" పర్తిసాయి నుంచి పత్రిసార్ వరకు "

 

నా పేరు చాముండేశ్వరి.

నేను పుట్టింది, పెరిగింది, మెట్టింది అనంతపురంలో, ఊహ తెలిసింది మొదలు .. నా చుట్టూ వున్న పరిస్థితులనూ, సమాజంలోని అసమానతలనూ గమనించడంతో మొదలయ్యాయి .. నాలో " ఎందుకిలా ? ", " ఏమిటిలా ? " అన్న ప్రశ్నలు.

ప్రతిరోజూ " దేవుడు ", " దేవత " అంటూ పూజలు, ఉపవాసాలు చేసే తల్లి .. " అసలు దేవుడే లేడు " అంటూ కమ్యూనిస్టులతో తిరిగే తండ్రి.

" ఏది నిజం ? "

ఈ నేపధ్యంలో అనంతపురంలోని " సత్యసాయి బాబా వుమెన్స్ కాలేజీ " లో చేరడం నా జీవితంలో మొట్టమొదటి మలుపు. వారం వారం " బాబా " కాలేజీకి వచ్చి .. మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని .. భజనలు పాడి నేర్పించడం చేసేవారు. ఆ కాలేజీలో చదివిన మొదటి బ్యాచ్ విద్యార్థినిని నేను.

" సత్యం ", " దైవం " గురించి ఆయన చేసిన ఉపన్యాసాలు ఒకవైపు, అనంతపురం జిల్లాకు ఆయన చేసిన .. నీళ్ళు, విద్య, వైద్యం వంటి మహోపకారాలు మరొక వైపు .. నాలో అయన మీద ప్రేమ, గౌరవం పెరిగేలా చేసాయి. నా చిన్నతనంలో మా చిన్న తమ్ముడి నడుముకి తాడుకట్టి బావిలోని నీళ్ళను బిందెలలోకి నింపేవాడు. మేము ముందు బిందెలను పైకి చేదుకుని .. తరువాత వాడిని చేదుకునే వాళ్ళం. అలాంటి సంకట పరిస్థితుల నుంచి " ఈ రోజు ఇంటింటా మంచినీళ్ళ కుళాయిలున్నాయి " .. అంటే అది కేవలం " భగవాన్ సత్యసాయి బాబా " వారి కృపామృతమే.

భగవంతుడున్నాడో లేడో తెలీని పరిస్థితుల నుంచి .. మానవ జాతికి అన్నిరకాలుగా సేవలందించే ఇలాంటి సద్గురువులపై నాలో " ప్రేమ " అలా తెలియకుండానే మొదలైంది. చదువు పూర్తయి, పెళ్ళయి, జీవిత మహాప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న తరుణంలో రాఘవేంద్రస్వామినీ, షిర్డీ సాయినాథునీ ప్రేమిస్తూ, ఆరాధిస్తూ .. " ఒక యోగి ఆత్మ కథ " పుస్తకం చదవడంతో .. నా జీవితం ఓ పెద్ద మలుపు తిరిగినట్లయ్యింది !

స్వామి యోగానందకు మల్లే నేను కూడా శరీరధారి అయిన ఒక సద్గురువు కోసం, భగవంతుని కోసం తపించాను, పరితపించాను.

1996 నుండి 1999 దాకా కొనసాగిన ఈ తపన, ఈ వేదన 1999లో " బ్రహ్మర్షి పత్రీజీ " రాకతో " చివరి మహా మలుపు " తిరిగింది ; " ఆనాపానసతి " ధ్యాన సాధనతో నా మనస్సు అంతర్ముఖమైంది. మొదటిరోజే ధ్యానంలో ఋషులు, బుద్ధుడు నాకు కనిపించారు. అద్భుతమైన కలలు, వాటిద్వారా దివ్యసందేశాలతో .. ఒక నెల గడిచేసరికి నాకు నా గత జన్మలు తెలియడం మొదలై నాకు సంబంధించి, ఎన్నెన్నో జన్మల వివరాలు తెలిసాయి.

ఈ శిక్షణ, సాధన, 2006 దాకా కొనసాగింది. ఏ చిన్న సందేహానికైనా సమాధానం .. ధ్యానంలో విజన్స్ ద్వారా కానీ, కలల ద్వారా కానీ తెలిసేది. ఎందరో దేవుళ్ళు, గురువులు కనిపించి నాతో మాట్లాడేవారు. ఎన్నోసార్లు ఈ శరీరంలోంచి నేను బయటికి వచ్చి సూక్ష్మ, కారణ శరీరాల గురించి తెలుసుకోవడం జరిగింది.

