" ధ్యానమే నీ ధ్యేయం "

 

నా పేరు V.పరమేశప్ప.

నాకు ఊహ తెలిసిన తర్వాత అంటే 1990 సం|| నుండి 14 డిసెంబర్ 2001 సం|| వరకు ఎన్నో పాపాలు చేశాను. చివరకు తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి లేకుండా చేశాను. తప్పత్రాగి ఎన్నోసార్లు కట్టుకున్న భార్యను కూడా వేధించడం జరిగింది. ఇలాంటి క్రూరత్వాలకు బానిసగా దాదాపు 11 సంవత్సరాలు నా జీవితం కొనసాగించాను. ప్రతిరోజూ ఇన్ని పాపాలు చేస్తున్నానే, నా జీవితంలో ఇక మంచిరోజులు ఎప్పుడు వస్తాయా? అని అప్పుడప్పుడూ వేదన చెందుతూ వుండేవాడిని.

హఠాత్తుగా ఒకరోజు డిసెంబర్ 14, 2001 సం|| న మా గ్రామానికి ఉరవకొండ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వ్యవస్థాపకులు G. వెంకటేశులుగారు, వలీబా గారు, మా గ్రామ టీచర్ శ్రీరాములు గారు ధ్యానప్రచారం చేయడానికి వచ్చారు. ఉదయం 10 గంటలకే నేను తప్పత్రాగి వున్నాను. నా స్థితి గమనించిన శ్రీరాములు గారు, వెంకటేశులు గారు, మిగతా కొంతమంది మాస్టర్లు "ఏమయ్యా, నువ్వు ధ్యానం చేయి. చాలామంచి జరుగుతుంది. ఎటువంటి సమస్యనైనా తేలికగా ఎదుర్కోగలవు. ఇలా త్రాగితే నీ ఆరోగ్యం చెడిపోతుంది. ధ్యానం చెయ్యి. నీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది." అని చెప్పినప్పుడు 'నేను ధ్యానం చేయను సార్. నాకెందుకు ధ్యానం. రోజూ మాంసం తిని, సారాత్రాగి జీవితం గడుపుతున్న నాకెందుకు ఈ ధ్యానం?' అని చెప్పాను. ఇకవారు 'నీ ఇష్టం బాబూ. ధ్యానం చేస్తే మంచిది' అని చెప్పి వెళ్ళిపోయారు.

వారు వెళ్ళాక మొదలయిందీ నా దృష్టి ధ్యానం మీద. ధ్యానంలో ఎటువంటి మహత్యం లేనిదే ఇంతమంది ధ్యానప్రచారానికి ఎందుకు వస్తారు? వీరికి వేరే పనేమీ వుండదా? అని ఆలోచన చేశాను. అప్పుడు ఇలా ఆలోచిస్తూ వుండగా ఒక కథ నాకు వెన్ను తట్టింది. ఆ కథే రామాయణం. ప్రతిరోజూ దొంగతనం చేస్తూ జంతువులను వేటాడి ఆ మాంసాన్నే ఆహారంగా భుజించిన వాల్మీకి దురలవాట్లన్నీ వదులుకుని, రామాయణం రచించినప్పుడు, నేను మాత్రం ఈ చెడు సహవాసాలు వదులుకుని ధ్యానం చేస్తే తప్పేముంది. అని ధ్యానం చేయడం ప్రారంభించాను. అప్పుడు మొలకెత్తింది - నాజీవితంలో ధ్యానమనే మొక్క. డిసెంబర్ 14, 2001 న ప్రారంభించిన ధ్యానం ఇప్పుడు ఎన్నో చిగురాకులు తొడిగి పెద్ద తీగలా నా శరీరాన్ని అల్లివుంది. నా శరీరానికే కాక మా గ్రామమంతా అల్లుకుని ఎన్నో రకరకాల అనుభవాలకు ఆలవాలమయ్యింది. మా గ్రామమే కాకుండా మా చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా ఈ ధ్యాన తీగను అల్లించాం. నేను ధ్యానం చేయడం గొప్పకాదు. ఇతరులతో ధ్యానం చేయించడం గొప్ప అని భావిస్తూ 'ధ్యానాంధ్రప్రదేశ్' కావాలని ఆశిస్తూ, పని లేని సమయంలో ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గంటా వృథా గాకుండా ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేశాక తెలిసింది నాకు కూడా ఎన్నో అనుభవాలు వున్నాయని. ఇప్పుడు ఎన్నో కవితలు, పాటలు వ్రాశాను. నేను చదివినది కేవలం 6వతరగతి మాత్రమే. కానీ ఇలాంటి కవితలు, ఇలాంటి పాటలు నాకు రావడం, నాకే ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు తెలిసింది ఇదంతా ధ్యానం యొక్క మహిమ అని.

1. పల్లవి : ధ్యానమే నీధ్యేయము అదియే ప్రధానము
సత్యమే జయము అది కనుగొనుము|| 2 ||
చరణం : మనిషి మనిషికీ మధ్య ఎందుకు పోరాటం
మన బ్రతుకుల పైన ఎందుకు ఆరాటం.
అది కానేకాదు నీ ధ్యేయం || ధ్యానమే||
చరణం : ఆశ నిరాశలు అదుపున వుంచుదాము మంచి అన్నది
పది మందికి పంచుదాము
అప్పుడే శాంతి నీకు లభించును || ధ్యానమే ||
చరణం: మనుషులు మూరెడు ఆశలు బారెడు కారాదు నేడు
నీవు దాల్చిన మాయావేశము నీకు చేయును చాలా మోసం || ధ్యానమే||
చరణం : పుట్టేటప్పుడు వెంటరానిది చచ్చేటప్పుడు వెంటవచ్చును
మధ్యవచ్చినది వుండునా తుదివరకు|| ధ్యానమే||

2. పల్లవి : ఎంతమంచి ధ్యానం ఇది ఎంత మంచి సూత్రం
చేసుకున్న వారికి ఇది అంతులేని ఆనందం|| 2 ||
చరణం : ఇంత మంచి ముక్తి మరి ఏ జన్మకు రాదాయే
మనసంటూ లేని మాకు మార్గమొకటి దొరికింది|| 2 ||
చీకటంటి మా బ్రతుకును చిరు వెలుగును చూశాము
స్వార్ధం విడిచి మేము త్యాగాల గుడికడతాం || ఎంత మంచి ||
చరణం : పెద్దపెద్ద యోగంతో శోధించిన ఈ ధ్యానం
మన అందరికి ఇదియే ఆదర్శం || 2 ||
పౌరుషాలకు పోయామా పలచనై పోతాము
ఇక మాకు వద్దులే ఎటువంటి కలతలు || ఎంతమంచి||
చరణం : మోసాలు మనకొద్దు క్రోధాలు మనకొద్దు
పంతాలు పట్టింపులు అసలే మనకొద్దులే|| 2 ||
కదలుతున్న కాలం తరిగిపోయే వయస్సు
వెనుకకు రాదింక ప్రతినిత్యము తెలుసుకో || ఎంతమంచి ||

 

V. పరమేశప్ప
కంబదూరు మండలం
అనంతపురం జిల్లా

Go to top