" నా వయస్సు 26 సంవత్సరాలు ! శాసనసభకు శ్రీకాకుళం స్థానానికి పోటీ చేయడం ఓ చరిత్ర."

 

నేను మాస్టర్ నందప్రసాదరావు. శ్రీకాకుళం. అందరం కలిసి ఆధ్యాత్మిక రాజ్యం ఏర్పాటుచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆధ్యాత్మిక వాదులు మాత్రమే రాజ్యాధికారం చేపట్టాలని బ్రహ్మర్షిపత్రీజీ గారి సందేశంతో రాష్ట్ర వ్యాప్తంగా "పిరమిడ్ పార్టీ" ద్వారా 1999 ఎన్నికలలో ఎందరో పిరమిడ్ ధ్యానులు అనేక శాసనసభ, మరి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి రాష్ట్ర చరిత్రలోనే సంచలనం సృష్టించారు. అందులో భాగంగా నేను శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి "పిరమిడ్ పార్టీ" అభ్యర్ధిగా ఎన్నికల రంగంలో ఉండడం ఓ విశేషమైన అనుభవం.

అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూ సుమారు 150 అనుచరులతో స్థానిక R.D.O. కార్యాలయంలో నామినేషన్ ఘట్టం. అక్కడ జరిగిన సన్నివేశాలు ఇప్పటికీ నాకు మనస్సులో మెదలుతున్నాయి. అసలు ఎన్నికల ప్రక్రియలో ఓ చిన్ని యువకుడు,... అప్పటికి నా వయస్సు సుమారు(26 సంవత్సరాలు) .... శాసనసభ స్థానానికి పోటి చెయ్యడం ఓ చరిత్ర.

ఆరోజు మేము కార్యాలయంలోకి వెళ్ళగానే ఎన్నికల అధికారి అయిన స్థానిక R.D.O. సాదరంగా ఆహ్వానించి "పిరమిడ్ పార్టీ" చరిత్ర ఆశయాలు విని ముగ్ధుడై "మీలాంటి వారే రాజకీయాలకు రావాలి. మీరు గెలవాలి." అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మా ప్రయాత్నానికి తొలి మద్దతు ప్రకటిస్తున్నప్పుడు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం.

అక్కడ R.D.O. మరి ఎన్నికల సిబ్బందితో కాసేపు 'ధ్యానం' , 'ఆనాపానసతి' గురించి చర్చించి, కొన్నొ పుస్తకాలు, క్యాసెట్లు ఇచ్చి అక్కడి నుండే మన ఆశయాలకు అనుగుణంగా ప్రచారభేరి ప్రారంభించాం.

ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో గ్రామ, గ్రామాలలో విరివిగా "పిరమిడ్ పార్టీ" కరపత్రాలు పంచి "ఏ పార్టీలో వున్నవారయినా సరే . . . ముఖ్యంగా ఆత్మజ్ఞానులకు ఓటు వెయ్యండి" అని ప్రచారం చేస్తూ, 'ఆనాపానసతి' అవసరం వివరంగా చెపుతూ స్థానిక గ్రామ పెద్దలను కలుస్తూ, వారికి మన ఆశయాలు వినిపిస్తున్నప్పుడు వారు శ్రద్ధగా విని కావల్సిన ఏర్పాట్లు చేసి మాకు వెన్నంటి నిలిచేవారు. మరి అనేక గ్రామాలలో, కూడళ్ళలో, సంతలలో "పిరమిడ్ పార్టీ" గురించి విశేషంగా చర్చించుకునేవారు.

ఇంతలో మన గుర్తు ' T.V. ' రావడం, వెంటనే మరికొన్ని కరపత్రాలను పంపిణీ చెయ్యడం, స్థానిక న్యూస్ పేపర్లలలో ప్రకటనలు స్థానిక సిటీ కేబుల్ ద్వారా పత్రీజీ గారి సందేశాలు, మొదలైన అంశాలతో ప్రచారం విశేషంగా సాగేది.

శ్రీకాకుళం శాసనసభ ఎన్నికలలో అయిదుగురు అభ్యర్ధులు పోటీలో ఉండగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు, మరి పర్యవేక్షకులకు "పిరమిడ్ పార్టీ" అభ్యర్ధి అన్ని అంశాలలోనూ అంటే ఖర్చులు, ప్రచార సమాచారం ఇవ్వడంలో ముందుండి వారి వద్ద నుంచి అనేక సార్లు ప్రశంసలు పొందినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.

ప్రచారంలో కూడా "పిరమిడ్ పార్టీ" అభ్యర్ధులు అన్ని పార్టీల అభ్యర్ధుల నుంచి ప్రశంసలు పొందగలిగారు. ఎందువల్ల అంటే "పిరమిడ్ పార్టీ" ఎవరి పైనా వ్యక్తి గత ఆరోపణలు చెయ్యలేదు. మరి అన్ని పార్టీల వారికి 'ధ్యానం' గురించి మాత్రమే ప్రభోధించింది. కుల, మత వర్గాలకు అతీతంగా మన ప్రచార అంశాలు, ప్రజలనూ, అధికారులనూ, రాజకీయ నాయకులనూ బాగా ఆకర్షించి 'ధ్యానం' 'బుద్ధ ప్రభోధిత ఆనాపానసతి' మరి ఆధ్యాత్మిక వాదులు రాజకీయ ప్రవేశ అవసరం గురించి పూర్తిగా వివరించి ప్రజలను చైతన్య పరచడంలో సఫలీకృతమైనామని చెప్పక తప్పదు.

