" ఎన్ని జన్మల పుణ్య ఫలమో "

 

పుట్టాం, పెరిగాం. చనిపోయాం. ఇదే నా జీవితం? అలా అనుకుంటే పక్షులు, జంతువులు, జలచరాలు, ఇలా ప్రతిజీవి కూడా చేస్తున్న పని ఇదే. ఇవన్నీ కూడా మనలాగే పుడ్తున్నాయి. పెరుగుతున్నాయి, చనిపోతున్నాయి. చీమలు, తేనేటీగలు మొదలైనవి ఆహారాన్ని దాచుకుంటున్నాయి కూడా. అదే పని మనం కూడా చేస్తున్నాం.

ఉద్యోగమో, వ్యాపారమో చేయడం, డబ్బుసంపాదించడం, ఆస్తులు ఏర్పరచుకోవడం, సంపాదించినది దాచుకోలేక నానా అవస్థలు పడడం. సంపాదించడానికి, దాచుకోవడానికి కొన్ని తప్పులు, నేరాలు చేయడం. ఉన్నత స్థాయికి ఎదగాలన్న కాంక్షతో మనిషి పతనానికి చేరువవుతున్నాడు.

ఎన్ని జన్మల పుణ్యఫలమో మానవజన్మలెత్తాం అని ప్రతి ఒక్కరూ అనుకొంటారు కదా. అయితే ఎంతమంది ఫలాన్ని ఫలదీకరణ చేసుకున్నారు? అని ప్రశ్నించుకుంటే ఏ ఒక్క శాతం మాత్రమే ఉంటారు. ప్రతి మనిషి కూడా జంతువులాగా కాక మనిషిగా, మహనీయుడుగా ఎదగాలంటే ఏం చేయాలో ఆలోచించారా? ఆలోచించారు ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. మన ప్రక్కింటివాడు, ఎదురింటివాడు మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడే, మిద్దెలు, మేడలు కడ్తున్నాడే కార్లలో షికార్లు కొడుతున్నాడే, నేను కూడా వాడికంటే ఎక్కువ సంపాదించాలి. పెద్ద పెద్ద బంగళాలు కట్టాలి. పెద్ద పెద్ద కార్లు కొనాలి అనే తపనతో నిద్రాహారాలు మాని జీవిత పోరాటం సాగిస్తాడు, శ్రమించి సంపాదిస్తాడు, దాచుకుంటాడు.

జీవితాంతం సంపాదించినది ఈ శరీరాన్ని వదిలినపుడు ఈ సంపాదన తన వెంట రాదని తెలియదు, మరణ శయ్యపై ఉన్నప్పుడు ఆలోచన వస్తుంది. అప్పుడిక ఫలితమేముంది. ఏమీచేయలేని స్థితి. ఈ స్థితి నుంచి బయట పడడానికి ఒక మార్గం ఉంది అదే "శ్వాస మీద ధ్యాస" అంటూ మానవాళికి అత్యున్నతమైన మార్గాన్ని చూపారు - బ్రహ్మర్షి సుభాష్ పత్రీగారు. 'భౌతిక పరమైన సంపాదన నీవెంటరాదు, ఆధ్యాత్మికపరంగా, ఆత్మపరంగా ఎదగాలి. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. అదే నిజమైన సంపాదన - నీవెంట వచ్చే సంపాదన' అని ఊరూవాడ పల్లె పట్టణం తిరుగుతూ ఆధ్యాత్మిక సత్యాలు తెలియజేస్తూ, భూమండలాన్ని ఆత్మజ్ఞాన పరాయణుల నిలయంగా తీర్చిదిద్దాలని నిర్విరామ కృషి చేస్తున్నారు. ఎన్ని జన్మల పుణ్యఫలమో 'పత్రి గారి చెంత చేరాం. ఎన్ని జన్మల పుణ్యఫలమో 'శ్వాస మీద ధ్యాస' పెట్టాం. ఎన్ని జన్మల పుణ్య ఫలమో 'ఆత్మ జ్ఞానుల'మయ్యాం.

ఇక జన్మలొద్దు. ఆకాశమే హద్దు. ఈ జన్మే ముద్దు. ధ్యానం చేద్దాం. ధ్యాన ప్రచారం చేద్దాం. ధ్యాన జగత్తు సాధిద్దాం.

రండి , కదిలిరండి, శాంతిని, ప్రేమను పంచుదాం. పత్రి గారి దారి వెంబడి కదలిరండి. ధ్యాన జగత్తు సాధిద్దాం మన జన్మ సార్ధకం చేసుకుందాం.

 

D. కేశవరాజు
శ్రీ కేశవ పిరమిడ్ ధ్యానకేంద్రం
8-105, రాయల్ నగర్, తిరుపతి
సెల్ : +91 9440077359

Go to top