" పిరమిడ్ పార్టీ మహా తీపి స్వీయ అనుభవం "

 

అది 1999 సంవత్సరం. మే నెల. తిరుపతి ట్రెక్కింగ్‌లో ప్రకృతి సోయగాలతో ఆహ్లాదకరమైన వాతావరణం. వందలాది ధ్యాన మిత్రుల సంగమం. అక్కడ మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి పత్రీజీ గారు పిరమిడ్ పార్టీ ని గురించి చెప్పటం జరిగింది. పిరమిడ్ పార్టీ యొక్క ఆవశ్యకతను గురించి వివరించటం జరిగింది. దాన్ని సారాంశాన్ని పరికించి చూస్తే - ప్రస్తుత సమాజానికి అది ఎంత అవసరమో అర్ధమైంది. "యథా రాజా - తథా ప్రజా" అన్న లోకోక్తి అందరికీ తెలిసినదే. రాజులు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే తయారవుతారు.

అందుకే పరిపాలించేవాళ్ళు "జ్ఞాను"లైనప్పుడే ప్రజలను కూడా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దవచ్చు. ఆత్మజ్ఞాన పరాయణులుగా పెరగటానికి దోహదపడవచ్చు.

కాబట్టి జ్ఞానులు, యోగులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించుటకు అర్హులు. వారికి ఏ విధమైన స్వార్ధచింతనా ఉండదు. స్వప్రయోజనాలూ ఉండవు. అంతా సేవాభావమే. ఎందుకంటే అందరిలోనూ ఉన్నది వారే నన్న సత్యం వారికి తెలుసు. ఎదుటివారి బాధ తమ బాధగా గుర్తించారు కాబట్టి ఎక్కడా హింసా ప్రవృత్తి ఉండదు. ఎక్కడ హింసా ప్రవృత్తి లేదో అక్కడ "శాంతి" తాండవిస్తుంది. శాంతమయమైన జీవితాలు సుఖవంతంగా ఉంటాయి. వెరసి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

పిరమిడ్ మాస్టర్లందరూ అహింసాపరులు. ఆత్మజ్ఞాన పరాయణులు. సమాజ శ్రేయస్సును కాంక్షించే జ్ఞానులు దేనికీ వెనకడుగు వేయకూడదు. అన్నింటికీ మార్గదర్శకంగా ఉండాలి. అలాగే రాజకీయాల్లో కూడా.

అందుకే బ్రహ్మర్షి పత్రీజీ గారి ద్వారా ఆవిర్భవించింది పిరమిడ్ పార్టీ. దానిని పెంచిపోషించవలసిన బాధ్యత మనందరిదీనూ.

ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రీజీ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. "పిరమిడ్ పార్టీ"లో పనిచేయటానికి సంసిద్ధులైన వారు అవగాహన కల్గినవారు ధైర్యంగా ముందుకు రండి. లేదా 'ఆనాపానసతి' ధ్యాన ప్రచారంలో నిమగ్నులై ఉండండి" అన్నారు.

అంతే. పార్టీలో పనిచేయటానికి ఎందరో పిరమిడ్ మాస్టర్స్ చాలా ఉత్సాహంతో ధైర్యంగా ముందడుగు వేశారు. వారిలో నేనొకడిని.

నా ధైర్యానికి, ఉత్సాహానికి తగ్గట్టుగానే అప్పట్లో నాకు అప్పజెప్పబడిన బాధ్యతలు ఉన్నాయి. కృష్ణాజిల్లా విజయవాడ హెడ్ క్వార్టర్స్‌గా పెట్టుకుని మొత్తం నాలుగు జిల్లాలు ఒక డివిజన్‌గా చేసారు. అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాలు మరి ముఖ్యంగా నాకు అప్పజెప్పబడ్డాయి.

1. ఈ జిల్లాల నుండి సమర్ధవంతులైన వారిని నిర్ణయించి పార్టీలో నిలబడటానికి రంగం సిద్ధం చేయాలి.
2. పార్టీ ఆశయాలు ప్రజలకు వివరించగలగాలి.

చూశారా, ఇవి రెండే పనులు. "పిరమిడ్ హౌస్" ఫస్ట్ ఫ్లోర్‌లోనే పార్టీ ఆఫీస్ ప్రారంభించాం. ధ్యాన ప్రచార క్లాసులు నుండే ఉత్సాహవంతులైన యువకులను పార్టీ కార్యకర్తలుగా నియమించటం జరిగింది. పార్టీ గుర్తులో జెండాలు ముద్రించి ఆటోలకు కట్టడం, పార్టీ ఆవశ్యకతను గురించి బ్రహ్మర్షి పత్రీజీ గారి ప్రసంగం ఆడియో క్యాసెట్స్‌ను ప్రతి ఆటోలోనూ ఉంచి ప్రజలకు వినిపించటం, లక్షలాది పాంప్లెట్స్ ఇంటింటికీ అందిచటం, ఇలా ఎంతో ముమ్మరమైన ప్రచారం - పిరమిడ్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా.

ఇక పార్టీకి అభ్యర్ధులను ఎంపిక చేసే విషయానికి వస్తే అదొక అనుభవం. ముందు వారికి ధ్యానమంటే ఏమిటో చెప్పాలి. దానిలోని లాభాలు తెలియజేయాలి. పిరమిడ్ పార్టీ ఎందుకు పెట్టబడిందో విశదీకరించాలి. ఆధ్యాత్మికతకూ - పార్టీకీ ఉన్న సంబంధబాంధవ్యాలు ఏమిటో చెప్పాలి.

మిగిలిన రాజకీయ పార్టీలకు మాదిరి మనకు 'పార్టీ ఫండ్' ఏమీ ఉండదు. అంతా మన జేబులో నుండే ఖర్చు పెట్టాలి. ఒకటా, రెండా వారు అడిగే యక్షప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పి, వారిని ఒప్పించితే గానీ ఒక అభ్యర్ధి దొరకడు. అటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ 12 మంది అభ్యర్ధులను ఎంపిక చేసి "పిరమిడ్ పార్టీ" ద్వారా పోటీ చేయించగలగటం ఇప్పటికీ మరచిపోలేని మహా తీపి అనుభవం.

మరి అభ్యర్ధులను నిలబడమన్నప్పుడు వారేమంటారు? సహజంగా అడిగే ప్రశ్న - "మీరు పోటీ చేయటం లేదా?" అని. అందుకే ముందుగానే నన్ను నేను డిక్లేర్ చేసుకున్నాను. విజయవాడ నుండి తూర్పు M.L.Aగా నిలబడ్డాను. ఈ విధంగా తూర్పు డివిజన్‌లో ఉండే ప్రతి ఇంటికీ తిరిగి ధ్యాన ప్రచారంతో పాటు పార్టీని గురించి చెప్పటం జరిగింది.జనాల హావభావాల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. అసలు రాజకీయాలంటేనే గిట్టని నేను ఇంత కార్యక్రమం నిర్వహించగలిగానంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది.

 

J. రాఘవరావు
విజయవాడ

Go to top