" ఒక యోగి ఆత్మ కథ " చదివి .. " ఈ సైంటిఫిక్ యుగంలో ఇన్ని అద్భుతాలు జరిగాయా ? ఇవన్నీ సత్యమా ? అయితే నేను కూడా ఇలాంటివి చూడాలి .. అప్పుడే నమ్ముతాను " అని బలంగా అనుకున్నందుకేనేమో .. నేను ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొందాను.

2006 వరకు పత్రీజీ సాంగత్యంలో ఎన్నో ట్రెక్కింగ్లు, ప్రకృతితో సహజీవనంతో పాటుగా ఎన్నో అద్భుతమైన అనుభవాలు, సత్యం కోసం భగవంతుని కోసం ఈ మార్గంలోకి వచ్చిన నాకు " మనమే దేవుళ్ళం .. మరి వున్నదంతా భగవత్పదార్థమే, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల్లో నివసిస్తూ .. జాగృత స్వప్న, సుషుప్తి అవస్థలో నిరంతరం సమ్చరిస్తూ వున్న ఆత్మ సుందరలమే మనమంతా " అన్న అవగాహన నాలో స్థిరమైంది.

2002 లో " ‘ చాముండేశ్వరి ’ కన్నా ముందు నా జన్మ ఏమిటి ? " అనుకుని నేను .. నా భర్త, మా బావగారు తోడికోడలు, ధ్యాన మిత్రులు శేషగిరిరావు గారితో కలిసి, " బ్రహ్మంగారి మఠం " వెళ్ళి, బ్రహ్మంగారి సమాధి దగ్గర ధ్యానం చేసాను. అప్పుడు నేను బ్రహ్మం గారి మనుమరాలైన " ఈశ్వరాంబ " ను అని తెలిసింది. అనుమానం తీరక .. ఇదే విషయాన్ని సిద్ధయ్య గారి సమాధి వద్ద, " యాదాటి గోవిందయ్య " ( వీరబ్రహ్మేంద్రస్వామి సమకాలికులు జీవ సమాధి పొందిన యోగి ) సమాధి వద్ద కూర్చుని ధ్యానం చేస్తే అక్కడ .. అదే సందేశంతో వారు కూడా ఈ విషయాన్ని దృవపరచారు.

" ఈశ్వరమ్మ కూడా జీవ సమాధి పొందిన యోగిని కదా ! మరి ఆమెకు మళ్ళీ ఈ శరీరం .. అంటే " చాముండేశ్వరి " గా ఎందుకు జన్మ కావలసివచ్చింది ? " అన్న ప్రశ్న వేసుకుంటే .. " ఆ జన్మలో సిద్ధత్వం .. మరి ఈ జన్మలో బుద్ధత్వం ! బుద్ధత్వస్థితే .. జన్మరాహిత్య స్థితి " అన్న సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని పత్రిసార్తో వివరించినప్పుడు ఆయన నాకు " కంగ్రాట్స్ " చెప్పి, షేక్హాండ్ ఇస్తూ .. ఒక మాటన్నారు.

" ఆత్మకు జ్ఞానం ఇచ్చావు .. మరి శరీరానికి ఏం చేశావు ? " అని.

ఈ మాటతో నా లోపల సరిక్రొత్త జ్ఞానానికి ద్వారం తెరుచుకుని .. 2006 వరకూ నాతో కూడుకుని ఉన్న విషయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. నా నుంచి ఎంతో దుఃఖం బయటికి వెళ్ళిపోవడం, " నేను ", " నాది " అన్న బంధం, అహంకారం, భ్రమలు అన్నీ పటాపంచలు కావడం జరిగాయి.

2007 లో నేను పుట్టపర్తికి తిరిగి రావడంతో నా జీవితం మరో గొప్ప ఆధ్యాత్మిక మలుపు తిరిగి .. సరిక్రొత్త అధ్యాయం మొదలైంది.

