" నేనే అంతటా, అంతటా నేనే "

 

నా పేరు K. శ్రీనివాస్. నేను విజయవాడ పట్టణంలో M.A. మ్యూజిక్ చదువుతున్నాను. నేను సంగీత విద్వాంసుల వంశంలో లక్ష్మీసూరమ్మ, సోమయాజుల దంపతులకు ఆఖరి సంతానంగా జన్మ తీసుకున్నాను.

ధ్యానం మొదలు పెట్టిన ఆరు నెలల్లోనే నా శరీరంలోంచి అద్భుతమైన సుగంధ పరిమళాలు బైటకి వచ్చాయి. ఆఖరికి నా చెమట కూడా సువాసన వేసింది. అప్పుడు నాకు అర్ధమైంది నా భౌతిక శరీరం పూర్తిగా శుద్ధి అయినదని. అప్పటి నుంచి జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను మందులు వాడకూడదని నిర్ణయించుకున్నాను. మరి నన్ను నేను పరిక్షించుకోవడానికి అవకాశం రానే వచ్చింది. వారం రోజుల పాటు జ్వరంతో నరకం అనుభవించాను. కూర్చోలేను, పడుకోలేను, అన్నం తినలేను. ధ్యానం కూడా చేయలేను. అయినా సరే నేను మందులు వాడలేదు. వారం రోజుల తర్వాత 100 మందితో కలిసి రెండు గంటల సేపు ధ్యానం చేస్తే మళ్ళీ మాములు మనిషినై పోయాను. ఎంతటి బాధను అనుభవించిన మందులు వాడనందున నా ఆలోచనా శక్తి పనిచేసింది.

నేను సుమారు రెండు సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నప్పటికీ నాలో ఏదో అసంతృప్తి. నేను ' వచ్చిన పని ' చేయట్లేదు. అదేంటో తెలీదు. 20 సంవత్సరాల్లోనే భౌతిక జీవితం మీద పూర్తిగా వైరాగ్యం వచ్చి 41 రోజుల పాటు ధ్యానం చేయాలని నాలోంచి చాలా సార్లు మెసేజ్ వచ్చింది. నింబగల్లు, ఉరవకొండ(అనంతపురం జిల్లా) లలో 41 రోజుల మౌన ధ్యానం పోయిన ఏడాది జూలై 4 నుండి చేశాను.

ధ్యానానుభవాలు :

నన్ను ఉదయాన్నే 3.30 గంటలకు శంకరాచార్యుల వారు లేపి ధ్యానం చేయించేవారు. హిమాలయాల్లో శివుడు, నాగలోకం అంతా చూశాను నా దివ్యచక్షువుతో, అప్పుడు శివుడిని నేను అడిగాను " నా పూర్ణాత్మ ఎవరు? " అని. ఏడు గంటల తర్వాత శివుడు విశ్వంలోకి ఒక బంతిని విసిరితే అది పైకంటా వెళ్తూ ఒక చోట ఆగి శివలింగం ఏర్పడింది. అప్పుడు నాకర్ధమైంది ... " శివుడే నా పూర్ణాత్మ " అని.

శివుడు నా ప్రక్కన వ్యక్తికి కనిపించి, " ఎవరైతే 21 రోజుల్లో గానీ, 41 రోజుల్లో కానీ 24 గంటల సేపు ధ్యానం ఒక్కసారిగా చేస్తారో వారు ధన్యులవుతారు ". అని చెప్పారు. అది విన్న నేను 24 గంటల సేపు ధ్యానం చేయాలనుకున్నాను. మొదటి సిట్టింగ్ 15 గంటలు ధ్యానంలో విఘ్నేశ్వరుడు మృదంగం వాయిస్తూండగా, శివుడు తాండవం చేయడం చూశాను. తర్వాత 18 గంటలు పాటు ధ్యానం చేసి నొప్పులు భరించలేక కళ్ళు తెరిచాను. 18 గంటల్లో మొదటి ఏడు గంటల సేపు రాయిలా కదలకుండా కూర్చునేసరికి చాలా బాధ అనుభవించాను. కింద వేడి వేడి చీలల మీద కూర్చున్నట్లు. పై నుంచి వేడి వేడి ఆవిర్లతో ఏడు గంటల సేపు ధ్యానం చేసిన తర్వాత దేవతలు ఎదురుగా వచ్చి నా మీద పూవ్వులు చల్లి వెళ్ళారు.

24 గంటలసేపు ధ్యానం ఆఖరి ప్రయత్నంగా రాత్రి 9.30 కి మొదలుపెట్టాను. సుమారు ఐదు గంటల సేపు ధ్యానంలో - నేను తెలుపురంగు శక్తిగా మారిపోయి, నేను అనేది ఎక్కడా లేదు, నేను ఈ సృష్టి అంతా ఉన్నాను. ప్రతి మనిషిలోనూ, ప్రతి చెట్టూ లోనూ, అణువణువునా నేను ఉన్నాను. నేనే అంతటా, అంతటా నేనే. నేను తప్ప మరొకటి లేదు. ఐదుగంటల సేపు కలిగిన ఈ అనుభవం ఐదు నిమిషాలుగా అనిపించింది. " నేను ఎక్కడ ఉన్నాను? " అని ఒక్కసారి కళ్ళు తెరిస్తే పిరమిడ్ లోనే భౌతిక శరీరంతో ఉన్నాను. 24 గంటల ధ్యానం చేయకపోయినా ఈ అనుభూతి ఎంతో బ్రహ్మానందం కలిగించింది.

