" ఆత్మ విశిష్టత తెలుసుకున్నాను "

 

నా పేరు నర్సింహ యాదవ్. నేను మహబూబ్‌నగర్ జిల్లా " పుల్గర్‌చర్ల " గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్‌గా ఉద్యోగంచేస్తున్నాను. నేను 2003, జూలై 4వ తేదీ ఈ ధ్యానంలోకి ప్రవేశించడం .. చాలా చిత్రంగా జరిగింది.

అంతకు ముందు నాలుగు సంవత్సరాలుగా నేను టెన్షన్ తో తల బరువెక్కడం, అల్సర్, మరి B.P తో బాధపడుతూ ఉండే వాడిని. ముందు, సిగరెట్లతో పాటు విపరీతమైన మాంసాహారినైన నేను ఈ జబ్బులన్నిటి కోసం మందులు మింగీ, మింగీ .. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తెచ్చుకున్నాను.

ఈ క్రమంలో నేను ఎన్నెన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బును ఖర్చుచేసుకోవడంతో పాటు, " చేత బడులు మంత్రాల వల్ల కూడా ఇలా జరుగుతుందేమో " అన్న సందేహంతో ఎందరెందరో ఉపాసకుల దగ్గరికి మరి దర్గాలకు కూడా వెళ్ళాను. " మహిబూ స్వామి దర్గా " , మరి జటప్రోలు " మస్తాన్ బాబా దర్గా " పునర్నిర్మాణంతో పాటు " పుల్గర్‌చర్ల " ఆంజనేయస్వామి గుడి శుభ్రం చేస్తూ, అనేక మంది గురువుల వెంట తిరుగుతూ కూడా .. నానారకాల బాధలు అనుభవిస్తూండే వాడిని. అయితే మద్యం, మాంసం మరి సిగరెట్లు త్రాగడం మాత్రం మానలేదు. దేని దారి దానిదే గా ఉండేది.

ఇలా ఉండగా ఒకరోజు నేను డాక్టర్ని కలవడానికి " పెబ్బేరు " లో ఉన్న హాస్పిటల్‌కి వెళుతూ .. ఆ ప్రక్కనే ఉన్న పాన్ డబ్బాలో " ధ్యానాంధ్రప్రదేశ్ " పత్రిక " బ్రహ్మర్షి పత్రీజీ " ముఖచిత్రంతో ఉన్నది చూసాను. పత్రీజీ బహు చక్కగా నిలబడి, అద్భుతమైన ముఖవర్ఛస్సుతో నాలోని ఆత్మను ఎంతో ఆకర్షించారు.

" అదేంటో చూద్దాం , " అనుకుని షాన్ డబ్బా వాడిని పత్రిక అడిగి తీసుకుని దానిని తిరిగేస్తూంటే .. నా భార్య వచ్చి " ఈయన పుస్తకాలు చదవద్దంట. దానివల్ల అనేక రకాల ఆలోచనలతో మన బుర్ర పాడయిపోతుందట. మీ ఫ్రెండ్ .. ఫలానా డాక్టర్ చెప్పాడు " అని చెప్పి నా చేతిలోంచి పుస్తకాన్ని లాగేసి పాన్‌డబ్బాలో పెట్టి .. నన్ను హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళింది.

కానీ ఎంతగానో నన్ను ఆకర్షించిన ఆ మహానుభావుని ముఖ చంద్రబింబం మాత్రం నన్ను వదలలేదు. " ఎలాగైనా ఆ పత్రికను కొనాలి " అనుకుంటూ తిరుగు ప్రయాణంలో మళ్ళీ పాన్ డబ్బా దగ్గరికి వెళ్ళగా .. " ఒకే ఒక్క పత్రిక ఉంటే ఎవరో వచ్చి కొనుక్కుని వెళ్ళిపోయారు " అని చెప్పాడు. " ఎవరు ఇచ్చారో వారి అడ్రస్ కూడా తెలియదు " అని కూడా చెప్పాడు.

ఇక నా బాధ చెప్పనలవి కాదు. ఏ పనిచేస్తున్నా .. పదే పదే ఆ ముఖమే గుర్తుకు వచ్చేది. " కాషాయం, రుద్రాక్షలూ చిత్రమైన వేష ధారణ ఏమీ లేకుండా .. సామాన్యమైన రూపంతో, అద్భుత తేజస్సుతో వెలిగిపోయే ఆ స్వామిని ఎలాగైనా కలవాలి " అని పరితపించాను.

అంతే .. అతి కొద్ది కాలంలోనే నన్ను వెతుక్కుంటూ నా దేవుడు వచ్చినట్లు .. " ఆనాపానసతి ధ్యానం " కరపత్రాల ద్వారా మా స్కూల్ పిల్లలకు ధ్యానం నేర్పడానికి పిరమిడ్ మాస్టర్ల రూపంలో పత్రీజీ వచ్చేసారు. ఆ కరపత్రంలో చూసి వై. రామారెడ్డి గారికి ఫోను చేసి వెళ్ళి ఆయనను కలిసి .. అరగంట ధ్యానం చేసాను.