పుట్టపర్తిలో .. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ తరపున " నలభై రోజుల .. ఉచిత ధ్యాన శిక్షణ " నిర్వహిస్తూన్నారని తెలిసి నేను కూడా అటెండ్ అయి మరోమారు బాబాను చూడవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన నేను తిరిగి వెళ్ళకుండా ఇక్కడే వుండి పోవడం యాదృచ్ఛికమైతే .. అనంతపురం, ధర్మవరం ధ్యానుల ద్వారా ధ్యానబోధ జరుగుతున్నా .. ముఖ్య భూమిక పోషించాల్సిన బాధ్యాత నా మీద పడి పుట్టపర్తిలోనే ధ్యాన జ్ఞాన బోధ చెయ్యవలసిరావడం మరో యాధృచ్చికం. " అర్థవంతమైన యాధృచ్చిక సంఘటనలు మానవజాతి యొక్క ఆధ్యాత్మిక పరిణామాన్ని సూచిస్తాయి " అన్న వాక్యం గుర్తొచ్చింది.

పుట్టపర్తిలో అదుగుపెట్టగానే ధ్యానంలో నేను గమనించింది యీ ప్రాంతంలో అంతటా సూక్ష్మ పిరమిడ్స్ వుండటం. ఇక్కడ నలభై రోజులు .. ఉదయం ఆంజనేయస్వామి దేవాలయంలో, మధ్యాహ్నం వృద్ధాశ్రమంలో, సాయంకాలం సాయి భక్తులైన " M.N.రెడ్డి " గారి ఇంట ధ్యానం క్లాసులు నిర్వహించాం. ఈ నలభై రోజులూ నాకు వసతి, భోజనం సీనియర్ పిరమిడ్ ధ్యాని " సుగుణమ్మ " గారు కల్పించారు. వారికి నా ధన్యవాదాలు.

ఈ నలభై రోజులూ తెల్లవారుజామున 6 గంటలకు బాబా వారి మందిరం సముదాయంలో వున్న " మెడిటేషన్ ట్రీ " దగ్గరకు వెళ్ళి నేను ధ్యానం చేసేదాన్ని. అప్పుడు ఎన్నో సందేశాలు బాబాగారి ద్వారా అందుకోవటం జరిగింది.


ఒకరోజు ధ్యానంలో ఓ పెద్ద నాగుపాము నా చెవిదగ్గర నోరు పెట్టి ఏదో చెబుతోంది. ఆ పామును చూసి భయం వేయలేదు సరికదా .. తెలీని ఆనందం కలిగింది.

అదేరోజు మాములుగా ఉదయం 10 గంటలకు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి .. భజన మందిరం తలుపులు తీసి ధ్యానం క్లాసుకు ఒక్కొక్కరే వస్తూంటే కూర్చోబెడుతున్నాను. నెమ్మదిగా 70,80 మంది వచ్చి హాలు నిండింది. ఇంతలో ఒకావిడ పాతిక లేదా ముప్పై సంవత్సరాలు వుంటాయి .. ‘ చుడిదార్ ’ వేసుకుంది. లోపలికి వచ్చింది. నేను కూర్చోమని సైగ చేసాను. కూర్చుని కళ్ళు తెరిచి నన్నే చూస్తోంది. ఆమె శ్వాస .. దీర్ఘంగా " బుస్ " అన్న పెద్ద శబ్దంతో నన్ను తాకుతోంది. ఆ శ్వాస నేలను తాకడం నేను స్పష్టంగా గమనించాను.

" నేను ఆమె దగ్గరికి వెళ్ళి చేతులు కలిపి .. కళ్ళు మూసి శ్వాసను గమనించమన్నాను.

పకపకా నవ్వింది !

ఈ లోగా ‘ OK ’ చెప్పి .. అందరితో కళ్ళు తెరిపించి క్లాప్స్ కొట్టించాను. ఈమె అందరినీ ఆకర్షిస్తోంది.

" నీ పేరేమిటి ? " అన్నాను. " నాగేంద్రుడు " అంది.

" ఎందుకొచ్చావు ? " అన్నాను. " నాకు ఉండటానికి జాగాలేదు నాకో కట్ట .. అంటే అరుగు లాంటిది .. కట్టించవా ? " అంది.

" నీకు తట్ట, బుట్ట, కట్ట కావాలా ? మనిషి జన్మలో వున్నావు. నీ గురించి నువ్వు తెలుసుకో .. ధ్యానం చెయ్యి " అన్నాను.

అప్పుడు ఆమె పకపకా నవ్వి .. " నేను చెప్పింది నాకే చెబుతావా " అంటూ .. పుట్టపర్తిలోని ఓ ప్రాంతం గురించి చెప్పి " అక్కడ నెగెటివిటీ గురించి జాగ్రత్తపడమని చెప్పాలని వచ్చాను " అన్నది.