" నేను అసలు ఎందుకు పుట్టాను? " అని ప్రశ్నించుకొని ధ్యానం చేశాను. 14 గంటల సేపు చేసిన ధ్యానంలో త్యాగరాజస్వామి ఎదురుగా కూర్చుని " నేను రచించిన కీర్తనల్లోని ధ్యానార్ధాలను ప్రపంచానికంతటికీ తెలియజేయి " అని చెప్పారు. తర్వాత మా తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నప్పుడు కూడా శ్రీ త్యాగరాజస్వామి దగ్గరుండి ఆ పని చేయించడం చూశాను." మరి నేను ఎవరిని? " అని ప్రశ్నిస్తే ఒక ముసలాయన ... శివుడు ... వచ్చి నమస్కరిస్తూ " మీరు గొప్ప యోగీశ్వరులు. త్యాగరాజస్వామి వారు చెప్పిన పని చేయండి. " అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత నేను పెద్ద పెద్ద ధ్యానమహాయజ్ఞాల్లో వీణ, మృదంగ సహకారాలతో త్యాగరాజస్వామి కీర్తనలు పాడి, అర్ధాలను చెప్తూ ఉంటె, త్యాగరాజి స్వామి నాలోకి వాకిన్ అయి ఆయనే చెప్తున్నట్లు చూశాను.

క్రితం జన్మలో ఒకానొక పండితుడి కొడుకుగా ఉన్న నేను ఒక ముసలావిడ (నాగురువు) వచ్చి " ఇక నువ్వు ధ్యానం మొదలుపెట్టు అని చెప్పగా (అప్పుడు నాకు 12 సంవత్సరాలు ఉండవచ్చు) సుమారు 70 సంవత్సరాలపాటు ధ్యానం చేసి ఈ జన్మ (600వ జన్మ) నే ఆఖరి జన్మగా చేసుకోవడంతో పాటు " త్యాగరాజస్వామి కీర్తనలను ప్రపంచానికంతటికీ తెలియజేయడానికై ఈ భూమి మీదకి వచ్చాను. " అని తెలుసుకున్నాక నన్ను నేను ఎంతో అభినందించుకున్నాను.

41 వరోజు రాత్రి 9.30 గంటలకు ధ్యానంలో అనుకోకుండా కూర్చున్నాను. ధ్యానంలో మా ఇంటిలో బ్రహ్మదేవుడు లోంచి ఎంతో మంది మాస్టర్స్ బయటికి వచ్చి ధ్యానయజ్ఞం చేయడం, శివుడి మూడోకన్ను లోంచి ఒక జ్యోతి వచ్చి మా ఇంటిలో అద్భుతమైన కాంతితో వెలగడం. సాయిబాబా వచ్చి మా ఇంట్లో అన్నం తినడం చూశాను. 41 రోజుల పాటు నేను చేసిన ధ్యాన వైబ్రేషన్స్ మా ఇంటిలోని నెగటివిటీని పూర్తిగా తొలగించిందని నాకు అర్ధమైంది.

నేను వీణ, మృదంగం కూడా వాయిస్తాను. నా దగ్గరున్న సంగీతంతో ఎంతో మంది ధ్యానులకు దగ్గరైపోయాను. అప్పుడు నాకర్ధమైంది " ధ్యానం, సంగీతం ఉన్న జీవితాలు చాలా అద్భుతమైనవి. ప్రపంచం అంతా సంగీతమయం ధ్యానమయం అవ్వాలి " అని. కాని చేసిన ధ్యానంలో - నా కళ్ళలోంచి నీళ్ళు కారుతూ " ఇక ప్రపంచంలో ఎవరూ దుఃఖించకూడదు. అంతా ధ్యానమయం అవ్వాలి " అని నాలోంచి అర్ధగంటసేపు మెసేజ్ వస్తూనే ఉంది. చివరికి పత్రిసార్ వచ్చి చప్పట్లు కొట్టి " కంగ్రాచ్యులేషన్స్ " అని చెప్పారు.

41 రోజుల తర్వాత నాలో ఏదో తెలీని శక్తి నన్ను తట్టి తట్టి ముందుకు నడిపిస్తోంది. నాకు ఈ ప్రపంచంలో ఏదీ అడ్డులేదు. నేను ఎక్కడ కాలుపెడితే అక్కడ విజయం. అంతే జీవితం మీద ఎంతో అవగాహన జీవితంలో ఎలా ఆడుకోవాలో నాకర్ధమైంది.

నాజీవిత కార్యక్రమం తెలుసుకున్న నేను ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళాను.

నా సందేశం : సమస్త సృష్టి అంతా మీరే అని తెలుసుకుని చిన్న పిల్లల్లాగా ఎప్పుడూ హాయిగా నవ్వుతూ, కేరింతలు కొడుతూ ప్రతి క్షణం ఆనందంగా జీవించాలి అని కోరుకుంటూ....

 

శ్రీనివాస్
విజయవాడ

Go to top