" పూర్వ జన్మ స్మృతులు గుర్తుకొచ్చాయి "

 

నా పేరు N.S.రావు, 2000 సంవత్సరంలో నాకు హెర్నియా ఆపరేషన్ అయినప్పటి నుంచీ నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే వుండేది. అల్లోపతి మందులవల్ల శరీరం బాగా బలహీనపడింది. తరచూ డాక్టర్ల దగ్గరకు వెళ్ళాల్సి వచ్చేది.

"ఇక మళ్ళీ ఆరోగ్యంగా తయారు కావడానికి మార్గమేదైనా వుందా?" అని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో "హరిహరకళాభవన్"లో 2000 సం.లో జూన్ 2 నుండి 4 వరకు జరిగిన ధ్యాన యజ్ఞంలో పాల్గొనటం, బ్రహ్మర్షి పత్రీజీ గారిని కలవడం, వారి ఆశీస్సులు పొంది "ఆనాపానసతి ధ్యానం" మొదలుబెట్టడం జరిగింది. ఇది నా జీవితంలో పెదమలుపుగా మారింది.

ప్రతిరోజూ ఇంట్లో ధ్యానం చెయ్యటమూ, ప్రతి సోమవారం "వాసవీనగర్ కమ్యూనిటీ" హాల్లో జరిగిన క్లాసుల్లోనూ, యజ్ఞాల్లోనూ, పౌర్ణమి ధ్యానాల్లోనూ, ఇతరచోట్ల బ్రహ్మర్షి పత్రిగారు నిర్వహించిన ధ్యానం క్లాసుల్లోనూ పాల్గొనటం జరిగింది.

నా మొదటి ధ్యానానుభవంలో నేను నిత్యం పూజించే వెంకటేశ్వరస్వామి అద్భుతమైన రంగుల్లో కనబడి ఆశీర్వదించడం, వెంటనే నాలోకి విపరీతమైన విశ్వశక్తి ప్రవహించడం జరిగింది. ఆ తరువాత అనేక మంది దేవీ దేవతలూ, ఋషులూ, మాస్టర్స్ వరుసగా కనబడి ఆశీర్వదించారు.మరోమారు వెంకటేశ్వరస్వామి కనబడ్డప్పుడు, "స్వామీ నీవు నాలోనే వున్నప్పుడు నేను వేరే పటాలనూ, విగ్రహాలనూ పూజించటమెందుకూ?" అనడిగాను. "అవును" అన్నట్లు మందహాసం చేసి దీవించారు. వెంటనే నాలోకి విపరీతమైన విశ్వశక్తి ప్రవహించింది. అప్పటి నుంచి నేను పూజలు పూర్తిగా మానేశాను.

2001 జూలై 29 న ధ్యానంలో, నాకు ఆపరేషన్ చేసిన చోట బాగా నొప్పి పుట్టింది. మా ఫ్యామిలీ డాక్టరుతో చెబితే సర్జన్ను కలవమన్నది. ఆయన పరీక్షజేసి అంతా సరిగ్గానే వుంది. "బహుశా స్కూటర్ నడపటం వల్ల నొప్పి వచ్చుంటుంది" అని చెప్పి ఏవో మాత్రలు వ్రాసి "నొప్పి తగ్గకపోతే వారం తరువాత కలిస్తే టెస్టులు చెయిస్తా"నన్నారు. ఆయన చెప్పిన టెస్టలన్నీ మా డాక్టరు చేయించింది. వాటిల్లో ఏ లోపమూ కనబడలేదు. నొప్పి మాత్రం వొస్తూనే వుండేది. సర్జనుక్కూడా ఏమీ అంతుబట్టలేదు. అప్పుడు నాకు తెలిసింది, డాక్టర్లు తెలుసుకోలేని జబ్బును కూడా విశ్వశక్తి తెలుసుకుని నయం చేయగలదని. ఎందుకంటే, ధ్యానంతోటే నాకా నొప్పి తగ్గిపోయింది. వ్యాధి పూర్తిగా నయం కావటానికి అవసరమైన క్యూరింగు అంటే నయం చేయటం కూడా జరుగుతున్నది. ఇది మాటల్లో చెప్పలేని అద్భుతమైన అనుభవం. వున్న జబ్బులను మాత్రమే డాక్టర్లు చూడగలరు. కానీ రాబోయే జబ్బులను విశ్వశక్తి కూడా కనిపెట్టి అవి తీవ్రం కాకముందే నయం చేస్తుంది. పూర్వజన్మ సంచితం వల్ల వచ్చే జబ్బులు కూడా నయమైపోతాయి. జగిత్యాల పిరమిడ్ మాస్టర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తిగారు కూడా ఈ విషయం చెప్పారు.

ఆరోగ్యంలో మార్పులు:

ధ్యానం వల్ల నా ఆరోగ్యం బాగుపడింది. ఏవిధమైన వైద్యంగానీ, మందులుగానీ తీసుకోటం లేదు. నా పనులు నేను చక్కగా చేసుకోగలుగుతున్నాను. ఆత్మవిశ్వాసం, ధైర్యం వచ్చాయి. వయస్సు 77 సంవత్సరాలైనా స్కూటర్ నడపగలుగుతున్నాను. మామూలుగా వచ్చే జలబులూ, జ్వరాలు, నొప్పులూ దూరమయ్యాయి. ధ్యానాన్ని పత్రిగారు నాకిచ్చినవరంగా భావిస్తున్నాను.