మహాద్భుతమైన ప్రకంపనలు నా శరీరంలో ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా మందులు మ్రింగి మ్రింగి అల్సర్స్, గ్యాస్‌లతో బాధపడుతూన్న నా శరీరం అంతా ప్రక్షాళన అయిపోతున్న అనుభవం నాకు కలిగింది. ఎంతో ప్రశాంతత, ఆనందం ఆ కొద్ది సేపట్లోనే కలిగింది. ఇక ఆనాటి నుంచి మరవకుండా .. ధ్యాన సాధన చేస్తూనే ఉన్నాను. దివ్యచక్షువు అనుభవాలూ, సూక్ష్మ శరీరయానాలు, గత జన్మలు చూసుకోవడాలూ, అన్నీ జరిగిపోయాయి. నా శరీరం ఎంత గొప్పదో మరి అందులో నివసిస్తూ ఉన్న నా ఆత్మ ఎంత విశిష్టమైందో తెలుసుకుని వెంటనే .. ఎన్నో యేళ్ళుగా నాతో సహచర్యం చేస్తూన్న నా చెడు అలవాట్లైన మందు, మద్యం మరి సిగరెట్లకు స్వస్తి చెప్పి .. శుద్ధ శాకాహారిగా మారిపోయాను.

ఆ తరువాత కొన్ని రోజులకే .. " సిద్ధభైరవ కోన " ట్రెక్కింగ్‌లో బ్రహ్మర్షి పత్రీజీ ని ప్రత్యక్షంగా కలిసి .. నా అనుభవాన్ని తెలుపుకున్నాను. సార్ కూడా ఎంతో సంతోషపడ్డారు.

అప్పటి నుంచి నా కర్తవ్యం ఏమిటో తెలుసుకుని నిరంతర ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. ఎన్నెన్నో స్కూళ్ళకూ, కాలేజీలకూ, ప్రభుత్వ కార్యాలయాలకూ నా విరామ సమయంలో తిరుగుతూ .. ధ్యాన శాకాహార ప్రచారాలు విరివిగా చేస్తున్నాను. పెళ్ళిళ్ళు, పేరంటాలు, చావులూ, మరి గృహప్రవేశాలూ .. మరి ఏ ఇతర ఫంక్షన్లు అయినా సరే .. నేను వాళ్ళు పిలిచినా, పిలవకున్నా వెళ్ళి .. అక్కడ ధ్యానం కరపత్రాలు పంచుతూ ఉంటాను.

ఈ క్రమంలో మా బావమరిది ఫ్రెండ్ అయిన " గుర్క నర్సింహ " కు ధ్యానం నేర్పి .. " బుద్ధ పౌర్ణమి " ఉత్సవాలకు బెంగళూరు తీసుకుని వెళ్ళాను. అక్కడ మెగా పిరమిడ్‌లో ధ్యానం చేస్తూంటే ఆ పిల్లవాడికి నరాలు బిగుసుకుపోయి .. ఫిట్స్ వచ్చి ప్రమాదకరంగా మారాడు. నేను చాలా భయపడిపోయి పత్రీజీని తలుచుకున్నాను. ఆ అర్ధరాత్రి ఎవ్వరిని సహాయం అడగాలో తెలియక .. ప్రేమ్‌నాధ్ సార్ దగ్గరలోనే ఉన్నారని తెలిసి వెళ్ళాను. ఆయన నాతో సంకల్ప ధ్యానం చేయించారు. చాలా తక్కువ సమయంలోనే .. అతడు కోలుకుని మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాం. కానీ ఆ అబ్బాయిని బెంగళూరు తీసుకుని వెళ్ళినందుకు నేను " వెయ్యింతలు " బాధపడ్డాను.

అయితే ఆ తర్వాత ఆ అబ్బాయి ధ్యానంలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించి .. తాను ధ్యానం చేస్తూ " సర్వ " గ్రామ ప్రజల కోసం ఇరవై లక్షల రూపాయలతో పిరమిడ్ నిర్మాణం చేసి .. బ్రహ్మర్షి పత్రీజీ తో బ్రహ్మాండమైన ధ్యాన సభను ఏర్పాటు చేసినందుకు .. అంతకు కోటిరెట్లు ఆనందపడ్డాను.

ఇప్పుడు మా కుటుంబంలో అందరం ధ్యానులుగా, మారి శాకాహారులుగా మారిపోయి ధ్యాన ప్రచారం బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇలా మా జీవితాలను అద్భుతంగా మలిచి మాతో మంచి పనులు చేయిస్తూన్న బ్రహ్మర్షి పత్రీజీ గారికి అనేక ధ్యాన అభివందనాలు.

 

M. నర్సింహ యాదవ్
మహబూబ్‌నగర్

సెల్ : +91 9490006680

Go to top