నేను " సరేలే, ఆ ప్రాంతంలో ధ్యానం క్లాసులు పెడదాం, అంతా సరిపోతుంది " అన్నాను. ఆమె ప్రతి ఒక్కరి దగ్గరికీ వెళ్ళి " నువ్వు జ్ఞానివా ? ", " నువ్వు జ్ఞానివా ? " అంటూ అడగడం మొదలు పెట్టింది.

నా దగ్గరకు వచ్చి " నీవు జ్ఞానివా ? " అంది.

" అవును ! నేను జ్ఞానిని ! " అన్నాను.

కాస్సేపయ్యాక వెళ్ళిపోయింది. అందరూ " ఆమెను ఇంతవరకూ ఆ ప్రదేశంలో చూడలేదు " అన్నారు. " యీ సంఘటన వుద్దేశ్యం ఏమిటి ? " అని నేను ధ్యానంలో కూర్చున్నాను. నన్ను కలవడానికి వచ్చిన ఒక నాగ దేవతగా ఆమెను చూపించారు .. ఆస్ట్రల్ మాస్టర్స్ ! !

2009 " గురుపౌర్ణమి " ముందు రోజు, సాయిభక్తులు, ధ్యాని, జ్ఞాని అయిన " M.Nరెడ్డి " గారు తాను వ్రాసిన " ధ్యానమేవం విశిష్యతే " అన్న వ్రాత ప్రతిని ఛాప్టర్గా సెపరేట్ చెయ్యమని అడిగితే .. నేను, మా ఆయన కలిసి వాటిని ఛాప్టర్గా సెపరేట్ చేసి కూర్చి పెట్టాము. ఆ పని పూర్తయేసరికి రాత్రి 12 గంటలు దాటింది. ఒంటిగంటకు నిద్రకు వుపక్రమిస్తే తెల్లవారుజామున నాలుగు గంటలకు .. నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో " సాయి కుల్వంత్ హాలు " లో బాబా వెలిగిపోతూ సింహాసనం మీద కూర్చుని వున్నారు. హాల్ చివరిలో ఓ మూల కొద్దిగా భక్తులు ఉన్నారు. నేను పరిగెత్తుకుని వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించాను. అప్పుడాయన నాతో " చూసావా ? వాళ్ళంతా " నాకు చాలా దూరంలో వున్నారు. నువ్వు మాత్రమే నాకు చాలా దగ్గరగా వునావు " అన్నారు.

నాకు మెలుకువ వచ్చింది . అంటే " ధ్యానం చేసిన వారే బాబాకు దగ్గరగా వుంటారు .. మరి సత్యానికి చేరువవుతారు " అని నాకు అర్థం అయ్యింది. ధ్యానంలో నాగుపాము కనబడి .. అదే రోజు " నేనే ఆ నాగేంద్రుడు " అని చెప్పుకున్న స్త్రీ కనిపించిన రోజునే .. సాయంకాలం ఓ పెద్ద పాముల పుట్ట ప్రక్కన వున్న స్థలం కొనడానికి నేను నిర్ణయించుకోవడం .. మరి నాకు ధ్యానంలో కనిపించిన ఇల్లులాంటిదే కట్టుకోవడం చాలా విచిత్రంగా చకచకా జరిగిపోయింది.

ఒకప్పుడు ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలతో సతమతమైన నేను .. ఈ రోజు ఏ ప్రశ్నా లేక నిశ్చలస్థితిలోకి రాగలిగాను. " ఈ భూమ్మీద ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించు కుంటున్నారు " అనీ, " సాక్షాత్తు పరమాత్మలమైన మనం ఈ భూమ్మీద మానవ రూపాలలో సంచారం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది జనన మరణ చక్రాన్ని దాటి శరీరంలో వుండగానే .. పరమాత్మ స్థితిలో చరించబోతున్నాం " అనీ తెలుసుకున్నాను.

ఈ అనంత జ్ఞాన వాహినిలోకి నన్ను నడిపించిన బంగారు తండ్రి బాబాకు మరి నడిపిస్తూ వున్న బ్రహ్మర్షి పత్రీజీకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ .. వారితో పాటు ఈ విశ్వ ప్రణాళికలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

 

చాముండేశ్వరి
అనంతపురం

సెల్ : +91 9032523729

Go to top