" ‘వాయాల్పాడు కు పోటీ చెయ్యి’ అనగానే 'ఓ.కె.' అన్నాను"

 

నేను M. రెడ్డి సుధాకర్. వాయల్పాడు పట్టణం, చిత్తూరుజిల్లా. 1999 ఎలక్షన్ లో నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున శాసనసభకు పోటీ చేశాను. అంతకు ముందు ఒక సంవత్సరం నుండి నేను పిరమిడ్ ఇండియా స్పిరిచ్యువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆధ్వర్యంలో ధ్యాన జీవితంలో ప్రవేశించాను.

ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, ఆత్మస్థైర్యం పరంగా, ఆత్మజ్ఞాన పరంగా, ఎంతో ఆనందాన్నీ, స్ఫూర్తినీ అనుభవించాను.

తరువాత పిరమిడ్ పార్టీ ఆవిర్భావ సమయంలో తిరుపతి కంచి రఘురాం గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుపతి ర్యాలీలో పాల్గొని, T.N. శేషన్ గారితో సమావేశంలో పాల్గొన్నాను. బ్రహ్మర్షి పత్రీజీ ఈ పార్టీ పరంగా ఇచ్చిన వివరణ నన్నెంతో ప్రభావితం చేసింది. పత్రీజీ గారు అన్నారు... "ఆత్మజ్ఞాని గా తయారైన వారే దేశాన్ని పరిపాలించాలి." అని.

" ఒక రాముడే రామరాజ్యాన్ని ఇవ్వగలడు కానీ, ఒక రాక్షసుడు ఇవ్వలేడు" ఇది నన్నెంతో ప్రభావితం చేసింది. 'నిజం' అనిపించింది.

ఆ స్పూర్తితో వున్న నేను పత్రీజీ గారు నన్ను "వాయల్పాడు కు పోటీ చెయ్యి" అనగానే "ఓ.కె." అన్నాను. నాకు రాజకీయ అభిలాష లేకున్నా, అర్ధికపరంగా అనుకూలంలేకున్నా, మంది మార్భలం లేకున్నా ఒప్పేసుకున్నాను.

పాంప్లెట్స్ ప్రింట్ చేయించుకుని, నామినేషన్‌కు, తదితర తతంగాలన్ని అడిగి తెలుసుకుని, నామినేషన్ ప్రాసెస్‌ను అతి కష్టంగా సమకూర్చుకుని, ఒక కారును 4,5 రోజులకు చూసుకుని కారులో నేను, డ్రైవర్, మైక్ అతను బయలుదేరి, అంతా తిరిగి, నేనే అనౌన్సర్‌గా వ్యవహరించి, పాంప్లెట్స్ పంచి మరి నా భార్య, నా కుమారుడు, మా తండ్రి, మాస్టర్ యోగానంద్, మరి కొంతమంది సహకారంతో ఎలక్షన్స్ లో పాల్గొన్నాను. ఇదంతా ఎలా జరిగిపోయిందో, నా వెనుక పత్రీజీ గారి ఫోర్స్ ఎలా పని చేసిందో అంటే ఒక అద్భుత కలలా జరిగిపోయింది.

నామినేషన్ సమయంలో పీలేరు అభ్యర్ధి పిరమిడ్ మాస్టర్ నాకు కొన్ని పేపర్స్ పంపవలసి వచ్చింది. దానిని నాకు చేర్చడానికి నా మేనమామ J. నారాయణస్వామి గారు బయలుదేరి, జీపులో వాయల్పాడుకు వస్తూండగా జీపుకు ఆక్సిడెంట్ అయ్యింది. వారికి చేతి వ్రేళ్ళలో దెబ్బతగిలి, రక్తం కారి పేపర్స్ కూడా కొద్దిగా రక్తపు మరకలు ఏర్పడ్డాయి. అయినా ఆయన ఎంతో ఓర్పుతో లేచి వేరే బస్సులో వాయల్పాడు చేరి ఆ పేపర్స్ నాకిస్తూ, "నీవు నిలబడేది నాకు తెలియలేదే", అని ఎలక్షన్ విషయం మాట్లాడుతున్నాడు కానీ, పెద్ద దెబ్బ చేతికి తగిలినా దాన్ని గురించి చెప్పలేదు. తరువాత ఆయనను ఆసుపత్రికి తీసుకు వెళ్ళడం జరిగింది.

ఇదొక అద్భుతమైన విషయంగా నాకు గొప్ప అనుభవంగా మిగిలిపోయింది. గురువు గారి బలంతోనే జరిగి ఉంటుంది.

ఆ ఎలక్షన్స్‌లో నాకెన్నో రకాలుగా సహకారాన్ని అందించిన పరోక్షంగా బ్రహ్మర్షి పత్రీజీ గారు ... ప్రత్యక్షంగా సహకారం అందించిన పిరమిడ్ ధ్యానులు అందరికీ నా ధ్యాన నమస్సుమాంజలులు.

 

M. రెడ్డి సుధాకర్
వాయల్పాడు
చిత్తూరు జిల్లా

Go to top