2001 నవంబర్ 1న డాక్టర్ న్యూటన్, వాసవీ కమ్యూనిటీ హాల్లో ధ్యానులందరిచేత 'హిప్నోటిక్ రిగ్రెషన్' అంటే 'పూర్వజన్మ స్మృతుల్లోకి పోవటం', చేయించారు. అందులో పాల్గొన్న నెను నాకు రెండు సంవత్సరాల వయస్సున్నప్పుడెట్లా వున్నానో చూసుకోగలిగాను.

తరువాత న్యూటన్ గారి చెప్పిన విధంగానే ఇంటివద్ద ప్రాక్టీసు చేశాను. ఒక నెలరోజుల సాధన తర్వాత అనుకుంటాను, ఒక రోజు రాత్రి సూక్ష్మశరీరయానం వచ్చింది. చాలా పెద్దచెట్లూ, అడవుల మీదుగా వెళ్ళాక ఒక చీకటి సొరంగంలో ప్రవేశించాను. అందులో అతివేగంగా చాలా దారం ప్రయాణించాక ఒక వెలుగు బిందువు కనిపించింది. అది పెద్దదై సొరంగద్వారం కనిపించింది. చీకటి సొరంగం నుండి బయటపడి వెలుగులో కొచ్చాను. అక్కడ నాకు ఋషి లాగా వున్న ఒక తేజస్వి కనిపించాడు.

ఆయన చిరునవ్వుతో నన్నాహ్వానిస్తూ, "రా నాయనా, నీ కోసమే ఎదురుచూస్తున్నాను" అన్నారు. చెయ్యి పట్టుకుని తన వెంట తీసుకెళ్ళారు. దారిలో ఒక చిన్న నది దానిపై అర్చీలాగా వున్న కొయ్యవంతెన. ఆ వంతెన మీదుగా నదిని దాటాము. ఆవలిఒడ్డున ఒక ఆశ్రమం కనిపించింది. ఋషి అక్కడవున్న ఒక శిష్యుణ్ణి పిలిచి, "మీ గురువుగారొచ్చారు. లోపలికి తీసుకువెళ్ళు" అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ శిష్యుడు నాకు నమస్కరించి నది ఒడ్డుకు తీసుకెళ్ళి "స్నానం చెయ్యండి గురువుగారూ" అన్నాడు. అంతే, వెంటనే నాకు స్నానం చేసినట్లే అనిపించింది. "ఈ దుస్తులు ధరించండి" .... అని పసుపురంగులో వున్న ఆశ్రమ దుస్తులిచ్చాడు. వెంటనే అవి నావొంటి మీదకి వచ్చేసాయి. ఆశ్రమవెనుకభాగంలో వున్న వంటింట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నున్నగా మెరుస్తున్న ఒక కొయ్యపాత్రలో వేడివేడిగా లేతపసుపు రంగులోనున్న రసం ఒకటి తెచ్చిచ్చి తినమన్నాడు. మరొక మట్టిపాత్రలో పాలు తెచ్చాడు. అనంతరం ఆశ్రమంలోని ఒక గది వద్దకు తీసుకువెళ్ళి "గురువు గారూ ఇదే మీ గది. అదే మీ ఆసనం. విశ్రమించడం అన్నాడు.

ఇదంతా నాకేదో అయోమయంగా వుంది. ఆ ప్రదేశమంతా కొత్తగా వుంది. ఆ గదిలో వున్న వస్తువులు, అంటే కమండలం మొదలైనవి చూసి "కాదు, ఇది నా గది కాదు. నేను సన్యాసినికాను" అన్నాను. "ఒక్క నిమిషముండండి" అంటూ ఎక్కడికో వెళ్ళాదు. వెంటనే మొదటకలిసిన గురువుగారు నా యెదుట ప్రత్యక్షమయ్యారు. నా తల నిమురుతూ "ఇప్పుడైనా గుర్తొచ్చిందా? ఇది నీ పూర్వజన్మ" అన్నారు. అప్పుడు గానీ గుర్తురాలేదు అది నా పూర్వాశ్రమమని. ఆ గదిలో ఆసనం మీద నేనే కూర్చుని వున్నాను, ఆశ్రమదుస్తుల్లో.

ఇక ఒక్కొక్కటిగా పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చాయి. నేను ఇల్లు వదిలి ఆశ్రమానికి రావటం, పెద్దల అనుమతి లేకుండానే సన్యసించటం, ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయటం మొదలైనవి. అయితే నా విద్యనూ, జ్ఞానాన్నీ ఇతరులకు బోధించే అవకాశం రాకముందే దేహం చాలించవలసి వచ్చింది. అందుకే ఈ జన్మ తీసుకుని క్రిందటి జన్మలో మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తిచేసుకుంటున్నాను.

ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఎంతో ఇష్టంగా 50 సంవత్సరాలుగా పిల్లలకు విద్యాబోధ చేస్తూ వస్తున్నాను. ఈ విధంగా నా పూర్వజన్మస్మృతి వల్ల ఈ జన్మ రహస్యం తెలిసింది. నాకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నాను.

 

N.S.రావు
సికింద్రాబాద్

Go to top