"పిరమిడ్ పార్టీ" అభ్యర్ధిగా శ్రీకాకుళం శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మొట్టమొదటి అభ్యర్ధి నేను అయినప్పటికీ మా నియోజక వర్గంలో అనేక చోట్ల ప్రధాన రాజకీయ పార్టీలు అయిన తెలుగుదేశం, కాంగ్రేస్‌లకు ధీటుగా సుమారు ముప్పై మంది సహాయ కమిటీ ఏజంట్లను నియమించిన ఘనత పిరమిడ్ పార్టీదే. మనం ఎవ్వరినీ ఎక్కడా స్వంతానికి ఓటు అడగలేదు. మన ప్రధాన ఉద్దేశం ప్రకారం ప్రజలకు ఆధ్యాత్మికతను ప్రచారం చేసి ఆధ్యాత్మిక వాదులనే గెలిపించాలని విజ్ఞప్తి చేసాం. ఎన్నికల రోజువరకూ ఎన్నికల సంఘం నుంచి కానీ, స్థానిక అధికారుల నుంచి కానీ, స్థానిక ప్రజల నుంచి కానీ, ఎటువంటి ప్రతిఘటన లేకుండా పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొన్న పార్టీ పిరమిడ్ పార్టీ. మనకు కావల్సిన ఏర్పాట్లు చెయ్యడంలో ప్రభుత్వ అధికారులు శ్రద్ధవహించి మనం ఊహించిన, ఆశించిన దానికంటే ఎక్కువుగా సహాయ సహకారాలు అందించేవారు అంటే, వారు ఇలాంటి పార్టీ కోసం ఎంతగా తపన పడుతున్నారో అప్పుడు తెలిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధుల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రతి అభ్యర్ధికీ ముగ్గురు చొప్పున అంగరక్షకులను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మన కార్యలయం వద్దకు కూడా స్థానిక S.P. ఇద్దరు రక్షణ సిబ్బందిని మెషీన్ గన్స్‌తో అంగరక్షకులుగా పంపించారు. నేను వెంటనే స్పందించి స్థానిక S.P. గారికి "పిరమిడ్ పార్టీ" ఆశయాలు వివరించి, 'ఆనాపానసతి' పుస్తకాలు ఇచ్చి, మనకు నియమించిన అంగరక్షకులను తిరిగి వారికే అప్పగించినప్పుడు "ఇలాంటి పార్టీ యే రావాలయ్యా. ప్రభుత్వ ధనంతో ఎంతో మంది అంగరక్షకులను నియమించుకుని, స్వార్ధప్రయోజనాలకు వినియోగించుకుంటున్న ఈ కాలంలో మీరు 'మాకు అక్కర లేదు' అని వెనుకకు పంపిస్తున్నారు. ఎవరయ్యా మీ నాయకుడు? ఎవరయ్యా మీ గురువు? ఆయనను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని తెలిపారు.

ఎన్నికల లెక్కింపు రోజు ఆశ్చర్యంగా కొన్ని వందలు, వేలలో మనకు ఓట్లు రావడం అన్నది ఒక మహా ఆవిర్భావం. మరి అనేకమంది వారి వారి సందేశాలను ఓట్లపైన వ్రాసి, కొన్ని కాగితాల మీద వ్రాసి "పిరమిడ్ పార్టీ వర్ధిల్లాలి. ఆధ్యాత్మిక రాజ్యం ఏర్పడాలి." అని వ్రాసినవి వారి వద్ద నుంచి వచ్చినప్పుడు నిజంగా గెలిచినంత తృప్తి సంతోషం పొందాం.

ఈ విధంగా మా రాజకీయ రంగ ప్రవేశం జరిగి ప్రజలలో సత్‌సంబంధాలు ఏర్పాటు కావడంతో మాకు వెన్నంటి ప్రోత్సహించిన అనేక మంది పిరమిడ్ మాస్టర్లకు మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రీజీ గారికి ధ్యానశతాభివందనాలు....

నేను రాజకీయాలలో ప్రవేశించడానికి మంచి కారణమైన 'ఆనాపానసతి' ధ్యానం విస్తరణ తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో అధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ధ్యానం చెయ్యడం మనం చూస్తున్నాం.

ఈ రకంగా మన ప్రయత్నం వలన ధ్యాన విస్తరణ జరగడం మనం గెలిచినట్లు భావిస్తూ ఆనందిస్తున్నాం.

 

నందప్రసాద్
కన్వీనర్ - శ్రీకాకుళం జిల్లా
"ది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా"

Go to top