" ధ్యానంలో ఎందరో దేవుళ్ళను చూశాను "

 

నా పేరు బ్రహ్మేశ్వరి. డిసెంబర్ 2002 సంవత్సరంలో మా ప్రక్క ఇంటి సరస్వతి ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను.

అదే రోజు నుండి ఆనాపానసతి ధ్యానాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. మొదట్లోనే ధ్యానంలో శ్రీ వీరబ్రహ్మంగారు వచ్చారు. నేను చాలా నమ్మశక్యం కాని అనుభూతి పొందాను. ఆయన వెంటనే "ఈ రోజు నుండి ధ్యానం క్రమం తప్పకుండా చెయ్యి. ముందు ముందు చాల విషయాలు తెలుస్తాయి." అని చెప్పారు.

ఆ తరువాత రోజూ నేను మూడు గంటల వరకు ధ్యానం చేస్తున్నాను. చాలా మంది మాస్టర్లతో సంభాషించడం జరుగుతోంది. ప్రతి రోజూ నాకు శివుడు, విష్ణుమూర్తి, లక్ష్మీ, వినాయకుడు, సరస్వతి, చాల మంది మాస్టర్స్ అంటే మనం ఎవరినైతే దేవుళ్ళుగా కొలుస్తూవున్నామో వారందరూ ధ్యానంలో కనిపిస్తూంటారు. వాళ్ళు చేసినవి, మనం చేయవలసినవి, తెలుసుకోవలసినవి పత్రీజీ చెబుతూంటారు. ఈ అనుభవాలు నేను గతజన్మలో చేసిన కర్మనుసారం వస్తున్నవి అని అనుకుంటున్నా.

తలనొప్పి, ఏదో తెలీని వెలితి నన్ను వేధించేవి ... అవన్నీ ధ్యానం ద్వారా మటుమాయమయ్యాయి. మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ధ్యానం చేయడం లేదు. వాళ్ళకు ధ్యానమంటేనే కోపం. త్వరలోనే వాళ్ళందరూ ధ్యానులుగా మారే రోజులు వస్తాయి. అప్పుడు నేను ఇంకా సంతోషపడతాను.

నా ఆశయం యోగ సాధన ద్వారా నా జన్మ పరంపరను తెలుసుకోవడం మరి జన్మరాహిత్య మార్గాన్ని అనుసరించడం నా ముందున్న లక్ష్యం.

నా సందేశం : స్థూల శరీరంలో శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి, చేయించాలి.

 

బ్రహ్మేశ్వరి

Go to top