. నేను గుడికి వెళ్ళకుండా ఏమైనా పొరబాటు చేస్తున్నానా? అనిపించేది. మరుసటి రోజు ధ్యానంలో శ్రీ ఆంజనేయస్వామి కనిపించారు. స్వామి గుడికి రాకుండా పొరపాటు చేస్తున్నాను. నన్ను శిక్షించండి స్వామి అంటే, ఆయన నన్ను దగ్గరికి తీసుకుని ' లేదు, నువ్వు ఏమీ తప్పుచేయడం లేదు. నీవు సరైన మార్గంలోనే ఉన్నావు ' అని చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది.

ధ్యానంలో ఒక రోజు కాళికా దేవి శూలం విసురుతూ కనపడింది. దుర్మార్గులపైన కదా ఆయుధం విసిరేది. మరి ఎందుకు ఆమె ఆయుధం వేస్తూకనపడింది? అని నా మనస్సులో చాలా అలజడి ఉంది. మరుసటి రోజు ధ్యానం చేస్తూంటే ఆ శూలం కనపడి ఎన్నో గ్రహాలు దాటి ఎంతో దూరం ప్రయాణించి ఓ ప్రాంతంలో పడింది దాని ముందర బుద్ధుడు ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు తెలిసింది కాళికాదేవి శూలం ద్వారా బుద్ధుని మార్గం చూపించింది అని. ఇలా ఎన్నో అనుభవాలు.

ధ్యానం వలన నా ఆరోగ్యం కూడా బాగుపడింది. ధ్యానం చెయ్యడానికి ముందు నాకు సొరియాసిస్ అనే జబ్బు ఉండేది. నాకు నడిచేటప్పుడు కాళ్ళ నుంచి రక్తం కారుతుండేది. ఎన్నిమందులు వాడినా తగ్గలేదు. ఇప్పుడు పూర్తిగా తగ్గి దానికి సంబందించిన మచ్చ కూడా కనపడడం లేదు. మానసికంగా కూడా ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను. ఇంతకు ముందు ప్రతి చిన్న విషయానికీ భయపడే దానిని. ఇప్పుడు ఏ విషయానికి భయపడటం లేదు. ఇంట్లో అందరికి ధైర్యం చెప్తున్నాను. నన్ను చూసి నా భర్త, నా కొడుకు ధ్యానం చేస్తున్నారు. జీవితం ఎంతో ఆనందంగా ఉంది. నేను కూడా పత్రీజీ మార్గంలోనే నడుస్తాను. ఆయన జీవితమే నాకు ఆదర్శం. అందరికి ధన్యవాదాలు తెలుపుతూ...

 

గీతాంజలి
C/o ఆత్మదీపం, 1060
శ్రీపురం కాలనీ, తిరుపతి

Go to top