" ఇది ఆయుధం లేకుండా చేసే యుద్ధం "

 

"అహం బ్రహ్మాస్మి" అని వేదాలు ఎంతగా ఘోషించినా .... "ఉద్ధరేదాత్మనాత్మానాం" అని కృష్ణుడు ఎంతగా నొక్కి చెప్పినా ... "అప్పో దీపో భవ" నీ దీపం నీవే వెలిగించుకో" అని బుద్ధుడు ఎంతగా నిరంతరం బోధించినా - మనం అన్నీ మరచిపోయాం; అన్నింటినీ మరచిపోతున్నాం. అందుకే మళ్ళీ, మళ్ళీ మహర్షులూ, ఋషులూ వస్తూనే వున్నారు. మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నారు.

అలాగే ఇప్పుడు ఓ కారణజన్ముడు, ఓ యుగపురుషుడు, ఓ ప్రవక్త, "బ్రహ్మర్షి పత్రీజీ" రూపంలో వచ్చారు - ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానజ్యోతిని వెలిగించడానికి, ప్రతి ఇంటిలోనూ ధ్యాన దీపం వెలిగించడానికి. దాని నేపధ్య పర్యవసాన రూపకల్పనే "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" ఆవిర్భావం. వెంటనే "ఆధ్యాత్మిక వాదులకు రాజకీయాలెందుకు ?" అనే ప్రశ్న ఉదయించడం అత్యంత సహజం (దానికి సమాధాన ప్రయత్నమే ఈ శీర్షిక). "ఆధ్యాత్మికత" అంటే "తొడుక్కునే అంగీ" కాదు. "ముఖానికి వేసుకునే రంగు" కాదు. "ఆధ్యాత్మికత" అన్నది జీవితంలో అతి ముఖ్యమైన అంతర్భాగం. జీవితం వేరు, జీవనం వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు. ఆధ్యాత్మికత లేని జీవనం జీవనమే కాదు.

నువ్వూ నేనూ కలిస్తే "మనం" ; మనం, మనం కలిస్తే "సమాజం"; ఇలాంటి సమాజాల చేత ఏర్పడేదే "రాష్ట్రం" ; రాష్ట్రాల ద్వారా ఏర్పడదే "దేశం" ; దేశాల చేత ఏర్పడేది ఈ "ప్రపంచం". కనుక, ముందు మన నుంచి, తరువాత మన పరిసరాల నుంచి కొంచెం కొంచెంగా పునరుద్ధరిస్తూ పోతూ ఉంటే రాష్ట్రం, దేశం అన్నీ వాటంతట అవే బాగుపడ్తాయి. దీనికి మన నినాదం ఒక్క మాటలో-

"వ్యక్తి నిర్మాణం ద్వారా వ్యవస్థ నిర్మాణం" - "ఆధ్యాత్మికత ద్వారా ఆదర్శ రాజ్యస్థాపన"

ఇవే "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" ముఖ్య లక్ష్యాలు, ప్రధాన ఆదర్శాలు. ఒక్కసారి మనం గతాన్ని అవలోకిస్తే, పరిశీలిస్తే "పంచమ వేదం" గా కీర్తింపబడే మహాభారతంలో భగవద్గీతను ప్రసాదించిన యోగిపుంగవుడైన శ్రీ కృష్ణుడు "నేను ఆధ్యాత్మిక వాదిని" అని ఓ మూల కూర్చోలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని నడిపి ధర్మ రాజ్యాన్ని స్థాపింపచేశాడు. అదే పని ఇప్పుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు చేస్తున్నారు. మీరు గమనించాల్సిన మరో ముఖ్య విషయం - కృష్ణుడు గీతను ఆశ్రమాలలోనూ, అడవులలోనూ, కుటీరాలలోనూ చెప్పలేదు. యుద్ధభూమిలో బోధించాడు.

అదేవిధంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపచేసిన, "విద్యారణ్య స్వామి" , అద్భుత ఆధ్యాత్మిక వాది; వేదానికి భాష్యం వ్రాసినవాడు.

జాతీయోద్యమాన్ని నడిపిన "మహాత్మాగాంధీ", స్వాతంత్ర్యం నా జన్మహక్కు" అన్న "బాలగంగాధర్ తిలక్", భూదానోద్యమాన్ని నడిపిన "ఆచార్య వినోబా భావే", సరిహద్దు గాంధీ "ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్", "అరవింద్ ఘోష్", తెలంగాణా విమోచనోధ్యమ నాయకుడు "స్వామి రామానందతీర్ధ" - ఇంకా ఎందరో... ఎందరెందరో .. వీరంతా ఆధ్యాత్మిక వాదులే - అన్న సత్యం మనం మరువకూడదు.

కనుక, "ఆధ్యాత్మికత వేరు, జీవితం వేరు కాదు. జీవితంలో మౌలికమైన అంతర్భాగం ఆధ్యాత్మికత; ఆధ్యాత్మికత ఓ 'మతం' కాదు. మతం మనిషిని సంకుచితుణ్ణీ, అహంకారినీ చేస్తుంది. ఆధ్యాత్మికత విశ్వజనీనతను ప్రసాదిస్తుంది. విశ్వప్రేమకు స్వాగతం పలుకుతుంది.

ధ్యానం చెయ్యడమంటే ముక్కు మూసుకుని మూలన కూర్చోవడం ఒక్కటే కాదు. జడలు కట్టిన మౌనంలో అంతర్ శక్తుల ఏకీకృతం ఇది. లెక్కకు మిక్కిలి అణువులు విస్ఫోటనం చెందడానికి సన్నద్ధం అవుతున్న సమయం ఇది. ఆయుధం లేకుండా చేసే యుద్ధం ఇది. నూతన యుగానికి నాందీ ప్రస్తావన ఇది.

"శ్రీ శ్రీ" గారు మహాప్రస్థానంలో "పుడమి తల్లికి పురిటినొప్పులు క్రొత్త సృష్టికి స్ఫూర్తినిచ్చాయి" అన్నారు. ఎందుకన్నారో గానీ అది నిజంగా "నిజం" అవుతున్న సమయం ఇది. పుడమి తల్లికి పురుటినొప్పులు నిజంగానే వస్తున్న సమయం ఇది. దాన్నే మన భాషలో "యాక్సిస్ షిఫ్ట్" అంటున్నాం.

అందుకే చెబుతున్నా "యోగం నీలో యాగం కావాలి; కర్మయజ్ఞం కొనసాగాలి, ధర్మ యుద్ధం నిరంతరం జరగాలి; సత్యయుగం సాక్షాత్కారమవ్వాలి" - అందుకు అందరూ వెంటనే సమాయత్తం అవాలి.

భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు "కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన" అంటే "మన పనిని మనం చేద్దాం - మన కర్తవ్యాన్ని మనం నిర్వహిద్దాం - ఫలితం పత్రీజీ సార్‌కు వదిలేద్దాం." సెలవ్.

 

T. మురళీధర రావు
హైదరాబాద్

Go to top