" ధ్యానంతో భేషుగ్గా పాలన "

 

"సమాజంలో పెరిగిపోతున్న హింసాధోరణికి సరైన విరుగుడు - ఆధ్యాత్మిక చింతనే.

"సైన్స్, టెక్నాలజీ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమకాలీన సమాజంలో నెలకొంటున్న ద్వేషం, అసూయ, హింస, అశాంతిలను నియంత్రించేందుకు ఆధ్యాత్మిక బోధనలు ఎంతో దోహదపడతాయి. 'సైన్స్', 'ఆధ్యాత్మికం' అనేవి నాణానికి రెండు ముఖాలు; ఆధ్యాత్మికత నుంచే సైన్స్ వచ్చింది.

"ప్రశాంతత, నిశ్చలత్వం కోసం నిత్యం ధ్యానం చేస్తాను. ఉద్యోగులూ, మంత్రులూ ఎదుర్కొంటూన్న అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుగా ఆంధ్రలో వారికి ధ్యానం గురించి చెప్పవలసిందిగా 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' అధిపతి శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్‌ను కోరుతున్నాను.

ప్రభుత్వ నిర్వహణలో ఎదురయ్యే ఒడిదుడుకులను ధ్యానంతోనే నేను ఎదుర్కొంటాను. టన్నుల కొద్దీ డబ్బు కానీ, అధికారం కానీ, మానసికశాంతిని ఇవ్వలేవు. ఆధునిక సాంకేతికపై ఎంత మొగ్గు చూపినా సమస్యల పరిష్కారానికి ఆధ్యాత్మిక చింతన ఉపకరించగలదని విశ్వసించే వారిలో ఒకడిని నేను.

"ఆధ్యాత్మిక విలువల పరిధిలో ఆధునిక మానవ జీవితాన్ని నిర్మిస్తే సమాజంలో అశాంతి, హింస, ద్వేషాలు ఉండవు. ఇందుకోసం ఆధ్యాత్మికత గురువులు ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. గాంధీజీ అహింసా సూత్రాలు నేటి సమాజ పరివర్తనకు అవసరం. సమస్యల వలయంలో ఉండే రాజకీయనేతలు మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక విలువల్ని ఆచరించడం అనివార్యం.

"భారతదేశానికి వచ్చే విదేశీ పర్యాటకులకు ఇక్కడి సంస్కృతీ, సాంప్రదాయాలూ, ఆధ్యాత్మిక విలువలూ ఎంతో సంతోషాన్నిస్తాయి. ప్రపంచ ఆధ్యాత్మిక సమాజానికి భారతదేశం దిక్సూచి మాదిరిగా నిలిచింది. మానవత్వం, ప్రేమ, సోదరభావాల్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి."

 

నారా చంద్రబాబునాయుడు

Go to top