" ధ్యానం వల్ల కలుగు పలు లాభాలు "

 

నా పేరు కొత్తపల్లి రామకృష్ణ. వయస్సు 67 సంవత్సరాలు. 2003 సంవత్సరం ఆగష్టు నెలలో హిందూపురం పట్టణంలో పిరమిడ్ మాస్టర్ టి.రవికుమార్ గారి ధ్యాన కేంద్రంలో చేరి ధ్యానం నేర్చుకున్నాను. ఆ తరువాత 2003 అక్టోబరులో భైరవ కోన ట్రెక్కింగ్‌కు వెళ్ళాను. అక్కడే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారితో తొలిపరిచయం జరిగింది. అదే సమయంలో పత్రిగారి ఎదుట ఏదో అసందర్భపు మాట మాట్లాడినందుకు నాకు వెంటనే ఆయన గుణపాఠం నేర్పారు. తక్షణమే నా వాక్కును కంట్రోల్ చేసుకోగలిగాను.

రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పక ధ్యానం చేస్తున్నాను. కోపం చాలా వరకు తగ్గి పూర్తిగా సహనం ఏర్పడింది. మితాహారం, మిత నిద్ర, మిత వాక్కు అలవాటైపోయాయి.

సుమారు 12 సంవత్సరాల నుంచి నా వెన్ను నొప్పి నివారణకై, ప్రతి ఉదయం 20 నిమిషాలు వ్యాయామం చేసేవాణ్ణి. కానీ, ఇప్పుడు ఆ వ్యాయామం అవసరం లేకుండానే ధ్యానంతోనే నివారణ కలిగింది.

ఒకరోజు ఉదయం నాకు తెలియకుండానే రెండున్నర గంటలసేపు ధ్యానంలో కూర్చున్నాను. శరీరం చాలా తేలిక అయిపోయి, వీపులో చీమలు ప్రాకినట్లు అనుభూతి కలిగింది. అమితమైన ఆనందం, కళ్ళనుంచి ఆనందబాష్పాలు వచ్చాయి. ఇలా రెండు రోజులు జరిగింది. ధ్యానంలో నాకిష్టమైన దేవతాస్వరూపాలు, సద్గురువులు రూపాలు, వృక్షాలు, పర్వతాల వంటి దృశ్యాలు చూశాను. ఒక్కొక్కసారి లోతైన గుహలోనికి చొచ్చుకుని పోయినట్లు అనుభవం కలిగింది. బజారులో విపరీతమైన రద్దీలో నడుస్తున్నప్పుడు, చిన్న చిన్న ప్రమాదాల నుంచి తప్పించుకోగలిగాను. ఇంటిలో నెగటివిటీ పోయి, ధ్యాన ప్రకంపనల వల్ల పూర్తిగా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఇదంతా ధ్యాన మహిమయే గదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపమని నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి.

ధ్యానం శరణం గచ్ఛామి !

 

కొత్తపల్లి రామకృష్ణ
హిందూపురం
అనంతపురం జిల్లా

Go to top